అతను ఓ పేరున్న క్రీడాకారుడు. ఆరోగ్యకరమైన జీవనశైలి. అసూయ పడేంత దారుఢ్యం. అడుగడుగునా సూచనలు అందించే వైద్య నిపుణులు. అయినా ఓ రోజు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. జీవితం తలకిందులైపోయింది. ఇలాంటి వార్తలు మనం తరచూ వింటూ ఉంటాం. కొన్నిటికి కారణాలు కనిపిస్తాయి. మరికొన్నిటికి విధిని నిందిస్తాం. కానీ, అప్పటివరకూ సాఫీగా సాగిపోయే జీవితంలో గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు డెన్మార్క్ పరిశోధకులు. గుండె కణజాలంలో ఉండే cardiac sodium channel అనే ప్రొటీన్ పనితీరులో లోపం వల్ల సమస్య ఏర్పడుతున్నట్టు గ్రహించారు. అంతేకాదు, ప్రొటీన్‌లో మార్పులు ఎందుకు వస్తున్నాయి, అవి ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అనే విషయాలు కూడా తెలుసుకోగలిగారు. ఈ ప్రొటీన్‌ను ఎప్పటికప్పుడు గమనించడం వల్ల, భవిష్యత్తులో రాబోయే గుండెపోటును ముందుగానే ఊహించి,నివారించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.