e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home బతుకమ్మ సివిల్స్‌ సమరంలో భగవత్‌ గీత

సివిల్స్‌ సమరంలో భగవత్‌ గీత

సివిల్స్‌ ఓ సమరం! ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కావాలన్న సంకల్పంతో ఎందరో ఈ యుద్ధానికి సిద్ధం అవుతారు.కానీ, తొలి ఓటమి వారి ఆశలపై పిడుగుపాటు అవుతుంది. అంతే, కుంగిపోయి, బెదిరిపోయి ఇక పరుగు మా వల్ల కాదంటూ కురుక్షేత్రంలో అర్జునుడిలా కుదేలవుతారు.అలాంటి అభినవ పార్థులకు విజయ మంత్రాన్ని బోధిస్తున్నారు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌, అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్‌. ‘వాట్సప్‌ గురువు’గా ప్రతి దశలో మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఆరేండ్లలో దాదాపు వెయ్యిమంది అభ్యర్థులు సివిల్స్‌కు ఎంపిక కావడంలో తనవంతు సహకారం అందించిన మహేశ్‌ భగవత్‌ ఐ.పి.ఎస్‌.
‘బతుకమ్మ’తో పంచుకున్న అనుభవాలు .

1990 లో నేను పుణె ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. 1883లో అదే కాలేజీలో ‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు ఇంజినీరింగ్‌ చదివారు. నా చదువు పూర్తయిన సంవత్సరం మహారాష్ట్ర ప్రభుత్వం ‘జీరో బడ్జెట్‌’ ప్రకటించింది. అంటే, ఆ ఏడాది ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లూ ఉండవని అర్థమైంది. ‘ఏం చేయాలా?’ అని ఆలోచనలో పడ్డాను. ఇంజినీరింగ్‌లో మా ముందు బ్యాచ్‌కు చెందిన భూషణ్‌ గగ్రాని మా ఊరికి దగ్గరే. అప్పటికే ఆయన సివిల్స్‌కు సన్నద్ధం అవుతున్నారని తెలిసింది. మరాఠీ లిటరేచర్‌, హిస్టరీ
సబ్జెక్ట్‌లు తీసుకొని సివిల్స్‌ రాశారు. దేశం మొత్తంలో మూడో ర్యాంక్‌ సాధించారు. ఆయన విజయం నాకెంతో ప్రేరణనిచ్చింది.

- Advertisement -

శిక్షణ వదిలేసి వచ్చేశా
మాది పక్కా గ్రామీణ నేపథ్యం. పదో తరగతి వరకు మరాఠీ మీడియంలోనే చదివా. ఇంగ్లిష్‌ సరిగ్గా వచ్చేది కాదు. భూషణ్‌గారి ప్రేరణతో మరాఠీలో సివిల్స్‌ రాయాలని నిర్ణయించుకున్నా. 1990 జూన్‌లో మా ఇంజినీరింగ్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌పై పనిచేస్తున్న స్థానిక ఎన్జీవో అదే ఏడాది అక్టోబర్‌ 2న నన్ను ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా ఎంచుకున్నది. దాదాపు రెండున్నరేండ్లు అందులో చేశాను. ఉద్యోగంలో భాగంగా మారుమూల పల్లెలకు వెళ్లేవాణ్ని. అక్కడి జనాలతో మమేకం అయ్యేవాణ్ని. ఆ సమయంలోనే అన్నాహజారే, మేధాపాట్కర్‌ వంటి గొప్ప వ్యక్తులతో పరిచయం అయ్యింది. ఎంత పనిలో ఉన్నా.. నా మనసు మాత్రం సివిల్స్‌పైనే ఉండేది. సివిల్స్‌ రాసే వారి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయిలోని ఎస్‌ఐఏసీ అనే సంస్థ ద్వారా ఉచిత శిక్షణ ఇప్పించేది. ప్రవేశ పరీక్ష ద్వారా శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉచిత వసతితోపాటు భోజనానికి డబ్బులు కూడా ఇచ్చేవారు. నేను మంచి మార్కులతో ఎంపిక అయ్యాను. దీంతో, ఉద్యోగం వదిలేసి శిక్షణలో చేరాను. అక్కడ సచిన్‌ టెండూల్కర్‌ నాన్న రమేశ్‌ టెండూల్కర్‌ మాకు మరాఠీ లిటరేచర్‌ బోధించేవారు. నాలుగు నెలలు శిక్షణ తర్వాత 1993లో నాకు పుణెలోని టాటా కంపెనీ టెల్కోలో సీఎస్‌ఆర్‌ యాక్టివిటీలో ఇంజినీర్‌గా మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. అదే ఏడాది మా నాన్న హెడ్‌మాస్టర్‌గా పదవీ విరమణ చేశారు. నాకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వాళ్ల పెండ్లిళ్లు చేయాలి. ఇంటి బాధ్యతల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో శిక్షణ వదిలేసి పుణె చేరుకున్నా. దాదాపు రెండేండ్లు అక్కడే పనిచేశా.

ఆ ఉత్తరం..
మాకు కేకే షా గారు చరిత్ర చెప్పేవారు.
నేను పుణె వెళ్లాక ఆయన నాకో ఉత్తరం రాశారు. ‘నువ్వు ప్రిపరేషన్‌ మధ్యలో వెళ్లడం నాకు నచ్చలేదు. నీ సీనియర్‌ భూషణ్‌లా నువ్వూ మంచి సబ్జెక్ట్‌ ఉన్నవాడివి. సివిల్స్‌కు తప్పకుండా ఎంపికవుతావన్న నమ్మకం నాకు ఉంది. మళ్లీ ప్రిపరేషన్‌ మొదలుపెట్టు’ అని ఆ లేఖ సారాంశం. ఆ ఉత్తరం అందుకోగానే నా లక్ష్యం ఏంటో అర్థమైంది. వెంటనే టెల్కోలో ఉద్యోగం మానేశాను. రెండోసారి శిక్షణ కోసం మళ్లీ ముంబయికి వచ్చాను. శిక్షణలో ఉండగానే పుణెలోని డా. ఆనందపాటిల్‌ స్టడీ సర్కిల్‌ నాకు ఫ్యాకల్టీగా అవకాశం ఇచ్చింది. అలా ఒకవైపు శిక్షణ తీసుకుంటూనే, మరోవైపు శిక్షకుడి
అవతారమెత్తాను. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పీఎస్‌ పాలాండే ప్రతి శనివారం సివిల్స్‌ అభ్యర్థులకు ఉచితంగా పాఠాలు చెప్పేవారు. ఆయన దగ్గరికీ వెళ్తుండేవాణ్ని. సివిల్స్‌కు ఎంపికైన సీనియర్లు కూడా చాలా సాయం చేసేవారు. 1994లో ప్రిలిమ్స్‌ రాశాను. కానీ, రాలేదు. 1995లో గట్టిగా ప్రయత్నించాను. ఈసారి విజయం సాధించాను. ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. నా విజయంలో ఎంతోమంది సహకారం ఉందని ఎప్పుడూ నమ్ముతాను. అందుకే, సివిల్స్‌ కోసం కష్టపడుతున్న వారికి నావంతుగా సాయం చేయాలని భావించాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవారికి ‘మీరు ఒకస్థాయికి చేరుకున్న తర్వాత మీతోటి వాళ్లకు తప్పక సాయం చేయండి’ అని చెబుతుంటాను.

వాట్సప్‌ వేదికగా
నేను సర్వీస్‌లోకి వచ్చాక 2006 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సమాచారం ఇస్తుండేవాణ్ని. 2014లో పూర్తిస్థాయిలో సలహా సేవలు ప్రారంభించాను. ఇందుకోసం వాట్సప్‌ను వేదికగా మార్చుకున్నా. 2015 నుంచి మెంటర్‌గా మార్గనిర్దేశనం చేస్తున్నా. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థుల కోసం వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాను. నాతోపాటు
ఇంకొందరు కూడా మెంటర్స్‌గా ఉండేందుకు ముందుకొచ్చారు. మెయిన్స్‌ క్లియర్‌ చేసి ఇంటర్వ్యూకి వెళ్లే వారికి సలహాలు, సూచనలు ఇస్తుంటాం. ఈ ఐదారేండ్లలో మా వాట్సప్‌ గ్రూప్‌ సభ్యుల్లో దాదాపు వెయ్యి మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌, సీఏపీఎఫ్‌లో అంటే సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్లుగా ఎంపికయ్యారు. 2021 యూపీఎస్సీ ఫలితాల్లో 764 మంది ఎంపికయ్యారు. వారిలో 135 మందికిపైగా మంచి ర్యాంకులు సాధించారు. టాప్‌ 100లో 20 మంది వరకూ ఉన్నారు. నాతోపాటు డాక్టర్‌ శైలేంద్ర జెవ్‌డాంకర్‌ విలువైన పాఠాలు చెప్పారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై జూమ్‌లో పాఠాలు చెప్పేవారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌ నితీశ్‌ పాఠోదయ్‌, కస్టమ్స్‌ జాయింట్‌ కమిషనర్‌ సాధు నర్సింహారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి కూడా మాతోపాటు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు.

పట్టుదలే ప్రాణం
పొలీస్‌ కమిషనర్‌గా సమయం దొరకడం కష్టమే! కానీ, పక్కాగా సమయ పాలన పాటిస్తాను. ఉదయం లేవగానే దినపత్రికలు చదువుతాను. వార్తలను సివిల్స్‌ పరీక్షల కోణంలో చూస్తాను. వాటిలో ముఖ్యమైన వాటిని వాట్సప్‌ గ్రూప్‌లో సర్క్యులేట్‌ చేస్తాను. సమయం కుదిరినప్పుడల్లా అభ్యర్థులతో మాట్లాడతాను. ఇంటర్వ్యూల సమయంలో ఎక్కువ సమయం కేటాయిస్తాను. వీలైతే ఆదివారాలు క్లాసులు తీసుకుంటాను. డ్యూటీలో భాగంగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ఒక్కోసారి 45 నిమిషాల నుంచి గంటపాటు సమయం చిక్కుతుంది. ఆ సమయంలో పిల్లలతో మాట్లాడతాను. జమ్మూ కశ్మీర్‌, పశ్చిమ బెంగాల్‌ ఇలా వివిధ రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు నా సలహాల కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్లకు సమయం కేటాయించడం నా బాధ్యతగా భావిస్తాను. గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం.. ఇవేవీ సివిల్స్‌ సాధించడానికి అడ్డంకులు కావు. మహారాష్ట్రకు చెందిన అసీంఖాన్‌ ఉర్దూలో సివిల్స్‌ రాసి 500వ ర్యాంక్‌ సాధించారు. తెలుగులోనూ పరీక్షలు రాయొచ్చు. సివిల్స్‌ సాధించడానికి పట్టుదల ముఖ్యం. కష్టపడితే ఏదైనా సాధ్యమే. దాంతోపాటు, ప్రణాళిక కూడా అవసరమే.

ఎందరికో ర్యాంక్‌లు
సివిల్స్‌లో ఈసారి మంచి ఫలితాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్‌ సాధించిన అంకితా జైన్‌, ఆమె సోదరి వైశాలి జైన్‌ (21వ ర్యాంక్‌), తెలంగాణకు చెందిన శ్రీజ (28వ ర్యాంక్‌),
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అన్నదమ్ములు జగత్‌సాయి (32వ ర్యాంక్‌), వసంతకుమార్‌ (171 ర్యాంకు), 66వ ర్యాంకర్‌ అనీశా శ్రీవాస్తవ, యశ్వంత్‌కుమార్‌ రెడ్డి (93వ ర్యాంక్‌).. ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఐపీఎస్‌గా శిక్షణ పొందుతూ మళ్లీ సివిల్స్‌ రాసిన జీవాని కార్తిక్‌ (8వ ర్యాంక్‌), పూజా గుప్త (42వ ర్యాంక్‌), శాశ్వత్‌ త్రిపురారి (19వ ర్యాంక్‌) వీరంతా నా దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లే. మహబూబ్‌నగర్‌లో అడిషనల్‌ కలెక్టర్‌గా ఉన్న తేజస్‌ పాటిల్‌, భైంసాలో ఐపీఎస్‌ కిరణ్‌ ఖరే, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హనుమంత జండ్గే లాంటి వాళ్లకు మెంటర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉంది.

ప్రతి ఒక్కరికీ ఓ గంట
అభ్యర్థుల బయోడేటా ఆధారంగా ఇంటర్వ్యూలో ఏయే ప్రశ్నలు అడగవచ్చు అన్నదానిపై వాళ్లకు సూచనలు చేస్తాను. అభ్యర్థుల పేరు, అభిరుచులు, గతంలో వాళ్లు చేసిన ఉద్యోగం, నేపథ్యం,
జిల్లా, వారి ప్రాంతానికి సంబంధించిన చారిత్రక విషయాలు ..ఇలా ఏఏ అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతారో నా అనుభవం, అవగాహన మేరకు గైడ్‌ చేస్తాను. ఒక్కొక్కరితో గంటపాటు
మాట్లాడతాను. నేను చెప్పే అంశాల ఆధారంగా వారు ప్రిపేర్‌ అవుతారు కాబట్టి ,తప్పక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

-నాగోజు సత్యనారాయణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement