e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home బతుకమ్మ సృజనశ్రీ మల్లిక్‌!

సృజనశ్రీ మల్లిక్‌!

సృజనశ్రీ మల్లిక్‌!

ఆయన పాట శ్రోతలను రసానంద డోలికల్లో తేలియాడిస్తుంది.ఆయన కవిత కమనీయ భావాలతో అలరిస్తుంది. వెలుగు జిలుగుల వెండితెరే కాదు, నట్టింట్లోని బుల్లితెరకూడా ఆ కలానికి దాసోహమంటుంది. ఆయనే,అక్షరాన్ని ఆయుధంగా చేసుకొన్న సాహిత్య పిపాసి.. మౌనశ్రీ మల్లిక్‌.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన మౌనశ్రీ మల్లిక్‌ కవిగా, సినీగేయ రచయితగా చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆరెల్లి బక్కయ్య, వెంకటమ్మ దంపతులు తల్లిదండ్రులు. 1974 మార్చి 4న మల్లిక్‌ జన్మించారు. ఇంటర్మీడియట్‌ వరకూ వర్ధన్నపేటలో చదువుకున్నారు. వరంగల్‌లోని సీకేఎమ్‌ కళాశాలలో డిగ్రీ, తెలుగు యూనివర్సిటీలో ఎంసీజే చేశారు. పదహారేండ్లపాటు పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేశారు. బాల్యం నుంచే తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు మల్లిక్‌. కవిత్వం, కథ, నవల.. ప్రక్రియతో సంబంధం లేకుండా అన్ని కోణాల్లోనూ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో జరిగే సాహిత్య కార్యక్రమాలకు తరచుగా హాజరయ్యేవారు. సినారె, గోపి, శివారెడ్డి లాంటి మహామహులతో పరిచయం పెంచుకున్నారు. వారి ప్రభావంతో కవిత్వ రచనవైపు దృష్టి మరల్చారు. పేదరికం వెంటాడినా, అవరోధాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగారు. ‘దిగంబర’, ‘గరళమ్‌’, ‘మంటల స్నానం’ మొదలైన కవితా సంపుటాలు ప్రచురించారు.

- Advertisement -

‘చేతిలో చెయ్యేసి’తో..
కవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మల్లిక్‌ సినీకవిగా రాణించాలన్న సంకల్పంతో ఎంతో శ్రమించారు. 2010లో సింహశ్రీ మిద్దె దర్శకత్వంలో వచ్చిన ‘చేతిలో చెయ్యేసి’ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో మూడు పాటలు రాసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నది’ అంటూ రాసిన తొలిపాట యువ హృదయాలను కొల్లగొట్టింది. లేత మనసుల్లో చిగురించిన తొలివలపు సంగతులను, సరిగమలను కొంగొత్తగా వివరించింది. అల్లరి పరువపు వింతల్ని, కవ్వింతల్ని ఎంతో ఇంపైన పదబంధాల్లో పొదిగి వినూత్నంగా చెప్పారీ పాటలో. ‘నువ్విలా పాడితే మది వాసంతం.. నన్నిలా మీటితే ఎద సంగీతం’ అన్న వాక్యాల్లో గొప్ప భావుకతను ప్రదర్శించారు. ప్రేయసి గానం చేత ప్రియుని హృదయం వసంతమవ్వడం, ప్రియుడు తాకితే ప్రేయసి హృదయం సంగీతమవ్వడం నవ్యాతినవ్యం. ఇదే సినిమాలో ‘ప్రేమకు వేళాయెరా’ పాటతోపాటు, ‘చేతిలో చెయ్యేసి’ అంటూ టైటిల్‌ సాంగ్‌నూ రాశారు మల్లిక్‌.

ఊహలకు అక్షర రూపం
ప్రేయసీ ప్రియుల మనసుల్లో చెలరేగే అవ్యక్త మైన ఊహలకు అందమైన అక్షర రూపాన్నిస్తూ అనేక పాటలు రాశారు మల్లిక్‌. 2012లో వచ్చిన ‘గుడ్‌ మార్నింగ్‌’ సినిమాకోసం చక్కని ప్రేమగీతాలను అందించారు. ‘ఎదలో నదిలాగా కదిలిన భావాలు.. మదిలో సుధలాగా కురిసిన రాగాలు’ అనే పాట జనాదరణ పొందింది. ఇదే చిత్రంలో ‘విధి ఆడిన ఆటలలోన అలసినదా ఈ ప్రేమ’ అంటూ రాసిన విరహగీతం కరుణ రసార్ద్రంగా సాగుతుంది. ‘తొలి వేకువ తరుణాన మలిసంధ్యగ మారావు.. ఆశల వంతెన పరిచావు.. మృత్యువు ముంగిట నిలిపావు’ అనే పంక్తుల్లో ప్రేమ శాపమై కాఠిన్యాన్ని ప్రదర్శించిన తీరును తెలిపారు. ‘చెంబు చిన సత్యం’ (2015)లో ‘ప్రేమా విరివాన తన సొగసరి కనులలో చూసినా’ అనే ప్రణయ గీతాన్ని రసరమ్యంగా ఆవిష్కరించారు.

పోరాట గీతాల్లోనూ..
విప్లవత్వాన్నీ వీరావేశాన్నీ రంగరించుకున్న
చైతన్యగీతాలనూ అలవోకగా రాశారు మల్లిక్‌. 2017లో వచ్చిన ‘పోరాటం’ చిత్రమే ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలో ‘సరసర కత్తులు దూసేయ్‌.. నీ అడుగులు బిరబిర వేసేయ్‌’ అంటూ రాసిన పాట, విమర్శకుల ప్రశంసలందుకొన్నది. ఇందులోని ‘కదలరా విప్లవ జ్వాలై.. నడవరా ఉరుముల పిడుగుల వానై’ వంటి పంక్తులు ప్రతి ఒక్కరిలోనూ భావావేశాన్ని రగిలిస్తాయి. ‘ఐపీసీ సెక్షన్‌ భార్యాబంధు’ (2018)లోని ‘రెండు మనసులు కలిసే వేళ.. మదిలో వీణలు మ్రోగే వేళ.. అది కల్యాణం’ పాట భారతీయ వివాహ సంస్కృతినీ, వైశిష్ట్యాన్నీ తెలియజేసింది. పెండ్లి ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. వివాహంతో ఏర్పడిన అనుబంధాలను కలకాలం నిలుపుకోవాలని, బాధ్యతగా ఒకరి కొకరు మసలుకోవాలనే సందేశాన్నిస్తున్నది.‘ఎండకు నీడై.. వానకు గొడుగై.. మీరే మసలాలి’ అంటారు మల్లిక్‌. భార్యాభర్తలు కష్టసుఖాల్లో ఒకరి కొకరు తోడుగా నీడగా సాగిపోవాలని, వారి జీవితాల్లో సంతోషానికే తప్ప సంతాపానికి చోటుండకూడదని చెప్పారీ పాటలో. భావాల మాలలు అల్లి, ఈ చిత్రంలోని ఏడు గీతాలనూ ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు మల్లిక్‌.

‘చిన్నితెర’ మీదా..

‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’ (2019) సినిమాకోసం ఓ వలపు గీతాన్ని ఎంతో మనోహరంగా రాశారు మల్లిక్‌. ‘చెలి వరములు కురిసెను ఎదలో.. కలవరములు కరిగెను మదిలో’ అంటూ సాగే ఈ పాటలో ఇరు హృదయాల్లోని ప్రణయభావ లహరిని, గిలిగింతల సవ్వడిని చక్కగా వివరించారు. యువ హృదయాల వలపుబంధం ఎంత బలమైందో, ఎంత సౌందర్యభరితమో స్పష్టంగా తెలిపారు. ఇవే కాకుండా,
‘థ్రిల్లింగ్‌’, ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’,
‘కై నీడ’, ‘కర్మణ్యే వాధికారస్తే’, ‘బెంగుళూరు 69’, ‘జాతీయ రహదారి’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావ’, ‘ఒక అమ్మాయితో’ మొదలైన 50కి పైగా సినిమాల్లో 100కు పైగా పాటలను అందించారు. 200కు పైగా ప్రైవేటు గీతాలూ రాశారు. చిత్ర సీమలోనేకాదు, చిన్నితెరపైనా తన ప్రతిభను చాటారు మౌనశ్రీ మల్లిక్‌. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన ‘కోయిలమ్మ’ సీరియల్‌కోసం 500కి పైగా పాటలు అందించారు. ఇలా, ఒకే సీరియల్‌లో ఎక్కువ పాటలు రాసిన రచయితగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ‘కృష్ణ తులసి’ మెగా సీరియల్‌కూ ఇప్పటికే 60 పాటలు రాశారు.

-తిరునగరి శరత్‌ చంద్ర ,6309873682

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సృజనశ్రీ మల్లిక్‌!
సృజనశ్రీ మల్లిక్‌!
సృజనశ్రీ మల్లిక్‌!

ట్రెండింగ్‌

Advertisement