‘నేను పెరుగు తినను!’ అని ఓ పిల్లవాడు భీష్మించుకుంటాడు. ‘మా అబ్బాయి ఆకుకూరల జోలికే పోడు’ అని ఓ తల్లి వాపోతుంది. ఈ సమస్య చాలా ఇండ్లలో కనిపించేదే. కొన్ని రకాల ఆహారాన్ని మాత్రమే తినడం, కొన్ని పదార్థాలను ద్వేషించడం పిల్లల్లో కనిపించే అలవాటే! దీని వల్ల పిల్లలకు తగినన్ని పోషకాలు అందకపోవచ్చు. పిల్లలను బలవంతపెట్టడం, కఠినంగా దండించడం, బహుమతుల ఆశ చూపడం… పెద్దగా ప్రయోజనంలేని వ్యవహారాలని అంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. ఎంతోమంది పిల్లల మనస్తత్వాన్ని విశ్లేషించిన తర్వాత వీరు ఓ పరిష్కారం చూపారు. కుటుంబసభ్యులంతా కలిసి భోంచేయడం, తినేటప్పుడు టీవీ కట్టేయడం, పిల్లలకు నచ్చని ఆహారంతో పాటు నచ్చే వంటకాలనూ వడ్డించడం… ఇలా బలవర్ధకమైన ఆహారం మీద ఆసక్తి కల్పించవచ్చని సలహా ఇస్తున్నారు. ప్రయత్నించి చూడండి మరి!