ఉత్తరం రోడ్డు ఉన్న ఇంటిని దుకాణం చేశాం. కాంటిలివర్ (దర్వాజా) ఎత్తులో పందిరి వేశాం. దానిని ఈశాన్యం కూడా తిప్పాలా?
-అరవింద్, ఖమ్మం
ఇంటిని వ్యాపార స్థలంగా మార్చారు. జనం వస్తే నిలబడటానికి ఉత్తరం వైపు పిల్లర్స్‌తో పందిరి వేశారు. అయితే పిల్లర్స్‌తో పందిరి వేస్తున్నప్పుడు, పిల్లర్స్ తర్వాత ఉన్న ఖాళీనీ చూసుకోండి. మీ దక్షిణం ఖాళీ కంటే ,ఉత్తరం వైపు ఖాళీ ఎక్కువ ఉండాలి. అలానే ఆ పందిరిని తూర్పు వైపు ఈశాన్యంతో ఉన్న ద్వారం వైపు కూడా తిప్పాలని అనుకుంటే, తూర్పు అంతా కూడా పందిరిని విస్తరించుకోవాలి. లేదంటే.. ఉత్తరం వరకే వేసుకొని, తూర్పు వైపు వేయకుండా వదిలివేయండి. ఉత్తరం ఉంది కదా అని, తూర్పు వేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి లోపలి గదులు తీసేశారు. యజమాని స్థానాన్ని (ఎండీ, లేదా ఓనర్) నైరుతిలోనే ఏర్పాటు చేసుకోండి.
కొత్త లే అవుట్ చేయాలని అనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇండ్ల స్థలాలు డిజైన్ చేయడం ఒక ‘బృహత్తరమైన’ కార్యం. అయితే, దాన్ని చాలామంది తేలికగా తీసుకుంటున్నారు. జీవితాలను సుస్థిరపరిచే మైదానాలు.. లే అవుట్లు. మట్టిని చులకనగా చూస్తూ ఇండ్ల ప్లాట్లు చేస్తుంటారు. అదే మట్టితో కోట్లు గడిస్తుంటారు. కొన్ని లే అవుట్లు అయితే.. దిశ లేక దశ లేక ఎన్ని ఎక్కువ ప్లాట్లు చేయగలిగితే అంత గొప్ప అన్నట్లుగా ఉంటున్నాయి. అలాంటివన్నీ వెలవెల పోతుంటాయి. స్థలం నిర్ధారణలోనే
లే అవుట్ వైభవం ఉంటుంది. వాగుల పక్కన, నాలాల వద్ద, లోయల అంచున వ్యూల కోసం కాకుండా, శాస్త్రబద్ధంగా ప్రధాన వీధిని అనుసంధానించుకొని, ముందు రోడ్ల విభజన చేసి, పార్కులు నిర్ధారించి ఏ ప్లాటుకూ వీధి పోట్లు రాకుండా బొమ్మను చెక్కినట్లు లే అవుట్లు సృష్టించాలి. పెద్దపెద్ద లే అవుట్లు చేయడం కాదు. మన పల్లెటూళ్లు అతి సాధారణంగా కనిపించినా, అవన్నీ ఎంతో వైజ్ఞానికంగా, వైదికంగా లోతైన రుషి ఆలోచనలతో చేసినవే అన్న విషయాన్ని మరువొద్దు. సరిహద్దులు దిశలకు స్థిరపరిచి చేసిన ఇండ్ల సముదాయాలు గొప్పగా ఉంటాయి. లే అవుట్ల విషయంలో కేవలం వ్యాపార దృక్పథం మంచిది కాదు. నావ మునిగితే నడిపే వ్యక్తి కూడా మునిగిపోతాడు కదా!
ఇంటి ద్వారం గేటులో పడవచ్చా?
-బీసు రామచందర్, కొలనుపాక
పడకూడదు. గేట్లను, ద్వారాలను కలుపుతూ ప్లాన్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. ఇంటి ద్వారం, ప్రహరీ గేటు ఎదురెదురుగా పెట్టడంతో గేటు స్థానం ఎక్కడ వస్తుంది. మొత్తం ఇంటి స్థలానికి ఉచ్ఛమేనా అనేది చూడాలి. గేటు – ద్వారం కలుపుతూ ఒకే లైనులో వేస్తున్నప్పుడు రెండింటి సెంటర్‌ని చూడాలి. ఇంటిద్వారం వెడల్పు గేటుకంటే తక్కువ ఉంటుంది. కాబట్టి, గేటులో ద్వారం పడేలా నిర్మించాలి. ఏ కోణం ఏదాంట్లో పడవద్దు. గేటు పిల్లర్స్ ఇంటి మధ్యలోకి వచ్చేలా వేయడం దోషం. కొలతకు ముందు దారాలు పట్టి ముందు స్థలం నిర్ధారించి గేట్లను నిలబెట్టాలి. గేట్ల చూపు దిశలకు ఉండాలి.
మూడు రోడ్లు ఉంటే మూడు గేట్లు పెట్టాలా? రెండు చాలా?
ఇంటికి రోడ్లు ఎన్ని వచ్చినా, వాటి ప్రభావం ఆ ఇంటిమీద ఉంటుంది. అలానే ఆ రోడ్డులోకి వెళ్లే అవకాశాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రోజూ వెళ్లడం ఉండదనో, రెండు రోడ్లు చాలనో ఒక రోడ్డును వదిలి వేయవద్దు. లేదంటే మూడు అనే సంఖ్య సరికాదనే వ్యక్తిగత నమ్మకంతో, సెంటిమెంట్‌తో ఓ నిర్ణయానికి రావద్దు. కాలనీల్లో కొన్ని రోడ్లు డెడ్ ఎండ్‌తో ఉంటాయి. మనం ఉండే చోటు రెండు మూడు ఇండ్లకే పరిమితమై, ఒక సందు (గల్లీ) ఉన్నప్పుడు అసలు గేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక ప్రధాన వీధులుగా జన సంచారం ఉండే రోడ్లు మూడున్నా, రెండున్నా గేట్లు పెట్టొచ్చు. ఇదేం తప్పుకాదు. ఒక్కో దిశకు ఒక్కో రోడ్డు మాత్రమే ఉంటుంది. అప్పుడా గేటు ఆ దిశను నిర్ధారించి దాని వైభవాన్ని నిలుపుతుంది.
ఇంటి మెట్లను కూడా లెక్కించి కట్టాలా?
గృహం దాని శాస్త్రం కొన్ని ప్రధాన అంగాల మీద నిలబడి ఉంటుంది. అందులో కొన్ని సాధారణ విషయాలు ఉంటాయి. మరికొన్ని అతి
ముఖ్యమైనవి కూడా ఉంటాయి. ఇంటికి మెట్లు అవసరం. అవి ఇంటి లోపలికో, పై మేడకో చేరుస్తాయి. అయితే మెట్లు… ఆయా ఇళ్ల ఫ్లోరింగ్ లేదా మేడ ఎత్తు మీద ఆధారపడి మూడు లేదా నాలుగు (కింద అయితే), ఇరవై రెండు లేదా ఇరవై నాలుగు (మేడ మీదికి వెళ్లడానికి) వస్తూ ఉంటాయి. వీటిని లాభనష్టాల కోణంలో లెక్కించాల్సిన అవసరం లేదు. మెట్లు వేసే స్థానం, వాటి నడక, వెడల్పు, ఎత్తు .. తప్పక చూసుకోవాలి. దాహం తీరాలంటే నీళ్లు తాగాలి, అంతేకాని ఎన్ని గుటకలు తాగాలి, ఎన్ని వదలాలి? అంటే విడ్డూరంగానే ఉంటుంది. కాబట్టి అన్నిటినీ శాస్ర్తానికి ముడిపెట్టొద్దు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం. రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.