టీ కప్పులో పడితే.. పైకప్పు అదిరిపోయే తలపోటైనా సరే, ఎగిరిపోతుంది. నూనెచుక్కగా బుగ్గను అద్దుకుంటే.. నిగ్గు మొగ్గ తొడిగి సిగ్గు పిల్లిమొగ్గలేస్తుంది. సౌందర్య ఉత్పత్తుల్లో ఎసెన్షియల్గా పేరుమోసింది లెమన్ గ్రాస్.ఆరోగ్య సాధనలోనూ సంచలనం సృష్టిస్తున్నది. ఇప్పుడు పాలమూరు పంటచేలల్లో విరగపండి క్షేత్రస్థాయిలో పరిమళాలు పంచుతున్నది. రైతు ఇంట సిరుల రాశులు కురిపిస్తున్నది.
‘ఏం రామయ్యా ఈసారి ఏ పంట వేశావ్!’
‘చెరువు కింద వరి, చెలకలో మక్కజొన్న’
..ఆ ఊరు రైతులు మాత్రం ఇలాంటి మూస జవాబు చెప్పరు. సరికొత్త సమాధానమే చెబుతారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చీకురు చెట్టు తండాలోని చిన్నకారు రైతులు పెద్ద లక్ష్యంతో సాగుబడి చేస్తున్నారు. సౌందర్య సాధనాల్లో, ఆహార వ్యవహారాల్లో అరుదైన ఉత్పత్తిగా చెప్పే లెమన్గ్రాస్ను పండిస్తున్నారు వాళ్లు. మండల పరిధిలో చిన్నాచితకా రైతులు సుమారు 20 ఎకరాల్లో నిమ్మగడ్డిని పండిస్తున్నారు. సంప్రదాయ పంటలతో లాభాల్లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు కొత్త దారి చూపుతున్నారు. సుగంధ ద్రవ్యాల సాగుతో విలక్షణతను చాటుకుంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహంతో స్థానికంగా ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా లెమన్ గ్రాస్ నుంచి సబ్బులు, షాంపూలు, అగరు బత్తీలు, వివిధ రకాల స్ప్రేలు, లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ తదితర ఉత్పత్తుల తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. చర్మానికి పట్టిన చీడను, ఒంట్లో తిష్టవేసిన పీడను తొలగించే లెమన్‌గ్రాస్‌కు చీడపీడ బాధ తక్కువ. పురుగు మందుల వాడకం పెద్దగా అవసరం ఉండదు. ఫలితంగా పెట్టుబడీ తక్కువే! అంతర్జాతీయంగా భారీగా డిమాండ్ ఉండటంతో రాబడి తగ్గే ప్రసక్తే ఉండదు.
అన్ని ఖర్చులుపోనూ ఎకరాకు నికరంగా లక్ష వరకు మిగులుతున్నాయని నిమ్మగడ్డిని పండిస్తున్న రైతులు చెబుతున్న మాట. సెరా ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ అవగాహన కల్పించడంతో చీకురుచెట్టు తండా ప్రాంతంలో 17 మంది రైతులు లెమన్ గ్రాస్ సాగు చేస్తున్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (సిమాప్) విత్తనాలను ఉచితంగా అందించింది. ‘మొదటి పంట ఐదు నెలలకు వస్తుంది. తర్వాత మూడు నెలలకు ఒకసారి పంట చేతికొస్తుంది. దుక్కి దున్నడం మొదలుకొని పంట చేతికి వచ్చే వరకు పెట్టుబడి ఎకరాకు రూ.15వేల వరకు అవుతుంద’ని చెబుతున్నారు రైతులు. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాల్లో లెమన్ గ్రాస్ ఆయిల్‌కు మంచి డిమాండ్ ఉంది. దేశంలోనూ సౌందర్య సాధనాల్లో వాడేందుకు అవసరమైన లెమన్ గ్రాస్ ఆయిల్ కొరత ఉందని సిమాప్ సంస్థ చెబుతున్నది. వనపర్తి జిల్లాలో మొదలైన నిమ్మగడ్డి పరిమళం త్వరలోనే రాష్ట్రవ్యాప్తం కావాలని ఆశిద్దాం. అదే జరిగితే డైలాగ్ మారు తుంది..
‘ఏం రామయ్యా ఈసారి ఏ పంట వేశావ్!’
‘చెరువు కింద లెమన్ గ్రాస్, చెలకలో లెమన్ గ్రాస్’
ఎందెందు చూసినా..
పేరుకు గడ్డే అయినా.. లెమన్‌గ్రాస్‌లో పోషకాలు ఎక్కువ. ఉపయోగాలూ ఎక్కువే! న్యూట్రిషనిస్ట్‌లు, బ్యూటీషియన్లు లెమన్‌గ్రాస్ ప్రయోజనాల చిట్టా విప్పేకొందీ చాంతాడంత అవుతుంది. లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ ముఖారవిందాన్ని మరింత అందంగా మార్చేస్తుంది. రెండు చుక్కలు రాసుకుంటే జిడ్డు చర్మం కాస్తా నిగనిగలాడుతుంది. అంతేకాదు సువాసనభరితమైన లెమన్‌గ్రాస్ ఆయిల్‌ను అరోమా థెరపీలో వాడుతారు. మానసిక ఒత్తిడిని దూరం చేసే శక్తి దీని పరిమళానికి ఉందని పలు పరిశోధనల్లో తేటతెల్లం అయింది. ఇక లెమన్‌గ్రాస్ కాడలతో టీ కాచితే ఆ పరిమళం వాడంతా వస్తుంది. సువాసనను ఆస్వాదిస్తూ టీ తాగితే మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి వస్తుంది. ఇలాంటి ప్రయోజనాలు కోకొల్లలని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే సౌందర్య, ఆహార ఉత్పత్తుల్లో లెమన్‌గ్రాస్‌కు ‘హెవెన్ గ్రాస్’గా పేరుంది.
-పెద్ది విజయ భాస్కర్ , మహబూబ్‌నగర్