అక్కడ వేసే ప్రతి అడుగూ.. ప్రకృతితో మమేకమవుతుంది. అక్కడి పూలను చూస్తే.. ‘సృష్టిలో ఇన్ని రకాల పుష్ప రాజాలున్నాయా?’ అని అబ్బురమేస్తుంది. అక్కడి ‘సాయంసంధ్య’.. అనుభూతుల స్వర్గంవైపు తీసుకెళ్తుంది. అమెరికాలోని‘అట్లాంటా బొటానికల్ గార్డెన్’ ఓ పచ్చటి ప్రపంచం!
మాఅబ్బాయి అట్లాంటా నగరంలో ఉంటాడు. తన దగ్గరికి వెళ్లినప్పుడే ఈ అరుదైన, అందమైన ఉద్యానవనాన్ని సందర్శించే అదృష్టం దక్కింది. దేవలోక వనానికి ఏమాత్రం తీసిపోని ప్రదేశమిది. 1976 ప్రాంతంలో 30 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ బొటానికల్ గార్డెన్ ఏర్పాటైంది. అప్పటినుంచి లక్షలమంది పర్యాటకులకు ఆనందానుభూతులను అందిస్తున్నది.
లెక్కకు మిక్కిలి..
విభిన్న పుష్పాలకు అట్లాంటా బొటానికల్ గార్డెన్ నెలవు. వేల రంగుల్లో, లెక్కకు మిక్కిలి ఆకృతుల్లో కనువిందు చేస్తాయి. మామూలు పూలతోపాటు నిలువెత్తు పుష్పాలూ దర్శనమిస్తాయి. జపనీస్ గార్డెన్, ఆర్కిడ్ హౌస్, రోజ్ గార్డెన్.. ఇలా ఒక్కో జాతి పూల కోసం ఒక్కో తోటను ఏర్పాటు చేశారు. పూబాలల మధ్య కాలక్షేపం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
వహ్వా.. ట్రీహౌస్!
ఇక్కడి మరో ప్రత్యేకత.. ‘ట్రీహౌస్’. ఇందులో అడుగు పెడితే.. మళ్లీ వెనక్కి రావాలని అనిపించదు. మామూలు మొక్కలే వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాల రూపాల్లో ‘ఔరా’ అనిపిస్తాయి. ‘ప్రకృతి దేవత’ (ఎర్త్ గాడెస్’)నూ కచ్చితంగా దర్శించి తీరాల్సిందే!
పరిశోధన కేంద్రంగానూ..
పరిశోధన కేంద్రంగానూ ఉపయోగపడుతున్నదీ బొటానికల్ గార్డెన్. వృక్షశాస్త్ర విద్యార్థులు, శాస్త్ర
వేత్తలు ఈ ఆవరణలో నెలల తరబడి పరిశోధనలు చేస్తూ ఉంటారు. అంతరించిపోయే జాబితాలో ఉన్న పలు వృక్షజాతులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. ఇందుకోసం గార్డెన్లో ప్రత్యేకంగా ఒక ఇండోర్
కన్జర్వేటరీని ఏర్పాటు చేశారు. అరుదైన జంతు, వృక్ష జాతులు ఇక్కడ కనిపిస్తాయి.
‘ప్రత్యేక’ రోజుల్లో..
రోజువారీ సందర్శనలతోపాటు ప్రత్యేక రోజుల్లో ఇక్కడ ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా ‘గార్డెన్ లైట్స్’ పేరుతో నిర్వహించే వేడుకను కళ్లారా చూడాల్సిందే! ఈ సందర్భంగా గార్డెన్ మొత్తాన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. వాటిని తిలకించి, ఆనందించడానికి ప్రపంచ నలుమూలల నుంచీ లక్షలాది సందర్శకులు వస్తుంటారు. యాత్రికులు సేదతీరేందుకు మంచి రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ప్రకృతి అందాలను చూస్తూ.. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఉద్యానవనాన్ని సందర్శించిన ప్రతి సందర్శకుడూ.. ‘భూతల స్వర్గం అంటే ఇదే!’ అన్నంత సంభ్రమాశ్చర్యానికి లోనవుతాడు. ఏదేమైనా, ‘అట్లాంటా బొటానికల్ గార్డెన్’ను సందర్శించడం.. అద్భుతమైన అనుభూతి, అందమైన జ్ఞాపకం. వీలైతే మీరూ వెళ్లిరండి.
–పంతంగి శ్రీనివాస రావు , హైదరాబాద్.