e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home బతుకమ్మ పాత ఖైదీలకు కొత్తదారి

పాత ఖైదీలకు కొత్తదారి

క్షణికావేశంలో తప్పు చేసిన వారిని చట్టం కొద్దికాలమే శిక్షిస్తుంది. కానీ, సమాజం జీవితాంతం నేరస్థుడిగానే చూస్తుంది. ఫలితంగా, చేసిన తప్పునే మళ్లీ చేసే ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ధోరణిలో మార్పు తీసుకు రావడానికి తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ కృషి చేస్తున్నది. సత్ప్రవర్తనతో విడుదలైన ఖైదీలకు, సమాజంలో గౌరవంగా బతికే అవకాశం కల్పిస్తున్నది. జీవితంలో మళ్లీ తప్పు చేయాలనే ఆలోచనే రాకుండా, పాత నేరస్థులకు కొత్త బతుకు దారిని చూపిస్తున్నది.

తొమ్మిదేండ్లపాటు పిల్లలకు నీతిపాఠాలు బోధించిన ఓ ప్రైవేట్‌ టీచర్‌ క్షణికావేశంలో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. దీంతో ఖైదీగా నిన్నటివరకూ జనగామ సబ్‌ జైలులో ఊచలు లెక్కపెట్టాడు. మరో ఖైదీ పెండ్లి చేసుకొని ఏడాదైనా గడువక ముందే, తనతో ఏడడుగులు నడిచిన ఇల్లాలిని ఏకంగా ఆరడుగుల గొయ్యిలో సమాధి చేశాడు. ఈ నేరానికి జీవితఖైదు పడింది. చర్లపల్లి జైలుకి వెళ్లాడు. ఈ ఖైదీల వ్యక్తిగత, కుటుంబ నేపథ్యం వేరు. కానీ, జైలు జీవితం ఈ ఇద్దరికీ ఓ విలువైన పాఠం నేర్పింది.

- Advertisement -

కొత్త జీవితాలకు ‘ప్రారంభం’
జైళ్లశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పలు పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే జనగామ మండలం యశ్వంతాపూర్‌లో తెలంగాణ జైళ్లశాఖ డీజీ రాజీవ్‌ త్రివేది చేతులమీదుగా పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించారు. జైలుశిక్ష అనుభవించి, సత్ప్రవర్తనతో విడుదలైన వారికి ప్రత్యేక శిక్షణనిచ్చి, ఉద్యోగావకాశం కల్పించారు. ప్రస్తుతం ఇక్కడ ఆరుగురు పనిచేస్తున్నారు. నెలకు రూ.12 వేల జీతాన్ని అందుకుంటున్నారు. ఉన్నతాధికారులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుతూ పెట్రోల్‌ బంక్‌ను లాభాల బాటలో నడిపిస్తున్నారు. రోజూ రూ.4 నుంచి రూ.5 లక్షలదాకా టర్నోవర్‌ ఉంది. జైలునుంచి విడుదలయ్యాక గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలతో కలిసి ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఈ పెట్రోల్‌ బంక్‌లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తుండటంతో జనం క్యూ కడుతున్నారు.

నిజంగా పునర్జన్మే..
‘మాది జనగామలోని ధర్మకంచ. క్షణికావేశంలో భార్యను హత్య చేశాను. జీవిత ఖైదు పడ్డది. చర్లపల్లి జైలులో పదహారేండ్లు శిక్ష అనుభవించా. సత్ప్రవర్తనతో గతేడాది గాంధీ జయంతికి తెలంగాణ ప్రభుత్వం నన్ను విడుదల చేసింది. బయట ఏదైనా కూలీ పని చేసుకుందామంటే, ఎవరూ నన్ను నమ్మే పరిస్థితి లేదు. అసొంటి నాకు తెలంగాణ జైళ్లశాఖే బతుకు దారి చూపింది. ప్రస్తుతం పెట్రోల్‌ బంకులో పని చేసుకుంటూ, నెలనెలా జీతం తీసుకుంటున్నా. దాంతో మా అమ్మా, నేను సంతోషంగా జీవిస్తున్నాం. నిజంగా ఇది నాకు పునర్జన్మలాంటిదే అనుకుంటాను’ అంటాడు నారదాసు ఎల్లయ్య. మరో మాజీ ఖైదీ రమేష్‌ నేపథ్యమూ ఇలాంటిదే. ‘మాది పాలకుర్తి మండలం గూడూరు దగ్గర్లోని మొర్సుగద్ద తండా. నేను ఎంఏ, బీఎడ్‌ చేశా. పాలకుర్తిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేసేవాణ్ని. మా మధ్య వచ్చిన ఓ చిన్న గొడవ కారణంగా నా భార్య ప్రాణాలు కోల్పోయింది. దాంతో హత్యానేరం కింద జైలుకు వెళ్లాను. ఇటీవలే బెయిల్‌మీద బయటకు వచ్చాను. నాకు ఇద్దరు చిన్న పిల్లలు. నేను చేసిన తప్పుకు వాళ్లు తల్లిని కోల్పోయారు. జైలునుండి వచ్చిన నన్ను ఎవరూ నమ్మి పని ఇవ్వలేదు. ఉన్నత చదువు చదివిన నేను, జీవితంలో ఉన్నతంగా జీవించలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ సమయంలో తెలంగాణ జైళ్లశాఖ నాకు ఓ అవకాశం కల్పించింది. పెట్రోల్‌ బంకులో పని చేస్తూ, పిల్లలతో కలిసి ఆనందంగా జీవిస్తున్నా’ అంటూ తన కథ వివరించాడు రమేష్‌. నిజమే, జైళ్లు సంస్కరణాలయాలుగా మారితే, ‘పాత నేరస్తుడు’ అన్న మాటే వినిపించదు. ప్రతి ఖైదీ ఓ కొత్త మనిషిగా అవత రిస్తాడు. బాధ్యత కలిగిన పౌరుడిగా జీవిస్తాడు.

గౌరవంగా బతుకుతున్నారు!
మా ఉన్నతాధికారులు రాజీవ్‌ త్రివేది, సైదయ్య, వై.రాజేశ్‌, హనుమాన్‌ ప్రసాద్‌ల సహకారంతో జనగామ జిల్లాలో తొలిసారిగా ఒక పెట్రోల్‌ బంక్‌ను ఏర్పాటుచేశాం. ఖైదీల్లో మార్పు తీసుకొచ్చి, వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్నదే మా లక్ష్యం. జైలునుంచి విడుదలైన ఆరుగురు ఖైదీలపై నమ్మకంతో ఇంతపెద్ద వ్యాపారాన్ని వారికి అప్పగించాం. వారు క్రమశిక్షణతో పనిచేస్తూ శ్రమకు తగిన వేతనం తీసుకుంటూ, గౌరవంగా బతుకుతున్నారు. మా ఖైదీలు నడిపే పెట్రోల్‌ బంక్‌లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తున్నారు. ఎందుకంటే, మళ్లీ తప్పు చేస్తే జీవితం తలకిందులవుతుందని వారికి బాగా తెలుసు. అందుకే, అంత నమ్మకంగా పని చేస్తున్నారు. కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

  • వి.ఉపేందర్‌రావు, సబ్‌ జైలర్‌, జనగామ

-కన్నారపు శివశంకర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana