e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home కథలు శభాష్‌ గౌండ్ల రామక్కా!

శభాష్‌ గౌండ్ల రామక్కా!

“బాగున్నవా ఇజ్జమ్మా” అని నా చెవిలో గుసగుసగా వినిపించేసరికి, నేను ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాను. నా వెనుక కుర్చీలో కూర్చున్న ముసలి వగ్గును చూసి, వెంటనే గుర్తు పట్టలేకపోయాను. చూస్తే తెలిసిన ముఖం లాగానే ఉంది. నేను వెనుకకు తిరిగి చూసేసరికి ఆమె ముఖం వెలిగిపోయింది. నిండుగా నోరు తెరిచి నవ్వేసరికి.. ఆమెలో నాకు తెలిసిన వ్యక్తి పోలికలు కనిపించాయి.

‘అవును.. ఆమె గౌండ్ల రామక్కేనా?’
నా ముఖ కవళికలు తనను గుర్తు పట్టినట్టుగా మారుతుండేసరికి.. “ఆఁ! యాదికొచ్చిన్నా?” అని నా భుజంమీద రాస్తూ అడిగింది.
వార్ధక్యం వల్ల ఆమె గొంతు బలహీనంగా ఉందో, లేక ఆ పెండ్లిపందిరిలో మోగుతున్న మంగళ వాయిద్యాల హోరులో నాకు సరిగ్గా వినపడటం లేదో గానీ.. నాకు ఆమె మాటలు సరిగ్గా వినిపించడం లేదు. కానీ, ఆమె ఎవరో మెల్లిమెల్లిగా గుర్తుకు రాసాగింది. ఆమె పేరు నోటిదాకా వస్తున్నది గానీ, ఆ పేరుకు సరిపడ పదాలు అందక, పలుకలేకపోతున్నా! ఇంతలో తనే..
“గౌండ్ల రామక్కను! మర్చిపోయినవా ఇజ్జమ్మా?” అంది తొర్రిపండ్లతో నవ్వుతూ. అప్పుడు నా నాలుకమీద నానుతున్న అస్పష్ట భావానికి ఒక పేరు, ఒక రూపం కండ్లముందు మెదిలాయి.
‘ఎక్కడి గౌండ్ల రామక్క? ఎక్కడి జొన్నల మల్యాల? ముప్పై ఏండ్లు గడిచిపోయాయి..’ అనుకుంటుండగానే కండ్లలో నీళ్లు తిరిగాయి. నా కండ్లలో నీళ్లు చూసి రామక్క కంగారు పడుతూ, నా భుజంమీద మరింత ఆప్యాయంగా రాస్తూ..“ఏమైంది ఇజ్జమ్మా? అంతా పయిలమే కద?” అన్నది.

- Advertisement -

నేను రామక్క చేతిని ఆప్యాయంగా, పెన్నిధి జారిపోతుందేమోనన్నంత అపురూపంగా పట్టుకొని లేచి నిలబడి, పెండ్లిపందిరి బయటకు నడిచాను. రామక్క మెల్లిగా నడుస్తూ నన్ను అనుసరించింది. రామక్కను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నిలువెత్తు మనిషి వంగిపోయి, వడలిపోయి, ముసలి వగ్గయి, పండువృక్షంలా, మెల్లిగా కర్ర పట్టుకొని నడుస్తున్నది. పెండ్లిపందిరికి దూరంగా, మా కారు దగ్గరకు నడిచాము. తలుపు తీసి లోపలికి రమ్మంటే..
“మీదేనా ఇజ్జమ్మా?” అని గుసగుసగా అడిగింది. నేను నవ్వుతూ..
“మనదే రామక్కా! దా లోపలికి రా!” అని నా చేయి అందించి లోపలికి లాగి కూర్చోబెట్టాను. కొత్తగా కొన్న ఇన్నోవా క్రిస్టా కారులోని బకెట్‌ సీటులో కూర్చుని, చుట్టూ చూస్తూ.. “ఇజ్జమ్మా! గాలి మోటరు లెక్కుంది. ఐదారు షేర్‌ ఆటోలంత పెద్దగుంది!” అని సంబురపడింది. నేను కూలింగ్‌ కంపార్ట్‌మెంట్‌ లోనుండి స్ర్పైట్‌ కూల్‌ డ్రింక్‌ తీసి ప్లాస్టిక్‌ గ్లాసులో పోసి ఇస్తే..
“కల్లా?” అని అడిగింది.

నేను ఫక్కున నవ్వి..
“మేం కల్లు తాగుతమా రామక్కా? కూల్‌ డ్రింక్‌! తాగు!” అన్నాను.
కూల్‌ డ్రింక్‌ తాగుతూ నన్ను తేరిపార చూస్తూ, నా చేతులకున్న బంగారు గాజులనూ, మెడలో ఉన్న నెక్లెసును చేయితో ఆప్యాయంగా తడిమి చూసి..
‘అవేనా?’ అని అన్నట్టు చూసింది. నేను నవ్వుతూ.. ‘అవును’ అన్నట్టుగా తలూపాను.
“మీ ఆయిన మంచిగ చూసుకుంటడ? కొడ్తడ ఎప్పుడైన?” అని నా చెవిలో గుసగుసగా అడిగింది. నేను నవ్వాపుకోలేకపోయాను.
“మంచిగ చూసుకుంటడు! కొట్టుడు కాదు గద తిట్టనుకూడ తిట్టడు!” అన్నాను.
“పోనీయ్‌ లే బిడ్డ! మహారాజుల ఇంట బుట్టినవ్‌! కని చివరికి ఘనంగ పెండ్లి చేసే దిక్కుకూడ లేకపాయె! కని దేవుడు చల్లంగ చూసిండు. ఘనమైన ఇంట్ల పడ్డవు. మారాణి లెక్కున్నవ్‌! చిన్నప్పుడు మీ నాయిన, పెద్ద సావుకారు బతికున్నప్పుడు ఎట్లున్నవో గట్లున్నవ్‌! అసలూ గీ కమాన్‌పూర్ల పెండ్లికి నేను రాకనే పోదును గనీ, నువ్వొస్తున్నవని మనూర్లె తపాలా పంతులు పెద్దబిడ్డ, నీతోటి కలిసి చదువుకున్నది చూడు.. గా రాధమ్మ దొరసాని చెప్పింది. గందుకె వచ్చిన. లేకపోతే ఎక్కడ మల్యాల? ఎక్కడ కమాన్‌పూరూ? గీ వయసుల నాతోటి అయితదా? నిన్ను చూడాలని కండ్లు తపన పడతా ఉండే! నువ్వేమో మనూరి ముఖమే చూస్త లేవాయె? గందుకె మీ అన్న కొడుకును బతిలాడి, ఆ పెండ్లి బస్సుల పడి వొచ్చిన. వొచ్చినందుకు నిన్ను జూసిన. చాలు, ఈ జన్మకు గీ తృప్తి చాలు..” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

నేను రామక్క కండ్లు తుడుస్తూ, అప్రయత్నంగానే ఆమె కాళ్లకు మొక్కాను. రామక్క చప్పున కాళ్లను వెనుకకు లాక్కొని..
“అయ్యో.. గిదేంది ఇజ్జమ్మా! నా కాళ్లు మొక్కుతున్నవ్‌! తప్పు కాదు. మీరు మా ఊరి షావుకార్లు. మా ఇంటిని మీ అమ్మ లక్ష్మమ్మే నిలబెట్టింది” అంటూ నా కాళ్లు మొక్కబోయింది. నేను వారిస్తూ, చేతులు జోడించి ఆమెకు నమస్కరిస్తూ.. “రామక్కా! నేనెందుకు దండం పెడుతున్ననో నీకు తెలుసు!” అన్నాను.
“యే! గవన్ని గిప్పుడెందుకమ్మా! పెండ్లికొచ్చినవ్‌! నిన్ను చూడాలని నేనొచ్చిన గని గా పాత విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకునేటందుకు కాదు!” అంటూ నా చేతులు పట్టుకొంది. తర్వాత అనేక విషయాలు ముచ్చటించుకొన్నాం.
తన భర్త చనిపోయాడనీ, పిల్లలందరికీ పెండ్లిళ్లయి వాళ్ల కాపురాలు వాళ్లు చేసుకుంటున్నారనీ, తను మాత్రం మల్యాలలోనే ఉంటూ తన వంతుకు వచ్చిన మూడు తాటిచెట్లను కౌలుకు ఇవ్వగా వచ్చిన సొమ్ముతోపాటు తనకొచ్చే వృద్ధాప్య పింఛనుతో కాలం వెళ్లదీస్తున్నానని చెప్పుకొచ్చింది రామక్క. అది విని నేను..
“మరి మీ కొడుకుల దగ్గరికి వెళ్లి ఉండవచ్చు కదా?” అని ప్రశ్నించాను.
“ఇజ్జమ్మా! అడ్డాలనాడు బిడ్డలుగనీ గిప్పుడు గడ్డాలనాడు మన పిల్లలు కాదు. పెండ్లిండ్లు, సదువులు, నౌకర్లు పడి ఎవరి సంసారం వాండ్లకు ఏర్పడినంక గిప్పుడు.. గిప్పుడు.. నేను వాండ్లకు సొంతతల్లిని కానని గుర్తుకొచ్చింది. నేనుగూడ ఒకమాట పడేదాన్ని కాదు! వాళ్ల కాళ్ల దగ్గర పడుండే ఖర్మ నాకేం పట్టిందమ్మా! నా పాలుకొచ్చిన మూడు తాటి చెట్లున్నయి. ఇల్లున్నది. సర్కారిచ్చే పింఛనొస్తాంది. దర్జాగ బతుకుతున్న. ఎప్పటికైన గౌండ్ల రామక్క శభాష్‌ అనిపించుకొనేటట్టే బతుకుత! గంతేగని సవతి కొడుకులూ, వాండ్ల పెండ్లాలూ ఈసడించుకుంటాంటే వాండ్ల కాళ్లదగ్గర పడి ఉండను. అయినా ఇజ్జవ్వా! నాకంత గనం కష్టమొస్తె నువ్వు లేవా?” అన్నది.

రామక్కకు సుమారు ఎనభై ఏండ్ల వయసొచ్చినా మునుపటి ఆ ధైర్యం, ధీరత్వం పోలేదు. కానీ, చివరకు తనన్న ‘నువ్వు లేవా?’ అన్న మాటకు నా గుండె కలుక్కుమంది. ఈ ముప్ఫై ఏండ్లు రామక్క నన్ను తలచుకుంటూనే ఉంది. అందుకే ఆ భరోసాతోనే ‘నువ్వు లేవా?’ అన్నది.
కానీ, ఈ ముప్ఫై ఏండ్లలో నేను రామక్క గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. రామక్క చూపిన ఔదార్యానికి నేను కృతజ్ఞత చూపించలేదు. కనీసం ఆమెను తలచుకోలేదు కూడా! గిల్టీనెస్‌తో నా హృదయం భారమైంది.
అయితే, దానికి కూడా ఓ కారణం ఉంది. అయినా సరే నేను చేసింది తప్పే!
కంప్యూటర్‌లో ‘డిలీట్‌’ అన్న బటన్‌ ప్రెస్‌ చేసి అప్పటివరకు స్టోర్‌ చేసిన మెమొరీస్‌ను డిలీట్‌ చేసినట్టుగా.. నేను నా మనసులో నుండి నా పుట్టింటి ఙ్ఞాపకాలన్నిటినీ, ‘పెండ్లి’ అనే బటన్‌తో తుడిచి పారేశాను.

నేను ఆ ఊరినుండి వచ్చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆస్తులన్నీ కరిగిపోయినయ్‌. మా అన్నల దగ్గర అప్పులు తీసుకున్న వాళ్లు, ‘అన్నల’ పేర్లు చెప్పి బెదిరించడంతో ప్రాణాలు అరచేతబట్టుకొని మా అన్నలిద్దరూ తట్టాబుట్టా సర్దుకొని ఒకరు కరీంనగర్‌కు, ఒకరు వరంగల్‌కు చేరుకొన్నారు. తర్వాత కొన్ని రోజులకు అమ్మ చనిపోయినప్పుడు, వరంగల్‌కు వెళ్లి అమ్మకు అంతిమ నివాళులు అర్పించి వచ్చాను.
అందుకే, నాకు మా ఊరు జొన్నల మల్యాలతో ఇప్పుడు సంబంధం ఏముంటుంది?
ఆ రోజు మల్యాలను వదిలిపెట్టి వస్తున్నప్పుడు నా మనసులో ముద్రించుకున్న భవంతి చిత్రమే ఇప్పటికీ నాకు గుర్తుంది. కానీ, ఇప్పుడు ఆ భవంతి ఆనవాళ్లు కూడా లేవని తెలిసిన తర్వాత.. అమ్మ లేని, ఇల్లు లేని, ఆప్యాయతలు మృగ్యమైన ఆ పుట్టిన ఊరితో నాకేం పని?

ఇలా నా ఆలోచనల్లో నేను ఉండగానే, రామక్క ఏదేదో చెబుతున్నది. కాసేపు తనుకూడా ఆలోచనల్లో మునిగింది. కాసేపటి తర్వాత అమ్మను తలచుకొని ఇద్దరం కన్నీరు కార్చాము. తర్వాత రామక్క నా సంసారం గురించి అడిగి వివరాలు తెలుసుకొన్నది. నా పిల్లలు ప్రయోజకులయ్యారనీ, నేను మహాలక్ష్మిలా ఉన్నానని చెబుతూ మరొకసారి చెంపలు నిమిరింది.
తర్వాత కారు దిగబోతుంటే..
“ఇజ్జమ్మా! గదొకటి ఇంకో గ్లాసు పోస్తవా?” అని స్ర్పైట్‌ బాటిల్‌ వంక చూపించింది రామక్క.
నేను నవ్వుతూ.. ఆమె గ్లాసు నింపాను. తను తాగిన తర్వాత పెండ్లిపందిరిలోకి నడిచాము.
కమాన్‌పూర్‌లో మా అన్న కొడుకు పెండ్లి అయిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరాను. మా ఆయన, పిల్లలూ రాననడంతో డ్రైవర్‌ను తీసుకొని నేనొక్కదాన్నే వచ్చాను. కారు కమాన్‌పూర్‌ ఊరు దాటుతుంటే, మనసు బాల్యంలోకి పరిగెత్తింది.

కమాన్‌పూర్‌ మా అమ్మమ్మగారి ఊరు. చాలా చిన్నప్పుడు మా అమ్మ చేయి పట్టుకొని ఆ ఊరికి వచ్చినట్టు లీలగా గుర్తుంది. మా ఆస్తులు తరిగిపోవడంతో మాకు ఆప్తులు కరువయ్యారు. ఆ ఊర్లో బంధువులెవ్వరూ లేరు.
మాది జొన్నల మల్యాల. నా బాల్యం అంతా అక్కడే గడిచింది. మా నాన్న బతికి ఉన్నంత కాలం మహారాణిలా తలెత్తుకొని బతికిన నేను, ఆయన హఠాత్తుగా చనిపోవడంతో.. అన్నదమ్ముల ఆస్తి తగాదాలలో కుటుంబం చితికి పోవడంతో గుంభనంగా, దీనంగా, రహస్యంగా, పేదగా గడపాల్సిన రోజులు దాపురించాయి.
నేను ఐదో తరగతో ఆరో తరగతో చదువుతున్నప్పుడు, మా భవంతికి కొంచెం దూరంలో ఉండే శంకర్‌గౌడ్‌ భార్య చనిపోయింది. ఆ గౌండ్లాయనకు ఆరోగ్యం బాగుండదు. ఆరుగురు పిల్లలు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో ఊర్లో పెద్దలందరూ కలిసి తల్లీదండ్రీ లేని రామక్కను తీసుకొచ్చి శంకర్‌గౌడుకిచ్చి పెండ్లి చేశారు. వాళ్లిద్దరి మధ్య ఇరవై ఏండ్ల వయసు తేడా ఉంది. తల్లిదండ్రుల ఆలనాపాలనా లేకపోవడంతో పిల్లలంతా ఆవారాగా తిరగడం చూసి రామక్క రంగంలోకి దిగింది. రామక్క పనిమంతురాలు అని నెలరోజుల్లోనే నిరూపించుకొంది. రోగిష్టి భర్తను కట్టడి చేసింది. కొడుకులను తీసుకొని తనే తాళ్లల్లకు పోయి కల్లు కుండలు దింపించుకొని ఇంటికి తీసుకొచ్చేది. వాడుక ప్రకారం ఎవరి ఇంటికి కల్లు పంపాలో పంపి, మిగిలిన కల్లును నగదు ఇచ్చిన వారికే పోసేది. ఉద్దెర అడిగిన వారికి నిర్మొహమాటంగా కల్లు లేదని చెప్పేది. కల్లు అమ్మకం పూర్తయ్యేసరికి, ఎదిగిన ఆడపిల్లలు స్నానం చేసి చిన్న పిల్లలు ఇద్దరినీ తయారుచేసి బడికి పంపాలనే రూల్‌ పాస్‌ చేసింది. పిల్లలు బడికి పోగానే తనూ, మిగిలిన నలుగురూ కలిసి కూలీకి పోయేవారు. ఎప్పుడూ చింపిరి తలలతో, పాత బట్టలు కట్టుకొని ఉండే పిల్లలు ఆరోగ్యంగా తయారవ్వడం, శంకర్‌గౌడ్‌ ఆరోగ్యం బాగుపడి పదేళ్ల వయసు తగ్గినట్టుగా కనిపించడం, మొండిగోడల ఇల్లును బాగు చేసుకొని సున్నాలు వేసుకోవడంతో శంకర్‌గౌడ్‌ ఇల్లు కళకళలాడింది.
రామక్క ప్రతిరోజూ పిల్లలను తీసుకొని పొలం పనులకు కూలీకి పోయేది. పొలం పనులు లేనప్పుడు కుట్టు మిషిన్‌ పనికి పోయేది. ఆడపిల్లలిద్దరికీ పెద్దపల్లిలో శిక్షణ ఇప్పించి, బ్యాంకు లోనుతో రెండు కుట్టుమిషిన్లు కొని మా ఊళ్లోనే టైలరింగ్‌ పనులు చేయించేది.

రామక్క మొగుడు రోగిష్టి. రామక్క వయసులో ఉందని కొంతమంది ఆమెమీద, ఈడొచ్చిన ఆడపిల్లలమీద కన్నేశారు. ఒకరోజు పట్టపగలు తనమీద చేయి వేయబోయిన ఒక తాగుబోతు మర్మాంగాన్ని గట్టిగా పట్టుకొని, వాడిని ఊరి నడిమధ్యలోకి లాక్కొని వచ్చి, అందరి ముందూ “ఖబడ్దార్‌!” అని హెచ్చరించింది. అప్పటినుంచి రామక్క అన్నా, ఆ ఇంటి ఆడపిల్లలన్నా ఊరి ప్రజలకు హడల్‌ పుట్టింది.
రామక్కతో పిల్లలు కనాలని ఉందని శంకర్‌గౌడ్‌ చెప్పడంతో.. మొగణ్ణి చడామడా తిట్టింది. ఒకరోజు ఎవ్వరికీ చెప్పకుండా పొత్కపల్లికి పోయి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకొని రెండు రోజుల తర్వాత వచ్చింది. ఊరంతా ముందు ‘ఔరా!’ అని ఆశ్చర్యపోయింది. తర్వాత ‘శభాష్‌ రామక్కా!’ అని మెచ్చుకొంది.
అంతటి సమర్థురాలైన గౌండ్ల రామక్క, మా అమ్మకు ప్రియమైన భక్తురాలు. తీరికగా ఉన్నప్పుడు అమ్మ దగ్గరకు వచ్చేది. నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకొని ముచ్చట్లాడుకునే వారు. అమ్మకు కూడా రామక్క అంటే ఎంతో అభిమానం. కూలిపోబోతున్న తన సంసారాన్ని చక్కదిద్దుకొన్న వైనం చూసి మెచ్చుకునేది. తనకా సామర్థ్యం లేనందుకు అమ్మ చింతించేది. రామక్క వెళ్తున్నప్పుడు ఇంట్లో మిగిలిన పాలో, పెరుగో, పచ్చడో ఇచ్చేది. మాకున్న అనేక వ్యాపారాల్లో పిండిగిర్ని ఒకటి. అందులో అడుగున మిగిలిన పిండిని తను కొన్న పశువుల కోసం తీసుకెళ్లేది. రామక్కకు ఎప్పుడైనా అవసరమైతే అమ్మ తను దాచుకున్న డబ్బులో నుంచి కొంత సాయం చేసేది. రామక్క తనకు వెసులుబాటు కాగానే తిరిగి ఇచ్చేది.
రెండేండ్లలోనే తమ ఇంటిపక్కన ఉన్న జాగాను కొని, అందులో రెండు గదులు కట్టి పెద్ద కొడుకు పెండ్లి చేసింది. మరో నాలుగేండ్లలో మిగిలిన ముగ్గురి పెండ్లిళ్లూ చేసింది. చిన్న పిల్లలిద్దరినీ పెద్దపల్లి బీసీ హాస్టల్లో చేర్పించింది.

ఊరంతా మరొకసారి ‘శభాష్‌ రామక్కా!’ అని ఆమెను మెచ్చుకొన్నారు.
రామక్క సంసారం పెరుగుతున్న సమయంలోనే, మా ఇంటి సంసారం కృంగిపోసాగింది. దగ్గరి బంధువులు, రక్త సంబంధీకులే అందిన కాడికి పందికొక్కుల్లా దోచుకొని మా ఇల్లును గుల్ల చేశారు. నాకు పెళ్లీడు వచ్చినా అన్నదమ్ములు పట్టించుకోకపోవడంతో అమ్మ రామక్కను రహస్యంగా వరంగల్‌కు పంపి, మాకు వరసయిన వారితో మాట్లాడి నా పెండ్లికి ఒప్పించింది. పల్లెటూళ్లో ఏ విషయమూ దాగదు. అందుకే, అత్యంత పకడ్బందీగా అమ్మా, రామక్క వేసిన ప్లాన్‌ ప్రకారం మూడో మనిషికి తెలియకుండా నేను వరంగల్‌కు చేరుకున్నాను. గుళ్లో నా పెండ్లి జరిగింది. నేను లేచిపోయాననే వార్త ఊరంతా గుప్పుమన్నది. మా అన్నదమ్ములు ఆగ్రహోదగ్రులై మా అమ్మనూ, రామక్కనూ తిట్టారు. వరంగల్‌లో మా అత్తగారింటి మీదకు దాడికి వచ్చారు. కానీ, మా వాళ్లు తిట్టి పంపడంతో వెనుతిరిగారు.
ఆ నరకం నుండి బయటపడ్డా నా పెండ్లిని మా అమ్మ చూడలేదనే బాధ నాకుండేది. అమ్మ నన్ను కలువకుండా నా అన్నదమ్ములు కట్టడి చేశారు. ఇంతలో నేను గర్భవతినయ్యాను. అయిదో నెలలో సీమంతం జరిగింది. మా పుట్టింటి తరఫున వొచ్చిన ఒకే ఒక వ్యక్తి రామక్క. ఆ సంబురం ముగిసిన తర్వాత వెళుతూ వెళుతూ నా చేతిలో ఒక మూట పెట్టింది.

నా సీమంతానికి రామక్క ద్వారా అమ్మ పంపిన నగలు ధరించి ఈరోజు నేనీ పెండ్లికి రావడం మంచిదైంది. అమ్మెలాగూ లేదు. కనీసం అమ్మ పంపిన దూత రామక్క అయినా నేను ధరించిన నగలను చూసి సంబురపడ్డది. పెండ్లి అయిన తర్వాత నేను బయలుదేరుతూ కొన్ని డబ్బులు ఇవ్వబోతే, రామక్క తల అడ్డంగా ఊపి.. మరొక్కసారి అమ్మ గాజులను, గొలుసులను తడిమి నవ్వి వెళ్లిపోయింది. నేను అప్రయత్నంగా ఆ గాజులను తడుముతుంటే.. అమ్మను తాకినట్టుగానే అనిపించి కండ్లు చెమర్చాయి. మరోసారి మనసులోనే..
‘శభాష్‌ రామక్కా!’ అనుకున్నాను.

పల్లెటూళ్లో ఏ విషయమూ దాగదు. అందుకే, అత్యంత పకడ్బందీగా అమ్మా, రామక్క వేసిన ప్లాన్‌ ప్రకారం మూడో మనిషికి తెలియకుండా నేను వరంగల్‌కు చేరుకున్నాను. గుళ్లో నా పెండ్లి జరిగింది. నేను లేచిపోయాననే వార్త ఊరంతా గుప్పుమన్నది. మా అన్నదమ్ములు ఆగ్రహోదగ్రులై మా అమ్మనూ, రామక్కనూ తిట్టారు. వరంగల్‌లో మా అత్తగారింటి మీదకు దాడికి వచ్చారు. కానీ, మా వాళ్లు తిట్టి పంపడంతో వెనుతిరిగారు.

డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ
రచయితగా, సినీ దర్శకుడిగా చిరపరిచితులు డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ. వీరి స్వస్థలం వరంగల్‌. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత వాణిజ్య పన్నులశాఖలో సీటీవోగా పనిచేసి విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. బాల్యంలో చూసిన సంఘటనలు, అనుభవాలతో రచయితగా మారారు. 1981లో ‘ఎదను ధర్మం’ పేరుతో మొదటి కథ రాశారు. సామాజిక కోణంలో నవలలు రాస్తున్నారు. ఇప్పటివరకూ అనేక కథలు, 24 నవలలు వెలువరించారు. ప్రస్తుతం వీరి ఐదు నవలలు ఏకకాలంలో వివిధ పత్రికలలో ప్రచురితమవుతున్నాయి. పాలపిట్ట మాసపత్రికలో ‘సమర్థుని జీవయాత్ర’, ఆంధ్రప్రభ సాహితీ గవాక్షంలో ‘కన్యాశుల్కం రివిజిటెడ్‌ ఇన్‌ 2021’, సాహో మాస పత్రికలో ‘కాళీ’, సినీవాలి అంతర్జాల వారపత్రికలో ‘హైటెక్‌ సిటీలో హైటెక్‌ హత్య’ ప్రచురితమవుతుండగా, ‘గురుభ్యోన్నమః’ నవల త్వరలో మరో పత్రికలో రానున్నది. 2021 ఉగాది పర్వదినాన వీరి రెండో కథల సంపుటి ‘సర్దుకున్నారా?’ ఆవిష్కృతమైంది. 2021లో ఒక యథార్థ సంఘటన ఆధారంగా ‘గర్భశోకం’ అనే సినిమాను ప్రారంభించారు. వీరి రెండో కవితా సంపుటి ‘గోధూళి వేళ..’ ప్రచురణకు సిద్ధంగా ఉంది. ఈ దశాబ్దంలోనే (2012 నుండి 2021 వరకు) 17 నవలలు, రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలు వెలువరించారు. ఐదు ఫీచర్‌ ఫిల్మ్స్‌ నిర్మించారు. 2021 జూన్‌ 19న ‘సినీవాలి’ ఉచిత అంతర్జాల వారపత్రికను విహారి అధ్యక్షతన, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి చేతులమీదుగా ఆవిష్కరించారు. వీరి ‘క్షమాభిక్ష దొరికింది’ అనే కథను ప్రొఫెసర్‌ కె.వెంకటరెడ్డి ఇంగ్లీషులోకి అనువదించగా, ‘టెలీస్కోప్‌’ అనే ప్రముఖ ఆంగ్లపత్రికలో ప్రచురితమైంది. వీరి సాహిత్య జీవితం మీద కాకతీయ యూనివర్సిటీలో ఒక అభ్యర్థి పీహెచ్‌డీ చేస్తున్నారు. తన ప్రతీ ఒక్క అక్షర సృష్టి వెనుక భార్య విజయలక్ష్మీ జైనీ సహకారం, తోడ్పాటు, శ్రమ, సూచన ఉన్నాయని ప్రభాకర్‌ జైనీ చెబుతున్నారు.

డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ
79898 25420

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana