పెద్దలతో పోలిస్తే… కొత్త భాషను పిల్లలు త్వరగా నేర్చుకుంటారు. ఇది తెలిసిన విషయమే! కానీ దీని వెనుక కారణం ఏమిటన్నదే అస్పష్టంగా ఉండేది. పిల్లల మెదడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టే, చిన్నారుల బుర్రకు ఇంత వేగమని ఇప్పటివరకూ భావించారు. కానీ, ఓ సరికొత్త ప్రయోగం అంతకంటే ముఖ్యమైన కారణాన్ని గుర్తించింది. పిల్లలు ఒక భాషను నేర్చుకుంటున్నప్పుడు, వాళ్లతో పెద్దలు మాట్లాడే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వీలైనంతగా తేలిక పదాలను ఉపయోగిస్తూ, వాక్యాలను స్పష్టంగా ఉచ్ఛరిస్తూ.. అరటిపండు ఒలిచినట్టు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా పెద్దలకు తెలియకుండానే, అతి సహజంగా జరిగిపోతుంది. కాబట్టే, చిన్నారులకు కొత్త భాష త్వరగా ఒంటబడుతుందన్నది తాజా అధ్యయనం. ఈ విషయాన్ని నిరూపించేందుకు పరిశోధకులు 41 మంది పిల్లలను ఓ చోట చేర్చి, జంతువులను గుర్తించే ఆటపెట్టారు. వారికి సాయంగా తల్లిదండ్రులనూ అనుమతించారు. ఆ సమయంలో పిల్లలు తమకు తెలిసిన జంతువులను గుర్తించేందుకు, తెలియని జంతువుల గురించి తెలియచేసేందుకు ఎలాంటి భాషను ఉపయోగించారో గమనించారు. పెద్దల వాక్యనిర్మాణంలో స్పష్టమైన తేడాలు కనిపించాయి. ఇదో సానుకూలమైన మార్పే.