e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home బతుకమ్మ వినూత్న తీర్పు.. సామాజిక సేవ!

వినూత్న తీర్పు.. సామాజిక సేవ!

వినూత్న తీర్పు.. సామాజిక సేవ!

‘ పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను, ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత.ఆ పౌరులే అదుపు తప్పి, సమాజానికి ముప్పుగా మారితే శిక్షించే హక్కుకూడా చట్టానికి ఉంది. కానీ, శిక్షలవల్ల ఖైదీలలో పరివర్తన వస్తున్నదా? లేదంటే, ఊచల వెనుక జీవితాలు వారి భవితను మరింత చీకటిగా మారుస్తున్నాయా?’ అన్న సందేహాలు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ శిక్షా స్మృతి గురించి ఆలోచించక తప్పదు. ఒక వ్యక్తి సమాజానికి శాపంగా మారకూడదంటే, దీపమై ఆదర్శంగా నిలవాలంటే.. సమాజ సేవను మించిన శిక్షలేదని అంటున్నారు విశ్లేషకులు.

ఆయన ఓ జిల్లా కలెక్టరు. కోర్టు ధిక్కారం కేసులో న్యాయస్థానం కండ్లెర్రజేసింది. అదే కేసులో ఓ పౌర సరఫరాల శాఖ అధికారిణి కూడా శిక్షార్హురాలని తేలింది. పరిహారంగా కొంత జరిమానా విధించింది న్యాయస్థానం. ఆ ఇద్దరికీ జరిమానా పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ, చెల్లించడం అన్నది అవమానకరమే! అందుకే, జరిమానాను రద్దు చేయమంటూ ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. హైకోర్టు వీరిద్దరికీ ‘సమాజసేవ’ను శిక్షగా విధించింది. సదరు కలెక్టరు ఆరునెలలపాటు, వారాంతాల్లో ఓ అనాథాశ్రమంలో సేవ చేయాలనీ, ఆ అధికారిణి కూడా తన ఇంటికి పది కిలోమీటర్ల లోపు ఉన్న శరణాలయంలో పిల్లలకు ఆహారాన్ని అందించాలనీ తీర్పునిచ్చింది. ఈ సంచలనాత్మక తీర్పుతో మరోసారి సమాజసేవను శిక్షగా విధించడం గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇలాంటి ‘సేవా’ శిక్షలవల్ల పరివర్తన వస్తుందా? అంటే.. అది వ్యక్తినిబట్టి ఉంటుంది. నిజంగానే మారినవారూ ఉన్నారు.

ఒక వ్యక్తి చేసిన తప్పు రుజువు అయితే, నేరస్తుడిలో సకారాత్మకమైన పరివర్తన తీసుకొచ్చేందుకు జైలు శిక్షలు విధించడం సర్వ సాధారణమే. కానీ, జైలు జీవితం ఆ మార్పును ఎంతవరకు సాధిస్తుందన్నదే సందేహం. మన దేశంలో జైళ్లు కిక్కిరిసిపోయి ఉంటున్నాయనీ, లెక్కకు మించిన ఖైదీల వల్ల అనారోగ్యాలూ అంటువ్యాధులూ ప్రబలుతున్నాయనీ అనేక నివేదికలు చెబుతున్నాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం వెలువరించిన నివేదిక ప్రకారమే.. ‘2019లో మన కారాగారాలకు 4 లక్షల మందిని నిర్బంధించగల సామర్థ్యం ఉంది. కానీ, అంతకంటే 20 శాతం ఎక్కువ ఖైదీలు ఉన్నారిక్కడ. దేశ రాజధాని ఢిల్లీలో అయితే దాదాపు 75 శాతం వరకూ అధికంగా ఉండటం బాధాకరం, అమానవీయం. వీటికితోడు అధికారుల కాఠిన్యం, తోటి ఖైదీల దురుసుదనంతో జైల్లోకి అడుగుపెట్టిన వాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం ఉంది.ఇలాంటి వాతావరణం మధ్య ఖైదీ కన్నయ్యలు మరింత రాటు తేలిపోతున్నారనీ, అందుకే జైలునుంచి విడుదలయ్యాక.. అంతకంటే తీవ్రమైన నేరం చేసి, తిరిగి ఊచల వెనుకకు వెళ్తున్నారనీ మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో చిల్లర నేరస్తులు పెద్ద నేరగాళ్లనూ, పెద్ద నేరగాళ్లు ఇంటర్నేషనల్‌ క్రిమినల్స్‌నూ పరిచయం చేసుకోవడానికి, క్రిమినల్‌ నెట్‌ వర్క్‌ పెంచుకోవడానికి, నేర నైపుణ్యాలను సానబెట్టుకోవడానికి జైళ్లు శిక్షణ కేంద్రాలు అవుతున్నాయన్న విమర్శా ఉంది.

మరో కోణంలో నుంచి చూస్తే.. నెలనెలా కొన్ని వేలమంది చిన్నపాటి నేరాలతో జైళ్ల్లలోకి అడుగు పెడుతున్నారు. జైలు జీవితం వీరి భవిష్యత్తుమీద తీవ్ర ప్రభావం చూపుతున్నది. కొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు, కొంతమంది ఉపాధి అవకాశాలకు దూరం అవుతున్నారు. ఆ మచ్చ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారూ ఉన్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమూ సరికాదు. ఇలాంటి చిన్నపాటి నేరాలకు సమాజసేవను శిక్షగా విధిస్తే, చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నది విశ్లేషకుల మాట. పైగా మన జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో 86 శాతం మంది 18-50 ఏండ్ల వయసు వారే. అంటే, కొన్ని లక్షలమంది విలువైన జీవితం జైలు గోడలకే అంకితం అవుతున్నది. ఇది మానవ వనరులను వృథా చేసుకోవడమే! ఇలాంటి నేపథ్యంలో సామాజిక శిక్షలే తగిన ప్రత్యామ్నాయం అన్నది ఓ బలమైన వాదన.

ఆలోచన కొత్తదేం కాదు
తరాలనాటి శిక్షా స్మృతిలో సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచన ఈనాటిది కాదు. అనేక కమిటీలు సమాజసేవను ఓ శిక్షగా విధించాలని సూచనలు చేశాయి. దీనికి చట్టబద్ధత కల్పించేందుకు 1978లో ఓ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా జరిగింది. అయితే, ఇవేవీకూడా న్యాయవ్యవస్థ ఆమోదాన్ని పొందలేకపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘కమ్యూనిటీ సర్వీస్‌ ఆఫ్‌ అఫెండర్స్‌-2010’ పేరిట ఓ చట్టాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ, దీనిమీద కూడా నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకూ మన దేశంలో సమాజసేవను శిక్షగా విధించడానికి చట్టపరమైన వెసులుబాటేదీ లేదు.భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 53 ‘మరణదండన నుంచి జరిమానా వరకు ఎలాంటి శిక్షలు విధించవచ్చు?’ అన్నది స్పష్టం చేస్తున్నది. వీటికి సామాజిక శిక్షనుకూడా జోడించమంటూ వచ్చిన ప్రతిపాదనలు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అలాగని, సామాజిక సేవను ఓ శిక్షగా ఖరారు చేస్తూ తీర్పులు వెలువరించకూడదనే నిబంధన ఎక్కడా లేదు. State of Gujarat v Hon’ble High Court of Gujarat లాంటి కేసులలో నేరస్తులలో పరివర్తన కలిగించడమే శిక్షల ముఖ్యోద్దేశం కావాలన్న బలమైన ఆకాంక్ష వ్యక్తమైంది. అందుకే, క్రమంగా న్యాయమూర్తులు సామాజిక శిక్షలపట్ల చొరవ చూపిస్తున్నారు. ఇదో మంచి పరిణామమే.

వినూత్న తీర్పు.. సామాజిక సేవ!

టూజీ కేసులోనూ..
2జి స్పెక్ట్రమ్‌ కేసులో తమ వాదన వినిపించే విషయంలో అశ్రద్ధ చూపినందుకుగాను షాహిద్‌ ఉస్మాన్‌ బల్వా అనే వ్యాపారితోసహా అయిదుగురికి ఢిల్లీ కోర్టు సామాజిక శిక్ష విధించింది.15 వేల చెట్లు నాటాలంటూ తీర్పునిచ్చింది. నాటడమే కాకుండా, వాటి పరిరక్షణ బాధ్యతనూ స్వీకరించాలని ఆజ్ఞాపించింది. ఆ మాత్రం సేవకూడా తమకు భారమేనంటూ నిందితులు మరో పిటిషన్‌ వేయడం కొసమెరుపు. మరో సందర్భంలోనూ ఓ హైకోర్టు ఇలాంటి తీర్పునే వెలువరించింది. ఇందులో వైద్యవృత్తిలో ఉన్న ఓ వ్యక్తి, తెలిసీ తెలియని వయసులో హత్యాయత్నానికి పాల్పడ్డాడని తేలింది. బాల్యం నాటి నేరానికి, పెద్దయ్యాక శిక్ష విధించడం సబబు కాదు కాబట్టి, వంద చెట్లు నాటి ప్రాయశ్చిత్తం చేసుకోమంటూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.
తెలుగు రాష్ర్టాల్లోనూ సామాజిక శిక్షల సంప్రదాయం పెరుగుతున్నది. ఓ ఎక్సైజ్‌ అధికారికి కోర్టు ధిక్కరణ కేసులో కొంత జరిమానా విధించారు. దాన్ని రద్దు చేయమంటూ హైకోర్టును ఆశ్రయించిన అధికారికి, జరిమానాకు బదులుగా సామాజిక శిక్షను విధించింది న్యాయస్థానం. రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా, తన ఇంటికి దగ్గరగా ఉన్న మసీదులో ఉపవాస దీక్షను విరమించుకుని వచ్చేవారికి వారం రోజులపాటు అల్పాహారాన్ని అందించాలని తీర్పునిచ్చింది.

వివాదాస్పదమూ
ఏ నేరానికి ఎలాంటి శిక్ష విధించాలి, ఎన్ని రోజుల ఖైదు ప్రకటించాలి.. అన్నది ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం నిర్ణయిస్తారు. కానీ, నేరం నిరూపితమైన తర్వాత కఠిన కారాగారానికి బదులుగా, ఫలానా సామాజిక శిక్షను విధించవచ్చనే మార్గదర్శకాలేవీ లేవు. అందుకే, కొన్ని సందర్భాల్లో మాత్రమే కోర్టులు ఈ తరహా తీర్పును వెలువరిస్తున్నాయి. విచారణకు సహకరించనందుకో, బెయిల్‌ మంజూరుకు ఓ షరతుగానో, జరిమానాకు బదులుగానో సేవతో ముడిపడిన శిక్షలు విధిస్తున్నాయి. కానీ, సామాజిక శిక్షలు నూటికి నూరుశాతం విచక్షణమీదే ఆధారపడి ఉండటంతో.. అరుదుగానే అయినా, అవి దుర్వినియోగం అవుతాయనే భయమూ లేకపోలేదు. 1999లో ఆయుధ వ్యాపారి మనవడైన సంజీవ్‌ నందా, తప్ప తాగి కారు నడుపుతూ ఏకంగా పోలీస్‌ చెక్‌ పోస్టునే గుద్దేశాడు.

ఈ ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. అయినా, సంజీవ్‌ కనికరం చూపలేదు. వాళ్లకు వైద్యం అందించే ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడినుంచి తప్పించుకుని, సాక్ష్యాలను తారుమారు చేసే పనిలో పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు సహా ఆరుగురు అమాయకులు చనిపోయారు. మరణించింది పోలీసులు అయినా, సాక్ష్యాలు బలంగా ఉన్నా ఈ కేసు దాదాపు పదేండ్లపాటు నడిచింది. మధ్యలో సాక్షుల మనసు మార్చే ప్రయత్నాలు జరిగాయంటూ ఎన్డీటీవీ ఓ స్టింగ్‌ ఆపరేషన్‌కూడా నిర్వహించింది. ఎట్టకేలకు 2012లో కీలకమైన తీర్పు వెలువడింది. అప్పటికే సంజీవ్‌ ఈ కేసులో రెండేండ్ల జైలుశిక్ష అనుభవించాడు కాబట్టి, భారీ జరిమానా చెల్లించి, సమాజసేవకు సిద్ధపడితే సరిపోతుందంటూ కోర్టు తీర్పునిచ్చింది. అంత పెద్ద తప్పు చేస్తే, ఇంత చిన్న శిక్షా.. అన్న విమర్శ వినిపించింది.

అన్నీ పరిగణనలోకి తీసుకొనే సామాజిక శిక్షలను విధించే సమయంలో వ్యక్తి వయసు, నేరచరిత్ర, మానసిక స్థితి లాంటి విషయాలను మరింత జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలి. లేకపోతే వాటి మూలభావనలకే ప్రమాదం. సమాజసేవను శిక్షగా విధించేటప్పుడు ప్రజల మనోభావాలనుకూడా దృష్టిలో ఉంచుకోవాలనే అభిప్రాయం ఉంది. 2017లో రాంచీ (ఝార్ఖండ్‌) హైకోర్టు ఆరుగురు ముద్దాయిలకు బెయిలు మంజూరు చేస్తూ, వాళ్లు స్థానిక ప్రభుత్వాసుపత్రులలో రోగులకు సేవ చేయాలని సూచించింది. ఈ తీర్పుపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కానీ, అదే రాంచీలోని ఓ స్థానిక కోర్టు ఓ మతానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు సదరు మత గ్రంథాలను పంచి పెట్టాలంటూ ఓ విద్యార్థినికి సామాజిక శిక్ష విధించింది. ఈ తీర్పు విశ్వాసాలను దెబ్బ తీసేదిగా ఉందని మేధావులు ఆక్షేపించారు.

అండర్‌ ట్రయల్స్‌కు ఊరట
ఓ నివేదిక ప్రకారం సెప్టెంబరు 2020 నాటికి మన దేశంలో 1.6 కోట్ల క్రిమినల్‌ కేసులు విచారణలో ఉన్నాయి. సహజంగానే విచారణలో ఉన్న కేసులలో, తీర్పుకోసం ఎదురుచూస్తూ జైళ్లలో మగ్గిపోయే వారి (అండర్‌ ట్రయల్స్‌) సంఖ్యకూడా అసాధారణంగా ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెలువరించిన నివేదిక ప్రకారం, మన జైళ్లలో ఉన్న ప్రతి పదిమందిలో, ఏడుగురు ఇంకా తీర్పుకోసం ఎదురుచూస్తున్నవారే. ప్రపంచంలో అతికొద్ది దేశాల్లో మాత్రమే ఇంత దారుణమైన పరిస్థితులు ఉండటం గమనార్హం. పైగా ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. నేరం నిరూపణ కాకుండానే, ఐదేండ్లకు పైబడి జైళ్లలో మగ్గుతున్నవారి సంఖ్యే 5,000కు పైబడి ఉందని సాక్షాత్తు రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పుకొంది. చాలా సందర్భాలలో బెయిలు కోసం దరఖాస్తు చేసుకోలేని, పూచీకత్తుకు కావల్సిన డబ్బును సమకూర్చుకోలేని నిరుపేదలే అండర్‌ట్రయల్స్‌గా మగ్గిపోతున్నారు.

వినూత్న తీర్పు.. సామాజిక సేవ!

ఆర్థిక స్థోమత లేని పేదలకోసం వాదించేందుకు, న్యాయస్థానమే న్యాయవాదులను ఏర్పాటు చేస్తుంది. అయితే, ఈ ఉచిత సేవలు చాలా సందర్భాల్లో తగినంత నాణ్యతగా ఉండటం లేదన్నది ఓ ఆరోపణ. కేసును త్వరగా ముగించడానికి పోలీసుల సహకారం కూడా చాలా అవసరం. మన దేశంలో ప్రతి లక్షమంది పౌరులకూ 200 మంది పోలీసులు కూడా లేకపోవడంతో సాక్ష్యాల సేకరణలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. మొత్తంగా నిరుపేదలు, నిరక్షరాస్యులే అండర్‌ ట్రయల్స్‌గా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. తీర్పు వెలువడేదాకా వీరికి సామాజిక శిక్షతో కూడిన బెయిలుని మంజూరు చేస్తే లక్షలాది కుటుంబాలకు ఊరట కల్పించినట్టు అవుతుంది. నాణానికి బొమ్మ-బొరుసు ఉన్నట్టు ఏ విధానానికైనా ఎన్నోకొన్ని లోపాలూ ఉంటాయి. ఆ లోపాలను సరిదిద్దుకుంటూ మంచిని పెంచుకోవడమే మన బాధ్యత.

పరివర్తన దిశగా!
మౌరిస్‌ ఫ్రెడ్‌మన్‌.. పోలాండ్‌లో జన్మించిన యూదు. ఆ దేశాన్ని ఆక్రమించుకున్న హిట్లర్‌ దురాగతాలనుంచి తప్పించుకుని ఇండియాకు వచ్చాడు. తన తెలివితేటలతో గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ఈ క్రమంలో భారతీయ తత్త్వచింతన అతడిని ఆకర్షించింది. గాంధీ భావనలూ మనసును గెలుచుకున్నాయి. అప్పట్లో మహారాష్ట్రలో ఔంధ్‌ అనే రాజ్యం ఉండేది. ఆ ఔంధ్‌ రాజు, మౌరిస్‌కు మంచి మిత్రులు. ఔంధ్‌ రాజును ఓ చిత్రమైన ప్రయోగానికి ఒప్పించారు మౌరిస్‌. తన రాజ్యంలో సంపూర్ణ గ్రామస్వరాజ్యాన్ని అమలు చేయమని సలహా ఇచ్చారు. ప్రభుత్వానికి లేదా రాజుకు కేవలం నామమాత్రమైన అధికారం ఉండే ఈ ప్రయోగానికి ‘ఔంధ్‌ ఎక్స్‌పెరిమెంట్‌’ అని పేరు. అంతా బాగానే ఉంది. గాంధీకూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ, ‘నేరస్తులను శిక్షించడం ఎలా?’ అనే ప్రశ్న ఉత్పన్నమైంది.

ఆ సమస్యను పరిష్కరించడానికి కూడా మౌరిస్‌ చొరవ చూపారు. నేరస్తులలో పరివర్తన వచ్చేలాగా నామమాత్రపు పర్యవేక్షణ మధ్య వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడే అవకాశం ఇవ్వాలని సూచించారు. కొంత పొలాన్ని కేటాయించి, వాటిమీద పండే పంటను అమ్ముకునే అవకాశం ఇవ్వాలన్నది తన ఆలోచన. దీన్ని ‘స్వతంత్రపూర్‌’ అనేచోట అమలుచేశారు కూడా! మౌరిస్‌ ఆలోచనలు బాలీవుడ్‌ను సైతం ఆకర్షించాయి. శాంతారామ్‌ ‘దో ఆంఖే బారహ్‌ హాథ్‌’ చిత్రం తీసేలా ప్రేరేపించాయి. దాన్నే తెలుగులో ‘మా దైవం’గా మలిచారు. ఇదే ఫార్ములాని కాస్త మార్చి ‘ఇద్దరు దొంగలు’, ‘ఖైదీ బాబాయ్‌’ తరహా తెలుగు చిత్రాలు విజయవంతమయ్యాయి.

ట్రా‘ఫికర్‌’
దేశంలో వాహనాల సంఖ్య రెట్టింపు వేగంతో పెరిగిపోతున్నది. దాంతోపాటే ప్రమాదాలూ. రోడ్డుమీదికి వచ్చే వాహనదారులను వీలైనంత అప్రమత్తంగా ఉంచేందుకు ప్రభుత్వం ‘మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌’లో ఎప్పటికప్పుడు మార్పులు తెస్తున్నది. ఇందులో భాగంగానే, 2019లో ఓ సవరణ తీసుకువచ్చారు. లైసెన్స్‌ లేకపోతే రూ. 5 వేలు, వేగంగా బండి నడిపితే రూ. 5 వేలు ముక్కుపిండి వసూలు చేయాలంటూ.. భారీ జరిమానాలను పేర్కొన్నారు. వీటిలో చాలా నేరాలకు జైలుశిక్షను కూడా విధించే అవకాశం ఉంది. అయితే, చిన్నపాటి నేరాలకు (ఉదా॥ వాహనబీమా లేకపోవడం) జైలుశిక్షకు బదులుగా సమాజసేవ చేసే అవకాశం కల్పించడం విశేషం. మన దేశంలో చిన్నపాటి నేరాలకు జైలుశిక్షను ఖరారుచేసే ఇలాంటి చట్టాలు చాలానే ఉన్నాయి (ఉదా॥ టికెట్‌ లేని ప్రయాణం). తొందరపాటులో తప్పులు చేసేవారిని, పేదవారిని, నిరక్షరాస్యులను ఇలాంటి చిన్నపాటి కారణాలతో ఖైదు చేయడం అంటే నిండు జీవితాన్ని జైలుపాలు చేయడమే. చిన్న నేరాలకు సామాజిక శిక్షలే మంచి ప్రత్యామ్నాయం.

వినూత్న తీర్పు.. సామాజిక సేవ!

వివిధ దేశాలలో..

సింగపూర్‌
ఇక్కడ ఒకప్పుడు చిన్నపాటి నేరాలకు మాత్రమే సమాజసేవను కారాగార శిక్షకు ప్రత్యామ్నాయంగా విధించేవారు. కానీ, 2018లో ‘క్రిమినల్‌ జస్టిస్‌ రిఫార్మ్‌ యాక్ట్‌’ను ఆమోదించిన తర్వాత, చాలా నేరాలకు సేవా శిక్షలను ఖరారు చేస్తున్నారు. ఇంతకు ముందే ఒకసారి కారాగార శిక్ష అనుభవించిన వారు, తగిన పరిహారం చెల్లించిన వారు, ఇక మీదట తప్పు చేయరనే నమ్మకాన్ని కలిగించిన వారికి మాత్రమే సమాజసేవను శిక్షగా విధిస్తున్నారు. అయితే, ఇక్కడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ‘ఇన్‌ జి’ అనే ఓ వైద్య విద్యార్థి, తన ప్రియురాలి గొంతు నులిమినందుకు అతనికి సమాజసేవను పరిహారంగా విధించారు. ఈ తీర్పు వివాదాస్పదమైంది.

ఆ స్ట్రేలియా
సామాజిక శిక్షలకోసం వేర్వేరు రాష్ర్టాలలో భిన్నమైన చట్టాలున్నాయి. వాటిని అమలు చేసేందుకు విభిన్నమైన పద్ధతులూ ఉన్నాయి. న్యూసౌత్‌ వేల్స్‌లో కమ్యూనిటీ శిక్షలతోపాటు కౌన్సెలింగ్‌, అధికారుల పర్యవేక్షణకూడా ఉంటాయి. డిసెంబరు 2020లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం, ఒక్క ఉత్తర ఆస్ట్రేలియాలోనే ప్రతి లక్షమందిలో 679 మంది సమాజసేవను శిక్షగా అందుకున్నారు. దీనిబట్టి, ఇక్కడ ఈ తరహా తీర్పులు ఎంత సహజమో అర్థమవుతుంది.

ఇంగ్లండ్‌
ఆస్తులకు నష్టం కలిగించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం తదితర నేరాలు చేసినవారు.. ఇక మీదట అలాంటి నేరాలు చేయక పోవచ్చనే నమ్మకం కుదిరినప్పుడే సామాజిక శిక్షను విధిస్తారు. దీనికి అక్కడ ‘కమ్యూనిటీ పేబ్యాక్‌’ అని పేరు. ఇందులో భాగంగా కలుపుమొక్కలు తీయడం, గోడలమీద రాతలను శుభ్రం చేయడం, ప్రభుత్వ భవనాలను అలంకరించడం లాంటి పనులు చేయిస్తారు. నేర తీవ్రతను బట్టి 40నుంచి 300గంటల వరకు ఈ సేవ చేయాల్సి ఉంటుంది.

అమెరికా
కమ్యూనిటీ రెస్టిట్యూషన్‌ పేరుతో అమెరికాలోనూ సామాజిక శిక్షలు విధిస్తుంటారు. అయితే, ఈ సేవను విధించే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. మరణశిక్ష, జీవితఖైదు లాంటి శిక్షలకు బదులుగా సామాజిక సేవను విధించరు. కమ్యూనిటీ రెస్టిట్యూషన్‌లో అమలు చేసే పనులు సమాజానికి ఉపయోగపడటమే కాకుండా, చేసిన నేరంతో ముడిపడి ఉండేలా చూస్తారు.

జింబాబ్వే
1992లో జింబాబ్వే ప్రభుత్వం తన కారాగారాల్లో మగ్గుతున్న ఖైదీలమీద ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం వారిలో 60 శాతం మంది చిన్నపాటి నేరాలతోనే జైళ్లలో మగ్గుతున్నట్టు తేలింది. అప్పటినుంచి స్వచ్ఛంద సేవను శిక్షలుగా అమలు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది.

వినూత్న తీర్పు.. సామాజిక సేవ!

సెలబ్రిటీలూ అందుకొన్నారు
అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్‌, వ్యాపారవేత్త పారిస్‌ హిల్టన్‌ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న కారణంగా, 200 గంటలు సమాజసేవ చేయాలన్న తీర్పు వెలువడింది.
ప్రముఖ ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు ఎరిక్‌ కంటోనా ఓ ప్రేక్షకుడిని గాయ పరిచినందుకు శిక్షగా, 120 గంటలపాటు పిల్లలకు ఉచితంగా ఫుట్‌బాల్‌ నేర్పించాల్సి వచ్చింది.
ఇంగ్లండ్‌కు చెందిన రసెల్‌ బ్రాండ్‌ అనే నటుడు, ఓ జర్నలిస్ట్‌ ఫోన్‌ను పగులగొట్టినందుకు 20 గంటల సామాజిక శిక్షను అనుభవించారు.
నవోమీ క్యాంప్‌బెల్‌ అనే ప్రముఖ మోడల్‌ తన పనిమనిషిపై చేయి చేసుకున్నందుకుగాను ..న్యూయార్క్‌ లోని‘శానిటేషన్‌ గ్యారేజ్‌’ను వారం పాటు శుభ్రం చేయమంటూ న్యాయస్థానం ఆదేశించింది.ఈ సందర్భంగా, నవోమీ ఒక్కోరోజు ఒక్కో ఫ్యాషన్‌ డ్రెస్‌లో రావడం విమర్శలకు దారితీసింది.

వినూత్న తీర్పు.. సామాజిక సేవ!
Advertisement
వినూత్న తీర్పు.. సామాజిక సేవ!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement