టాలీవుడ్లో చేసింది నాలుగు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది రుహానీ శర్మ. మొదటి సినిమా ‘చి॥ల॥సౌ॥’లో అందంతోపాటు అభినయంతో మెప్పించి ప్రశంసలు అందుకుంది. తాజాగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాతో మరోసారి తెలుగువారిని పలకరించింది. . స్క్రిప్ట్ నచ్చితే చాలు, స్క్రీన్ స్పేస్ గురించి ఆలోచించనంటున్న ఉత్తరాది భామ రుహానీ గురించి ..
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌కు చెందిన రుహానీ పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. చదువుకునే రోజుల్లోనే వీడియో ఆల్బమ్స్‌తో కెరీర్ ప్రారంభించింది. ‘క్లాస్రూమ్’, ‘కుదీ తు పటాకా’ వంటి ఆల్బమ్స్‌తో బాగా పాపులర్ అయిన ఈ భామ, తమిళ సినిమా ద్వారా వెండితెరపై మెరిసింది. ‘తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటిస్తున్నాను. కథ నచ్చితే భాషతో సంబంధం లేకుండా అంగీకరిస్తాను. పాత్ర పరిధి వరకూ ఫర్వాలేదుగాని, మరీ బోల్డ్ పాత్రలు ఇష్టపడను.’
‘నాకు వ్యక్తిగతంగా సైకో థ్రిల్లర్ మూవీస్, లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. అందుకే మలయాళంలో ఓ డార్క్ క్యారెక్టర్ చేశాను. నానీ ప్రొడక్షన్లో ఓ సినిమాతోపాటు, మరో మూవీలో నటిస్తున్నా. తెలుగులో నాలుగు సినిమాలే చేసినా ప్రేక్షకుల ఆదరణ గొప్పగా ఉంది.’
2018లో వచ్చిన ‘చి॥ల॥సౌ॥’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రుహానీ. తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంది. ‘హిట్’, ‘డర్టీ హరి’ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మరో రెండు సినిమాలకు సంతకం చేసింది. కరోనా కారణంగా షూటింగ్‌లకు అంతరాయం కలగడంతో సమయం వృథా కాకుండా, పలు వెబ్‌సిరీస్‌లలో నటించింది. మరోవైపు టెలివిజన్ షోల ద్వారానూ అభిమానుల సంఖ్య పెంచుకుంది.
“బాలీవుడ్‌లోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో చేయాలనిఉంది. హిందీలో ఇప్పటికే ‘ఆగ్రా’ అనే ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాను. రెమ్యునరేషన్, ఫేమ్‌తో సంబంధం లేకుండా నాకు సరిపోయే పాత్రలను ఎంచుకోవడానికే మొగ్గు చూపుతాను. కమర్షియల్ చిత్రాల కంటే,
కథా ప్రాధాన్యమున్న సినిమాలే నా మొదటి చాయిస్” అంటున్నదీ ముద్దుగుమ్మ.
‘డర్టీ హరి’లో బోల్డ్ పెర్ఫార్మెన్స్కి కేరాఫ్‌గా నిలిచిన రుహానీ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాతో క్లాస్ పాత్రల్లోనూ మెప్పించగలనని నిరూపించింది. ‘నాకు తెలిసినంత వరకూ.. మనం అంతర్గతంగా ఎలా ఉంటామో, అదే అసలైన అందం. చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నామన్నది కొలమానం కాదనేది నా అభిప్రాయం’ అంటూ తన మనసులోని మాట పంచుకుంది.