నా వయస్సు 28. ఇంట్లో పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏడాది నుంచి మూత్రంలో, వీర్య స్ఖలన సమయంలో తీవ్రమైన మంట వస్తున్నది. ఈ భయంతోనే పెండ్లి వాయిదా వేస్తూ వస్తున్నాను. డాక్టర్‌కు చూపించు కోవాలంటే భయంగా ఉంది. పరిష్కారం చెప్పండి.
మీ సమస్య మూత్రమార్గ సంబంధమైన ‘ప్రొస్టేట్ గ్రంథి వాపు’ కావచ్చు. మూత్ర మార్గ వ్యాధులు ఎక్కువ కాలం బాధిస్తాయి. ఒకసారి తగ్గినా, లక్షణాలు మళ్లీమళ్లీ కనిపిస్తూ ఆందోళన కలిగిస్తాయి. ఆధునిక చికిత్సతో ‘ప్రొస్టేట్ వ్యాధి’ని పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చు. దీని గురించి ఆందోళన చెందాల్సిందేమీ లేదు. అయితే, వ్యాధి గురించి శాస్త్రీయమైన, వైద్యపరమైన అవగాహన ఉంటే ఆందోళన నుంచి బయట పడవచ్చు.
ప్రొస్టేట్ గ్రంథి : మూత్రాశయానికి కింది భాగంలో, మూత్రనాళం పైభాగాన్ని చుట్టి ఉండేదే ప్రొస్టేట్ గ్రంథి. ఇది కొంత ఆమ్లత్వాన్ని కలిగి స్రవాల్ని విడుదల చేస్తూ ఉంటుంది. వీటిలో సిట్రిక్ యాసిడ్, ప్రొస్టేటిక్ యాసిడ్, ఫాస్పాటేజ్ ప్రోస్టాగ్లాండిన్స్ అనే పదార్థాలు ఉంటాయి. వీర్యంలో 14 నుంచి 35 శాతం పదార్థాలు ప్రొస్టేట్ గ్రంథి స్రావాలే.
ప్రొస్టెటిస్కు కారణాలు : ‘ప్రొస్టెటిస్’ అంటే.. ప్రొస్టేట్ గ్రంథివాపు. మూత్రమార్గం ద్వారా, రక్తం ద్వారా, లింఫ్ గ్రంథులద్వారా ప్రొస్టేట్ గ్రంథిని చేరే సూక్ష్మక్రిముల వల్ల ప్రొస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి వాపు వస్తుంది.
లక్షణాలు : ప్రొస్టెటిస్ సమస్య ఉన్నవారిలో జ్వరం, చలి, నడుము నొప్పి, అతి మూత్ర లక్షణాలు ఉంటాయి. మూత్రం/ వీర్యస్ఖలన సమయంలో మంట, నొప్పి వస్తుంది. ప్రొస్టేట్ వాపు అధికమైతే, మూత్రనాళం మూసుకుపోయి, మూత్రం బయటకు రావడం కష్టమవుతుంది. గట్టి కుర్చీపై కూర్చున్నప్పుడు కూడా నొప్పి కలుగుతుంది.
వ్యాధి నిర్ధారణ : అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిస్టోస్కోపీతో వివిధ దశల్లోని మూత్రాన్ని పరీక్షించడం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. అలాగే ప్రొస్టేట్ గ్రంథిపైన కొన్ని రకాల మందులు మాత్రమే పనిచేస్తాయి. కోర్సును పూర్తి చేయడం చాలా ముఖ్యం. లేకుంటే ఇన్ఫెక్షన్ తిరిగి వస్తుంది. సుఖవ్యాధుల వల్ల కూడా ప్రొస్టేట్ వ్యాధి వస్తుంది. కాబట్టి, బాధితులు మెరుగైన చికిత్స తీసుకోవాలి. వాపు తీవ్రంగా ఉంటే శస్త్ర చికిత్స కూడా అవసరం అవుతుంది.
డా. భారతి (ఎమ్మెస్)
మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్,
జయా హాస్పిటల్
బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 9908383910