పిల్లలూ! కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త పుస్తకాలు చదువడానికి చాలామంది లైబ్రరీలకు వెళ్తుంటారు. ఇలాంటి గ్రంథాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటిలో అతిపెద్ద గ్రంథాలయం ఎక్కడుందో తెలుసా?
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఓ లైబ్రరీ ఉంది. అదే ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథాలయం. అక్కడ ఎన్ని పుస్తకాలుంటాయో తెలుసా? సుమారు 10 కోట్లు! సిబ్బందే 3 వేల మంది వరకూ ఉన్నారు. క్రీ.శ.1800లో అమెరికా ప్రభుత్వం దీన్ని నిర్మించింది. అప్పట్లోనే, ఇందుకు 5 వేల డాలర్లలను ఖర్చు చేసింది. దీన్ని ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’గా పిలుస్తారు. పుస్తకాలతోపాటు సీడీలు, పురాతన పత్రాలు, మ్యాపులు, వీడియోలు ఎన్నో ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడి పుస్తకాలన్నీ వరుసగా పేర్చుకుంటూ పోతే 1,046 కి.మీ. దూరం వరకూ వస్తాయట. దీన్ని ప్రారంభించిన పన్నెండేండ్ల తర్వాత బ్రిటిష్ సైనికులు యుద్ధంలో చాలా పుస్తకాలను తీసుకెళ్లారు. తర్వాత, అప్పటి అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ 6 వేల పుస్తకాలతో మళ్లీ ప్రారంభించారు. క్రమంగా పుస్తకాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 470 భాషలకు చెందిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు, ఒక సినిమా థియేటర్ కూడా ఉంది.ప్రపంచంలోనే ‘అతిపెద్ద లైబ్రరీ’గా గిన్నిస్ రికార్డును పొందింది.