e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home కథలు యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. పరమాత్మ తత్వాన్ని ప్రపంచానికి చాటుతాడు.

- Advertisement -

అనంతపాల సేనాని యుద్ధభూమికి తరలివెళ్లాడు.త్రిభువనుడు తీసుకున్న నిర్ణయం రాణీ చంద్రలేఖకు మనస్తాపం కలిగించింది. అయినా, ఒకసారి చక్రవర్తి నిర్ణయం జరిగిన తర్వాత ఇక దానిపై చర్చకు అవకాశం ఉండదు.భువనగిరి సామ్రాజ్యంలో యుద్ధ వాతావరణం ఏర్పడలేదు. కోలాహలమంతా కోటలోనే! ఎందుకంటే, త్రిభువన మల్లుడి పరిపాలన ఏకోన్ముఖంగా ఉన్నట్టనిపించినా, బహుముఖమైన వికేంద్రీకరణ కారణంగా ప్రాంతీయ, గ్రామీణస్థాయిలో క్రమబద్ధమైన పాలనా వ్యవస్థ బలంగా ఉంది. అందుకే, యుద్ధవాతావరణం గురించిన వార్తలు ఆ నోటా ఈ నోటా వినబడినా సైన్యాలు గ్రామాలమధ్యకు రావడం ఉండదు.
‘పరిపాలకుడి నిర్ణయాలు ప్రజలను ప్రభావితం చేయాలి. చేస్తాయి. కానీ, ప్రశాంతతను భగ్నం చేయకూడదు’ అనేది త్రిభువనుడి సిద్ధాంతం.రాజమందిరంలో ఏకాంతంగా ఆలోచనామగ్నుడై ఉన్నాడు త్రిభువనుడు. రాణీ చంద్రలేఖ నిశ్శబ్దంగా వచ్చి నిలబడి ఉంది. గవాక్షం నుండి బయట ఆటస్థలం కనిపిస్తున్నది. రాకుమారుడు సోమేశ్వరుడు హాయిగా ఆడుకుంటున్నాడు. తను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అద్భుత దృశ్యం ఇది. ఇంతకాలం అంతు తెలియని వ్యాధితో బాధ పడుతూ, అసలు బతుకుతాడా, లేడా? అన్నంత భయాందోళనలకు గురి చేసిన సోమేశ్వరుడు ఈరోజు ఇంత సంతోషంగా.. ఉల్లాసంగా ఆడుకుంటున్నాడు అంటే.. అది శ్రీ యాదగిరీశుడి దయ మాత్రమే! శ్రీ లక్ష్మీనృసింహుడి కరుణా కటాక్షమే!
తను నమ్మలేదు.. అయినా, స్వామి కాపాడాడు.

నమ్మని వారికీ, నమ్మిన వారికీ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ నృసింహుడే!
“ప్రభూ! ఇంత సంతోషకరమైన సమయంలో మీరు ఏదో ఆలోచనలో, ఆందోళనలో ఉండటం ఆశ్చర్యంగా ఉంది” రాణీ చంద్రలేఖ మాటలకు తలెత్తి చూశాడు త్రిభువనుడు.
“రాణీ! నీవన్నది నిజమే. కుమారుడి ఆరోగ్యం నాకేకాదు, ఈ సామ్రాజ్యపు భవితకూ సౌభాగ్యం. తండ్రిగా పట్టరాని ఆనందం ఉంది మనసులో. ఎక్కడ భువనగిరి కోటలోని అహంకారి, అజ్ఞాని అయిన ఈ మానవుడు, ఎక్కడ కొండ గుహలో కొలువైన సింహదేవుడు! సందేశాలు పంపించాడు. సంకేతాలు అందించాడు. సందేహాలు తొలగించాడు. నేననుకున్నాను.. ఉన్నాడా? ఉన్నా చూస్తాడా? చూసినా కష్టాలు తొలగిస్తాడా? అసలు నా జీవితంలో నా అనుభవంలోకి వచ్చింది కలా? నిజమా? తాదాత్మ్యతా? పలవరింతా? తెలీదు. ఏదో వింత..”
ఆశ్చర్యపడింది చంద్రలేఖ. కార్యదక్షత మాత్రమే ప్రతిఫలించే ప్రభువు మాటల్లో ఏదో వింత ధోరణి. కొత్తగా ఉంది.

“ప్రభూ! స్వామిని దర్శించాలని మీరు కలగన్నారు. స్వామి మీ కలను నిజం చేశారు. నిజం అన్న దానికి నిదర్శనం.. నారసింహుడి దర్శనమే! మీరు సాహసించారు. సర్వం తాత్కాలికంగానైనా త్యాగం చేశారు. కారడవిలో కానరాని కొండగుహల్లో అన్వేషించారు. మీ అన్వేషణ, మీ కష్టం, మీ కట్టుబడి, మీ ఆరాధన.. ఫలించాయి. మీ మనసుకు ఏ సంతోషం కలిగిందో ఏమో, నాలో మాత్రం మాతృవాత్సల్యాన్ని కాపాడింది. కన్నబిడ్డను పదిలంగా చేతికి అందించింది. ఏం చేయగలిగితే శ్రీ నారసింహుని మెప్పించగలం? స్వామిని నమ్మి అహంభావాన్ని విడనాడి ‘నేను’ లేను, ‘నువ్వు’ ఉన్నావు అనాలనిపిస్తున్నది..”
ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆతృతగా అన్నాడు త్రిభువనుడు.
“ఎంత మంచిమాట అన్నావ్‌ మహారాణీ! ‘నేను లేను’ అని మనం అనుకున్నప్పుడే, ‘నేను ఉన్నాను’ అని నిజదర్శనం చూపిస్తాడు. నిన్నూ, నన్నూ.. అందర్నీ కాపాడే లీలా నారసింహుడు. యాదర్షిని అనేక పరీక్షల తర్వాత కరుణించినవాడు, ప్రహ్లాదునికోసం తక్షణమే అవతారాన్ని దాల్చినవాడు.. మన కోసం తన మహిమను చూపించాడు.”
త్రిభువనుని గొంతు గాద్గదికమైంది.
కొండపైన గుహలో స్వయంభువుగా ఆవిర్భవించినవాడు, అవతార కాలాన్ని క్షణికం కాకుండా శాశ్వతం చేసుకున్న వాడు హృదయలక్ష్మీ సమేతుడైన నారసింహుడు.. తనకు దర్శనమిచ్చి, తనద్వారా ప్రజలందరికీ సుఖసంతోషాలు ప్రసాదించాలనుకుంటున్నాడు. తాను పొందిన అనుభవాన్ని, తనను నమ్మిన ప్రజలందరికీ కలిగించడమే బహుశా తనకు ప్రసాదించిన మహద్భాగ్యమేమో!

ఏమో.. తాను ఇంకా ఏమి కానున్నాడో..
తానే ఒక ‘సర్వసంగ పరిత్యాగి’గా మారి, ప్రభువును సేవించుకొని పరమపదం చేరుకుంటే, అంతకన్నా మహద్భాగ్యం ఏముంటుంది?
ఈ పరిణామం తాను ఊహించలేదు కానీ, ఉత్తమం అని ఇప్పుడు అనిపిస్తున్నది.
మహారాణి ఆలోచన విధానం కూడా అదే అనిపిస్తున్నది.
ఇదే సరైన సమయం, తన మనసులోని మాట చెప్పడానికి!
“మహారాణీ! మేమొక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం. దానికి నీ అనుమతి అవసరమనిపిస్తున్నది”
ఈ మాటలకు దిగ్భ్రాంతి చెందింది మహారాణి.
“ప్రభూ! ఏమీ మాటలు ఇవి? మీ నిర్ణయం మాకు శిరోధార్యం. మీరు మాటంటే ప్రాణాలు పోయినా పాటించడం నా నైజం. నేను మీ నిర్ణయానికి అనుమతి ఇవ్వడం ఏమిటి? ఇది నన్ను తీవ్రంగా అవమానించడమే..”
ఉబికి వస్తున్న దుఃఖాన్ని, భావోద్వేగాన్నీ అణచివేసే ప్రయత్నం చేస్తూ అన్నదామె.
“నా ఉద్దేశం.. నిన్ను బాధ పెట్టడం కాదు. బలవంతంగా ఒప్పించడం కూడా కాదు. నా సంకల్పాన్ని.. నువ్వు అంగీకరిస్తావని బలంగా నమ్ముతున్నాను. నువ్వు సరేనంటే..
నేను నా నిర్ణయాన్ని
ప్రకటిస్తాను” అన్నాడు త్రిభువనుడు.

“ఆదేశించండి ప్రభూ! మీరు ఏం చేయమన్నా సంతోషంగా నేనది చేస్తాను. ఏనాడు మీతో కలిసి ఏడడుగులు నడిచానో, ఆనాడే మన బంధం ఏడేడు జన్మల బంధంగా బలపడింది. చక్రవర్తులు మీరు. త్రిభువనమల్ల బిరుదాంకితులు. కానీ, నన్ను ధర్మపత్నిగా గౌరవించారు. మీ సరసన సరైన స్థానం కల్పించారు. ఎంతమంది రాణులు చరిత్రలో లేరు? వారెవరికీ దక్కని అరుదైన గౌరవం నాకు దక్కింది. ఇంతకుమించి నేను కోరుకునేది, కోల్పోయేదీ ఏమీలేదు. మీ ప్రాణసఖిని నేను. నా ప్రాణం.. నా జీవం.. నా సర్వస్వం మీరే!”
ఉద్వేగం.. ఆమె పలికిన ప్రతి పదంలో ప్రతిఫలించింది.
అవును.. నిజమే!
చంద్రలేఖ తనలో సగభాగం. కార్యభారం పంచుకోవడంలో ఒక హృదయదాసిలాగా, మంత్రాంగంలో సలహాలిచ్చేటప్పుడు మహామంత్రిగా.. ఆహారం అందించేప్పుడు తల్లిలాగా అంతెందుకు, తన జీవన సర్వస్వంగా ఉన్నది.. తన భార్య!
ఇటువంటి ఉత్తమురాలిని, ఉన్నత సంస్కారవంతురాలిని, సాహితీవేత్తను, దక్షత కలిగిన అపూర్వ స్త్రీ రత్నాన్ని తనకు ‘భార్య’గా ప్రసాదించిన దేవదేవుడికి అనేకానేక ప్రణామాలు అర్పించుకోవాలి.. అనుదినమూ!
“చంద్రలేఖా! నువ్వన్నావు కనుకనే నేనన్నాను. రాజ్య పాలన ఒక భారం అనుకుంటే, రాజ్య భారాన్ని మోస్తున్న నా మానసిక శక్తిని నువ్వు మోస్తున్నావు. ఆలంబనగా ఉన్నావు. అధినేత అయినా, అతి సామాన్యుడే అయినా.. ఏ వ్యక్తి జీవన గమనానికైనా ‘ఆడదే’ ఆధారం. ఆమె.. కని, పెంచిన ‘అమ్మ’ కావచ్చు. కట్టుకున్న ‘భార్య’ కావచ్చు. ‘కన్న కూతురు’ కావచ్చు. రక్తం పంచుకు పుట్టిన ‘సోదరి’ కావచ్చు. సహృదయం కలిగిన ‘స్త్రీమూర్తి’ చేయి పట్టుకొని నడిపిస్తేనే, ఏ మగవాడి నడక అయినా ముందుకు సాగుతుంది. ఆ రకంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి” అంటూ త్రిభువనుడు లేచి, ఆమెను దగ్గరికి తీసుకున్నాడు.

“దేవీ! నీ కనులు చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా?”
“ఏమనిపిస్తుంది ప్రభూ!”
“నీ కనుల తడి అద్దబడిన అద్దంలో నా ముఖమే ప్రతిబింబమై కనిపిస్తున్నది. నాలో నేను కాదు.. నీలోనే నేనున్నాను. బహుశా మనం ఏ జన్మలో ఒకే ‘గుండె’గా ఉండి ఉంటాము. రెండు భాగాలైన ఆ గుండె, ఈ జన్మలో మనలో ఉండి.. చెరి సగమై, మనమై.. ఆ రెండు సగభాగాలూ మళ్లీ ఒకటి కావాలని మనమిద్దరం ఇద్దరిగా పుట్టినా.. ఒకటిగానే ఉన్నామేమో! ఉంటామేమో!”
త్రిభువనుడి భావావేశానికి నవ్విందామె.
“అవునేమో.. అర్ధనారీశ్వర తత్తానికి అసలైన అర్థం చెప్పారు. అర్ధనారీశ్వరుడంటే పార్వతీ పరమేశ్వరులే కాదు. ప్రకృతీ-పురుషులు కూడా. ప్రతి భర్తా, ప్రతి భార్యా కూడా! ఒకరికి బాధ కలిగితే మరొకరి నొప్పి కలుగుతుంది. ఒకరికి సంతోషం అనిపిస్తే, మరొకరికి అంతకన్నా ఆనందం కలుగుతుంది. అందుకే, మీ బాధ, సంతోషం, దుఃఖం ఆఖరికి ‘భక్తి’లో కూడా నాకు భాగం ఉంది”
చంద్రలేఖ మాటలు త్రిభువనుడికి ఆశ్చర్యం కలిగించాయి.

బాధలో, సంతోషంలో, భక్తిలో కూడా తన జీవిత భాగస్వామికి సగభాగం ఉంది అనుకుంటే.. తన ఆలోచన కార్యరూపంలో పెట్టడానికి సందేహం అవసరం లేదు.
“ప్రభూ! మీ మనసులో ఉన్న ఆలోచన నాకు చెప్పండి. దాన్ని కార్యాచరణగా మార్చే బాధ్యత నాది” విస్పష్టంగా చెప్పింది.
‘ఓం నమో నారసింహాయ!’ తనలో తానే స్వామినామం తలిచాడు.
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే
భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌

బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి
సంఘట్టితాంఘ్రి కమలామల కాంతికాంత
లక్ష్మీలసత్కుచ సరోరుహ రాజహంస
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌

సంసార దావదహనాతుర భీకరోరు
జ్వాలావళీ భి రతిదగ్ధ తనూరుహస్య
త్వత్పాద పద్మసరసీం శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌

“చంద్రలేఖా! నేను స్వామివారి సేవలోనే ఉండిపోదామనుకుంటున్నాను. తరించి పోదామనుకుంటున్నాను. ఇందుకు అర్ధాంగిగా నాకు నీ సమ్మతి కావాలి..”
ఆ మాట వింటూనే.. నోట మాటరాక దిగ్భ్రమతో చూస్తుండిపోయింది.
“కానీ.. నేను వ్యతిరేకిస్తున్నాను” ఖంగున మోగింది సోమేశ్వరుని కంఠం.
“నాయనా.. సోమేశ్వరా..”
“అవును నాయనగారూ. అమ్మ మీ నిర్ణయాన్ని ఆమోదించినా, అది నాకు సమ్మతం కాదు.. మన్నించండి”
కోపం పట్టలేక పోయాడు త్రిభువనుడు.
తన కుమారుడు, ముద్దుబిడ్డ సోమేశ్వరుడేనా.. ఇలా మాట్లాడేది?

(మిగతా వచ్చేవారం)

నారసింహుడే నాకు ప్రేరణ

ఇరవై నాలుగు వారాలుగా ‘బతుకమ్మ’లో ధారావాహికగా వెలువడుతున్న‘యాదాద్రి వైభవం’ సీరియల్‌ రచయిత అల్లాణి శ్రీధర్‌ నిర్మాతగా, దర్శకుడిగా చిరపరిచితులు. వీరు ‘ఉదయం’ దినపత్రికలో రాసిన ‘క్యాంపస్‌.. క్యాంపస్‌’, ‘యంగ్‌ ఇండియా’ సీరియల్‌ నవలలు బహుళ ప్రాచుర్యం పొందాయి. శ్రీధర్‌ దర్శకత్వంలో నిర్మితమైన ‘కొమురం భీమ్‌’ చిత్రాన్ని ‘ఉత్తమ దర్శకుడు’, ‘ఉత్తమ నిర్మాత’ విభాగంలో నంది అవార్డులు వరించాయి. అక్కినేని నాగేశ్వర్‌రావు, దాసరి నారాయణరావు, జగపతిబాబు వంటి సినీదిగ్గజాలతో నిర్మించిన
‘రగులుతున్న భారతం’ సమాజంలోని పరిస్థితులకు అద్దం పట్టింది. ‘గౌతమ బుద్ధ’, ‘తులసీదాస్‌’ చిత్రాలను హిందీ, తెలుగులలో రూపొందించి, బయోపిక్‌ స్పెషలిస్టుగా కూడా పేరు
తెచ్చుకొన్నారు.

‘ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌’గా నంది అవార్డునూ గెలుచుకొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సాయికుమార్‌, సుమన్‌ ప్రధాన పాత్రధారులుగా ప్రాణంపోసుకున్న ‘చిలుకూరు బాలాజీ’ చిత్రానికి రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు. విద్యా విషయక చిత్రాలు, ప్రచార చిత్రాలు అనేకం రూపొందించారు. ‘సాయి శరణం’, ‘ఆదిపరాశక్తి’, ‘మహాగణపతి’,
‘ఇంటింటా సంతోషం’.. వంటి సూపర్‌హిట్‌ టీవీ సీరియళ్లకు అల్లాణి శ్రీధర్‌ రచయితగా, దర్శక నిర్మాతగా వ్యవహరించారు. 2015లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’లో బాలల చిత్రాల జ్యూరీ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. సినిమా రంగంలో కృషికిగాను, ‘క్యాలిఫోర్నియా పబ్లిక్‌ యూనివర్సిటీ’ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. కేంద్ర ప్రభుత్వం ‘అల్లాణి శ్రీధర్‌’ను భారత సెన్సార్‌ బోర్డు అడ్వయిజరీ కమిటీ సభ్యునిగా ఇటీవలే నియమించింది. “యాదాద్రి నరసింహుడు మా ఇంటి దేవుడు. స్వామి సన్నిధిలోనే నా జీవితంలోని ముఖ్యమైన మలుపులన్నీ జరిగాయి. నరసింహుడి ప్రేరణతోనే ‘యాదాద్రి వైభవం’ రచనను ప్రారంభించాను. స్వామివారిపై వస్తున్న సమగ్ర రచన ఇది. ఈ అవకాశం ఇచ్చిన ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి కృతజ్ఞతలు. అరుదైన ఆధార గ్రంథాలను అందించిన కిషన్‌రావుగారికి, ఇతర మిత్రులకు ధన్యవాదాలు” అంటారు రచయిత
అల్లాణి శ్రీధర్‌.

-అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement