e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home బతుకమ్మ రుచుల్లో.. వన్‌కాయ్‌!

రుచుల్లో.. వన్‌కాయ్‌!

వంకాయ వంటి కూర లేదు. అందులోనూ, కారం కూరిన వంకాయకు సాటి లేదు. హా..హా..అంటూనే అరడజను కాయలు ఆరగిస్తాం! మంచినీళ్ల మద్దతుతో ఇంకో రెండు లాగిస్తాం. అయినా, తనివితీరదు. ఏ మిఠాయి ముక్కో నంజుకుని, రెండో రౌండు మొదలు పెడతాం. అసలే వంకాయ,ఆపైన మిరపకాయ దోస్తానా! మమకారం, కారం.. కలిసి డ్యూయెట్టు వేసుకున్నట్టే ఉంటుంది.

ఉత్తరాది వంటకాల్లో ఎక్కువగా కనపడకపోయినా దక్షిణాదిన మాత్రం ఏ శుభకార్యం జరిగినా విస్తరిలో కచ్చితంగా ఉండాల్సిందే. ఆ రోజుల్లో, ఎదురుకోళ్లనాడు వంకాయ కూర వండలేదని మామమీద అలిగే అల్లుళ్ల సంఖ్య తక్కువేం కాదు.

- Advertisement -

పోషకాల్లోనూ వంకాయ ‘వన్‌’ కాయే! దీనిలో సమృద్ధిగా ఉండే ఫైబర్‌, పిండిపదార్థాలు మధుమేహ బాధితుల్లో గ్లూకోజ్‌ను నియంత్రిస్తాయి. వంకాయలోని ఫోలేట్‌, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌- బి3, బి6, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్‌ వంటి పోషకాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వంకాయలో సహజంగానే కొవ్వుశాతం తక్కువ.

గుత్తొంకాయ కూర..పేరు వింటే నోట్లో నీళ్లూరాల్సిందే. మసాలా వంకాయ, వంకాయ కొబ్బరి కారం, వంకాయ కొత్తిమీర కారం, వంకాయ మెంతి కారం.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్టయిల్లో చేస్తారు. ఈ వంటకంతో బాల్య జ్ఞాపకాలూ ముడిపడి ఉంటాయి.

ప్రతి ఇంటికీ కారం వంకాయ ఓ సిగ్నేచర్‌ డిష్‌. ఆ దినుసుల రహస్యాలు గడపదాటితే ఖబడ్దార్‌. అత్తగారు కొత్త కోడలికి మాత్రమే చెబుతారు. ఆ కోడలు తన కోడలి చెవిలో గుసగుసగా బోధిస్తుంది. అందులో అంతర్లీనంగా మొగుడిని కట్టేసుకునే చిట్కా దాగి ఉంటుంది. రకరకాల ద్రవ్యాలు చేర్చి వండే మసాలా వంకాయ.. అన్నం, చపాతీ, పూరీ దేనికైనా సరిజోడు.

మార్కెట్లో దొరికే అన్నిరకాల వంకాయలతోనూ వండుకోవచ్చు. కానీ గుండ్రటి నల్ల వంకాయలైతే కారం కూర మరింత రుచిగా ఉంటుంది. వంకాయలో కూరే మసాలాలో కొబ్బరి, కొత్తిమీర, ఉల్లి, వెల్లుల్లి, మెంతి, కరివేపాకు, ధనియాలు, పల్లీ.. ఇలా నచ్చిన దినుసులు ఎంచుకోవచ్చు.

వంకాయలు నూనెలో ఏ మేరకు మగ్గాయి, మసాలాలో ఉప్పూ కారం కొలతలు ఏమాత్రం కుదిరాయి.. అన్నదానిపైనే కూర రుచి ఆధారపడి ఉంటుంది. వేపుడుగానూ, కూరగానూ రసం, సాంబారుతో కలిపి తినేయవచ్చు. కొంతమంది వంకాయకారం, ముద్దపప్పు కాంబినేషన్‌ ఇష్టపడతారు. నూనెతోకంటే వెన్నతో చేస్తే మరింత రుచిగా ఉంటుంది. కొందరు, పైనుంచి నెయ్యి కూడా కుమ్మరిస్తారు. ఎలా వండినా.. వంకాయ వంకాయే!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement