పెండ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వంటిల్లే ప్రపంచంగా బతకడం.. ఆమెకు అసలు ఇష్టం లేదు. ఉన్నతంగా ఎదగాలన్నదే ఆలోచన. రొటీన్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి, ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఒంటరిగా శ్రమించి, శోధించి, సాధించి పారిస్ హాట్కోచర్ షోలో పాల్గొన్న మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.
వైశాలి శాడంగులె ఇప్పుడొక ఫేమస్
డిజైనర్. ప్రతిష్ఠాత్మక పారిస్ కోచర్ వీక్-2021లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ. న్యూయార్క్ ఫ్యాషన్ షోలో తన అందచందాలతో మెప్పించిన సౌందర్య సృష్టికర్త. చేనేత వస్ర్తాలను ప్రపంచ ఫ్యాషన్ వేదికల్లో ప్రదర్శించిన మూలాలు మరువని భారతీయురాలు.
పాత బట్టలతో కర్టెన్లు
వైశాలిది మధ్యప్రదేశ్. చాలా పేద కుటుంబం. చదువుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని ఆర్థిక పరిస్థితి. అయినా కష్టపడి కొంతవరకు చదువుకున్నది. 17 ఏండ్ల వయసులోనే తన భవిష్యత్ ఏమిటన్నది కండ్లముందు కనిపించింది. ‘అందరిలా పెండ్లి చేసుకొని.. పిల్లల్ని కంటూ.. జీవితాంతం పాత బట్టలతో మెత్తలు, కర్టెన్లు, బొంతలు కుడుతూ బతకాలా?’ అని తనను తాను ప్రశ్నించుకున్నది. అమ్మానాన్న పరిస్థితి చూస్తే దుఃఖం వచ్చేది. తనకు ఓ అక్కా ఉన్నది. ఇంటిల్లిపాది సంపాదన రోజుకు వంద రూపాయలు కూడా లేదు. కన్నవారికి భారం కాకుండానే జీవితంలో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇంటి నుంచి వెళ్లిపోయి..
ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయానికి, ఆమె చేతిలో రెండు జతల బట్టలు, ఆమె కండ్లలో కోటి కలలు.. మాత్రమే ఉన్నాయి. ఎదగాలన్న ఆకాంక్షే వైశాలిని నడిపించింది. తన ఆలోచనంతా ఆ ఇరుకిరుకు జీవితం నుంచి బయటపడాలన్నదే. పొట్ట నింపుకోవడానికి ఓ పని వెతుక్కోవాలని అనుకున్నది. ఎదగడానిక ఒక వనరు కోసం అన్వేషణ మొదలైంది. మొత్తానికి భోపాల్ చేరుకున్నది. ఎటు వెళ్లాలో? ఎక్కడ ఉండాలో? తెలియదు. ఆలోచిస్తూ రైల్వేస్టేషన్లోనే ఉండిపోయింది. అర్ధరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉంటే, అందరూ తమాషా చూశారు.
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం
ఓ రైల్వే ఉద్యోగి ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆయన సిఫారసుతో స్థానికంగా ఒక హాస్టల్లో వసతి లభించింది. నీడ అయితే లభించిందిగానీ, ఉపాధి కోసం ఏదో ఒక పని చేసుకోవాలి కదా? ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం దొరికింది. నెలకు ఐదొందల జీతం. తోటి ఉద్యోగులతో తొందరగానే కలిసిపోయింది. వాళ్లలో కొందరు స్టయిలిష్‌గా ఉండేందుకు ప్రయత్నించేవారు. వైశాలి కొన్ని టిప్స్ చెప్పేది. ‘థ్యాంక్ యూ ఫ్యాషన్ డిజైనర్ వైశాలీ!’ అని పొగిడేవారు. ఆ ప్రశంసే ఆమెకో కొత్త
ఆలోచన ఇచ్చింది.
న్యూట్రిషనల్ కోచ్‌గా..
ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల ఆసక్తి ఉన్నా, అలాంటి కోర్సులో చేరేంత ఆర్థిక స్థోమత ఆమెకు లేదు. ఆఫీస్ కంప్యూటర్లో ఫ్యాషన్ డిజైనింగ్ సమాచారం డౌన్లోడ్ చేసుకొని, ఇంటికి వచ్చాక చదువుకునేది. తర్వాత గుజరాత్‌లోని వడోదరలో ఇలస్ట్రేటర్ ఉద్యోగం వచ్చింది. ‘ఇక బతకగలను’ అనే నమ్మకం ఏర్పడింది. దీంతో ముంబయికి షిఫ్ట్ అయ్యింది. డిజైనర్‌గా పని చేస్తూనే ఒక వ్యాయామశాలలో న్యూట్రిషనల్ కోచ్‌గా చేసింది. అక్కడికి వచ్చే కస్టమర్లకు పోషకాహారం, ఆరోగ్యం గురించి సలహాలు ఇచ్చేది. ఆర్థిక విజయంతోనే ఆత్మ విశ్వాసం సాధ్యమని అర్థమైపోయింది. అలా, 43 ఏండ్ల వయసులో ఒకదానికొకటి సంబంధం లేని నాలుగు రంగాల్లో పనిచేసింది వైశాలి.
తల్లిగా ..
సంపాదించిన డబ్బుకు కొంత బ్యాంక్ రుణం జోడించి ముంబైలోని మలాడ్‌లో ఒక బొటిక్ ప్రారంభించింది. చందేరీ మెటీరియల్‌తో కుట్టిన బ్లౌజ్‌లు ఆ బొటిక్ ప్రత్యేకత. గిరాకీ బాగా ఉండేది. దీంతో మరో శాఖ ఏర్పాటు చేసింది. క్రమంగా తనకంటూ ఓ బ్రాండ్ వాల్యూ సృష్టించుకొంది. ఆర్థికంగా నిలదొక్కుకున్నాక పెండ్లి చేసుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడానికి ఢిల్లీ వెళ్లేటప్పటికి, ఆమెకు ఏడాదిన్నర వయసు కూతురు ఉంది. గృహిణిగా, బొటిక్ నిర్వాహకు రాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది వైశాలి.
లక్ష్యానికి చేరువలో
2009లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో, 2011లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తన డిజైన్లు ప్రదర్శించే అవకాశం లభించింది వైశాలికి. ఇవే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పాయి. చేనేతను అస్త్రంగా ఎంచుకున్నది. చందేరీ ఫ్యాబ్రిక్‌ను విడిచిపెట్టలేదు. ఎన్నో గ్లోబల్ ఫ్యాషన్ వేదికలమీద ప్రదర్శనలిచ్చింది. తాజాగా పారిస్‌లోని హాట్కోచర్ వీక్‌లో విజేతగా నిలిచింది. వాస్తవానికి పారిస్ హాట్కోచర్ వీక్‌లో ఇప్పటివరకూ ఏ భారతీయ మహిళా పాల్గొనలేదు. వైశాలి దృష్టిలో ఆ విజయమూ ఓ మలుపే. అదే గమ్యం కాదు.