శుక్రవారం 22 జనవరి 2021
Sunday - Jan 10, 2021 , 00:08:16

పట్టు పద్మాలు!

పట్టు పద్మాలు!

కవులకు నేస్తాలు తామరలు.. ఆధ్యాత్మిక సాధనలో పద్మాలే  సోపానాలు ప్రణయరాగంలోనూ కమలాలు తొంగి చూస్తూ ఉంటాయి.. కలికి కండ్ల పోలిక చెప్పడానికి, ప్రేయసి పరువాలను ప్రస్తుతించడానికి పద్మాలకు మించిన ఉపమానం లేదు. కానీ, ఈ కమలాల నుంచే పట్టు పుట్టుకొస్తుందంటే నమ్ముతారా? తామర తూడు తోడు.. ఇది నిజం! పట్టు పరిశ్రమలో పద్మాలూ పట్టుసాధిస్తున్నాయిప్పుడు.పట్టంటే గిట్టని అతివలు ఉండరు. ఆ పట్టు చుట్టుకున్న పడతిని చూసి పడిపోని పురుషుడూ ఉండడు. నూతన పోకడలు ఎన్ని వచ్చినా.. నేటికీ సంప్రదాయ వేడుకల్లో పట్టు పీతాంబరాలదే హవా. ఈ పట్టంతా పట్టు పురుగుల నుంచి వస్తుందని అందరికీ తెలిసిందే! ఇప్పుడు కొత్తరకం పట్టు ఫ్యాషన్‌ ప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా మారింది. జీవహింసకు తావులేకుండా తామర పూల తూళ్ల నుంచి సాగిన పట్టును ‘వీగన్‌ సిల్క్‌'గా పిలుస్తూ ఆదరిస్తున్నారు.

నిదానంగా లాగి

ఈ వీగన్‌ సిల్క్‌ తయారీ మనదేశంలో ఇంకా జోరందుకోలేదు. మయన్మార్‌, కంబోడియా, వియత్నాం లాంటి కొన్ని దేశాల్లోనూ మారుమూల పల్లెల్లో లోటస్‌ సిల్క్‌ను తయారుచేస్తున్నారు. తామర తూళ్ల నుంచి పట్టుదారాలు సేకరించడం అంటే అనుకున్నంత తేలిక కాదు. ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే తామరలు వికసిస్తాయి. ఆ సమయంలోనే పూలను సేకరించి.. కాగల కార్యం నెరవేర్చాలి. తామరలు సేకరించడానికి ఉదయాన్నే పడవల్లో సరస్సంతా కలియ తిరుగుతారు చేనేత కార్మికులు. భానుడి లేలేత కిరణాలు సోకి విచ్చుకున్న కమలాలను నిదానంగా సేకరిస్తారు. గంపలు గంపలుగా ఇంటికి చేరుస్తారు. గుంపులు గుంపులుగా కూర్చొని గింజలు పక్కనుంచి, తామర తూళ్లను నిదానంగా తుంచుతారు. కాడలను నింపాదిగా లాగుతారు. నూలు కన్నా తేలికైన, పట్టుదారాల కన్నా మృదువైన దారం పోగులు సాగుతూ కనువిందు చేస్తాయి. వాటిని అంతకన్నా పొందికగా తీసి పొరలు పొరలుగా పేరుస్తారు. దారాలుగా పేనుతారు. రంగులు అద్దుతారు. మగ్గంపై ఆడిస్తారు. స్కార్ఫ్‌లుగా, శాలువాలుగా మలుస్తారు. ధర పదిరెట్లు

ఏ రోజు కోసిన కాడల నుంచి ఆరోజే దారాలు తీయాలి. అలా ఒక్కొక్కరూ రోజుకు 250 కాడలను మాత్రమే తీయగలుగుతారు. ఒకటిన్నర మీటర్ల పొడవు, పావు మీటర్‌ వెడల్పుతో తీర్చిదిద్దే స్కార్ఫ్‌ని నేయడానికి దాదాపు వెయ్యి తామరతూళ్ల నుంచి దారం అవసరం అవుతుంది. ఒక మనిషి రెండు వారాల పాటు శ్రమిస్తే ఒక స్కార్ఫ్‌ తయారవుతుంది. అందుకే దీని ధర మామూలు పట్టు ధర కన్నా పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. సంప్రదాయ పట్టంత మెరుపు లేకున్నా మైమరిపించే గుణం ఈ తామర పట్టు ఉత్పత్తుల సొంతం. మృదువుగా, హుందాగా, వెచ్చగా ఉంటాయివి. తేలిగ్గా ఉండి ఎలా కావాలంటే అలా ఒదిగిపోతాయి. మెడకు చుట్టుకునే మెత్తటి స్కార్ఫ్‌ రూ.15 వేలు పలుకుతుంటే, షర్ట్‌ మీద వేసుకునే కోటు ధర దాదాపు రెండు లక్షల పైమాటే. లోటస్‌ సిల్క్‌తో తయారైన దుస్తులు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ పట్టుతో గాజులు, జుంకాలు వంటి వాటినీ తయారుచేస్తున్నారు. అయితే వీటి ధర కూడా ఎక్కువే.  అరుదైన పట్టు ఆ మాత్రం ధర ఉండటంలో తప్పులేదు కదా! 

మణిపూర్‌లోనూ..

కంబోడియా, మయన్మార్‌, వియత్నాంలో పలు కుటుంబాలు లోటస్‌ సిల్క్‌ ఉత్పత్తి ద్వారా జీవనం సాగిస్తున్నాయి. దీనికి ఆదరణ పెరిగితే ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయంటారు వియత్నాంకు చెందిన చేనేత కళాకారిణి ఫాన్‌ తి తువాన్‌. లోటస్‌ సిల్క్‌ సేకరణలో శిక్షణ కూడా ఇస్తున్నారు. మనదేశంలోని మణిపూర్‌కు చెందిన విజయశాంతి తొంగ్బ్రాం తువాన్‌ దగ్గర తామర తూళ్ల నుంచి పట్టు సేకరించే కళను నేర్చుకున్నారు. వృక్షశాస్త్రంలో పీజీ చేసిన ఆమె.. వియత్నాంలో శిక్షణ పొంది ఇక్కడ పలువురు మహిళలకు శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పిస్తున్నారు. వీళ్లు తయారు చేసిన లోటస్‌ సిల్క్‌ వస్ర్తాన్ని జర్మనీకి చెందిన ఓ ఫ్యాషన్‌ దుస్తుల బ్రాండ్‌ కొనుగోలు చేస్తున్నది.logo