e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home కథలు సంస్కృతి రక్షతి..

సంస్కృతి రక్షతి..

“ఈ రెండు గంటల్లో చాలా ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చారు. లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌.. ఐటీడీఏ పీవోగా మీ ప్రధానాశయం ఏంటి సర్‌?”
అడిగింది యంగ్‌ జర్నలిస్ట్‌ గీత.. తన ఇంటర్వ్యూకు ముగింపుగా!
“గిరిజన హక్కులను కాపాడటం. వారి అభివృద్ధికి కృషి చేయడం” సమాధానమిచ్చాడు ఇస్లావత్‌ సేవాలాల్‌ నాయక్‌.
తన మొదటి పోస్టింగ్‌ అక్కడే. అతను ఆ రోజే సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
మరుసటిరోజు సేవాలాల్‌కు కాల్‌ చేసింది గీత.
‘ఇంటర్వ్యూ పబ్లిష్‌ అయ్యింది. చూశారా?’ అని తను అడగబోతుండగానే..
“థాంక్యూ.. థాంక్యూ సోమచ్‌ గీత గారూ! ఇంటర్వ్యూను బాగా ప్రెజెంట్‌ చేశారు. నా వ్యూని బాగా హైలైట్‌ చేశారు” అంటూ కృతజ్ఞత తెలుపుతుండేసరికి ఆశ్చర్యపోయింది గీత.
‘పీవో గారు భలే ఫాస్ట్‌ గురూ!’ అనుకొంటూ.. ఆ చనువుతోనే అడిగింది..
“సర్‌ ఇఫ్‌ యు డోంట్‌ మైండ్‌.. కెన్‌ ఐ ఆస్క్‌ వన్‌ ఆఫ్‌ ద రికార్డ్‌?” అంటుండగానే.. ఆమె కాల్‌ కట్‌ అయ్యింది.
అసలే ఏజెన్సీ ఏరియా. సిగ్నల్స్‌ సరిగ్గా ఉండని ప్రాంతమది. కాల్‌ కట్‌ కావడంతో చేతిలో ఫోన్‌ను అలానే పట్టుకొని.. సేవాలాల్‌ వేగంగా ఆలోచించడం మొదలుపెట్టాడు.
‘జస్ట్‌ నిన్న పరిచయమైన అమ్మాయికి తన దగ్గర ఆఫ్‌ ద రికార్డ్‌ ఏముంటుంది? అయినా ఫస్ట్‌ సైట్‌ ప్రభావం చూపుతుం

దని సైకాలజీ సబ్జెక్ట్‌లో చదివాను కదా!’ అనుకొన్నాడు.
‘ఒకవేళ తనేమన్నా క్రష్‌కు గురయ్యిందా?’ అని చిలిపిగా ఊహించుకొని నవ్వుకొన్నాడు.
‘బట్‌ ఐయాం నాట్‌ సో!’ అని అనుకొంటూనే..
‘నేను నా తెగ యువతినే ఇష్టపడుతాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకొంటాను. అసలు లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అనేది నా విషయంలో జరిగితే.. కచ్చితంగా ఆ అమ్మాయిని నేను నా తెగకే ప్రత్యేకమైన ఎరుపు, గులాల్‌, నీలం రంగుల బంజారా డ్రెస్‌లోనే చూసేవాణ్ని. ఆమె పొలంగట్టు పైనుండి గడ్డిమోపు ఎత్తుకొస్తూనే నాకెదురుపడేది! పచ్చగడ్డి పరకను మునిపంటితో కొరుకుతూ నన్ను చూసి సిగ్గుపడేది! తన పాలరంగు ఒంటిపై పచ్చబొట్లు, తన రవిక అద్దాల్లో.. నేను ఎన్నో నేనులుగా కనపడేవాణ్ని. తన కడియాల గాజులు, రూపాయి బిళ్లల అలంకరణ.. మా గతజన్మ బంధాన్ని గుర్తుచేసేది. అసలు నన్ను చూడగానే ఆమెకూ క్రితం జన్మ స్మరణకొచ్చి.. ఎడబాటు విరహంతో గుండె బరువెక్కి, తాను ఎంత విరహ వేదన అనుభవించిందీ ఏకరువు పెట్టేది కదా! నా డోక్రీ నన్ను చూడగానే ‘డోక్రా’ అని పిలిచేది కదా! తలపాగా చుట్టుకొన్న వాళ్ల నాన్న ఎడ్లను నడిపిస్తుంటే.. బండిలో కూర్చొని కనిపించేది కదా! తలపై కప్పుకొన్న తన కొంగుకు ఇరుపక్కలా వెండి గంటలు వేలాడుతుండేవి కదా..!’ అని ఊహించుకొంటుండగా.. మళ్లీ అదే నెంబర్‌ నుంచి ఫోన్‌ రింగ్‌ అయ్యింది.
“సారీ సర్‌! కాల్‌ కట్‌ అయ్యింది.

- Advertisement -

ఇందాకట్నుంచి ట్రై చేస్తున్నా, బట్‌ కలవట్లేదు! మేబీ సిగ్నల్స్‌ పూర్‌..” అంటూ ఆమె గడగడా మాట్లాడుతుంటే.. తమ తండాను ఆనుకొని ప్రవహించే మోతెవాగు గుర్తొస్తోంది అతనికి. అంతే వేగంగా మాట్లాడుతోంది తను. ఉదయం, సాయంత్రాల్లో ఆ నీళ్లపై సూర్య కిరణాలు పడి తళుక్కుమన్నట్టుగానే.. ఆమె మాట్లాడుతుంటే కూడా ఆమె తెల్లని పలు వరస తళుక్కుమంటున్నట్లు గుర్తు తెచ్చుకొంటున్నాడు. నిన్న ఇంటర్వ్యూ చేస్తున్నప్పటి కంటే ఈ రోజెందుకో తన స్వరం మరింత తియ్యగా ఉందనిపిస్తున్నది.
మళ్లీ మాటల్లోకి వస్తూ..
“ఇంతకూ ఏమిటో.. ఆ ఆఫ్‌ ద రికార్డ్‌! విషయం చెప్పండి..” అని అడగగానే..“అది.. అది.. తరువాత అడుగుతాను. ఆ టాపిక్‌ ఇప్పుడొదిలేయండి.. రేపు ఆదివారం కదా, మీ ప్లాన్స్‌ ఏంటి సర్‌?” అని అడిగింది.“ఏం లేవు.. ఐయాం ఫ్రీ” అన్నాడు.
“గుడ్‌.. అయితే ఎటన్నా బయటికెళ్దామా?” అని అడిగింది గీత. ఆమె అలా అడిగేసరికి ఏం సమాధానమివ్వాలో తెలియక తడబడుతుంటే.. “అదేంటి సర్‌.. నేనేదో మిమ్మల్ని డేటింగ్‌కు పిలిచినట్టు ఇబ్బంది పడిపోతున్నారు” అన్నది గీత, కొంటెగా నవ్వుతూ!
ఇంతలో మళ్లీ కాల్‌ కట్‌ కావడంతో.. ‘క్రేజీ!’ అనుకొంటూ ఫోన్‌ కిందకు దించాడు సేవాలాల్‌.

‘డేటింగ్‌’ అనే మాట.. అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ‘ప్రేయసీ ప్రియుల ఏకాంత కాలక్షేపం కదూ.. డేటింగ్‌ అంటే’ అనుకొన్నాడు. గీత..
‘బయటకు వెళ్దామా?’ అని ఎందుకు అంటున్నదో అర్థం కాలేదు. కానీ, తను డేటింగ్‌కు వెళ్లదలిస్తే.. తను మెచ్చే అమ్మాయి తనకోసం ఏ చెరుకు తోటకో, ఏ కాలువ గట్టుకో వస్తుంది. పజ్జొన్న రొట్టెల చందమామలకు ఎర్రని ఎల్లిపాయ కారం కండ్లు పెట్టి.. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తెస్తుంది. వాటిని నంజుకుంటుంటే.. ఓహ్‌! అంతకన్నా రొమాన్స్‌ ఏముంటుంది?’ అను కొంటున్నాడు.
కాల్‌ కట్‌ అయ్యింది కాబట్టి, మళ్లీ ఫోన్‌ చేస్తుందని అక్కడే వెయిట్‌ చేస్తున్నాడు సేవాలాల్‌. ఐదు నిమిషాలు, పది నిమిషాలు, అర్ధ గంటకూ ఫోన్‌ రాకపోవడంతో.. తనే ఆ నెంబర్‌కు కాల్‌ చేశాడు. ఓ సూపర్‌ హిట్‌ సినిమాలోని ప్రేమపాట.. తన కాలర్‌ ట్యూన్‌గా వినిపిస్తోంది. పాట పూర్తవుతున్నా తను లిఫ్ట్‌ చేయకపోవడంతో..

‘వద్దు.. వద్దు’ అనుకొంటూనే పావుగంట గ్యాప్‌తో మరో రెండుసార్లు కాల్‌ చేశాడు.
ఆ పాట వింటున్నంత సేపూ ఆ సినిమాలోని హీరోహీరోయిన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలే తన కండ్ల ముందు మెదిలాయి.
ఇంతలో తనే కాల్‌ చేసింది.
“వెరీ సారీ సర్‌! స్నానానికెళ్లాను. అయినా, మీ గురించే ఆలోచిస్తున్నాను” అనేసరికి..
సేవాలాల్‌ నవ్వుతూ.. “వాట్‌ నా గురించా? స్నానం చేస్తూనా?” అన్నాడు. దీంతో గీతకు ఏదో గుర్తొచ్చి.. నాలిక్కరుచుకొంటూనే గట్టిగా నవ్వేసింది. ఇద్దరి నవ్వులూ కొంచెంసేపు కంటిన్యూ అయ్యాక..
“ఇంతకూ ఏంటో చెప్పండి.. బయటకన్నారు, ఎక్కడికో?” అని అడిగాడు.
“ఏదన్నా తండాకెళ్దాం సర్‌!” అన్నది గీత.
‘తండా’ అనగానే.. సేవాలాల్‌ మనసు పులకించింది.

“నిజమా! ఎందుకు? ఏ తండాకు? తండాల్లో అందరూ వలస కూలీలే కదా! ఇంతకూ జనం ఉంటారా ఈ రోజుల్లో?” అని ప్రశ్నలు
గుప్పిస్తుండగా.. “ఉంటారు సర్‌.. హైదరాబాద్‌, ముంబైలకు వలస వెళ్లిన వాళ్లంతా మొన్న లాక్‌డౌన్‌ రోజుల్లో తిరిగొచ్చారు. ఇదివరకంటే సరైన సాగునీటి సదుపాయాలు లేక తెలంగాణ బీడుగా ఉండేది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో అన్ని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండి, కోస్తాంధ్ర ప్రాంతాలకు దీటుగా పంటలు పండుతూ పచ్చగా కళకళలాడుతోంది. ఇప్పుడిది బంగారు తెలంగాణ. ఇక్కడినుండి ఇప్పుడెవరూ వలసపోమంటున్నారు” అని అనగానే..
“ఏంటీ.. జర్నలిస్టు కూడా గవర్నమెంట్‌కు ప్రోగా మాట్లాడుతారా?” అన్నాడు సేవాలాల్‌.
“నేను చెప్పేది నిజం సర్‌! లాక్‌డౌన్‌ అనంతరం మేం ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లినప్పుడు వాళ్లు చెప్పిన అభిప్రాయమది” అన్నది గీత.


ఆ మధ్యాహ్నం డ్రైవర్‌ హఠాత్తుగా జ్వరం వచ్చిందని చెప్పడంతో..
‘కరోనా లక్షణమేమో! ఎందుకైనా మంచిది’ అనుకొని అతనికి సెలవిచ్చి పంపాడు సేవాలాల్‌.
ఆ విషయం గుర్తొచ్చి, వెంటనే గీతకు కాల్‌ చేసి.. “ప్రోగ్రాం క్యాన్సిల్‌ చేయండి” అని చెప్పాడు. కానీ, అందుకు గీత ఒప్పుకోలేదు. తను ప్రిపేరయ్యాననీ, డ్రైవర్‌ లేకుంటే తన కారులో వెళ్దామని చెప్పడంతో ‘సరే’ అనక తప్పలేదు
సేవాలాల్‌కు.
కారులో వెళ్తున్నప్పుడు ఆత్రుతగా అడిగాడు సేవాలాల్‌.. “పొద్దున ఏదో ఆఫ్‌ ద రికార్డ్‌ విషయం అన్నారు.. ఏమిటది?” అని.
దానికి గీత నవ్వుతూ.. “ఓ.. అదా!” అన్నది.

“అదే! ఇంతకూ ఏమిటో అడగండి?”
“ఏం లేదు సార్‌! గిరిజనుల హక్కులను కాపాడటం అంటే.. వన్‌ బై సెవెంటీ నిబంధనను అమలు చేయడమా? అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించడమా? పోడు సాగుకు మద్దతివ్వడమా?”
తనేదో ఊహిస్తే.. అందుకు భిన్నంగా గీత మాట్లాడుతుండేసరికి షాక్‌ అయ్యాడు సేవాలాల్‌.
“అంటే..” అని ఏదో చెప్పబోతుండగానే..
“అభివృద్ధి అంటే రోడ్లు, ఇండ్లు, నీళ్లు, లైట్లు మాత్రమేనా? సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం చేయూతనివ్వదా? సంస్కృతి పరాయీకరణ, తెగ సంప్రదాయ విచ్ఛిన్నతను అడ్డుకొని, ప్రత్యేకతను కాపాడాల్సిన అవసరం ఓ ప్రభుత్వాధికారికి ఉన్నా.. లేకున్నా.. తెగను ప్రేమించే, తెగకు చెందిన వ్యక్తిగా మీకుంది సర్‌!” అన్నది.

ఆ మాటలు విన్న సేవాలాల్‌కు తను దేని గురించి మాట్లాడుతున్నదో? తనతో బయటకు ఎందుకు వెళ్దామన్నదో అర్థమయ్యింది.
‘కార్యాలయానికే పరిమితమైతే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టే, ఈ తండా సందర్శన ఏర్పాటు చేసింది. గిరిజన పౌరుడిగా, ఆ శాఖ అధికారిగా ఇదీ మంచిదే’ అనుకొన్నాడు.
మాటల్లోనే ఓ గిరిజన తండాకు చేరుకొన్నారు. అక్కడున్న జనం అంతా, కారును చూసి ఒక్కచోట గుమి గూడారు. తండా పరిసరాలు, అక్కడి గిరిజనులనూ చూశాక.. గీత చెప్పిన ‘సంస్కృతి విచ్ఛిన్నం.. నిజమే!’ అనిపించింది సేవాలాల్‌కు.
జొన్నలు దంచుతున్న దృశ్యం ఎక్కడా కనిపించలేదు. రొట్టెలు చేస్తున్న, కాల్చుతున్న వాసనేం రాలేదు. మగవాళ్లలో తలపాగా దర్జా లేదు. మహిళలకు ప్రత్యేక వస్త్రధారణ, నగలూ లేవు. భాషలోనూ పరాయి పదాలు దొర్లుతున్నాయి. యాస తప్ప.. వాళ్లదైన సొంత ఆచారమూ, వేషమూ, సంప్రదాయమూ.. ఒక్కటీ కానరాలేదు. అక్కడి నుండి మరో మూడు తండాలను సందర్శించారు. అంతటా అదే దృశ్యం.. సంస్కృతి పతనం.

ఆ రాత్రి ఎంతసేపటికీ నిద్ర పట్టలేదు సేవాలాల్‌కు. పరాయి ప్రభావానికి లోనై ఒక దీర్ఘకాల చారిత్రక సంస్కృతికి చేజేతులా చేటు కలిగించుకొంటున్న వైనమే తన కండ్లముందు మెదులుతోంది. సినిమాలు, టీవీలు, నగరీకరణ, రియల్‌ ఎస్టేట్‌ విస్తరణ, అడవుల విధ్వంసం.. అన్నీ కలిసి సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఎలా చేటు కలిగిస్తున్నాయో ఎరుకైంది.
‘రిజర్వేషన్లు అమలు చేయడం ఒక్కటే కాదు.. తెగ సంస్కృతి, ప్రత్యేకతను సంరక్షించేందుకు జనాన్ని జాగృతం చేయడం కూడా తండా బిడ్డగా నా బాధ్యత’ అని భావించాడు సేవాలాల్‌.
తనను గీత బయటకు తీసుకువెళ్లకుంటే, క్షేత్రస్థాయి వివరాలు తెలిసేవి కావనుకొన్నాడు. అప్పటికి టైం రాత్రి పది అవుతోంది. ఆ సమయంలో కాల్‌ చేయడం బాగుండదని ఆమె ఫోన్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ చేశాడు.. ‘థ్యాంక్స్‌’ అని! అది చూశాక, గీత పెదవులపై సంతోషంతో కూడిన చిరునవ్వు. తనూ ఏదో టైప్‌ చేసింది.. కానీ, వెంటనే ఎరేజ్‌ చేసి ఒక ఎమోజీ సెండ్‌ చేసింది.

ఐటీడీఏ అధికారిగా తన విధులు నిర్వర్తిస్తూనే, కలెక్టర్‌ ప్రత్యేక అనుమతితో తన పరిధిలోని తండాలన్నిటినీ ఒక వాట్సాప్‌ గ్రూప్‌లోకి తీసుకొచ్చాడు సేవాలాల్‌. ఆయా తండాల్లోని యువతను అందులో చేర్చి, సంస్కృతి పరిరక్షణకు పాటుపడేలా చైతన్యం కల్పిస్తున్నాడు. తమ తెగకే ప్రత్యేకమైన దుస్తులు, అలంకరణలు, వేషధారణపై కొత్త మమకారాన్ని కలగజేస్తున్నాడు. దీంతో ట్రంకు పెట్టెలు, బీరువాల్లో అడుగున పడి ఉన్న సంప్రదాయ దుస్తులు మళ్లీ బయటి వెలుగు చూస్తున్నాయి. ప్రతి ఆదివారం ప్రత్యేక తండా సభలనూ నిర్వహిస్తున్నాడు.
“బతుకమ్మ పండుగ ఈసారి సంప్రదాయబద్ధంగా జరగాలి. మీ అందరి వీలుచూసుకొని, ఈ వారంలో మొదలయ్యేటట్టు చూడండి!” అని సేవాలాల్‌ అనగానే..
“అది సెప్టెంబర్‌ నెలలో కదా సార్‌!” అన్నాడు.. తండా పెద్ద హర్యా నాయక్‌.
“నేను చెప్పేది మన బంజారా బతుకమ్మ గురించి.. అది ఆగస్టులోనే జరగాలి” అనడంతో,

సేవాలాల్‌ ‘తీజ్‌’ పండుగ గురించి చెబుతున్నాడని అర్థమైంది నాయక్‌కు.
నిజానికి గత పదేండ్ల క్రితం వరకూ తీజ్‌ ఉత్సవం ఏటా జరిపేవారు. కానీ, చిన్నా చితకా జనం వలసలు పోవడం వల్ల తండాలో ముసలీ ముతకా మాత్రమే మిగిలారు. తీజ్‌ పండుగ జరిపే అమ్మాయిలు తండా మొత్తంలో ఒక్కరో ఇద్దరో మిగిలారు. దీంతో ఆ ఉత్సవం క్రమంగా మరుగున పడింది.
సేవాలాల్‌ చొరవతో అన్ని తండాల్లోనూ తీజ్‌ ఉత్సవం మొదలయ్యింది. బతుకమ్మ పండుగలా తొమ్మిది రోజుల ఉత్సవమది.
‘మారో బాపూ బజరజ్‌ హూంసియో కనాయియో.. ఓరి భేటీ వూన తీజ్‌ బొరాదూ కేరోయే..’ పాటలు మార్మోగుతున్నాయి.
పెండ్లీడుకొచ్చిన యువతులు తీజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారారు. బతుకమ్మను పూలతో అలంకరిస్తే, తీజ్‌లో గోధుమ మొలకలను పూజించి, ఉత్సవం జరుపుతారు.
‘శీత్లా యాడీ బొరాయీ తీజ్‌, బాయీ తారో పాలేణా, సోనేరో డాక్లో ఘలాన, బాయీ తారో పాలేణా’ అంటూ బతుకమ్మ తరహాలో బంజారా బతుకమ్మ సాగుతోంది. నిమజ్జనాన్ని అన్ని తండాలూ ఒకే చెరువు వద్ద జరిపేలా ముందుగానే నిర్ణయించారు. దీంsy చుట్టుపక్కల తండాల నుంచి గోధుమ మొలకల బుట్టలతో, పూజా ద్రవ్యాలతో హాజరవుతున్నారు యువతులు, మహిళలు, యువకులు.
ఆ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు సేవాలాల్‌. ఆ గుంపులో గీత.. తమ తెగ సంప్రదాయ దుస్తుల్లో కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. సేవాలాల్‌ దగ్గరికొస్తూనే..
“మార్‌ నాం గీతా నాయక్‌” అంటూ తెగ సంప్రదాయ భాషలో చెబుతూ.. తన తల్లిదండ్రులు, బంధువులనూ పరిచయం చేసింది.
ఆమె తండ్రి గుబురు మీసాలు, తలపాగాతో దర్జాగా ఉన్నాడు. తల్లి పూర్తి సంప్రదాయ దుస్తుల్లో నిండుగా ఉన్నది. ఎరుపు, గులాల్‌, నీలం రంగుల బంజారా డ్రెస్‌లో, గోధుమ మొలకల బుట్టను ఎత్తుకొన్న గీత.. తనకు ఎంతో అపురూపంగా కనిపించ సాగింది.
ఆమె సీత్లాబాయి, మేరామా భవాని దేవతలను పూజిస్తున్నప్పుడు, సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యం చేస్తున్నప్పుడు, పొలం గట్టుపై నడుస్తున్నప్పుడు, జొన్నరొట్టెల ప్రసాదం పంచుతున్నప్పుడు.. ఇన్నేళ్లూ తాను ఏ రూపాన్నయితే ఊహించుకున్నాడో, ఆ రూపమే గీతలో కనిపిస్తుండే సరికి, అలవికాని ఆనందానికి గురయ్యాడు సేవాలాల్‌.

ఆ తర్వాత, వేడుకలో సేవాలాల్‌ ప్రసంగిస్తూ..
“నాగరికత అవసరమే! కానీ, అది సంస్కృతిని ధ్వంసం చేసేదిగా ఉండకూడదు. మన ఆచారం, మన వేషం, మన భాష ఎప్పటికీ మనకు గర్వకారణం కావాలి. రాబోయే తరాలకు మన అస్థిత్వాన్ని వారసత్వంగా అందించాలి. కానీ, మనమే మన సంస్కృతి విచ్ఛిన్నానికి కారణమవుతున్నాం. మన సంప్రదాయ వస్ర్తాలంకరణ ఎటు పోయింది? మనకే ప్రత్యేకమైన ఆ నగలేమయ్యాయి? ఆ బంజారా నృత్యాలను సినిమాలు ఎందుకు మింగేస్తున్నాయ్‌? మన తండాలు ప్రత్యేకత కోల్పోవడానికి కారణమెవరు? మన పిల్లలకు మన ఇండ్లు, పొలాలు, డబ్బు, నగలూ, ఆస్తులే కాదు.. వాళ్లకు మన తెగ సంస్కృతినీ పంచుదాం. మన సంప్రదాయమే మన ఆస్తి. ఇతరులతో కలిసి ఉండొద్దని నా
ఉద్దేశం కాదు. కానీ, మన అస్థిత్వం కలుషితం కాకూడదని నా విన్నపం..” అంటూ ముగిస్తుండగా, ఆ ప్రాంతమంతా చప్పట్లతో మార్మోగింది.
ఆ వెంటనే సంప్రదాయ ఉత్సవ హంగామా మొదలయ్యింది. ఆ రాత్రి గీత ఫోన్‌కు.. ‘టాణా భా ఆషాళొ’ అంటూ మెసేజ్‌ చేశాడు సేవాలాల్‌. అది చదివి, ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి.
ఆ మాటకర్థం.. ‘నువ్వు బంజారా బతుకమ్మవి’ అని!
ఉంటారు సర్‌.. హైదరాబాద్‌, ముంబైలకు వలస వెళ్లిన వాళ్లంతా మొన్న లాక్‌డౌన్‌ రోజుల్లో తిరిగొచ్చారు. ఇదివరకంటే సరైన సాగునీటి సదుపాయాలు లేక తెలంగాణ బీడుగా ఉండేది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో అన్ని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండి, కోస్తాంధ్ర ప్రాంతాలకు దీటుగా పంటలు పండుతూ పచ్చగా కళకళలాడుతోంది. ఇప్పుడిది బంగారు తెలంగాణ.

కంచర్ల శ్రీనివాస్‌ కంచర్ల శ్రీనివాస్‌ స్వస్థలం ఖమ్మం. వృత్తిరీత్యా జర్నలిస్టు. ‘సూఫీ’ అనే కలం పేరుతో రచనలు చేస్తున్నారు. వృత్తి జీవితంలో తనకు ఎదురైన అనుభవాలను కథలుగా మలుస్తున్నారు. ఇప్పటివరకూ 20కిపైగా కథలు రాశారు. ఇది మరకలు చెరుపుకునే సమయం, లాక్‌డౌన్‌ టైమ్స్‌, బురద నుండి బాటకు, కంచాకడి ఇల్లు, లాల్‌ సలాం, బ్లాక్‌ పెయింటింగ్స్‌ కథలు ప్రజాదరణ పొందాయి. ‘లాక్‌డౌన్‌ టైమ్స్‌’ కథకు, తిమ్మాపురం బాలక్రిష్ణారెడ్డి స్మారక కథల పోటీలో బహుమతి దక్కింది. 2020లో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘లోగిలి’ కథల పోటీలో ‘టూలెట్‌’ కథకు ద్వితీయ బహుమతి, మలిశెట్టి సీతారాం స్మారక ఎడ్యుకేషనల్‌ సొసైటీ కథల పోటీలో ‘బురద నుండి బాటకు’ కథకు ప్రోత్సాహక బహుమతిని అందుకున్నారు.

నాగరికత అవసరమే! కానీ, అది సంస్కృతిని ధ్వంసం చేసేదిగా ఉండకూడదు. మన ఆచారం, మన వేషం, మన భాష ఎప్పటికీ మనకు గర్వకారణం కావాలి. రాబోయే తరాలకు మన అస్థిత్వాన్ని వార సత్వంగా అందించాలి. కానీ, మనమే మన సంస్కృతి విచ్ఛిన్నానికి కారణమవుతున్నాం. మన సంప్రదాయ వస్ర్తాలంకరణ ఎటు పోయింది? మనకే ప్రత్యేకమైన ఆ నగలేమయ్యాయి?

కంచర్ల శ్రీనివాస్‌
9346611455

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement