బుడిబుడి అడుగులేస్తూ బడికెళ్లే చిన్నారులకు స్కూల్లో దొరకని ఆనందం అంటూ ఉండదు. పాఠాలు ఉంటాయి. ఆటపాటలూ ఉంటాయి. అందులోనూ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందంటే, పిల్లల ఉత్సాహానికి హద్దులుండేవి కావు. ఎలాగైనా బహుమతి పొందాలని.. రకరకాల థీమ్స్తో, వినూత్నమైన దుస్తులు ధరించేవారు. కానీ, కరోనా మహమ్మారి పిల్లలను బడికి దూరం చేసింది. బడిలోని ఆటలకూ దూరం చేసింది. కాబట్టి, ఆన్లైన్ పాఠాలతో నీరుగారిపోతున్న చిన్నారుల్లో నూతన ఉత్సాహం నింపడానికి ఇంట్లోనే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించండి. డిఫరెంట్ థీమ్ దుస్తులు తొడిగి హంగామా చేయండి. కుదిరితే మీరూ అదే రకం దుస్తులు ధరించి పిల్లలుగా మారిపోండి. పండ్లు, కూరగాయలు, జంతువుల థీమ్ డ్రెస్లు ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. మరెందుకు ఆలస్యం? మీ పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేయండి.