e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home కథలు యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు. సాక్షాత్తు నారసింహుడే తన భక్తుడిని రక్షించుకుంటాడు. భక్తుడినే కాదు, ఆ భక్తుని బిడ్డనూ కాపాడుకుంటాడు.

- Advertisement -

“నఈం పాహియ రుజీషీత రుద్రః
శ్రియం లక్ష్మీ మౌపలా మంబికాం గామ్‌
షష్ఠీం చ యామింద్ర సేనేత్యుదాహుః
తాం విద్యాం బ్రహ్మయోనిగ్‌ం సరూపా
మిహాయుషే శరణ మహం ప్రపద్యే॥

.. కొండలమీద స్వామివారి సన్నిధిలో పరమ భాగవతోత్తముడైన నామాల వృద్ధుడు, త్రిభువనమల్లునితో పలికిన శ్లోకమిది.
ఎందుకో.. ఔషధం కంట్లో పడగానే, పసివాడు ఒక్కసారిగా కేక వేసిన క్షణంలో తనకు ఇది గుర్తొచ్చింది.
త్రిభువనుడికి ఒక్క క్షణం ఏమీ స్ఫురించలేదు. ‘ఇది జరిగిన సంఘటనా? లేక కలా?’ అన్నదికూడా అర్థం కాలేదు.
శ్లోకం చెప్పిన పెద్దాయన తనను ఆశీర్వదిస్తూ.. అన్నాడు.
“నాయనా! శక్తిమంతమైన ఈ శ్లోకం.. నీ శోకాన్ని తొలగిస్తుంది. అద్భుతమైన ప్రశాంతతను, ఐశ్వర్యాన్ని నీకూ, నీ కుటుంబానికి శ్రీ నారసింహుడు ప్రసాదిస్తాడు”
అది.. వదనంలో విరిసిన మందహాసమా? ముఖారవిందంలో ప్రతిఫలిస్తున్న ప్రశాంత కాంతి పుంజమా?
ఆ వృద్ధుని మొహంలోకి చూస్తూ అనుకున్నాడు త్రిభువనుడు.
“స్వామీ! ఈ శ్లోకం అర్థమేమిటి? ఎవరి గురించి?”
వినమ్రంగా అడిగాడు.
చిరునవ్వుతో చెప్పాడా పెద్దమనిషి.
“నాయనా! శ్రీ లక్ష్మీ నారసింహుడి మాయాశక్తి స్వరూపం గురించి నృసింహ పూర్వతాపిన్యుపనిషత్తు, తృతీయ ఖండంలో ఈ శ్లోకం చెప్ప
బడింది. అనర్థాలను తొలగించే పరమాత్ముని అనుగ్రహ పరమార్థమే ఈ మహత్తర శ్లోకం మనకిచ్చే ఫలితం..”
“అంటే?” ఉద్విగ్నతతో అడిగాడు త్రిభువనుడు.
“అర్థం చెప్తాను విను. జగత్తుకూ జన్మాది పరంపరకూ మూలకారకుడై, మంత్ర రాజాత్మకుడైన నృసింహుడు “ఈ” కారాత్మక మాయాశక్తితో భక్తాభక్తులను కాపాడుగాక! సర్వాత్మకుడైన ఈ నారసింహుడు “ఈ”కార రహితుడైనప్పటికీ తన ఆంశచే జన్మించిన సర్వులనూ కాపాడుగాక. మంత్రరాజ స్వరూప నృసింహుడు ధనధాన్యవస్తశ్యాది రూపిణి అయిన శుభ శ్రీలక్ష్మిని, గోశబ్ద వాచ్యురాలయిన భూమిని, షట్‌ సంఖ్యా పూరణి షష్ఠిని, సావిత్య్రాది రూపాలను కాపాడునుగాక. బ్రహ్మకారణమైన, సరూపమైన విద్యను ఆయుర్దాయం కొరకు నేను శరణు కోరుతున్నాను.. అని ఈ మంత్రార్థం”
.. ఒక్కొక్క శబ్దమూ శరమై, పరవశమై, హృదయవశమై స్థిరంగా
నిలిచిపోయింది.
చేతులు జోడించాడు త్రిభువనుడు.
శోకం లేని లోకం కోసమే.. ఈ విశిష్ట
‘శ్లోకాన్ని’ ప్రసాదించారు మహర్షులు.
ఆయుర్దాయం కొరకు శరణు కోరడం స్వార్థం కాదు. నిజానికి శరణు కోరవలసింది తన ఆయుర్దాయం కోసం కాదు. అర్ధాయుష్కుడై, అంతర్ధానమౌతాడేమో అని తనను క్షోభ పెడుతున్న సోమేశ్వరుని గురించి!
నారసింహుని మాయాశక్తిని స్వల్పాతి స్వల్పంగానైనా తెలుసుకోగలిగితే.. అపమృత్యు భయం తొలగిపోయి, సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. మృతం లేని అమృతం ప్రాప్తిస్తుంది.
“ప్రభూ! ప్రభూ!” ఎవరో తనను పిలుస్తున్నారు.
ఎవరో కాదు.. తన అర్ధాంగి.. ధర్మపత్ని.. చంద్రలేఖ!
“ప్రభూ!”
ఒక్కసారిగా కనులు తెరిచి చూశాడు.
“దేవీ!” ఆమె మోములో కనిపిస్తున్న సంతోషం చూసి, సంభ్రమంగా పలికాడు.
“ఏం జరిగింది దేవీ?!”
అప్పడు మొదలైంది.. ఆమె కంట కన్నీటి బిందువుల జలపాతం.
‘సంతోషమా? పట్టరాని దుఃఖమా?’ ఏమీ అర్థం కాలేదు.
“రాణీ.. చంద్రలేఖా! ఏం జరిగింది?” ఆతృతగా అడిగాడు.
“అద్భుతం జరిగింది ప్రభూ! మరణం అంచులదాకా వెళ్లిన మన ముద్దుబిడ్డ.. మన సోమేశ్వరుడు క్షేమంగా ఉన్నాడు. కలడో..? లేడో..? అని నేను కలవరపడిన పరమాత్ముడు ఉన్నాడనీ, అన్నీ చూస్తున్నాడనీ, మన బాధలు తీరుస్తున్నాడనీ తెలుసుకున్నాను. మీరన్నారు.. భక్తి నిర్బంధం కాదని. నిజమే ప్రభూ! ఇప్పుడు నా భక్తి నిర్బంధం కాదు నిజమైన అనుబంధం. విడదీయరాని బంధం..”
ఆ మాట వింటూనే సోమేశ్వరుడు ఒక్క ఉదుటున వచ్చి.. గట్టిగా తల్లిని కౌగిలించుకున్నాడు.
“అమ్మా.. ఇప్పుడు నాకు ఏ బాధా లేదమ్మా.. నాలోంచి జీవం పక్షిలా వెళ్లిపోతుందనుకున్నాను..”
“సోమేశ్వరా..”
“అవునమ్మా.. అసలు నేను బాధపడింది నా గురించి కాదమ్మా.. నేను లేకపోతే నువ్వు ఉండలేవని! నేను వెళ్లిపోతే నువ్వు ఏమయిపోతావో అని! నాలోంచి ఇప్పుడు పక్షిలా వెళ్లిపోయింది జీవం కాదమ్మా.. రోగం! వ్యాధితో అసలు ఎప్పుడన్నా నేను బాధ పడ్డానా అని మరుపు కలిగేంత మంచి జీవశక్తి ఇప్పుడు నాకొచ్చిందమ్మా..” సోమేశ్వరుడు తన హృదయంలో కలిగిన అనుభూతులన్నీ అమ్మకు పంచుతున్నాడు.
అప్పుడర్థమైంది త్రిభువనుడికి..
స్వామి కరుణించాడు. ప్రహ్లాదునికోసం దిగివచ్చిన నారసింహుడు.. ఈ నరుని బాధ తీర్చాడు. పసివాడికి సంపూర్ణ ఆయుర్దాయం ప్రసాదించాడు.
‘నమో.. నారసింహాయ’
మనసులో మళ్లీ మళ్లీ మననం చేసుకున్నాడు. నారసింహుని నామస్మరణ
చేసుకున్నాడు.
కుమారుడిని దగ్గరకు తీసుకున్నాడు.
“సోమేశ్వరా!”
“నాయన గారూ!”
“నీ నోట ఈ పిలుపు వింటానని నేను అనుకోలేదు కుమారా! నా పిలుపు స్వామి ఆలకించాడు. అనుగ్రహించాడు. నువ్వు నిండు నూరేళ్లూ సంతోషంగా జీవించి.. భువనగిరి సామ్రాజ్యాన్ని, కళ్యాణీచాళుక్య వంశ పతాకాన్నీ సమున్నతంగా నిలబెట్టాలి”
ఇంక భయం లేదు.
సోమేశ్వరుడు అన్ని విద్యలూ సంపూర్ణంగా అభ్యసిస్తాడు.
భవిష్యత్తులో అద్భుత పరిపాలన అందిస్తాడు.
“నాయన గారూ.. నాకు జన్మదాతలే కాదు.. ప్రాణదాతలూ మీరే! అన్ని సౌఖ్యాలూ, సౌకర్యాలు వదిలేసి, వొంటరిగా నా కోసం అడవిలో కొండపైన కాలం గడిపారు. మీ త్యాగం, నాకు ఈ యోగాన్ని ప్రసాదించింది”
“లేదు నాయనా.. ఇది త్యాగం కాదు. బాధ్యత. అదృష్టం మన పక్షాన ఉన్నది కాబట్టి.. నారసింహుడి భృత్యుడైన.. మృత్యువు కూడా దూరం తొలగిపోయాడు. అందుకే..”
మాట పూర్తికాకుండానే దళపతి ప్రవేశించి, వినయంగా అభివాదం చేశాడు.
“ప్రభూ! విద్యాపతి కవివరేణ్యులు, అనంతపాల మహాసేనాని.. మీ దర్శనం కోరుతున్నారు..”
“రమ్మని చెప్పు..” ఆజ్ఞాపించాడు
త్రిభువనుడు.
ఆజ్ఞను స్వీకరించి వెళ్లిపోయాడు దళపతి.
రాజ వైద్యుడు ఇంకా సంభ్రమాశ్చర్యాల నుండి తేరుకోలేదు. యువరాజు బతికి బట్ట కట్టడం తను ఊహించలేదు.
“ప్రభూ! ఈ మూలికల రసం కంట్లో వేయగానే, నిద్రలోంచి లేచినట్టుగా లేచాడు రాకుమారుడు. మనిషి అంతు చూసే ఈ వింత వ్యాధి, చేత్తో తీసేసినట్టు అంతరించిపోయింది. ఈ మూలికలు మీకు ప్రసాదించిన మహా వైద్యుడు ముల్లోకాల ఏలిక.. అని నాకు అర్థమయింది. ఆయుర్వేద ప్రభావం, శ్రీ నారసింహుడి అనుగ్రహం.. వ్యాధి నిర్మూలనకు మూలహేతువు! మీవంటి గొప్ప పరిపాలకుని ఏలుబడిలో నేను జీవించగలిగి ఉండటం.. దేవుడు నాకిచ్చిన మహద్భాగ్యం!”
భావోద్వేగంతో శరీరం కంపించిపోతున్నది రాజ వైద్యునికి..
త్రిభువనమల్లుడికి నమస్కరించి వెళ్లిపోయాడు.
“ప్రభువులవారికి జయము.. జయము..”
అనంతపాలుడు, విద్యాపతి ప్రవేశించి, నమస్కరించి తమతమ ఆసనాల్లో కూర్చున్నారు.
“ప్రభూ! తమరు సురక్షితంగా తిరిగిరావడం మాకు చాలా సంతోషంగా ఉంది. తమరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం” వినయంగా అన్నాడు అనంతపాలుడు.
“అనంతపాల సేనానీ.. నీవంటి వీరుడు, విద్యాపతి వంటి రాజభక్తులు ఉన్నంతకాలం మేము సురక్షితమే! మీరు ఎదురు చూస్తున్న ఆదేశాలు దేనికోసం?” అడిగాడు త్రిభువనుడు.
“ప్రభూ! మిత్రద్రోహి విష్ణువర్ధనుడు తుంగ
భద్రాతీరం దాకా సైన్యాలతో వస్తున్నాడు. అతడ్ని నిలువరించకపోతే.. భువనగిరి దుర్గం దాకా రాగలడు. మీరు ఆదేశిస్తే.. యుద్ధానికి వెళ్లి, విష్ణువర్ధనుడిని ఓడించి, బందీగా
పట్టుకొస్తాను”
ఆవేశం ప్రతిఫలించింది అనంతపాల సేనాని పలుకుల్లో..
“విష్ణువర్ధనుడు అంతవరకూ వచ్చాడా..? వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయండి. యుద్ధానికి ఎవరు సారథ్యం వహిస్తారో యోచించి చెప్తాను”
త్రిభువనమల్లుని మాటలకు అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.. విద్యాపతి, అనంతపాలుడు.
“విష్ణువర్ధనుడి ధైర్యం వెనుక ఉన్నదెవరు? ఏ శక్తిని అండగా చూసుకొని అతడీ దుస్సాహసానికి ఒడిగట్టాడు? అనంతపాల సేనానీ! నీకేమైనా తెలుసా?” అడిగాడు త్రిభువనుడు.
‘తెలియదు’ అన్నట్టుగా.. తలదించుకున్నాడు అనంతపాలుడు.
విద్యాపతికి ఈ ప్రశ్న అర్థం కాలేదు.
“ఏ శక్తి అతడికి అండగా ఉంటే మనకేమిటి ప్రభూ! మన శక్తి ముందు.. ఎదుటి పక్షం ఎంత శక్తిమంతమైందైనా.. తలవంచాల్సిందే! మీరు సరేనంటే.. అనంతపాలుడు అతడి తలతీసి.. మీ పాదాల దగ్గర ఉంచగలడు” కోపాన్ని అదుపు చేసుకుంటూ అన్నాడు విద్యాపతి.
“విద్యాపతీ! ఎవరి శక్తి ఎలాంటిదో తెలియకుండా ముందుకు వెళ్లడం ప్రమాదకరం!”
“ప్రభూ! ఎవరి శక్తి ఏమిటో యుద్ధభూమిలోనే తెలుస్తుంది. సందేహాలు అవసరం లేదని నా అభిప్రాయం..”
ఆ మాటలకు నవ్వాడు త్రిభువనుడు.
“యుద్ధభూమిలో తెలిసేదాకా వేచి ఉండాలా? గెలుపునకు కావాల్సింది ఆవేశం కాదు. ఆలోచన.. ప్రణాళిక.. అవి ఉన్నవాడే యుద్ధంలో గెలుపు సాధిస్తాడు”
“మాకు ఆపాటి జ్ఞానం లేదని ప్రభువులు భావిస్తున్నారా..? మన్నించండి. మీరిచ్చిన శిక్షణలో మేము నేర్చుకున్నది.. శత్రువుకు ఎదురు
వెళ్లడమే! ఎదుటివాడి శక్తి తెలుసుకొని వెనకడుగు వేయడం కాదు..” రోషంగా అన్నాడు విద్యాపతి.
విద్యాపతిని ప్రభువు గౌరవిస్తాడు కానీ, ఎదిరిస్తే సహించడు.
“విద్యాపతి కవివరేణ్యా.. ప్రభువుల వారికి మీపైన, మీ రాజభక్తిపైనా అణుమాత్రం అనుమానం లేదు”.. అనునయంగా అన్నాడు అనంతపాలుడు.
“విద్యాపతి రాజభక్తిపై మాకు అనుమానం లేదుగానీ, జ్ఞానం గురించి కొంత
ఆలోచించాలి..”
యథాలాపంగా ప్రభువు అన్నమాటలకు దెబ్బతిన్నట్టు చూశాడు విద్యాపతి.
ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు.
సర్రున ఒరలోంచి కత్తిని లాగాడు.
“ప్రభూ! మీ గౌరవం పొందడానికి నా కలం ఉపయోగిస్తాను. మీ విశ్వాసం కోల్పోయినప్పుడు ఈ కత్తిని ఉపయోగిస్తాను. నా రాజభక్తిని శంకించాల్సిన పరిస్థితే ఏర్పడితే, నేను బతికి ఉండి ప్రయోజనం లేదు”
విద్యాపతి గొంతు వణికింది.
త్రిభువనుడు ఈ పరిణామాన్ని ఊహించలేదు. అతడి కండ్లు కోపంతో ఎరుపెక్కాయి.
“విద్యాపతీ! సాన్నిహిత్యం ఉంది కదా అని, అవిధేయత చూపితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నీకు తెలుసు. నా సహనాన్ని పరీక్షించే అవకాశం ఎవరికీ ఇవ్వను. ఇక జ్ఞానమంటావా..? దానికి అంతులేదు. బహుముఖాలున్న వజ్రంలో ఎన్ని కోణాలు తెలుసుకున్నా.. ‘తెలుసు’ అనుకున్నా.. మనకు తెలియని కోణాలు మిగిలే ఉంటాయి. అనంతపాల సేనానీ.. యుద్ధానికి వెళ్లడానికి నీకు అనుమతి ఇస్తున్నాను. అహంకారంతో అవిధేయత చూపిన విద్యాపతికి మూడు వారాలపాటు మా దర్శనాన్ని నిరాకరిస్తున్నాం.. నిషేధిస్తున్నాం..”
‘ఇక వెళ్లవచ్చు’ అని సంజ్ఞ చేస్తూ లోపలికి వెళ్లిపోయాడు త్రిభువనుడు.

తుంగభద్రా తీరం..
గాలికి రెపరెపలాడుతున్న గుడారాలు.
సైన్యం విడిది చేసిన దానికి సూచనగా కోలాహల ధ్వనులు.
ప్రయాణం చేసి వస్తున్న నలుగురు వర్తకులు అలుపు తీర్చుకోవడానికన్నట్టుగా గుర్రాలు దిగి, చుట్టూ చూశారు.
అది గమనించిన ఒక కాపలా సైనికుడు వారి దగ్గరికి వచ్చాడు.
“ఎవరు మీరు?” అని గద్దించాడు.
“ఏదో యాపారం చేసుకొనే వర్తకులం బాబూ..” వినయంగా చెప్పాడు వారిలో ఒకడు.
“ఇక్కడ మహారాజుగారు విడిది చేసి ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎవరూ సంచరించకూడదు” ఖండితంగా చెప్పాడు.
“ఇక్కడ మహారాజుగారు విడిది చేసి ఉన్నారా..? ఎవరూ త్రిభువనమల్ల చక్రవర్తులవారా..?” ఆరాతీస్తూ అడిగాడు ఇంకొకడు.
“లేదు లేదు.. విష్ణువర్ధన మహారాజు”
ఆ సైనికుడి మాటలు వింటూనే దూరం నుండి పరిగెత్తుకొచ్చాడు సైనికుల నాయకుడు.
“ఒరేయ్‌ మూర్ఖుడా.. ఏం కాపలా కాస్తున్నావ్‌. అనవసరమైన వారికి ఎందుకు సమాచారం ఇస్తున్నావ్‌?” అని కోపంగా అరిచాడు.
దాంతో వర్తకులు భయం భయంగా ఒక పక్కకు నిలబడ్డారు.
“నేను నరసప్ప నాయకుడిని. ఈ ప్రాంతానికి ప్రధాన కాపలాదారు. ఈ పటాలానికి నాయకుణ్ణి. ఇప్పుడు చెప్పండి. మీరెవరు? ఈ ప్రాంతానికి ఎందుకొచ్చారు? సరైన సమాధానం చెప్పకపోతే.. మీ తలకాయలు మీ మెడకాయల నుండి వేరైపోతాయి..” ఒరలోంచి కత్తిలాగుతూ అన్నాడు.
వాళ్లు గజగజా వణికిపోయారు.
“అయ్యా.. మేము విష్ణువర్ధన మహారాజుకి భక్తులం. జన్మలో ఒక్కసారైనా వారిని దర్శించుకోవాలని వచ్చాం”
“రాజుగారికి భక్తులా? ఆయనేమన్నా దేవుడా?”
“మాకు దేవుడే! వారి పేరుమీద పూజలు చేయించాం. ఆ అక్షింతల్ని వారికి అందజేసే అవకాశం కల్పిస్తే.. మీకు రుణపడి ఉంటాం” ప్రాధేయపడ్డారు.
నరసప్ప నాయకుడికి ఒక్కక్షణం అయోమయంగా అనిపించింది. ‘ఏమో.. ఏ పుట్టలో ఏ పాముందో..?’
వీరు పూజలు చేసి, పవిత్ర అక్షితల్ని మహారాజుగారికి ఇద్దామని తీసుకొస్తే.. ఆపడానికి తనెవరు? వీరిని తీసుకొచ్చినందుకు రాజుగారు సంతోషపడి తనకు మెడలోని హారం ఇచ్చినా ఇవ్వొచ్చు.. ఎవరికి తెలుసు?
“పదండి.. అక్కడ అనుమతి తీసుకొని లోపలికి వెళ్దాం..” అన్నాడు.
ఆ నలుగురూ ఎంతో సంతోషించారు.
“అయ్యా.. మీరు సాధారణ సైనికాధికారి కాదు. జ్ఞానమూ, అధికారమూ, దయా మీకున్నాయి..” అంటూ ఒకడు ముందుకు నడిచాడు.
ఎదురుగా కాస్త దూరంలో రాజలాంఛనాలు, సైనిక కాపలా ఉన్న బంగారు రంగు డేరా సూర్యకాంతికి మరింత మెరిసిపోతున్నది.
అది చూసిన వర్తకుల్లో ఒకడు నవ్వుకొని, తన దుస్తులను తడిమి చూసుకున్నాడు.
చేతికి గట్టిగా తగిలించి.. చురకత్తి.
పక్కనున్న వాడిని చూసి నవ్వుతూ తలూపాడు.
“పదండి.. అక్కడికి వెళ్దాం..” నరసప్ప తొందరపెట్టాడు.
అందరూ ముందుకు నడిచారు.

-అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement