‘అందాల రాక్షసి’గా చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటూ సోకుల బాకులు విసిరింది. ‘భలే భలే మగాడివోయ్’ అంటూ కుర్రకారు గుండెల్లో చిచ్చుపెట్టింది. ఇప్పుడు ‘చావు కబురు చల్లగా’ చెబుతున్నది.. ఉత్తరాది భామ లావణ్య త్రిపాఠి. ఇన్నాళ్లూ గ్లామర్, కమర్షియల్ రోల్స్‌తో అలరించిన ఈ సొట్టబుగ్గల సుందరి ఇప్పుడు చాలెంజింగ్ పాత్రలపైనా దృష్టి పెట్టింది. రొటీన్‌కి భిన్నమైన పాత్రలే పోషిస్తానంటూ లావణ్య త్రిపాఠి చెబుతున్న ముచ్చట్లు ఇవీ..
కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలను ఒప్పుకొన్నా. ఇప్పుడు అలా కమిట్ కావట్లేదు. ఎందుకంటే, నేను విన్న చాలా కథలు అంతకుముందు చేసిన వాటిలానే ఉన్నాయి. ఒకే పాత్రను మళ్లీ మళ్లీ చేసి, ఒకే ఎక్స్ప్రెషన్ను పదే పదే ఇవ్వడం నాకిష్టం ఉండదు. రెగ్యులర్ పాత్రలతో బోర్ కొట్టేసింది. ఇకనుంచి చాలెంజింగ్ రోల్స్ చేయాలని నిర్ణయించుకొన్నా.
ఏదైనా పాత్రలో నటించేటప్పుడు సాధ్యమైనంత సహజంగా ఉండాలన్నదే నా అభిమతం. అందుకే, ఏ సినిమా చేసినా ఆ పాత్రకు తగినట్టు నన్ను నేను మలుచుకుంటా. డాక్టర్, డ్యాన్సర్, టీచర్, స్టూడెంట్, అథ్లెట్.. ఆయా పాత్రలకు తగినట్టు ఉండేందుకు ప్రయత్నిస్తా. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో హాకీ ప్లేయర్‌గా నటించా. ఈ పాత్రకోసం పాత హాకీ మ్యాచ్‌లు చాలా చూశా.
నాన్న లాయర్, అమ్మ టీచర్. ఇంట్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అందరికీ కళల్లో ప్రవేశం ఉంది. కన్నవాళ్ల ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీకి వచ్చా. అందరూ గర్వించేలా మంచి సినిమాలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నా. కథా ప్రాధాన్యం ఉంటేనే సినిమాకు ఓకే చెబుతున్నా.
వ్యాయామం నా దినచర్యలో భాగం. ఎంత బిజీగా ఉన్నా, రోజూ వర్కవుట్స్ చేస్తా. స్కూల్ డేస్‌లో బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ ఎక్కువగా ఆడేదాన్ని. డ్యాన్స్ అంటే ఇష్టం. సినిమాలో నా పాత్ర పరిధి మేరకు నేను చేయగలిగినంతా చేస్తా. పాత్ర అవసరాన్నిబట్టి ఏ పనైనా, ఇష్టంతో నేర్చుకొంటా.
పారితోషికం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కథ నచ్చితే చాలు. డబ్బు తీసుకోకుండానే కొన్ని యాడ్స్ చేశా. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాతోపాటు మ్యూజిక్ వీడియో చేస్తున్నా. తెలుగులో రెండు సినిమాలున్నాయి. ఓటీటీ నుంచీ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వద్దని చెప్పాను. ఇంకొన్నాళ్ళు సినిమాలు మాత్రమే చేయాలనుకొంటున్నా.
చాలామంది హీరోలతో చేశా. ప్రత్యేకంగా కొందరితోనే చేయాలనేం కోరుకోలేదు. కథ నచ్చితే చాలు. ఎవరనేది చూడను. కొరటాల శివ, రాజమౌళి, సుకుమార్‌ల సినిమాల్లో మాత్రం చేయాలనుంది. విలన్ పాత్రలు ఇష్టం. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే మనలోని నటనా సామర్థ్యం తెలుస్తుంది.