e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటేనే.. సత్తువ ముద్దలు

సద్దుల బతుకమ్మ అంటేనే.. సత్తువ ముద్దలు

బతుకమ్మ .. తెలంగాణ ప్రజల బతుకు చిత్రం. మనవైన సంప్రదాయాలకు, మట్టివాసనల సంస్కృతికి అద్దంపట్టే తొమ్మిది రోజుల వేడుక. ఎన్ని పిండి వంటలున్నా, సద్దుల బతుకమ్మ అంటే ఠక్కున గుర్తొచ్చేది సత్తుముద్దలే. పల్లె, పట్నం.. తేడా లేదు. పిన్న, పెద్ద.. భేదం లేదు. ఎక్కడైనా, ఎవరైనా ఆరగించేందుకు ‘సై’ అంటారు. అసలు,సత్తుముద్దల సంగతులేమిటో చూద్దాం..

పరిసరాల్లో దొరికే తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, పొలాల్లో పండే మక్కలు, బియ్యం, పల్లీలు, పెసలు, మినుములు, నువ్వులతో చేసిన సత్తుముద్దలను నైవేద్యంగా సమర్పించి సంబరపడతారు. రకరకాల గింజలతో జతకట్టే బెల్లం, నెయ్యి.. రుచితోపాటు పోషకాలను కూడా అందిస్తాయి.కొన్ని ప్రాంతాల్లో అన్ని సత్తులూ కలిపి ముద్దలు చేస్తే, కొందరు మాత్రం అభిరుచిని బట్టి చేసుకుంటారు. ఈ సత్తుముద్దలనే మినుప ఉండలు, నువ్వు ఉండలు, కొబ్బరి ఉండలు, పల్లీ ఉండలు అని కూడా అంటారు.

- Advertisement -

బతుకమ్మ ఈనాటి పండుగ కాదు. కాకతీయుల కాలంనాటికే కన్నుల పండువగా జరిగేదంటారు.బతుకమ్మ తొమ్మిదిరోజులకూ తొమ్మిది ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభించి, ఆరోదైన అలిగిన బతుకమ్మరోజు మినహా.. సద్దుల బతుకమ్మదాకా నువ్వన్నం, కొబ్బరన్నం, వేపకాయలు, అటుకులు-బెల్లం, వెన్నముద్దలు, మలీద ముద్దలు, సత్తుముద్దలు.. ఇలా రోజుకో నైవేద్యం సమర్పిస్తారు.

మక్కలు, బియ్యం, పల్లీలు, నువ్వులు.. ఇలా అన్ని దినుసులతోనూ సత్తుముద్దలు చేసుకోవచ్చు. ఒకప్పుడైతే బతుకమ్మ వారం పదిరోజులు ఉందనగానే సత్తులు చేసేందుకు కావలసిన దినుసులన్నీ సమకూర్చుకునేవారు. సద్దుల బతుకమ్మ ముందురోజే ఒద్దికగా రోట్లో దంచుకుని సిద్ధం చేసుకునేవారు. ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది.

రకరకాల దినుసులతో తయారయ్యే సత్తుముద్దలు పోషకాల గనులు. పప్పుల్లోని ప్రొటీన్లు; బియ్యం, మక్కల్లోని కార్బొహైడ్రేట్లు, ఫైబర్లతోపాటు బెల్లంలోని సుగుణాలూ వీటి ద్వారా లభిస్తాయి. నెయ్యి శరీరానికి మంచి కొవ్వులను అందిస్తుంది. ఎదిగే పిల్లలకు బలాన్ని, వృద్ధులకు సత్తువనూ ఇచ్చే చక్కని ఆహారం సత్తుముద్దలు.

దినుసులను దోరగా వేయించి, చల్లారాక మెత్తగా దంచుకుని బెల్లం లేదా చక్కెర, నెయ్యి కలిపితే సత్తు సిద్ధం. బెల్లాన్ని లేతపాకం పట్టుకుని, సత్తు కలిపి చేతికి నెయ్యిరాసుకుంటూ ముద్దలు కట్టుకుంటే సరి. వారం నుంచి పదిహేను రోజులు నిల్వ ఉంటాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement