e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home బతుకమ్మ వందేండ్ల విజ్ఞాన విప్లవంబహారామియా గ్రంథాలయం

వందేండ్ల విజ్ఞాన విప్లవంబహారామియా గ్రంథాలయం

వందేండ్ల విజ్ఞాన విప్లవంబహారామియా గ్రంథాలయం

‘భూమికోసం.. భుక్తికోసం.. విముక్తికోసం’ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా సాయుధ పోరాటాన్ని సాగించింది. నిజాం నవాబును గద్దె దించిన ఈ మహా సంగ్రామంలో‘బహారామియా గ్రంథాలయం’ కీలకపాత్ర పోషించింది. 1921 ఏప్రిల్‌ 6న ప్రారంభమైన ఈ ‘విజ్ఞాన విప్లవం’..‘వందేండ్ల వేడుక’లోకి అడుగిడుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

అది చివరి నిజాం కాలం. తెలుగుభాషపై ‘ఉర్దూ’ ఆధిపత్యం చలాయిస్తున్న సమయం. తెలుగు వారంతా తమ భాషను రక్షించుకోవాలని ప్రతినబూనారు. అప్పుడే ఆంధ్ర మహాసభ, గ్రంథాలయోద్యమం ప్రజలను అక్షరాస్యత వైపు ప్రేరేపించాయి. అందులోనూ గ్రంథాలయోద్యమం.. ‘కొలనుపాక’పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుత భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలోని కొలనుపాక.. నవాబ్‌ తురాబ్‌ యార్‌జంగ్‌ జాగీరు. ఇతను బహారామియా వంశస్థుడు. యార్‌జంగ్‌ జాగీరు కింద కొలనుపాక, బొందుగుల, చిన్న కందుకూరు, రఘునాథపురం ఉండేవి.

చిన్న ఇంట్లో మొదలు
గంగరాజు కిషన్‌రావు, గంగరాజు రఘునాథరావు, మంగు నరసింహారావు హైదరాబాద్‌లో చదువుకునేవారు. వేసవి సెలవుల్లో కొలనుపాకకు వచ్చినప్పుడు ఇక్కడ పఠనాలయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 6, 1921వ తేదీన 62 పుస్తకాలతో, ఒక చిన్న ఇంట్లో ‘బహారామియా గ్రంథాలయం’ ప్రారంభమైంది. నవాబుతో ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో లైబ్రరీ పేరుకు ముందు బహారామియా అన్న మాట చేస్తారు. ఇందులో చిన్నచిన్న పుస్తకాలతోపాటు పలు పత్రికలు, కరపత్రాలు అందుబాటులో ఉంచేవారు. ఆ ముగ్గురితోపాటు మంగు శేషగిరిరావుకూడా గ్రంథాలయ అభ్యున్నతికి కృషిచేశారు. కొద్దికాలం తర్వాత గ్రంథాలయాన్ని మాటూరి రామస్వామి మడిగలోకి మార్చారు. గోల్కొండ, ప్రజామిత్ర పత్రికలలో వచ్చే వ్యాసాలపై చర్చలు జరిగేవి.

స్వచ్ఛంద స్పందన
ఆంధ్ర మహాసభ, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర భాషా నిలయాల ప్రభావంతో బహారామియా గ్రంథాలయాన్ని ‘బహారామియా ఆంధ్రభాషా నిలయం’గా పిలిచేవారు. గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించాలని గ్రామానికి చెందిన ఆరుట్ల సోదరులతోపాటు బెల్లంకొండ లింగయ్య నిర్ణయించారు. అదే సమయంలో ఆరుట్ల కమలాదేవి మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసుకొని కొలనుపాక వచ్చారు. నూతనంగా నిర్మించబోయే భవనంలో గ్రంథాలయంతోపాటు బాలికల పాఠశాలనూ ఏర్పాటు చేయాలని ఆమె భావించారు. వెంటనే ‘గ్రంథాలయ భవనం కోసం సహాయ సహకారాలు అందించాలి’ అని గ్రామాల్లో చాటింపు వేయించారు. దీనికి ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. ఉదారంగా విరాళాలు అందించారు. ఇసుక, ఇటుకలు, మట్టి, దూలాలు, పెంకులు సమకూర్చారు. కానీ, గ్రంథాలయాలకు నిజాం ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది.

దీంతో ‘రామానుజ కూటం‘ పేరుతో అనుమతి తీసుకొన్నారు. 85 రోజుల్లోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక్కడే 15 జూన్‌ 1941 తేదీన బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఇందులో 60మంది బాలికలు చదువుకొనేవారు. ఆ సమయంలోనే ఈ గ్రంథాలయానికి వెళ్లడం నేరమనీ, ఒకవేళ వెళ్తే తగిన శిక్ష ఉంటుందనీ నిజాం సర్కారు ఆజ్ఞలు జారీ చేశారు. గ్రంథాలయంలోని వస్తువులు, పుస్తకాలను ఒక గదిలో ఉంచి, తాళం వేశారు. పోలీసును కాపలా ఉంచారు. అయితే, ‘బహారామియా గ్రంథాలయం’ పునఃప్రారంభం పై కొంత అస్పష్టత ఉంది. 1945 మేలో తెరుచుకున్నదని కొందరు, హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో కలిసిన తర్వాత తెరుచుకున్నదని ఇంకొందరు చెబుతున్నారు.

-డా. రవి కుమార్‌ చేగొని

Advertisement
వందేండ్ల విజ్ఞాన విప్లవంబహారామియా గ్రంథాలయం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement