e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home బతుకమ్మ యోధుడా..నీకు తోడుగా!

యోధుడా..నీకు తోడుగా!

వాళ్లంతా ఒంటి చేత్తో వందమందిని మట్టుపెట్టిన వీరులు. కాకులు దూరని కారడవిలో ఏండ్ల తరబడి పోరాడిన ధీరులు.తుపాకి గుండు గుండెల్లోకి దూసుకుపోయినా వెన్నుచూపని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) జవాన్లు.అలుపెరగని ఈ పోరులో కాళ్లు తెగిపడిన వాళ్లు కొందరు. చేతులు ఊడిపడిన వాళ్లు ఇంకొందరు. ఆ వైకల్యాన్ని సైతం దేశసేవలో దక్కిన పతకంగా స్వీకరించారు. ఆ అసమాన ధైర్యానికి కొత్త దారి చూపుతున్నది నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ దివ్యాంగ్‌ ఎంపవర్‌మెంట్‌ (ఎన్‌సీడీఈ). కార్యక్షేత్రంలో రొమ్మువిరిచి నిలిచిన జవాన్ల జీవితాల్లో కొత్త ఉషస్సులు పూయిస్తున్నది. క్రీడల్లో, సాంకేతిక రంగంలో వారియర్స్‌గా తీర్చిదిద్దుతున్నది.

హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట్‌. సీఆర్‌పీఎఫ్‌ కేంద్ర ఆవరణలో భాగమైన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ దివ్యాంగ్‌ ఎంపవర్‌మెంట్‌ (ఎన్‌సీడీఈ). ఇక్కడ అందరూ సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) జవాన్లే ఉంటారు. ఒకరికి ఒక కాలే కనిపిస్తుంది. ఇంకొకరికి ఒక చెయ్యే ఉంటుంది. కొందరికి రెండు కాళ్లూ ఉండవు. ఈ వైకల్యం విధి వక్రీకరించి వచ్చింది కాదు. విధులు నిర్వర్తించే క్రమంలో తగిలిన గాయాలు మిగిల్చిన గుర్తులవి. కానీ, ఆ పూట తూట్లు పొడిచిన తూటాకు తెలియదు… కీలు వరకూ కాలు పోయినా ఈ సైనికుడు జెండా కర్రలా నిటారుగా నిలబడతాడని. ఒళ్లంతా ఛిద్రం చేసిన మందుపాతర ఊహించకపోయి ఉండవచ్చు.. నడుం కింది శరీరమంతా ఊడిపడినా, ఆ వీరుడి పట్టులో పస తగ్గదని!

- Advertisement -

వాటిని పేల్చిన వాళ్లు అప్పుడు అనుకొని ఉండవచ్చు.. వీళ్ల ఖేల్‌ ఖతం అని! కానీ, ఇప్పుడు వీళ్లందరూ ఖేల్‌ రత్నలే! గుండెల నిండా ఆత్మైస్థెర్యం, కండల నిండా కొండలను పిండి చేసే బలం.. ఇప్పటికీ వారి సొంతం. దేశసేవలో, శాంతిభద్రతల రక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయక ముందుండి పోరాడిన ఈ వీరుల జీవితాలకు కొత్త దిశ చూపుతున్నది నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ దివ్యాంగ్‌ ఎంపవర్‌మెంట్‌ (ఎన్‌సీడీఈ). కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థ నక్సల్స్‌ దాడుల్లో అవయవాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. 2020 డిసెంబర్‌లో దీన్ని ప్రారంభించారు. సీఆర్‌పీఎఫ్‌ మాజీ డీజీ ఏజీ మహేశ్వరి విజన్‌కు ఈ సెంటర్‌ కార్యక్షేత్రం. అప్పటి హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుత సీఆర్‌పీఎఫ్‌ డీజీపీ కుల్‌దీప్‌ సింగ్‌ ఆధ్వర్యంలో మరిన్ని సదుపాయాలు కల్పించారు. ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా నేతృత్వంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

అంచెలంచెలుగా…
ఎన్‌సీడీఈలో అత్యాధునిక జిమ్‌, ఫిజియోథెరపీ సెంటర్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, ఇ-లైబ్రరీ ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. దివ్యాంగులు వీల్‌చైర్‌పై తిరుగుతూ అన్ని సౌకర్యాలనూ వాడుకునేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో షూటింగ్‌ రేంజ్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌ కోర్టులు, రన్నింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుచేశారు.

తొలుత ఎనిమిది వారాలపాటు బేసిక్స్‌ నేర్పుతారు. విధి నిర్వహణలో కోల్పోయిన వాటి స్థానంలో కృత్రిమ అవయవాలను సమకూర్చుతారు. తర్వాత, కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఆత్మవిశ్వాసం నింపుతారు. ఆసక్తులను గుర్తిస్తారు. ఏ రంగంలో రాణించగలరో గమనిస్తారు. వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఏ ఆటను ఎంచుకోవాలో సూచిస్తారు. ఆ రంగంలో ఎదిగేలా అన్నివిధాలా ప్రోత్సహిస్తారు.

దశ 1
ఇది మూడు నుంచి ఆరు నెలలపాటు ఉంటుంది. ఇందులో వొకేషనల్‌ ట్రైనింగ్‌, బేసిక్‌ కంప్యూటర్‌ కోర్సు, డాటా ఎంట్రీ, రీడింగ్‌-రైటింగ్‌ స్కిల్స్‌, సీసీటీవీ, కంప్యూటర్‌, మొబైల్‌ రిపేర్‌, సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ వంటి నైపుణ్యాలను నేర్పుతారు.

దశ 2
అప్పటికే ఓ అంచనాకు వచ్చి ఉంటారు కాబట్టి, ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తారు. కంప్యూటర్‌ టెక్నాలజీ పట్ల అభిరుచి ఉన్నవాళ్లకు అందులో నిపుణత సాధించేలా శిక్షణ కొనసాగిస్తారు.

దశ 3
గ్రాఫిక్‌ డిజైనింగ్‌, వాహనాలు, ఫోన్‌, టీవీ, ఏసీ రిపేరింగ్‌ నేర్పుతారు. ఆసక్తిని బట్టి, శారీరక స్థితిని బట్టి సైక్లింగ్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, షూటింగ్‌, ఆర్చరీ, షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో, సిట్టింగ్‌ వాలీబాల్‌.. ఇలా పారా స్పోర్ట్స్‌లో శిక్షణ ప్రారంభిస్తారు. పీవీ సింధు, గగన్‌నారంగ్‌ సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో మాట్లాడిస్తారు. ఆ దిగ్గజాల పర్యవేక్షణలో శిక్షణ అందిస్తారు.
-నాగోజు సత్యనారాయణ

కొత్త జీవితాన్నిచ్చింది..
ఎస్‌సీడీఈ నుంచి అంతర్జాతీయ క్రీడాంగణంలో పతకాల మోత మోగించిన యోధుడు అజయ్‌కుమార్‌. నక్సల్స్‌ దాడిలో ఒక కాలు కోల్పోయిన ఈ వీరుడు ఒంటి చేత్తో విజయాలు సాధిస్తున్నాడు. నిస్తేజంలో కూరుకుపోయిన తన జీవితంలో ఎస్‌సీడీఈ కొత్త ఉత్సాహాన్ని నింపిందని అంటాడాయన. అజయ్‌ పుట్టింది బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో. చదువు పూర్తయ్యాక సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యాడు. 2014లో.. విధి నిర్వహణలో భాగంగా ఔరంగాబాద్‌ జిల్లా పరిధిలోని అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అంతలోనే ఘోర విపత్తు. అసలేం జరిగిందో ఆయన మాటల్లోనే..

అది ఏప్రిల్‌ ఏడు.. ఎన్నికల డ్యూటీలో భాగంగా చిక్కటి అడవిలో సెర్చ్‌ ఆపరేషన్‌కు మా బృందం బయల్దేరింది. పచ్చిక పరిచినట్టు ఉండే ఆ నేల కింద, ఏ మూలన మందుపాతర ఉందో ఊహించడం కష్టం! చుట్టూ దట్టమైన చెట్లు, ఎటుచూసినా కమ్ముకున్న చీకట్లు. ఆ చెట్ల వెనుక ఏ ప్రమాదం పొంచి ఉందో అర్థం కాదు. చెవులు చిల్లులు పడేలా కీచురాళ్ల శబ్దం. ప్రత్యర్థి సంజ్ఞలను తలపించేలా పక్షుల కిలకిలలు. ఇన్ని అనుమానాల మధ్య.. కూంబింగ్‌ నిర్వహిస్తున్నాం. ఆకు కదలినా అప్రమత్తం అవుతున్నాం. గాలివాలులో తేడా వచ్చినా, చూపుడు వేలు ట్రిగ్గర్‌కు నొక్కిపెడుతున్నాం.

ఇంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా.. నా ముందు వెళ్తున్న వారిలో ఒకరు ఐఈడీ (ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌) మీద అడుగు వేశారు. అక్కడ మందుపాతర ఉందని గుర్తించేలోపే భారీ పేలుడు. అతనితోపాటు, పక్కనే ఉన్న ఇద్దరు జవాన్ల్లూ అక్కడికక్కడే మృతిచెందారు. నాతోసహా ఏడుమంది తీవ్రంగా గాయపడ్డాం. నా కాలు తెగిపడింది. మరో ఇద్దరికి కూడా కాళ్లు పోయాయి. నొప్పిని తలుచుకొని విలవిల్లాడేందుకు కూడా సమయం లేకపోయింది. పేలుడు జరిగిన వెంటనే దాడికి తెగబడటం నక్సల్స్‌ వ్యూహం. మెరుపు వేగంతో కాల్పులు జరిపి మా ఆయుధాలను తీసుకెళ్తారు. అనుకున్నట్టుగానే వెంటనే తూటాల వర్షం మొదలైంది. వెనక్కి తగ్గితే మా ప్రాణాలు దక్కవు. అంత బాధలోనూ ఎదురు కాల్పులు జరిపాం. కాల్పులు ఎప్పుడు ఆగిపోయాయో తెలియదు. నేను స్పృహ కోల్పోయాను. లేచేసరికి దవాఖానలో ఉన్నా. చూసుకునేసరికి నాకు ఒకే కాలు మిగిలింది. ఆ రోజు నేను వెళ్లకపోయి ఉంటే.. నా స్థానంలో మరో జవాను ఇదే స్థితిలో ఉండేవాడు. ప్రత్యర్థులను కట్టడిచేయగలిగామన్న సంతృప్తి ముందు వైకల్యం చాలా చిన్నగా అనిపించింది.

ఎయిర్‌ఫోర్స్‌లో గానీ, నేవీలో గానీ చేరాలన్నది నా చిన్నప్పటి కల. కానీ, రెండుసార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. స్నేహితుల సలహాతో సీఆర్‌పీఎఫ్‌లోకి వచ్చాను. అంతకుముందు సెర్చ్‌ ఆపరేషన్లలో మందు పాతర్లను సులభంగానే కనిపెట్టాను. కానీ, ఈసారి ఇలా జరిగింది. మొదట్లో, కాలు పోయిందన్న నైరాశ్యం ఉండేది. తర్వాత నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. క్రీడాకారుడిగా రాణించాలనుకున్నా. పారా సైక్లింగ్‌పై దృష్టిపెట్టాను. 2017 మార్చిలో బెహ్రయిన్‌లో జరిగిన ఏషియన్‌ పారా సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. ఇందులో ఆరోస్థానం వచ్చింది. అదే ఏడాది ఆగస్టులో సౌతాఫ్రికా పీటర్‌మారిట్జ్‌ బర్గ్‌లో జరిగిన వరల్డ్‌ పారా సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ పాల్గొన్నాను. ఎన్‌సీడీఈలోకి వచ్చిన తర్వాత పారా షూటింగ్‌, డిస్కస్‌ త్రో, పారా అథ్లెటిక్స్‌.. ఇలా అన్నిటిలోనూ శిక్షణ తీసుకున్నాను. మమ్మల్ని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ శిక్షణ మాలో ఆత్మవిశ్వాసం పెంచుతున్నది. ఇక్కడ కంప్యూటర్‌ కోర్సులు సైతం చేస్తున్నాం. ఆర్థిక ఎదుగుదలకూ ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతున్నది.

యోధులుగా తీర్చిదిద్దుతూ..
నక్సల్స్‌ దాడుల్లో చేతులు, కాళ్లు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి ప్రభుత్వ ఖర్చులతోనే ఎన్‌సీడీఈలో కృత్రిమ అవయవాలు అమర్చుతున్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన ఆ యోధుల ఆసక్తులను తెలుసుకొని, ఆయా రంగాల్లో రాణించేందుకు తగిన శిక్షణ ఇస్తున్నారు. ఒకేషనల్‌ ట్రైనింగ్‌, బేసిక్‌ కంప్యూటర్‌ కోర్స్‌, డాటా ఎంట్రీ, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, సీసీటీవీ టెక్నాలజీ, మొబైల్‌ రిపేర్‌, సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌లో శిక్షణ, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలతోపాటు శారీరక దారుఢ్యాన్ని బట్టి కోరుకున్న ఆటలో శిక్షణ ఇస్తున్నారు. ఆటల్లో ఆరితేరిన వారిని పారా ఒలింపిక్స్‌కు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే, విధుల్లో గాయాలపాలై అవయవాలు కోల్పోయిన 168 మందిని గుర్తించి, వారిని బృందాలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రైఫిల్‌ షూటింగ్‌లో ఆసక్తి ఉన్నవాళ్లకు గురికాడైన గగన్‌ నారంగ్‌ స్వయంగా ట్రైనింగ్‌ ఇవ్వడం విశేషం. ఆర్చరీలో అర్జునుడితో పోటీపడేలా.. జాతీయస్థాయి క్రీడాకారుడు గంగాధర్‌ సానబడుతున్నాడు. టెన్నిస్‌పై ఆసక్తి కనబర్చినవారికి అర్జున పురస్కార గ్రహీత విజయ రాఘవన్‌ గురువుగా మారారు. ఇలా ఆయా క్రీడలలో పట్టున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను సెంటర్‌కు పిలిపించి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. మూడు నెలలపాటు ప్రత్యేక ట్రైనింగ్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తారిక్కడ. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు క్రీడల్లో శిక్షణ ఉంటుంది. మధ్యాహ్నం ఐటీ, కమ్యూనికేషన్స్‌లో ట్రైనింగ్‌, సాయంత్రం మళ్లీ ఆటలు ఉంటాయి. బిట్స్‌పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ అధ్యాపకులు కంప్యూటర్‌, ఇతర అంశాల్లో తర్ఫీదునిస్తున్నారు. ముగిసిపోయిందనుకున్న జీవితాన్ని మేలి మలుపు తిప్పడమే కాదు, మేటి ఆటగాళ్లుగా మారుస్తున్నది ఎన్‌సీడీఈ. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటల్లో మెరిపించి.. ఈ యోధులను మరోసారి దేశసేవలో భాగస్వాములను చేస్తున్నది.

ఎప్పటికీ రాయల్‌గానే
పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన కృష్ణకాంత్‌ రాయల్‌ పారా సైక్లింగ్‌లో దిట్ట. సబర్మతి ఆశ్రమం నుంచి ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వరకు సైక్లింగ్‌ చేసిన రికార్డు ఉంది. తన రెండు కాళ్లలో ఒకటి కృత్రిమంగా అమర్చినది. అయినా, నడక సహజంగానే ఉంటుంది. సైక్లింగ్‌లో మెరుపు వేగంతో రికార్డులు సృష్టిస్తాడు. ఒంటికాలితోనే, భవిష్యత్తు దిశగా కృష్ణకాంత్‌ వేస్తున్న అడుగులు ఎందరికో ఆదర్శం.

‘అది 2017 జూన్‌. ఛత్తీస్‌గఢ్‌లో స్పెషల్‌ ఆపరేషన్‌లో ఉన్నాం. అడవిలో నక్సల్స్‌ కదలికలు ఉన్నట్టు సమాచారం వచ్చింది. మా బెటాలియన్‌తో వెళ్లాం. అడవి మొత్తం జల్లెడ పడుతున్నాం. అకస్మాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. మేం ప్రతి కాల్పులు జరిపాం. కాల్పులు వస్తున్న దిశగా ముందుకు వెళ్లడం మా కోబ్రా కమాండో ట్రైనింగ్‌ సూత్రం. అందుకే బుల్లెట్లకు ఎదురు వెళ్తూ ఫైరింగ్‌ చేస్తున్నాం. అవతలి వైపు ఒకరు చనిపోయారు. ఆ నక్సల్‌ డెడ్‌బాడీని తెచ్చేందుకు ముందుకు వెళ్లాం. అక్కడికి చేరుకొని, కట్టెలకు ఆ మృతదేహాన్ని కట్టి శవంతో తిరిగొస్తున్నాం. ఆ మృతదేహాన్ని మేం తీసుకెళ్లకుండా ఉండేందుకు, అవతలి వాళ్లు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. వారిని ఎదుర్కొంటూనే బాడీని 20 కిలోమీటర్లకుపైగా మోసుకొచ్చాం. అప్పటికే బాగా రాత్రయింది. అందరం అడవిలోనే బస చేశాం.

తెల్లారింది. వేగంగా మా క్యాంప్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. మమ్మల్ని తుపాకులతో అడ్డుకోలేమనుకున్నారు నక్సల్స్‌. మా కదలికలపై దృష్టి పెట్టారు. త్వరగా క్యాంప్‌కు చేరుకోవాలన్న ఆత్రుతతో మేం దగ్గరి దారిని ఎంచుకున్నాం. ఆ మార్గంలో మేం వెళ్తామని ముందే ఊహించి, దారిలో ఐఈడీ అమర్చారు నక్సల్స్‌. మేం వడివడిగా వెళ్తున్నాం. చుట్టుపక్కల చూస్తే నక్సల్స్‌ కదలికలేం లేవనిపించింది. అయినా, ఏదో అనుమానం కలుగుతూనే ఉంది. అంతలోనే నా వెనుక ఉన్నవారు ఐఈడీపై కాలు వేశారు. పెద్ద పేలుడు. దాడిలో నా కాలు తెగిపోయింది. మందుపాతరలోని స్ప్రింటర్లు, స్క్రూలు, చెర్రాలు నా శరీరంలో గుచ్చుకున్నాయి. ఒళ్లంతా రక్తం. ఏం చేయాలో పాలుపోని స్థితి. అంతలోనే నాలుగువైపుల నుంచీ కాల్పులు మొదలయ్యాయి. నక్సల్‌ డెడ్‌బాడీని తీసుకెళ్లాలన్నది వాళ్ల ఆలోచన. మేం ఆ అవకాశం వారికి ఇవ్వొద్దనుకున్నాం. రక్తమోడుతున్న దేహంతోనే ప్రతిఘటించాను. తెగిపడిన కాలికి గట్టిగా టవల్‌ కట్టి.. కాల్పులు మొదలుపెట్టాను. దాదాపు అరగంట కాల్పులు జరిగాయి. కాసేపటికి వాళ్లు వెనక్కితగ్గారు. మా యూనిట్‌ వాళ్లూ అక్కడికి చేరుకున్నారు. తర్వాత నన్ను రాయ్‌పూర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఒక కాలు తొలగించారు. అయినా నేను అధైర్య పడలేదు. కొన్నాళ్లకు ఎన్‌సీడీఈలో శిక్షణ కొనసాగించా. నా శక్తి రెట్టింపయింది. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌లోని మా గ్రూప్‌ సెంటర్‌ వరకు సైక్లింగ్‌ చేస్తూ వెళ్లాను. సైక్లింగ్‌తో పాటు పారా షూటింగ్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నాను. అయితే, కరోనా కారణంగా ఎక్కడా పోటీలు నిర్వహించే పరిస్థితి లేదు. మా ప్రాక్టీస్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. భవిష్యత్తులో జరిగే ఈవెంట్లలో పాల్గొనాలని భావిస్తున్నా. కాలు పోతే మాత్రం జీవితం ఆగిపోతుందా? అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నా జీవితం రాయల్‌గానే ఉంటుందని బలంగా నమ్ముతున్నా!’ అంటారు కృష్ణకాంత్‌ రాయల్‌.

బంగారు పతకం సాధించా..
రాజస్థాన్‌కు చెందిన సునీల్‌కుమార్‌ నేపథ్యమూ పోరాటమే. సీఆర్‌పీఎఫ్‌ సిపాయిగా చేరిన మూడేండ్లకే ఊహించని దెబ్బ తగిలింది. అయినా విధికి ఎదురీది వీరుడిగా నిలబడ్డాడు. ఎన్‌సీడీఈ ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్‌లో రాకెట్‌లా దూసుకుపోతున్నాడు.

‘2009 ఫిబ్రవరిలో సీఆర్‌పీఎఫ్‌లో సిపాయిగా చేరాను. 2012లో జరిగిన ఓ ప్రమాదం నన్ను దివ్యాంగుడిని చేసింది. క్యాన్సర్‌ వ్యాధికి గురైన ఓ నక్సల్‌ నాయకుడి చికిత్స కోసం ఓ వైద్యుడిని అడవిలోకి పంపుతున్నారు. ఆ విషయం మాకు తెలిసింది. మా అధికారులు ఆపరేషన్‌ ప్లాన్‌ చేశారు. డాక్టర్‌ను ఫాలో అవుతూ వెళ్తే… నక్సల్స్‌ను పట్టుకోవచ్చని ఆలోచన. మా పార్టీ ఒకటి డాక్టర్‌ను అనుసరించాలి. మరో రెండు బృందాలు వేరే వైపు నుంచి కవర్‌ చేయాలన్నది వ్యూహం. అంతిమంగా, వాళ్లను రౌండప్‌ చేయాలన్నది ప్లాన్‌.

అనుకున్న ప్రకారంగా మా బృందం డాక్టర్‌ను అనుసరిస్తూ అడవిలోకి వెళ్లింది. భారీ వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ప్రయాణం కొనసాగించాం. దాదాపు ఏడు రోజులు సాగింది. ఏడో రోజు అడవిలో ఉన్న ఓ కుగ్రామానికి చేరుకున్నాం. అక్కడివాళ్లను అడిగితే, దగ్గర్లోని కొండపై నక్సల్స్‌ ఉండొచ్చని చెప్పారు. మర్నాడు మెరుపుదాడి చేద్దామనుకున్నాం. నక్సల్స్‌ ఇలాఖా కావడంతో అక్కడ ఉండటం శ్రేయస్కరం కాదనిపించింది. వెనక్కి బయల్దేరాం. పక్కనే ఉన్న మరో గ్రామంలో ఓ పాఠశాలలో మకాం పెట్టాం. మా బృందంలో మొత్తం 45 మంది ఉన్నారు. అప్పటికే ఏడు రోజులుగా ఎవరికీ విశ్రాంతి లేదు. సరైన తిండి లేదు. అందరూ పాఠశాల గదుల్లో పడుకున్నారు.

నలుగురు చొప్పున కొన్ని బృందాలుగా విభజించి ప్రతి టీమ్‌ గంటన్నర చొప్పున కాపలా కాయాలని నిర్ణయించారు. నాతోపాటు మరో ముగ్గురం రైఫిల్స్‌ తీసుకొని పాఠశాల పైకి ఎక్కాం. నలుగురం నాలుగు వైపులా పహరా కాస్తున్నాం. కాసేపయ్యాక మా వాళ్లు ముగ్గురూ కునుకుపాట్లు పడుతున్నారు. ఇంతలో ఏదో అలికిడి. నేను ‘కౌన్‌ హై’ అనేంతలోనే అటునుంచి ఫైరింగ్‌ మొదలైంది. బుల్లెట్ల వర్షం. మా వాళ్లు నిద్రలోంచి తేరుకునే లోపే ముగ్గురి గుండెల్లో నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. వాళ్లను పక్కకు తీసుకొచ్చే క్రమంలో నా తొడలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అయినా కాల్పులు ఆపలేదు. దాదాపు గంటన్నర ప్రతిదాడి కొనసాగింది. స్పృహ కోల్పోయి రైఫిల్‌ మీదే కుప్పకూలిపోయాను. తొడలో నరాలు తెగిపోవడంతో చాలా రక్తం పోయింది. దవాఖానకు తీసుకెళ్లారు. బతకడం కష్టమే అన్నారట డాక్టర్లు. నా కాలి నరాలన్నీ తెగిపోవడంతో, తీసేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. నా అనుమతితో కాలు తొలగించారు. కొద్ది రోజుల్లోనే నేను కోలుకున్నాను.

నేను స్కూల్‌ డేస్‌లో హై జంప్‌ ఆటగాణ్ని. నాలుగుసార్లు జాతీయస్థాయిలో ఆడాను. నాలోని ఆటగాడికి ఈ దివ్యాంగ్‌ సెంటర్‌ వరంగా మారింది. మా జీవితాలు తీర్చిదిద్దుకునే అవకాశం లభించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాడ్మింటన్‌ నేర్చుకున్నాను. ఇప్పటికే కర్ణాటక తరఫున రాష్ట్రస్థాయిలో ఆడాను. డబుల్స్‌లో బంగారు పతకం సాధించాను. సింగిల్స్‌లో రజతం గెలిచాను. కరోనా వల్ల కొంతకాలంగా ఎక్కడా టోర్నమెంట్లు లేవు. ఇక్కడ మాకు అంతర్జాతీయ కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆటల ద్వారా దేశసేవలో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉంది.

పెండ్లికి నెల ముందు
నా పెండ్లికి నెల రోజుల ముందు ఈ ప్రమాదం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు ‘మా అమ్మాయిని కుంటివాడికి ఇవ్వలేం’ అన్నారు. ‘మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంది. మీకు నచ్చిన వ్యక్తితో పెండ్లి జరిపించండి. మీరు నాకు పెట్టిన దుస్తులు, డబ్బులు ఏమైనా ఉంటే తీసుకెళ్లండి’ అని నవ్వుతూ జవాబు ఇచ్చా. మా బంధువులు మాత్రం అమ్మాయి తండ్రికి నచ్చజెప్పారు. మళ్లీ వాళ్లే మా ఇంటికొచ్చారు. పెండ్లికి అంగీకారం తెలిపారు. కానీ, నేను ఒప్పుకోలేదు. ఆ అమ్మాయితో ‘మీ అమ్మానాన్నల ఒత్తిడితో పెండ్లి చేసుకోవద్దు. నీకు ఇష్టమైన సంబంధం చేసుకో..’ అని చెప్పా. చివరకు తన ఇష్టంతోనే వివాహం జరిగింది. ఇప్పడు మాకు ఇద్దరు అబ్బాయిలు.

మాట నిలబెట్టుకుంటా
మహారాష్ట్రకు చెందిన బోగాడి రాందాస్‌ది పోరాడి సాధించుకునే తత్వం. చిన్నప్పుడు పరుగులో చిరుత. కబడ్డీలో కూతకు వెళ్లాడంటే ప్రత్యర్థులకు మోత మోగాల్సిందే! క్రికెట్‌, కబడ్డీ జట్లకు నాయకత్వం వహించాడు కూడా! ఆటల్లో ఆరితేరిన రాందాస్‌.. ఇప్పుడు రెండు కాళ్లనూ కోల్పోయినా అదే ఒరవడిని కొనసాగిస్తున్నాడు. కృత్రిమ పాదాలతో వడివడిగా అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే, మునుపటి పరుగును మరిపించేలా మెరుస్తానని చెబుతున్నాడు.

‘2010లో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా జాయిన్‌ అయ్యాను. కోబ్రా బెటాలియన్‌ కమాండో స్థాయికి ఎదిగాను. జమ్మూ కశ్మీర్‌లోనూ కొన్నాళ్లు పనిచేశాను. తర్వాత ఛత్తీస్‌గఢ్‌కు వచ్చాను. 2017లో సుక్మా జిల్లా కిస్తారా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పలోదీ గ్రామం దగ్గర సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌ పెట్టాలనుకున్నారు. ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి మా డీఐజీ, ఇతర అధికారులు రానుండటంతో వాళ్ల సెక్యూరిటీ కోసం మేమంతా రోడ్డుకు ఇరువైపులా కాపుకాశాం. అధికారులు వెళ్లిపోయిన తర్వాత మేం తిరిగి క్యాంప్‌నకు బయల్దేరాం. మా ఆర్‌ఐ ‘ఆలస్యమైంది రోడ్డు మార్గంలో క్యాంప్‌కు చేరుకుందాం’ అన్నారు. అది చాలా రిస్క్‌! కానీ, మా అధికారి ఆదేశాల మేరకు తిరుగు ప్రయాణం అయ్యాం.

మా బెటాలియన్‌లో నేను మొదట్లో ఉన్నా. ఆ ప్రాంతమంతా కలియ చూస్తూ వెళ్తున్నా. అప్పటికే నక్సల్స్‌ అక్కడి పొదల్లో మందుపాతర పెట్టారు. చుట్టుపక్కలు గమనిస్తూ వడివడిగా అడుగులు వేస్తున్న నేను, పొరపాటున దానిపైనే కాలు పెట్టాను. అదే వేగంలో రెండో కాలు ముందుకు కదిలించేలోపు.. పేలిపోయింది. అంతెత్తున ఎగిరిపడ్డాను. నా ఎడమ కాలు నుజ్జునుజ్జు అయింది. కుడికాలు ఎముక పట్టుతో వేలాడుతున్నది. ఆ పరిస్థితిలోనూ పక్కనే పడిన నా రైఫిల్‌ అందుకొని దొర్లుతూ సమీపంలో ఉన్న రాయి వెనక్కి వెళ్లాను. కొండపై నుంచి నక్సల్స్‌ దాడి మొదలైంది. మా బెటాలియన్‌లో ఉన్న 24 మంది ప్రాణాలు కాపాడటం నా కర్తవ్యం. అంత బాధలోనూ ఫైరింగ్‌ స్టార్ట్‌ చేశా. దాదాపు 20 నిమిషాలపాటు వారిని నిలువరించగలిగాను. వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా వాళ్లు నన్ను హుటాహుటిన హెలికాప్టర్‌లో రాంచీలోని దవాఖానకు తరలించారు.

రెండురోజుల తర్వాత స్పృహ వచ్చింది. అప్పటికే మా కుటుంబసభ్యులు దవాఖానకు చేరుకున్నారు. ‘కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏం చేయడానికి లేదు. ఇలాగే ఉంచితే ఇన్‌
ఫెక్షన్‌ పెరిగి ప్రాణానికే ప్రమాదం’ అన్నారు వైద్యులు. మా కమాండెంట్‌ సార్‌ కూడా ‘నీ రెండు కాళ్లూ తీసేయాల్సి వస్తుంది’ అన్నారు. ఆ క్షణంలో భవిష్యత్తు అంధకారంలా అనిపించింది. ‘నేను మళ్లీ నడిచే అవకాశం ఉందా’ అని డాక్టర్‌ను అడిగాను. ‘ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ పెడతాం. మునుపటిలాగా నడిచేందుకు పూర్తి అవకాశం ఉంది. బాధపడాల్సిన పన్లేదు’ అని ధైర్యం చెప్పారు. నేను వెంటనే ఆపరేషన్‌కు ఓకే అన్నాను. సర్జరీ పూర్తయిన తర్వాత 43 రోజులు మంచంపైనే ఉన్నాను. వారం రోజులు ఎంతో ఏడ్చాను. ఈ జీవితం వ్యర్థంగా అనిపించేది. బాగా కుంగిపోయాను. నా భార్య, పిల్లల గురించి తలుచుకొని చాలా బాధపడ్డాను. ఓ రోజు మా ఐజీ సార్‌ వచ్చి..

‘రాందాస్‌ నువ్వు ముందులానే నడుస్తావు. నీ ఉద్యోగం నీకు ఉంటుంది. నీకు ఏ కష్టం రాకుండా మేమంతా ఉన్నాం’ అన్నారు. ఆ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. నా భార్య, కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో కోలుకున్నా. నేను మళ్లీ క్యాంప్‌లోకి వెళ్లాక మా వాళ్లంతా నన్ను భుజాలపై ఎత్తుకొని డ్యాన్స్‌ చేశారు. మా ఊరివాళ్లు ‘నీ వల్ల మన ఊరికే గొప్పపేరు వచ్చింద’ని మెచ్చుకున్నారు. ఆ సంఘటనల స్ఫూర్తితో.. నేను ఇక్కడితో ఆగిపోకూడదు, ఏదైనా సాధించాలని బలంగా నిర్ణయించుకున్నా.

అప్పుడే నా దృష్టి ఆటలపైకి మళ్లింది. స్కూల్‌డేస్‌ గుర్తు చేసుకున్నా. పరుగులో నా సత్తా చాటాలనుకున్నా. అదే సమయంలో నా కథ తెలిసిన బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ నన్ను ఒక కార్యక్రమానికి పిలిచారు. టీవీ షోలో నాతో మాట్లాడించారు. నాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఆ కార్యక్రమంలో ‘సరిగ్గా రెండేండ్లలో నేను పరిగెత్తి చూపిస్తాను’ అని చాలెంజ్‌ కూడా చేశాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమిస్తున్నాను. నా ఉత్సాహానికి ఊపిరులూదింది ఎన్‌సీడీఈ. నాలా యుద్ధంలో కాళ్లు, చేతులు కోల్పోయిన వాళ్లకు పునర్జన్మనిస్తున్నదీ వేదిక. మా వెంట మొత్తం సీఆర్‌పీఎఫ్‌ నిలుస్తున్నది. పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాను. ప్రస్తుతం కృత్రిమ పాదాల సాయంతో వేగంగా నడవగలుగుతున్నా. త్వరలోనే రన్నింగ్‌ లింబ్స్‌ సాయంతో పరుగులు తీస్తాను’ అంటున్నారు రాందాస్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement