e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home బతుకమ్మ వయసును ఓడిద్దాం!

వయసును ఓడిద్దాం!

అనగనగా యయాతి అనే చంద్రవంశపు రాజు. శుక్రాచార్యుడి కూతురైన దేవయానిని వివాహమాడాడు. దేవయానితోపాటుగా ఆమె చెలికత్తె శర్మిష్ఠతోనూ పిల్లల్ని కన్నాడు. ఇది విన్న శుక్రాచార్యుడు మండిపడ్డాడు. అసలే రాక్షస గురువు. ఆపై తన కుమార్తె పరువు. దాంతో ముసలివాడివైపొమ్మంటూ యయాతిని శపించాడు. ఎంతైనా అల్లుడు కదా! కాసేపు ప్రాధేయపడేసరికి కరిగిపోయాడు శుక్రాచార్యుడు. ‘నీ సంతానంలో ఎవరైనా, నీ వార్ధక్యాన్ని స్వీకరిస్తే.. నీ యవ్వనం నీకు తిరిగి వస్తుంది’ అంటూ పరిష్కార మార్గాన్ని సూచించాడు. కానీ, ఎంత తండ్రికోసమైతే మాత్రం యవ్వనాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఒక్కరు కూడా ముందుకు రాలేదు. చివరికి చిన్నకొడుకు పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి బదలాయించేందుకు సిద్ధపడ్డాడు. ఆ త్యాగానికి మురిసిపోయిన యయాతి, పూరుడికి తన సింహాసనాన్ని అందించాడు. ఈ పూరుడి వారసులే కౌరవ, పాండవులు.

ప్రతి మనిషిలోనూ ఓ యయాతి ఉంటాడు. మలి వయసులో తన ఒంటికి సత్తువ అందించే యవ్వనం కోసం పరితపిస్తాడు. దాన్ని సాధించేందుకు, తన సర్వస్వాన్నీ ధారపోయడానికైనా సిద్ధంగా ఉంటాడు. కానీ, అది సాధ్యం కాకపోవచ్చు. అయితే, అప్రమత్తంగా ఉంటే, వయసు ఓ సంఖ్య మాత్రమే అనీ.. ఆరోగ్యంగా ఉంటే, వార్ధక్యం ఓ అందమైన మజిలీ అనీ చెబుతున్నారు శాస్త్రవేత్తలు.లోకంలో ప్రతి జీవికీ ఓ కాలపరిమితి ఉంటుంది. దాన్ని క్రమంగా పూర్తిచేయడమే సృష్టి ధర్మం. మనిషిలో ఎదుగుదల ఓ స్థాయికి చేరుకున్నాక, శరీర ధర్మాలన్నీ అపసవ్యంగా అడుగులేస్తాయి. దీంతో జన్యువుల పనితీరు మందగిస్తుంది. ప్రొటీన్‌ ఉత్పత్తిలో లోపాలు మొదలవుతాయి (ప్రొటీయోస్టాసిస్‌). ఎదుగుదలకు సాయపడే హార్మోన్లు తగ్గిపోతాయి. వీటిని ఎవరూ ఆపలేరు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వయసు మీదపడుతున్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. క్రమశిక్షణతో, అప్రమత్తతతో.. ఎవరైనా సరే, నిండు నూరేండ్లూ ఆరోగ్యంగా ఉండవచ్చు.

- Advertisement -

‘తోకలు’ పెరగాలి
మన కణాలను శాసించే డీఎన్‌ఏ చివర, ‘టెలోమెర్‌’ అనే తోకలుంటాయి. శక్తిమంతమైన మైక్రోస్కోప్‌లో నుంచి చూస్తే.. షూలేసుల చివర ఉండే ప్లాస్టిక్‌ తొడుగుల్లా కనిపిస్తాయివి. మనుషుల్లో కణ విభజనను నియంత్రించేదీ ఇవే. వయసు మీద పడుతున్నకొద్దీ వీటి పొడవు తగ్గిపోతూ ఉంటుంది. అంటే, కణాలను విభజించే సామర్థ్యం క్రమంగా క్షీణిస్తూ వస్తుందన్నమాట. వృద్ధాప్యానికి ఇదే ముఖ్య కారణం. కణాల విభజన తగ్గుతున్న కొద్దీ, ప్రతి అవయవం బలహీనపడిపోతుంది. ఎముకలు సన్నబడుతూ, నడుము వంగిపోతుంది. చూపు మందగిస్తుంది. ఊపిరితిత్తులు నిదానిస్తాయి. చర్మం ముడతలు పడుతుంది. రోగ నిరోధక శక్తీ తగ్గిపోతుంది. ఫలితంగా, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడే ఆస్కారం ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ టెలోమెర్‌ తగ్గిపోవడం సహజమే. కానీ, ఆరోగ్యం పట్ల మన అశ్రద్ధ టెలోమెర్‌కు ఇంకా చేటు చేస్తుంది. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులతోనూ దీని పనితీరు మందగిస్తుంది. అంతేకాదు..

విపరీతమైన ఊబకాయం వల్ల ఎనిమిదేండ్ల జీవితానికి సరిపడా టెలోమెర్‌ తగ్గిపోతుందని వెల్లడైంది.
అంతర్జాతీయ పరిశోధకులు రూపొందించిన ఓ నివేదికలో.. మద్యం అలవాటు టెలోమెర్‌ మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని తేలింది.నిత్యం వ్యాయామం చేసేవారిలో టెలోమెర్‌ నిక్షేపంగా ఉన్నట్టు ఓ పరిశోధన నిరూపించింది. తరచూ పరుగులు తీసే యాభై ఏండ్ల వయసు వారిలో 20 ఏండ్ల యువకులతో సమానమైన టెలోమెర్‌ ఉంటుందని పరిశోధకులు తేల్చారు. అదే సమయంలో అపసవ్య జీవనశైలిని అనుసరించేవారిలో టెలోమెర్‌ త్వరగా కుంచించుకుపోవడాన్నీ గమనించారు.
మానసిక ఒత్తిడి కూడా టెలోమెర్‌ను తగ్గిస్తుందట. ఈ ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలంటే ‘ధ్యానం మంచి సోపానం’.అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎపిడమాలజీలో ప్రచురితమైన ఓ వ్యాసం ప్రకారం.. కూరలు,పండ్లు, పాలపదార్థాలు లాంటివి తీసుకుంటూ ఉప్పు, చక్కెర, ప్రాసెస్డ్‌ పదార్థాలను తక్కువగా తినేవారిలో టెలోమెర్‌ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి, టెలోమెర్‌ను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు.

ఆ నలుగురితో జాగ్రత్త
‘డెడ్లీ క్వార్టెట్‌’.. ఈ పేరును గుర్తుంచుకోవాల్సిన సమయం వచ్చేసింది. జీవక్రియల్లో అసమతుల్యత వల్ల ఏర్పడే నాలుగు ప్రాణాంతక సమస్యలను సూచించే పేరిది. పొట్ట దగ్గర కొవ్వు, అధిక రక్తపోటు, ఇన్సులిన్‌ను గ్రహించలేని కణాలు (మధుమేహానికి మూలం), రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ పెరిగిపోవడం.. ఈ నాలుగింటినీ కలిపి ‘డెడ్లీ క్వార్టెట్‌’ అంటారు. ఈ సమస్యలు శరీరంలోని ఇతర అవయవాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనీ.. గుండెపోటు, పక్షవాతం లాంటి ప్రమాదాలకు దారితీస్తాయనీ మనకు తెలుసు. ఇతరులతో పోలిస్తే.. ఈ నాలుగు లక్షణాలూ ఉన్నవారు వార్ధక్యానికి, మృత్యువుకు త్వరగా చేరువవుతారని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ‘జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ’లో ప్రచురించిన ఓ వ్యాసం ప్రకారం ‘డెడ్లీ క్వార్టెట్‌’ ఉన్నవారిలో.. మగవారైతే దాదాపు మూడు శాతం, మహిళలైతే ఏకంగా 13 శాతం త్వరగా మృత్యువాత పడే ప్రమాదం ఉంది.
ఒకప్పుడు ముప్పై ఏండ్లు పైబడినవారిలో ‘డెడ్లీ క్వార్టెట్‌’ లక్షణాలు కనిపించేవి. కానీ, మారుతున్న జీవనశైలితో చిన్నపిల్లల్లోనూ ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి.

డాక్టర్‌ నార్మన్‌ కల్పన్‌ అనే శాస్త్రవేత్త ప్రకారం పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడమే మిగతా మూడు లక్షణాలకూ దారితీస్తుంది. ఆదిలోనే ఈ సమస్యలను అదుపు చేయడానికి వ్యాయామం తప్పనిసరి. ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, చేపలు.. లాంటి బలవర్ధకమైన పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్యవేత్తలూ చెబుతుంటారు. చాలామంది ఈ సూత్రాన్ని పాటిస్తూ, ఒక్కసారిగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత మళ్లీ పాత అలవాట్లకు మారిపోతుంటారు. కానీ, ఒక్కసారిగా ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని పరిశోధకులు తేల్చారు. ఇలా మార్చుకునే ముందు, తరచూ ఉపవాసం పాటించాలని చెబుతున్నారు. దానివల్ల జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. కొత్త తరహా ఆహారాన్ని స్వీకరించేందుకు, అందులోని పోషకాలను శోషించుకునేందుకు సిద్ధపడుతుంది. దాంతో, కొత్త ఆహారపు విధానం కచ్చితమైన ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు ఉన్న 71 మంది అలవాట్లను పరిశీలించిన తర్వాత తేల్చిన విషయమిది. అప్పుడప్పుడూ ఉపవాసం చేయడం వల్ల, శరీరానికి నిజంగానే మేలు జరుగుతుందని అనేకానేక పరిశోధనలు నిరూపించాయి. ఉపవాసం వల్ల జీర్ణాశయంతో పాటు కాలేయం, మెదడు, కండరాలు మీద కూడా సానుకూల ప్రభావం పడుతున్నట్టు తేలింది. కాకపోతే ఉపవాస సమయంలో ఒంటికి తగినన్ని పోషకాలు, లవణాలు అందేలా చూసుకోవాల్సిందే. లేకపోతే, నిస్సత్తువతో కుప్పకూలే ప్రమాదం ఉంది.

రాడికల్స్‌ కరగాలి!
శరీరంలో ‘ఫ్రీ రాడికల్స్‌’ ఎక్కువగా పేరుకుపోవడం కూడా వార్ధక్యానికి దారి తీస్తుంది. వీటిలో ఒక విద్యుత్కణం (ఎలక్ట్రాన్‌) తక్కువగా ఉంటుంది. దాంతో అవి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ, శరీర అవయవాలను ప్రభావితం చేస్తుంటాయి. అందుకే వాటికి ‘ఫ్రీ రాడికల్స్‌’ అని పేరు! ఇవి ఎంత త్వరగా, ఎంత ఎక్కువగా మనల్ని వశపరుచుకుంటే అంత త్వరగా వృద్ధాప్యం పలుకరిస్తుంది. కాలంతోపాటు మనుషుల జీవనశైలి కూడా శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ పేరుకుపోవడానికి ఒక కారణం. కాలుష్యం, సిగరెట్లు, అతినీల లోహిత కిరణాలు, క్రిమిసంహారకాలు, ఒత్తిడి.. లాంటివన్నీ ఫ్రీరాడికల్స్‌ను సృష్టిస్తాయి. వీటిని నియంత్రించగల సత్తా ‘యాంటీ ఆక్సిడెంట్స్‌’కు ఉంటుంది. ఇవి ఫ్రీరాడికల్స్‌ తీరును మార్చి, వాటి దుష్ఫలితాలను తగ్గిస్తాయి. అందుకనే వయసును తగ్గించుకోవాలంటే ‘యాంటీ ఆక్సిడెంట్స్‌’ తీసుకోవాలనేది నిపుణుల మాట. విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పదార్థాలు, క్యాబేజీ లాంటి కూరలు, ఆకుకూరలు, బొప్పాయి లాంటి పండ్లు, తులసి లాంటి ఔషధ మొక్కలు.. గమనించాలే కానీ యాంటీ ఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా ఉండే పదార్థాలు మన చుట్టూ అనేకం!శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ మధ్య సమతౌల్యం తగ్గిపోవడాన్ని ‘ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌’ అంటారు. ముప్పై ఏండ్లకే వయసు మీద పడినట్టుగా మారిపోవడానికి కారణమిదే! తరచూ నిస్సత్తువ ఆవహించడం, కండరాల నొప్పులు, ఏకాగ్రత లేకపోవడం, తెల్ల జుట్టు, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడటం.. లాంటి లక్షణాలన్నీ ఈ ప్రమాదానికి సంకేతాలే. వీటికి విరుగుడుగా యాంటీ ఆక్సిడెంట్‌ పదార్థాలు తీసుకోవడంతోపాటు వ్యాయామం, ధ్యానం, స్నేహితులతో కాలక్షేపం, ప్రకృతి మధ్య గడపడం, నవ్వించే కార్యక్రమాలు చూడటం.. ‘ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌’ను తగ్గించుకొనే మార్గాలు.

మెదడులో ఏం జరుగుతుంది?
వయసు మీదపడే కొద్దీ మెదడు కుంచించుకుపోతుంది. న్యూరాన్ల సత్తా తగ్గిపోయి, సమాచార వేగం మందగిస్తుంది. దీంతో పాత విషయాలను, పేర్లను, ముఖాలను గుర్తుచేసుకోవడం కష్టంగా మారుతుంది. వీటికి తోడు జన్యుపరంగా తలెత్తే అల్జీమర్స్‌, డిమెన్షియా లాంటి సమస్యలు పరిస్థితిని జటిలం చేస్తాయి. అలాగని వృద్ధాప్యంతో అంతా నష్టమే జరుగుతుందని కాదు. వయసు పెరిగేకొద్దీ మెదడులోని వేర్వేరు భాగాల మధ్య వారధిగా ఉండే ‘డెండ్రైటిస్‌’ బలపడుతుంది. దానివల్ల ఏదైనా విషయాన్ని సమగ్రంగా ఆకళింపు చేసుకునే నైపుణ్యం అలవడుతుంది. సమస్య వచ్చినప్పుడు పెద్దవాళ్లు, నిదానంగా అవగాహన చేసుకుని.. పరిణతితో పరిష్కరించడానికి కారణం ఇదే! మలి వయసులోనూ మెదడు చురుగ్గా పనిచేయడానికి కొన్ని ఉపాయాలు లేకపోలేదు. క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రేచెల్‌ వూ’ అనే శాస్త్రవేత్త, వయసు పెరిగే కొద్దీ మనం నేర్చుకునే తీరు కూడా మారాలని చెబుతున్నారు. చిన్నప్పుడు, నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. దీన్ని ‘బ్రాడ్‌ లెర్నింగ్‌’ అంటారు రేచెల్‌. కానీ, పెద్దయ్యాక వ్యవహారం ఇలా ఉండదు. కొత్త విషయాన్ని అంగీకరించడానికి స్థిరమైన అభిప్రాయాలు, అహంకారం లాంటివి అడ్డుపడుతూ ఉంటాయి. దీన్ని ‘స్పెషలైజ్డ్‌ లెర్నింగ్‌’గా పేర్కొంటారు రేచెల్‌.

ఈ విధానాన్ని పక్కకు పెట్టి, చిన్నప్పటిలాగానే ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలనేది రేచెల్‌ సూచన. అప్పుడే, మెదడు మరింత చురుగ్గా ఉంటుందనీ, జ్ఞానం మరింత వృద్ధి చెందుతుందనీ చెబుతున్నారు.బీన్స్‌, గుడ్లు, టమాట లాంటి పదార్థాల్లో ఉండే ల్యూటెన్‌ కండ్లకు మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. కండ్లను పరీక్షిస్తే చాలు, శరీరంలో ల్యూటెన్‌ స్థాయిని తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిలో.. ల్యూటెన్‌ ఎక్కువగా ఉన్న వ్యక్తుల మెదడు చాలా చురుగ్గా పనిచేయడాన్ని కూడా గుర్తించారు. ల్యూటెన్‌ సమృద్ధిగా ఉన్న పెద్దల మెదడు, యువతతో సమానంగా పనిచేయడాన్నీ గమనించారు.

ఇవీ ముఖ్యమే..
కాలాన్ని ఎవరూ ఆపలేరు. కానీ, శరీరం మీద దాని ప్రభావాన్ని మాత్రం తప్పకుండా నెమ్మదించవచ్చు. అందుకోసం వైద్యులు అందించే కొన్ని ముఖ్య సలహాలు ..
‘మనం అంటే మన ఆహారమే’ అంటున్నది ఆరోగ్యశాస్త్రం. ఆహారాన్ని జిహ్వా చాపల్యాన్ని తీర్చే సాధనంగా కాకుండా, శరీరాన్ని నడిపించే ఇంధనంగా భావించినప్పుడు.. దానికి మేలు చేసే పదార్థాలనే స్వీకరిస్తాం.తల కూడా కదపాల్సిన అవసరం లేనంతగా మనం ఏదో ఒక తెరకు అతుక్కుపోతున్నాం. పిల్లలు వీడియోగేమ్స్‌ లేదా టీవీలకు, పెద్దలు కంప్యూటర్‌ లేదా మొబైల్‌కు అంకితం అవుతున్నారు. ఈ కాలు కదపని జీవన విధానాన్ని (సెడెంటరీ లైఫ్‌ స్టయిల్‌) మార్చి తీరాల్సిందే! ఇందుకోసం స్క్రీన్‌ టైమ్‌ తగ్గించుకుంటూ, గ్రీన్‌ టైమ్‌.. అంటే ప్రకృతి మధ్య గడిపే సమయాన్ని పెంచుకోమని సూచిస్తున్నారు.శరీరంలో మూడొంతులు మంచినీరే. మెదడు, ఊపిరితిత్తుల్లాంటి అవయవాల ఆరోగ్యానికి మంచినీరే కీలకం. తరచూ నీరు తాగాలి. నీరు ఎక్కువగా ఉండే పండ్లూ, కూరలను తీసుకోవాలి. శరీర శ్రమ, నివసించే ప్రాంతంలో తేమ శాతం, వయసు, చెమట పట్టే శరీరతత్వం లాంటి పరిస్థితులను బట్టి ఎవరు ఎంత నీరు తాగాలో నిర్ణయించుకోవాలి.
హిరణ్య కశిపుడు తనకు చావు రాకుండా ఉండటానికి 21 వరాలు అడుగుతాడు.

మనకు అలాంటి వరాలేవీ లేవు కాబట్టి, చుట్టూ ఉన్న విష రసాయనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కానీ, బయట కానీ, ఆహారంలో కానీ ఆహార్యంలో కానీ, ట్రాఫిక్‌ ద్వారా కానీ, దుమ్ము ద్వారా కానీ.. ఇలా రోజువారీ జీవితంలోకి చొచ్చుకొచ్చే విషాలను వీలైనంత దూరంగా ఉంచాలి. కష్టంగా తోస్తుందేమో కానీ, వీటిలోని ప్రతి సమస్యకూ అనువైన పరిష్కారాలు ఉన్నాయి.పైకి దృఢంగా కనిపించినంత మాత్రాన లోపల అంతా సవ్యంగా ఉన్నట్టుకాదు. సన్నగా ఉండేవారిలో కూడా కొలెస్ట్రాల్‌, మధుమేహం లాంటి సమస్యలు ఉండవచ్చు. అందుకని ఎప్పటికప్పుడు, వైద్య పరీక్షల ద్వారా లోపలి పరిస్థితి ఎలా ఉందో గమనించుకోవాలి. ఉదాహరణకు ఒక్క ఫ్యాటీ లివర్‌ను అశ్రద్ధ చేసినా, అది జన్యువులను ప్రభావితం చేస్తూ వార్ధక్యం వైపు త్వరగా అడుగులు వేయిస్తుందని అంటున్నారు వైద్యులు.వయసు పెరిగే కొద్దీ చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. చర్మం మీద ఉండే నూనె గ్రంథుల పనితీరు మందగిస్తుంది. దీంతో ముడతలు కనిపిస్తాయి. ‘కెరాటినోసైట్స్‌’ అనే కణాల సామర్థ్యం కూడా సన్నగిల్లుతుంది. పెద్దవారిలో గాయాలు త్వరగా మానకపోవడానికి కారణం ఇదే! పోషకాహారమే ఇందుకు విరుగుడు.

మనసు గతి మారకుండా!
వృద్ధాప్యంలో శారీరక ఆరోగ్యం, మెదడు పనితీరు ఎంత ముఖ్యమో.. మానసిక ప్రశాంతతా అంతే ప్రధానం. కానీ, అదేమంత తేలికైన పనికాదు. శరీరంలో వస్తున్న మార్పులు, పీడిస్తున్న వ్యాధులు.. చికాకు పెడుతుంటాయి. వయసుతోపాటు వచ్చే కుంగుబాట్లూ వేధిస్తాయి. రిటైర్‌మెంట్‌ వల్ల ఏమీ తోచకపోవడం, తమతో సమయం గడిపే తీరిక ఎవరికీ లేకపోవడం, జీవిత భాగస్వామి మరణం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కష్టాలు.. ఇలాంటి సమస్యలెన్నో అశాంతికి గురిచేస్తాయి. వీటికీ పరిష్కారాలను సూచిస్తున్నారు పరిశోధకులు. నిద్రకు తగినంత ప్రాధాన్యమివ్వడం, స్వచ్ఛంద సేవ కోసం సమయాన్ని కేటాయించడం లాంటి ఉపాయాలు సరేసరి. సామాజిక బంధాలను మెరుగుపరుచుకోవాలని, మరీ ముఖ్యంగా స్నేహితులతో కాలాన్ని గడపాలనీ సలహా ఇస్తున్నారు మిషిగాన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వృద్ధాప్యంలో స్నేహితుల వల్ల కలిగే లాభాన్ని విస్మరించలేమని చెబుతున్నారు. ఇందుకోసం ఏడువేల మంది వివరాలను సేకరించారు. స్నేహితులు ఉన్నవారు, ఇతరులకంటే ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నట్టు ఆ అధ్యయనంలో తేలింది. పదవీ విరమణ తర్వాత ఆసరా కోసం ఆస్తులనూ, డబ్బునూ ఎలా కూడబెట్టుకుంటామో.. స్నేహితులను కూడా అంతే జాగ్రత్తగా సంపాదించుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధాప్యంలో మనసులోని బాధలను అందరితోనూ పంచుకోలేం. కానీ, స్నేహితుల దగ్గర ఆ భేషజాలు ఉండవు. పైగా వ్యాపకం లేని జీవితానికి కాలక్షేపంగా, ఒంటరితనంలో తోడుగా, సమస్యలకు పరిష్కారంగా.. స్నేహితుల అండ చల్లని నీడలా మారుతుంది.

కండరాల బలానికి!
యవ్వనంలో దృఢంగా ఉండే చాలామంది, వయసు పైబడే కొద్దీ బక్కగా మారిపోవడాన్ని గమనిస్తుంటాం. నిజానికి ఇది వృద్ధాప్యంతోపాటు వచ్చే ఓ సహజ లక్షణమే! మన కణజాలంలోని ‘మైటోకాండ్రియా’లో తలెత్తే లోపం వల్ల ‘సర్కోపీనియా’ అనే సమస్య తలెత్తుతుంది. దీంతో కండరాలు కరిగిపోతాయి. ఓ అంచనా ప్రకారం 80 ఏండ్లు దాటేసరికి దాదాపు సగం మందిని ఈ పరిస్థితి వెన్నాడుతుంది. ఈ సమస్య వస్తే కనుక.. 30 ఏండ్లు దాటిన దగ్గర నుంచీ ప్రతి దశాబ్దానికి 3 నుంచి 8 శాతం వరకు కండరం కరిగిపోతుంది. ఒకవేళ అనారోగ్యంతో మంచం పడితే, సమస్య మరింత తీవ్రమవుతుంది. మూడు వారాలకే పదిశాతం కండరం కరిగిపోయే ప్రమాదం ఉంది. మనం ఏ పని చేయాలన్నా కండరాలదే ముఖ్యమైన పాత్ర. అవి మరింత బలహీనపడిపోతే నడవటం కూడా కష్టమైపోతుంది. ఈ సమస్య వచ్చినప్పటి నుంచే చిన్నపాటి వ్యాయామాలు చేయడం, మద్యం అలవాటును తగ్గించుకోవడం, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.అంతటి రామాయణాన్నయినా మూడు ముక్కల్లో చెప్పుకోవచ్చు. అలాగే, వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరకుండా ఉండటానికీ, మనల్ని ప్రభావితం చేయకుండా ఉండటానికీ ముఖ్యమైన మూడు ముక్కలు.. వ్యాయామం, మానసిక ప్రశాంతత, పోషకాహారం!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana