e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home బతుకమ్మ నువ్వులుండల్ని తింటూ కలకాలం నవ్వుతూ జీవించండి

నువ్వులుండల్ని తింటూ కలకాలం నవ్వుతూ జీవించండి

నువ్వుండలంటే ఇప్పటి పిల్లలకు కొత్తేమో కానీ, వాళ్ల తల్లిదండ్రుల పాలిట మాత్రం అవి లవ్వుండలే! అంత ప్రేమ! తియ్యటి బెల్లం, కమ్మటి నెయ్యి, కరకరలాడే నువ్వులు కలగలిసిన ఆ ఉండలను అలవోకగా ఓ అరడజను లాగించేయవచ్చు. పుష్కలమైన పోషకాల గని ఈ చిరుతిండి. తెల్లటి నువ్వుల్ని దోరగా వేయించి, గుండు బెల్లం పాకంలో పోసి, చివరగా నెయ్యి జోడించి చేసే నువ్వుల లడ్డూలే తెలంగాణ నువ్వుండలు. ఇది తరతరాల రుచి, సంప్రదాయ చిరుతిండి. అప్పట్లో, పిల్లలు దృఢంగా ఎదగడానికి వేయించిన నువ్వులు, బెల్లం కలిపి ఇచ్చేవారు. కొంతమంది వాటినే మెత్తగా దంచి ముద్దలు కట్టేవారు. తెలంగాణ పెద్ద పండగైన బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించే సత్తుల్లో నువ్వుల సత్తు ప్రత్యేకమైంది.

కొ న్ని ప్రాంతాల్లో నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని ముద్దలు కట్టకుండా పళ్లెంలో చదునుగా పేర్చి చిక్కీలు చేస్తారు. దాదాపు రెండు నెలల వరకు నిక్షేపంగా ఉండటం వీటి ప్రత్యేకత. ఒకప్పుడు తెలంగాణలో విరివిగా పండే నల్లనువ్వులతోనూ లడ్డూలు చేసేవారు. రాజస్థాన్‌, గుజరాత్‌ వంటి రాష్ర్టాల్లో పండుగ పిండివంటల్లో వీటిదే మొదటిస్థానం. మహారాష్ర్టలో సంక్రాంతి స్పెషల్‌ నువ్వుల లడ్డూలే. నాగుల చవితికి నువ్వుండలు చేసే సంప్రదాయం చాలా ప్రాంతాల్లో ఉంది.

- Advertisement -

ఇదివరకు నువ్వులు, బెల్లం, నేతితో మాత్రమే ఉండలు చేసేవాళ్ళు. ఇప్పుడు మరింత బలవర్ధకంగా మార్చేందుకు, రకరకాల పదార్థాలు జోడిస్తున్నారు. నువ్వులతోపాటు ఓట్స్‌, ఖర్జూర, పల్లీలు, బాదం, జీడిపప్పు.. ఎవరికి ఇష్టమైన కాంబినేషన్లో వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలూ ఇష్టంగా తింటున్నారు.

నువ్వుల్లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలం. ఐరన్‌ ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. నీరసంగా, బలహీనంగా ఉండేవారు నువ్వుల లడ్డూలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. నువ్వుల్లో అమైనోయాసిడ్‌, మాంసకృతులు ఉంటాయి. మెగ్నీషియం వల్ల అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది.

నువ్వులు రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. దానివల్ల పాంక్రియాస్‌ సక్రమంగా పనిచేస్తుంది. ఉబ్బసం నియంత్రణకు, రక్తనాళాలు, ఎముకలు, కీళ్ళు సక్రమంగా పని చేసేందుకు నువ్వులు ఇంధనంలా తోడ్పడతాయి. వీటిలోని సెసమాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ గుండెవ్యాధుల నుంచి కాపాడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆర్థరైటిస్‌ రోగులు నువ్వులు, బెల్లం కలిపి తింటే మంచిది.

నువ్వుల్లోని ఔషధ గుణాలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను నివారిస్తాయి. క్యాన్సర్‌ కారకాలతో పోరాటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఫలితంగా ట్యూమర్లు ఏర్పడవు. నల్ల నువ్వుల్లోని పోషకాలు కార్డియో వాస్క్యులర్‌ సమస్యను నిరోధిస్తాయి. బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు పెరుగుతామనే బెంగ అవసరం లేదు. పలు అనారోగ్య సమస్యల్ని తగ్గించడంలోనూ బెల్లం అద్భుతంగా పని చేస్తుందని పరిశోధనల్లో తేలింది.

శ్వాసకోశ సమస్యలను నియంత్రించడంలో బెల్లం సాయపడుతుంది. ఆస్తమా రోగులు బెల్లం, నువ్వులు కలిపి తింటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. హానికర వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపి కాలేయ సంబంధ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. ముఖ్యంగా స్త్రీలలో గర్భాశయ సమస్యల నివారణకు బెల్లం పరమౌషధం. ఇంకెందుకు ఆలస్యం? మీరూ నువ్వులుండల్ని తింటూ కలకాలం నవ్వుతూ జీవించండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana