ఉద్యోగం అంటే కత్తిమీద సామే. కొన్నిసార్లు రద్దీ కూడళ్ల పక్కనే పని చేయాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితి ఉద్యోగుల సామర్థ్యం మీద ఏమేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు హార్వర్డ్ పరిశోధకులు. ఇందుకోసం వారు 300 మంది ఉద్యోగులను ఎంచుకున్నారు. వారి ఆఫీస్ డెస్కుల పక్కన కొన్ని పరికరాలు ఉంచారు. వాటి ద్వారా, ఆ ఆఫీసులో ఉక్కపోత ఎలా ఉంది, కాలుష్యం ఎంతవరకు ఉంది?.. లాంటి వివరాలు సేకరించారు. కార్యాలయం ఇరుగ్గా ఉంటే ప్రాణవాయువు తగ్గిపోతుంది. కాలుష్యాన్ని సూచించే 2.5 పి.ఎమ్ కణాలు పెరిగిపోతే ఊపిరితిత్తుల నుంచీ గుండె వరకు ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. ఈ రెండూ ఎక్కువగా ఉంటే, ఉద్యోగుల రోజువారీ పనితీరు కూడా దెబ్బతింటుందని గ్రహించారు పరిశోధకులు. కాబట్టి, సిబ్బంది బాగా పనిచేయాలంటే… కార్యాలయం వాతావరణం సరిగ్గా ఉండాల్సిందే.