మంగళవారం 19 జనవరి 2021
Sunday - Dec 20, 2020 , 01:56:55

పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

అరుదైన అధ్యయనం

హైందవుల ఇతిహాసాలలో మహాభారతానికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. 8,800 శ్లోకాలతో మొదలైన జయం అనే కావ్యం లక్ష శ్లోకాల మహాభారతంగా ఎలా వర్థిల్లింది! అప్పటికే ప్రచారంలో ఉన్న జానపదకథలు చేరడం కూడా ఇందుకు ఓ కారణం అంటారు రచయిత. అనడమే కాదు... వాటిని తనదైన శైలిలో గుర్తించి పాఠకులకు అందించిన పుస్తకం ఇది. సూర్యుడికి రథసారథిగా ఉన్న అనూరుడి కథ, చంద్రుడు నిరంతరం క్షీణిస్తాడంటూ దక్షుడు ఇచ్చిన శాపం... ఇలా పలు వృత్తాంతాలు అప్పటికే జనపదంలో ఉన్నాయని చెబుతారు. సువర్ణష్ఠీవి లాంటి నీతికథలు, శిఖండి లాంటి వృత్తాంతాలకు మూలం జానపదమే అన్నది రచయిత పరిశీలన. ఇలాంటి ఓ 47 కథల సమాహారమే ఈ పుస్తకం. ఇలాంటి రచనలు చేసేటప్పుడు తీవ్రమైన అధ్యయనం, శాస్త్రం పట్ల స్పష్టత చాలా అవసరం. చదువరుల మనసును నొప్పించకుండా, తన వాదనను వెల్లడించడమూ ముఖ్యమే. అలా చూస్తే రచయిత విజయం సాధించనట్టే కనిపిస్తుంది

మహాభారతంలో..

 జానపద కథాంశ కథలు

రచన: ఎమ్‌. జయదేవ్‌ 

పేజీలు: 242, వెల: 250/-

ప్రతులకు: 8558899478


కదిలించే కథ

నాగరికతలో ముందుకు అడుగువేసేందుకు, మనిషికి తోడుగా ఉన్న జీవి కుక్క. వేటలో సాయపడటం దగ్గర నుంచీ, ఇంట్లో మనిషిగా మారిపోవడం వరకూ తనది కూడా ఓ అరుదైన ప్రయాణమే. వాటితో మనిషికి ఉన్న అనుబంధం హృద్యమైనదే. అందుకే శునకాలే ఇతివృత్తంగా కాస్త జాగ్రత్తగా కనుక కథను అల్లుకోగలిగితే, పాఠకులను ఆకట్టుకోవడం తేలికే. అలాంటి కోవకు చెందినదే ఈ పుస్తకం. కన్నడంలో సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్న ‘ఆత్మ వృత్తాంత’ అనే నవల ఈ కోవకే చెందుతుంది. లియో అనే కుక్క చెప్పుకునే కథ ఇది. కేవలం తన కథే కాదు, తన వెనుక ఉన్న మూడు తరాలనూ గుర్తుచేసుకుంటుంది లియో. యజమానులతో తన అనుబంధం, వాళ్ల వ్యక్తిగత బాధలను మర్చిపోయేలా చేయగల తన స్వభావం, ఓ జీవిగా తనకీ ఎదురయ్యే సుఖదుఖాలు, బాధలూ, సంతోషాలూ... అన్నీ ఈ కథలో కనిపిస్తాయి. పాఠకుల మనసులో గాఢంగా నిలిచిపోవాలనో ఏమో... మూగజీవాల కథలన్నీ విషాదాంతంగానే ముగుస్తాయి. లియో కథ కూడా ఇంతే! అనువాదం, మూలకథ చదువుతున్నంత సరళంగా సాగడం విశేషం.

ఓ కుక్క ఆత్మకథ

రచన: రజనీ నరహళ్ళి 

పేజీలు: 216, వెల: 150/-

ప్రతులకు: ప్రముఖ పుస్తకకేంద్రాలు