‘కందకు లేని దురద.. కత్తిపీటకు ఎందుకు?’ అన్నది సామెత. కానీ, వాడకం సరిగ్గా తెలిస్తే కందతోనే వంద వెరైటీలు చేసుకోవచ్చు. పసందైన విందులో అదనపు రుచిని పొందవచ్చు. ఆ కోవలోకే వస్తుంది ‘కంద బిర్యానీ’. బిర్యానీ రుచిని కొత్తగా ఆస్వాదించాలనుకునే
శాకాహారులకు ఈ వెరైటీ నచ్చి తీరుతుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే చక్కని ఆహారం ఇది. కందలో బీటా కెరోటిన్, విటమిన్-బీ6, విటమిన్-సి, ఖనిజాలు విశేషంగా ఉంటాయి. ఇవి జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కందలో ఫైబర్ ఎక్కువ, గ్లయిసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్థులు కూడా ఆరగించవచ్చు. దీనిలోని మెగ్నీషియం, సెలెనియం, జింక్ మూలకాలు మెదడు నరాలు చురుగ్గా పనిచేసేందుకు ఉపకరిస్త్తాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఓసారి కంద బిర్యానీ లాగించండి.
కంద చాలా ప్రాచీనమైన దుంప. తరతరాల నుంచీ ఇల్లాలి మనసు దోచుకుంటున్నది.దీన్నే కొన్ని ప్రాంతాల్లో పుల్లగంద,దురద గడ్డ, ఎలిఫెంట్ ఫుట్ (ఏనుగు పాదం).. అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. పచ్చికందకు దురద గుణం ఎక్కువ. అందుకే తవ్విన తర్వాత కనీసం మూడు నెలలు పక్కన పెట్టాకే వాడుతారు. కందలో స్టార్చ్, పిండి పదార్థాలతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
శాకాహారులకు ప్రీతికరమైన దుంపల్లో కంద స్థానం ప్రత్యేకం. కంద పులుసు, పచ్చడి, అట్లు, వేపుడు.. అంటూ చాలారకాల వంటలు వండుతారు. మిగతా కూరగాయలతో పోలిస్తే దీనికి పెళుసుదనం ఎక్కువ. ఎలా వండినా ముక్క ప్రత్యేక రుచిని ఇస్తుంది. అందుకే, పాకశాస్త్ర నిపుణులు కందతో కమ్మనైన బిర్యానీ వండి వడ్డిస్తున్నారు.
కంద బిర్యానీ కూడా చికెన్, మటన్ బిర్యానీ తయారీనే పోలి ఉంటుంది. కాకపోతే, వాటితో పోలిస్తే మసాల తక్కువగా వేసుకోవాలి. కంద ముక్కలకు మసాలా పట్టించి చక్కగా ఉడికిన తర్వాత, సగానికి కాస్త ఎక్కువగా ఉడికిన అన్నంతో కప్పేసి గాలి బయటకు పోకుండా చూసుకుంటే నాన్వెజ్ బిర్యానీలకు తీసిపోని కంద దమ్ బిర్యానీ తయారవుతుంది.
బిర్యానీ తయారీలో వాడే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులవంటి సుగంధ ద్రవ్యాలు సువాసనతోపాటు బలాన్నీ అందిస్తాయి. ముఖ్యంగా కందలోని పోషకాలు మహిళలకు చాలా మేలు చేస్తాయి. ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచడంలో, కీళ్ల నొప్పులను నివారించడంలో సాయపడుతాయి. వారానికి రెండు సార్లయినా మహిళలు కంద విందులు ఆరగించాలని నిపుణుల సూచన.