e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home బతుకమ్మ వలందులోరి పట్నంలో గోపరాజు గుర్రపునాడా

వలందులోరి పట్నంలో గోపరాజు గుర్రపునాడా

అది నాగులవంచలోని వలందుల పట్నం. నాలుగేండ్లపాటు రెండో నాయకుడిగా చేసిన నికోలస్‌ డాంక్ఫార్డ్‌ ఇప్పుడు ఆన్ఫ్యోర్డర్‌గాపదోన్నతి పొందాడు. దీంతో మరింత దర్పం, శిక్షల్లో ఇంకొంత కాఠిన్యం చూపిస్తున్నాడు. అతని కింద‘ఈరెస్తె’గా వచ్చిన గెరార్డ్‌ బెనూర్డెన్‌వి కూడా తోడేలు చూపులే.

దెబ్బలు తింటున్నది దొంగలో, నేరస్థులో కాదు, వాళ్లంతా అసాధ్యాన్ని అలవోకగా చేతిపనుల్లో చూపగలిగిన నిపుణులు, తరకలు మరకలూ లేకుండా నీలిమందు కాయగలవారు, సుతారమైన నూలు గుడ్డ వడక గలవారు, తుపాకి మందుకు అవసరమైన పెట్లుప్పు, గంధకం, వాణిజ్య ముద్రల రంగులకు అవసరమైన లక్క, ఇంకా వేల గిల్డర్ల ఖరీదు చేసే మిరియాలు అందించేవాళ్లు. కాకపోతే గడువులోగా వస్తువులు అందించలేదని శిక్షగా.. వాళ్లను గొడ్లని బాదినట్లు బాదుతున్నారు. ఈ
నరక ప్రాయమైన శిక్షల వల్ల గతంలో కొందరు పనివాళ్లు చనిపోతే, మరికొందరు బానిసలను ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి ఇదే ఊళ్లో చేర్చారు. మసులీపట్నంలో ఓడ బయల్దేరే సమయానికి కోరుకున్నంత సరుకును సిద్ధం చేసివ్వాలి. అందుకోసం వాళ్లు ముందస్తు బయానాలు చెల్లిస్తారు కాబట్టి, అంతకన్నా ఎక్కువ ధర చెన్నపట్నం సెట్టిగారు ఇస్తానన్నా తీసుకోలేరు. ఇప్పుడు వెళ్లబోయే ఓడకు నలభైవేల గిల్డర్ల సామాను పోగుచెయ్యాలి. అందులో మూడువందల బేళ్ల నీలిమందు, వెయ్యి మాణికలు శుభ్రం చేసిన పెట్లుప్పు కోసం వజ్రాలు ఏరుకొచ్చే వాళ్లకన్నా ఒత్తిడి చేస్తున్నారు.

- Advertisement -

అందమైన నాలుగు రాజవీధుల నాగులవంచ.. దాని పేరును ఈ డచ్చి టోపీల మాటున మర్చిపోయింది. అందరినోట్లో వలందులోరి పట్నంగా మారిపోయింది. అసలైతే వీళ్ల స్థావరాలన్నీ తీరం వెంబడే ఉంటాయి. గోలుకొండ దండుబాట దారిలో వీళ్లకు ఎందుకు నచ్చిందో, ఎట్లా చిక్కుకు పోయిందో కానీ పదహారేండ్లుగా గిజగిజలాడుతూనే ఉంది. రాత్రీ లేదు, పగలూ లేదు. పని.. పని.. ‘తొందరగా చెయ్యండ్రా ముండాకొడుకుల్లారా’ అంటూ కత్తి కొసవున్న తుపాకీలు పట్టుకున్న వలందుల కాపలా బంట్రోతు కూసే కారుకూతలు, అలసి పడుకున్నాసరే ఉలిక్కిపడి లేచేలా చేస్తాయి. ఆడవాళ్ల బాధలు చెప్పనలవి కాదు.

‘ఎంట్రా ఆలోచిస్తున్నావు? నాకు చెప్పవే పూర్తి సొతంత్రం అంటే ఏమిటి?’ మళ్లీ అడిగాడు రామాచారి.
నాలుగువైపులా లోపటి మెట్ల బురుజుల్తో, మందపాటి మట్టిగోడలతో కట్టిన డచ్‌ ఫ్యాక్టరీలోకి వెళ్లి దొంగచాటుగా సామాను పగలగొడితేనో, కొందరిని దొంగదెబ్బతీసి గూబలు గుయ్యిమనిపిస్తేనో చాలదు. అప్పుడు, రాములోరి కల్యాణానికి వచ్చిన గోపరాజుగారు చెప్పినట్లు మన తిండి మనం తినాలి. మన పనిలో లాభం మనకే కలగాలి. కానీ, వాళ్ల సైన్యం ముందు, వాళ్ల తుపాకుల ముందు, వాళ్ల పాలన ముందు ఎలా నిలబడాలి? ఇలా ఆలోచిస్తుండగానే వాళ్లు కొట్టడం పూర్తయ్యిందన్నట్లు రాతి కమానుకి కట్టిన కంచుగంట ఠంగ్‌ మంటూ మోగింది.
‘బానిస కొడుకుల్లారా, ఇకనన్నా ఒళ్లు దగ్గరపెట్టుకుని డచ్‌ కంపెనీ ప్రభువులకు నమ్మకంగా పనిచేయడం నేర్చుకోండి. కొడుకుకి కాలునెప్పి, పెండ్లానికి పన్నునెప్పి అంటూ పనులు ఎగనామం పెట్టారంటే పందినాయాళ్లారా! మీ పెళ్లాల పుస్తెలు పుటుక్కున తెగుతాయి. తర్వాత కోటలోపట అందరికీ ఊడిగం చేస్తూ బతకాల్సిందే!’ వెకిలిగా నవ్వుతూ వాళ్లను మెడపట్టుకు తోసేశాడు ఈరెస్తె బెనూర్డెన్‌.

అందరూ గుంపుగా కూర్చున్నారు. రోజంతా తగిలిన దెబ్బలకు ఆడవాళ్లు వేడినీళ్ల కాపడం పెడుతుంటే, ముసలివాళ్లు డచ్‌ సైనికులకు శాపనార్థాలు పెడుతున్నారు. వీళ్ల స్థావరం రాకముందు పదహారేండ్ల కిందట పదకొండు వంచలు, వాగులు ఐదు శివాలయాలు, ఐదు వైష్ణవాలయాలు, చుట్టూతా చక్కటి మామిడితోటలు, గింజరాల్చితే బంగారాన్ని పండించే భూములు, కంసాలులు, కమ్మర్లు, కుమ్మర్లు, మేదర్లు, పద్మశాలీలు, గొల్లకాపులు; పశువులు, పక్షులతో తిన్నని వీధులతో, ఊరంతా ఎంతో రాజసంగా ఉండేది.

శ్రీరామనవమి సంబరాలకు కొన్ని కోసుల దూరం నుంచీ వచ్చే కంచర్ల గోపన్న ఈ ఊరి జనంతో ఎంతో బాగా కలిసిపోయి, ఎన్ని మంచిమాటలు చెప్పేవారో. ఊరి మధ్య వృద్ధ జాంబవంతుడిలా నిలబడ్డ చింతచెట్టు ఎన్ని గ్రామ తీర్మానాలకు సాక్ష్యం అయ్యిందో. ‘అటువంటి నాగులవంచకు ఇవ్వాళ చీకటి రోజులొచ్చాయెందుకు?’ అందరి మనసులో మాటని కొంచెం గట్టిగా పైకే అన్నాడు సత్తెయ్య.గుంపులోంచి ముందుకొచ్చిన పెదముత్తయ్య భుజం తడుతూ ‘నేలకొండపల్లి గోపరాజు బాబు మన మొరని వాళ్ల మామలు అక్కన్న, మాదన్నలకు చేరవేస్తానన్నాడు కదా! తానీషా ప్రభువుల సన్నిధిలో.. ఈ డచ్‌ ముష్కరుల ఆటలు సాగకుండా కట్టడి చేస్తానన్నాడు కదా! తన పిలుపు కోసం ఎదురు చూడమన్నాడు. మర్చిపోయావా?’ మంద్రంగా అన్నాడు.

‘ఇదిగో తాతా! గోపరాజు వారు వచ్చినప్పుడు ఆయన గుర్రానికి మార్చిన నాడా ఇది, ఆయన రగిల్చిన ధైర్యానికి చిహ్నంగా వెంటే ఉంచుకున్నాను’ పైకెత్తి అందరికీ చూపించాడు సత్తెయ్య.
‘వీళ్ల అక్రమ పద్ధతులని తానీషా ప్రభువులకు చెప్తూ మాదన్న మంత్రిగారు వెయ్యి మణుగుల డచ్‌ తరలింపు బంగారాన్ని వదలకుండా నిలువరించారట! మరి బుద్ధి తెచ్చుకుని వీళ్లు ఇకనన్నా మనతో మర్యాదగా నడుచుకుంటారేమో ఎదురుచూడాలి’ అన్నాడు తాత!

‘పిచ్చి తాతా! వీళ్లు దోచుకెళ్లే దానిలో వెయ్యి మణుగుల బంగారం గుడ్డికాణీతో సమానం. తానీషాను తమ బహుమతులతోనూ, బులిపించే మాటలతోనూ కట్టడి చేసుకున్నారు. మాదన్న మంత్రే లంచం అడుగుతున్నాడని ఎదురు ఫిర్యాదు చేశారట. అక్కన్న, మాదన్నలకే ఆస్థానంలో పనిలేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. వాళ్లు మారాలని ఎందుకనుకుంటారు చెప్పు?’ నిర్లిప్తంగా అన్నాడు కండలు తిరిగిన చేతిని అక్కడి గోడపై బలంగా మోదుతూ సత్తెయ్య. ‘మనం దేవుణ్ని, గోపరాజునీ నమ్ముకున్నాం. ఆ దేవుడే వీళ్ల మనసులు మార్చి అప్పటి ఫేబరు దొర, వాండర్ఫూర్టు దొరల్లాగా మనలో కలిసిపోయి మంచిగా ఉండే గుణం ఇవ్వకపోడు’ పెద్ద ముసల్ది వేదాంత ధోరణిలో చెప్పింది.
‘మన ఊళ్ళో మనం స్వేచ్ఛగా ఉండటానికి ఇంకెవరి దయా దాక్షిణ్యాలో కావాలా? ఏం మాట్లాడుతున్నారు?’ విసుక్కున్నాడు సత్తెయ్య.‘అంతకన్నా ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. మనం తవ్వితీసిన సూరేకారం, మనం తెచ్చిపెట్టే గంధకం, బొగ్గుపొడితోనే వాళ్లు తూటాలు పేల్చుతారు. వాటికి ఏం బదులివ్వగలం?’ తల కొట్టుకుంటూ అన్నాడు ముసలయ్య. ‘వాళ్ల నీడలు మన చూరుకైనా తాకని రోజు రావాలని కోరుకుందాం’ నీరసంగా లేచారు అందరూ. సత్తెయ్యకు పడుకున్నా నిద్రరావడం లేదు.

ఇక్కడి నాగులవంచ లాగానే తన జాగీరు శంకరగిరి హుస్నాబాదులో గోదారికి అవతల భద్రగిరిపై ఉత్సవాలు చెయ్యాలని, పన్నుల డబ్బుతో గుడి కట్టించి, ఆ నేరానికి గోలుకొండ బందిఖానాలో శిక్ష అనుభవిస్తున్నాడు గోపన్న. ఆయనేమో తన మామలతో కలిసి బయటికొచ్చే మంత్రాంగం చేస్తున్నట్లున్నాడు. ఖైదు నుంచి తిరిగొస్తే ఆయనను నాగులవంచలోనే ఉండమనాలి. ఆయన ఆధ్వర్యంలోనే వీళ్లని ఎదిరించడం ఎలాగో చెప్పమనాలి. సత్తెయ్య మనసులో ఇవే ఆలోచనలు.
ఆరోజు ఉదయం.. అతడి ఆశలపై చన్నీళ్లు పోస్తూ గోలుకొండ కోట నుంచి దుర్వార్త మెల్లగా ఆ ఊరికి చేరింది. దుర్మార్గుడు అబ్దుల్లాఖాన్‌ పాహ్నీ అర్ధరాత్రి మూడుగంటల వేళ ఫత్తేదర్వాజా ద్వారాలను శత్రువుల కోసం తెరిచాడట. మొఘలాయి సేనాని పదిమంది సైనికులతో లోనికి వచ్చి ముఖ్యమైన భద్రతలను ఛిద్రం చేసి నెలల పాటు పట్టలేక పోయిన గోలుకొండ కోటను పాదాక్రాంతం చేసుకున్నాడట. అక్కన్న, మాదన్నలను చంపి కోటవీధులలో ఈడ్చుకుపోయారని, ఆ సంగతి బొమ్మలుగా గీయించి యూరప్‌ కెళ్లే ఓడలో సరుకులతోపాటు పంపాలని డచ్‌ వాళ్లు వెకిలిగా నవ్వుతూ చెప్పుకుంటున్నారు.

వందల ఏండ్ల వయసున్న ఊరి మధ్యలోని చింతచెట్టు కింద నిరాశగా కూలబడ్డాడు సత్తెయ్య. చేతిలో గుర్రపునాడాని తడారిపోయిన కళ్లతో నిరాశగా చూస్తున్నాడు. కోటలోకి వచ్చిన ముష్కరులు బందిఖానాలోని గోపరాజుని ఏం చేసి ఉంటారు? అలానే వదిలేసారా? బయటికెళ్లిపోయాడా? అనవసరపు అడ్డు ఎందుకని తల నరికారా? అందరు సాధారణ ఖైదీల్లాగానే గోపరాజు కూడా వాళ్లతో కలిసిపోయాడా? లేక తానీషాకన్నా శత్రువులుగా భావించే అక్కన్న, మాదన్నల మేనల్లుడే అని వాసన పట్టి ఉంటారా? అతని కనుకొలకుల్లోంచి నీటిబొట్టు బుగ్గలమీదుగా జారిపోతున్నది.
రెండువారాలు అందరూ నిస్తేజంలోనే గడిపారు. కానీ, వ్యాపార ఒప్పందం చేసుకున్న ప్రభుత్వమే మారిపోతున్నదని, సరుకుల కోసం డచ్‌ వాళ్ల ఒత్తిడి కూడా మరింత పెరుగుతున్నది, హింస పెట్రేగుతున్నది.

ఆ రాత్రి ఊరంతా చింతమాను కింద సమావేశం అయ్యారు.వాళ్ల దాష్టీకాలకి బదులివ్వాలనే పదహారేండ్ల కోరికను ఊరందరిలో ఉరకలెత్తిస్తూ సత్తెయ్య ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు. ‘కంచర్ల గోపన్నకు రామచిలక శాపం ఉందట, పంజరంలో చిలకను పూర్తిగా బయటకు వదిలేయడమే అసలైన స్వేచ్ఛ అంటుండేవారు. ఐరోపా నుంచి వచ్చిన ఈ వలందులు డచ్‌ ఫ్యాక్టరీ అనే పంజరాన్ని మన ఊరి చుట్టూ నిర్మించారు.బయటకి ఎగరటం కాదు, దీన్ని పగల గొట్టడమే స్వేచ్ఛ!
అడ్డొచ్చిన వాళ్ల నడుములు విరగ్గొట్టడమే స్వేచ్ఛ!!వీళ్లు మన ఊరు చుట్టూ బిగించిన పిడికిలిని బతిమిలాడటం కాదు… వేళ్లు తెగగొట్టగలిగితేనే స్వేచ్ఛ. రేపే దానికి ముహూర్తం.’ మొలకాసెలో ఉన్న గుర్రపు నాడాను చింతచెట్టు మొదలుపై మేకుతో కొట్టి బిగించాడు. ‘కత్తి, కొడవలీ, గొడ్డలీ, పలుగూ, రోకలీ ఏదైనా ఆయుధమే. వాటికి మించి మన గుండెధైర్యమే మన ఆయుధం’ అన్నాడు.
మనదేశాన్ని మనమే పాలించుకోవాలనే సంకల్పానికి తొలిబీజం వేస్తూ, ఊరంతా ఆ గుర్రపు నాడాను చేతులతో తాకి ప్రమాణం చేసింది.

మరునాడు… 1687 అక్టోబర్‌ 13.డచ్‌ ఫ్య్యాక్టరీ నేలమట్టం అయ్యింది. తుపాకులూ, కొరడాలూ, కత్తులూ వాళ్ల ఉద్వేగం ముందు పని చేయలేదు. అన్నాళ్లూ వాళ్లను తమ కాళ్ల కింద అదిమిపట్టిన వాళ్లు, ఆనాడు వాళ్ల పద ఘట్టనల కింద నలిగిపోయారు.చరిత్ర ఆ రోజు ఒక ఊరి స్వేచ్ఛను నిశ్శబ్దంగా నమోదు చేసింది. బహుశా భవిష్యత్‌ స్వతంత్ర పోరాటానికి తొలి బీజం కూడా వేసింది. వలందులోరి పట్నం మళ్లా నాగులవంచగా మారింది. కానీ, ఆ గోపన్న గుర్రపునాడా మాత్రం కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయింది.

-కట్టా శ్రీనివాసరావు ,9885133969
Katta.khammam@gmail.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement