నయన తార అన్న పేరు డయానాకు అతికినట్టు సరిపోయింది. తను కండ్లతోనే నటిస్తుంది. డైలాగుల అవసరం లేదు. స్క్రీన్‌ప్లేతో పన్లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకపోయినా నష్టం లేదు. దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో నటించిన ఈ భామ, త్వరలోనే బాలీవుడ్లో
అదృష్టాన్ని పరీక్షించుకోనున్నది.
నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. చదువుకొనే రోజుల్లోనే మోడల్‌గా అనేక ప్రకటనల్లో మెరిసింది. ‘మానస్సినక్కరే’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాకే మంచి మార్కులు కొట్టేసి, తమిళంతోపాటు తెలుగులోనూ వరుస
అవకాశాలు అందుకుంది.
‘లక్ష్మీ’ కంటే ముందే.. తెలుగులో డబ్ అయిన ‘చంద్రముఖి’, ‘గజిని’ వంటి తమిళ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది. తొలినాళ్ళలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం తమిళంలో, తెలుగులో సీనియర్ హీరోల ఫస్ట్ చాయిస్‌గా నిలుస్తున్నది.
మాలీవుడ్‌తో వెండితెరకు పరిచయమై కోలీవుడ్, టాలీవుడ్‌లలో పద్దెనిమిదేండ్లుగా ఎదురులేకుండా రాణిస్తున్న ఈ భామ.. త్వరలోనే బాలీవుడ్‌లోనూ నటించనుంది. అంతేకాదు, మొదటి సినిమాలోనే బాద్షా షారుక్ ఖాన్ సరసన చిందులేయనుంది.
‘ఫోర్బ్స్ ఇండియా’ ప్రకటించిన ‘సెలబ్రిటీ -100’లో దక్షిణాది నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరోయిన్ తనే. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి ‘రౌడీ పిక్చర్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించింది. సొంత సంస్థ ద్వారా తీస్తున్న.. ‘నెట్రికణ్’లో చూపులేని పాత్రతో మరో ప్రయోగం చేయనున్నది.
దక్షిణాదిన తిరుగులేని హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయన్ ఇప్పటికి దాదాపు 75 సినిమాల్లో నటించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించింది. చాలా అవార్డులు వరించాయి. ‘శ్రీరామ రాజ్యం’లో సీతమ్మగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నంది అవార్డుతోపాటు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్నీ సొంతం చేసుకుంది.
లాక్‌డౌన్‌తో పరిశ్రమ కుదేలైనా ఓటీటీలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వార్తల్లో నిలుస్తోంది నయన్. కమర్షియల్ సినిమాలే కాకుండా ‘కర్తవ్యం’, ‘అమ్మోరు’, ‘విశ్వాసం’ వంటి చిత్రాలతో ప్రయోగాత్మక పాత్రలకు చిరునామాగా మారింది. ఇటీవల విడుదలైన ‘నీడ’లో ఎనిమిదేండ్ల కుర్రాడికి తల్లిగా నటించి, మరోసారి తానేమిటో రుజువు చేసుకుంది.