మక్కజొన్న పొత్తులు కనిపిస్తే ఏం చేస్తాం? మహా అయితే, కాల్చుకుని తింటాం! లేదంటే, ఏ గారెలో చేసుకుని లాగిస్తాం! కానీ, అమెరికాలో ఏకంగా ఓ భవంతిని నిర్మించారు. ఆ ప్యాలెస్ విశేషాలేమిటో చూద్దాం..
పంట చేతికొచ్చే సమయంలో పండుగ చేసుకునే సంప్రదాయం చాలా దేశాల్లో ఉంది. అమెరికాలోని మక్కజొన్న రైతులు కూడా మన సంక్రాంతిని తలపించే వేడుకను జరుపుకొంటారు. ఎంతైనా అమెరికన్లు కదా? ఓ అడుగు ముందుకేసి, తమ నేలమీద సమృద్ధిగా పండే మక్కజొన్నకు గుర్తుగా ఓ ప్యాలెస్ నిర్మించారు సౌత్ డకోటా రైతులు. 1892 ప్రాంతంలో మిషెల్లో కార్న్ ప్యాలెస్ నిర్మించి మొదటిసారి పండుగ చేసుకున్నారు. ప్రపంచంలోని ఏకైక ‘కార్న్ ప్యాలెస్’ ఇదే. భవనాన్ని కాంక్రీటుతో నిర్మించినా అలంకరణకు మాత్రం మొక్కజొన్న పొత్తులను ఉపయోగించారు. అప్పటినుంచి ఏటా ఆగస్టులో వివిధ ప్రాంతాల్లో పండే తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు, ఆరెంజ్.. వంటి భిన్న రంగుల మక్కజొన్న పొత్తులు, గడ్డితో భవనాన్ని ముస్తాబు చేసి, ఘనంగా వేడుక చేసుకొంటారు. ఒక్కో ఏడాది ఓ థీమ్‌తో ప్యాలెస్‌ను అలంకరిస్తారు. అన్ని ప్రాంతాల రైతులూ ఈ వేడుకలో పాల్గొంటారు.