e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home ఎవర్‌గ్రీన్‌ యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు. సాక్షాత్తు నారసింహుడే తన భక్తుడిని రక్షించుకుంటాడు. కానీ, రాజ్యంలో మాత్రం అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ భయం! రాజు తిరిగొచ్చిన తర్వాత కూడా అదే అయోమయ వాతావరణమే.

- Advertisement -

‘తెల్లవారితే సైనిక దళాలు యుద్ధానికి సన్నద్ధమై వెళ్లాలి.
చక్రవర్తి మనఃస్థితి అయోమయంగా ఉంది. కోటకు తిరిగొచ్చాడన్న మాటేగానీ, ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కొంత విశ్రాంతి అవసరమేమో అనిపిస్తున్నది..’
ఈ ఆలోచనలతో సతమతమవుతున్నాడు అనంతపాలుడు.
తన సందేహాలను విద్యాపతి ముందుంచాడు.
“అనంతపాల సేనానీ! ప్రభువులవారి పలుకులు విన్న తర్వాత నేనూ నిరాశలో మునిగాను. ఏమి చేయాలో అర్థం కావడం లేదు”
“విద్యాపతి కవీంద్రా! మీరు కేవలం మంత్రులు, కవులు మాత్రమేకాదు. చక్రవర్తికి సన్నిహితులు కూడా. మంచీ, చెడూ చర్చించగల సాన్నిహిత్యం ఉన్నవారు. మీరు చెప్తే వింటారేమో!” సూచించాడు అనంతపాలుడు.
ఆ మాటలకు నవ్వాడు విద్యాపతి.
“కవియా నిరంకుశా అన్నది ఆర్యోక్తి. కవి అనేవాడు ‘నిరంకుశుడు’ అంటారుగానీ, త్రిభువనమల్ల చక్రవర్తి నిరంకుశులకే అంకుశం వంటి వారు. సర్వశాస్ర్తాలూ చదివిన పండితుడు. ప్రజలకు ఏమి కావాలో స్పష్టంగా తెలిసిన జన హృదయాధినేత! కాకపోతే ప్రస్తుతం నరసింహస్వామి మాయకు లోనై, దానిలోనే పూర్తిగా లీనమై ఉన్నారు.”
“మాయకు లోనైనారా? దానిలో లీనమై ఉన్నారా?”
విద్యాపతి ఉపయోగించిన పదాలకు అర్థం.. సానుకూలమా? ప్రతికూలమా? తెలియక అడిగాడు అనంతపాలుడు.
“వ్యతిరేక భావంతో నేనా మాటలు అనలేదు. త్రిభువనమల్ల చక్రవర్తుల మనసులో ఏదైనా ఆలోచన అంకురించిందంటే.. దానిని సాధించేదాకా వదిలిపెట్టరు. ప్రయత్నిద్దాం! వారి మనసును, ఆలోచనలను మళ్లీ రాజ్యపాలనపైకి మళ్లించడానికి! కొంతసేపు వేచి చూసి, సమయం తీసుకొని వారిని కలుద్దాం..” సాలోచనగా అన్నాడు విద్యాపతి.


సరిగ్గా అదే సమయంలో.. అత్యవసరంగా ఆంతరంగిక మందిరానికి రమ్మని రాజవైద్యునికి వర్తమానం చేరింది. ఆయన ఉన్నపాటున తాళపత్ర గ్రంథం తీసుకొని ఆంతరంగిక మందిరానికి చేరుకున్నాడు. అక్కడ తల్పంపైన సోమేశ్వరుడు నిస్త్రాణగా మెత్తకు చేరగిలబడి ఉన్నాడు.
త్రిభువన చక్రవర్తి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. రాణీగారి చేతిలో ఒక బంగారు గిన్నె ఉంది. అందులో ఏవో మూలికలు ఉన్నాయి.
“ప్రభువులకు అభివాదములు, మహారాణికి జయము..” వినయంగా పలికి, పక్కన నిలబడ్డాడు రాజవైద్యుడు.
“సమయానికి వచ్చారు. ఇదిగో.. ఈ మూలికలు తీసుకోండి” అనగానే ప్రధాన పరిచారిక నాగమల్లిక అతిభద్రంగా ఆ మూలికలున్న బంగారు పాత్రను తీసుకొని రాజవైద్యులవారికి అందించింది.
బంగారు పాత్రను అందుకున్న రాజవైద్యుడు, అందులోని మూలికల్ని చూసి ఆశ్చర్యపోయాడు.
“ప్రభూ! ఈ మూలికలు అరుదైనవి. ఎక్కడ దొరికినవి?” సంతోషంతో అన్నాడు.
“రాజవైద్య శిఖామణీ! మీరు ఆయుర్వేదంలో ఎంతో అనుభవమున్నవారు. వీటిని గుర్తించగలరా?” అడిగాడు త్రిభువనుడు.
“ప్రభూ! ఇందులో ఒకటి ‘విష్ణు క్రాంతి’ అనే వృక్షజాతికి చెందింది. మరొకటి ‘కొండ కసివింద’ లేదా ‘సింధునార’ జాతికి సంబంధించిన మొక్క అయి ఉండవచ్చు. కానీ, లేత బంగారు ఛాయలో మెరిసిపోతున్న ఈ మూడో మూలిక ఏమిటో అంతు పట్టడం లేదు..” పరిశీలనగా చూస్తూ చెప్పాడు రాజవైద్యుడు.
ఈ మూలికలు ఎక్కడ దొరికాయో? ఎవరిచ్చారో? అంతా ఒక అద్భుతంలా కనిపిస్తున్నది.
అప్పుడు అడిగింది రాణీ చంద్రలేఖ.
“వైద్య శిఖామణీ! వీటిని ముద్దగా నూరి, రెండు చుక్కలు సోమేశ్వరుని కంట్లో వేయాల్సిందిగా ప్రభువులవారు చెప్తున్నారు. అసలు నా బిడ్డను ఇంత దారుణంగా బాధిస్తున్న వ్యాధి ఏమిటో ఇంతవరకూ మీరు నిర్ధారించనే లేదు. ‘ప్రాణాంతక వ్యాధి’ అని మాత్రం చెప్పారు. వీటిని వాడటం వల్ల ప్రమాదమేమీ ఉండదు కదా! మీకు తెలిసినంత వరకు చెప్పండి..” స్పష్టమైన సమాధానాన్ని ఆశిస్తూ అడిగింది.
రాజవైద్యుని మౌనం..
“దీన్ని వాడాలా, వద్దా ఎవరు చెప్తారు? ఈ మూలికల ప్రామాణికతను మీరు నిర్ధారించగలరా? ఎందుకంటే, ప్రాణం నిలుపుతుందనే నమ్మకంతో మనం ఈ మూలికలు ఉపయోగిస్తే, జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అలా జరిగితే తట్టుకోలేను. దీనికి మౌనం సమాధానం కాదు..” అన్నది రాణి.
“అమ్మా! మీ అపనమ్మకం ఆయుర్వేదం పైనా? మా పైనా?” అడిగాడు రాజవైద్యుడు.
“నాకున్నది ఆయుర్వేదంపైన అపనమ్మకం కాదు. ఆయుర్వేదాన్ని సంపూర్ణంగా అభ్యసించిన మీపైనకూడా కాదు. ఈ మూలికలపైన! వీటి గురించి నాకు తెలియదు. ప్రభువులవారికి కూడా తెలుసునని నేను అనుకోను. ఇక చెప్పవలసింది మీరే!” సూటిగా అడిగింది.
“అమ్మా! ప్రభువులవారి సమక్షంలో వివరణలు గౌరవప్రదం కాదు. వారు అనుమతిస్తే, ఆయుర్వేదం గురించి నేను రెండు మాటలు మీకు మనవి చేసుకుంటాను..” ప్రభువులవారి అనుమతికోసం ఆగాడు రాజవైద్యుడు.
త్రిభువనుడు ఈ మాటలతో తన ఆలోచనలనుండి బయటికి వచ్చాడు.
“ఆయుర్వేదం గొప్పతనమేమిటో రాణీవారికి చెప్పండి. ఆమె అడుగుతున్న ప్రామాణికతను తెలియజేయండి..”
రాజవైద్యుడు కండ్లు మూసుకొని ఆయుర్వేదాన్ని ప్రపంచానికందించిన మహర్షులను స్మరించుకున్నాడు.
“ప్రభూ! రాకుమారులవారికి వచ్చిన వ్యాధి చాలా విపరీతమైంది. చాలా అరుదుగా వచ్చేది. మొదట పరిశీలించినప్పుడు నేను ఈ వ్యాధిని ‘హృద్ధాహ సన్నిపాతకం’ అనుకున్నాను..”
“హృద్ధాహ సన్నిపాతకం.. అంటే?” అడిగాడు త్రిభువనుడు.
“ప్రభూ! కొన్ని సన్నిపాతకములు.. అంటే వ్యాధులు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. భగ్ననేత్రము, హృద్దాహము, కంఠకుబ్జము, అంతకమ్ముర కోష్టము, శీతాంగం, అభిన్యాసము ఇవి చాలా ప్రమాదకరమైనవి. సరైన సమయంలో, సరైన చికిత్స చేయకపోతే 7 రోజుల నుండి 30 రోజుల్లోపు.. మన్నించాలి, ఆ మనిషి మనకు దక్కడు. సోమేశ్వరులవారికి వారి వయసు పదేండ్లే కనుక ఆయుర్వేద ప్రమాణాలను అనుసరించి వైద్యం చేస్తున్నాను. ఔషధానుగ్రహం వల్ల ఇంతవరకూ యువరాజుల వారిని స్పృహలో, సురక్షితంగా ఉంచగలిగాము. కానీ, ఆ సమయం కూడా మించిపోయింది. ఇక మీదట..” అప్రియ సత్యం చెప్పలేక ఆగిపోయాడు.
“మన వలన కాలేకపోతున్నదనే.. పెద్ద వైద్యుడిని ఆశ్రయించాము. వారే ఈ మూలికలను మనకు ప్రసాదించారు” గంభీరంగా అన్నాడు త్రిభువనుడు.
ఆ మాటలకు ఆశ్చర్యపోయింది మహారాణి.
అపర ధన్వంతరి అనదగ్గ చాళుక్య రాజాస్థాన ప్రధానవైద్యుడినే మించిన ఆ మహావైద్యుడెవరు? పతంజలి మహర్షి, చరకుడు, చ్యవనుడు.. వంటి ప్రాణదాతలు మళ్లీ జన్మించారా? లేక అశ్వనీదేవతలే మానవ రూపంలో ఈ ఔషధ మూలికలను ప్రభువువారికి అందించారా? ఏదేమైనా, ఈ మూలికల ప్రభావం ఎటువంటిదో చూడాలి. పసివాడి ప్రాణాలు కాపాడుకోగలిగితే చాలు. యువరాజు ఈ ఆయుర్వేద వైద్యం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడితే అదే ప్రామాణికత అవుతుంది. అందులో సందేహం లేదు.
“అమ్మా! ఆయుర్వేదం అనేది ఒక ప్రామాణిక శాస్త్రం. మేము చదివిన దానినిబట్టి మా పూర్వీకులు తరతరాలుగా మాకు బోధించిన దానినిబట్టి ఆయుర్వేదం అతిప్రాచీనమైంది. కాలపరీక్షకు తట్టుకొని నిలబడింది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రకృతి మనకు ఎన్నో వనమూలికలను ప్రసాదిస్తుంది. మానవ శరీరంలో సహజంగా వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది. శరీరంలోని లక్షణాలకు, ప్రకృతిలోని మూలికలను శుద్ధిద్వారా, తగిన తయారీ విధానం ద్వారా అనుసంధానం చేయగలిగితే.. ఆరోగ్యం సిద్ధిస్తుంది”
“అయితే.. దీనికి శాస్త్ర ప్రమాణాలు ఏవన్నా ఉన్నాయా?” అడిగింది మహారాణి.
“ఉన్నాయమ్మా! వేదాలు వెలిసిన ఈ పుణ్యభూమిలోనే మనిషికి ఆయుష్షు పోసే ‘ఆయుర్వేదం’ కూడా పుట్టింది. వేల సంవత్సరాలకు పూర్వమే ఋగ్వేదంలోని భాగంగా చెప్పబడింది.. ఆయుర్వేద జ్ఞానం! వివిధ సందర్భాల్లో ప్రస్తావితమైన వైద్యవిజ్ఞానాన్ని క్రోడీకరించి, భరద్వాజ మహర్షి తన శిష్యులకు ఉపదేశించాడు. ఆయన శిష్య పరంపరలో ముఖ్యుడు పునర్వసు ఆత్రేయుడు. ఆయన దగ్గర విద్యను క్షుణ్ణంగా అభ్యసించిన మహాత్ముడు అగ్నివేశుడు. అధ్యయనం ముగిసిన తర్వాత ‘అగ్నివేశ తంత్రము’ అనే తొలి వైద్యగ్రంథాన్ని రచించాడు అగ్నివేశుడు. నిగూఢంగా ఉన్న ఆ గ్రంథాన్ని చరక మహర్షి సులభ సాధ్యంగా అర్థమయ్యే రీతిలో సంస్కరించాడు. అందుకే, అది ‘చరక సంహిత’ పేరుతో వైద్యవిద్యార్థులకు ఆరాధ్యగ్రంథమైంది. సూత్రస్థానం, నిధానస్థానం, విమానస్థానం, శారీరస్థానం, ఇంద్రియస్థానం, చికిత్సాస్థానం, కల్పస్థానం, సిద్ధిస్థానం.. అనే 8 భాగాలుగా రాసిన ఈ సిద్ధాంత గ్రంథం శరీరతత్తం, రోగ నిశ్చయ విధానం, ఔషధ కల్పనలు, చికిత్సా పద్ధతులు, పంచశోధన కర్మల ప్రయోగ వివరాలను స్పష్టంగా తెలియజేస్తున్నది” రాజవైద్యుడు చెప్తుండగానే త్రిభువనుడు నవ్వుతూ అన్నాడు..
“వైద్య శిఖామణీ! చరక మహర్షి చెప్పిన ఒక మంచిమాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే, మేము తీసుకొచ్చిన అరుదైన ఔషధగుణాల మూలికలను, వాటిని రసం చేసి కంటిలో వేయాలని ఆ మహావైద్యుడు ఇచ్చిన సూచనను మా రాణీవారు ఇంకా నమ్మడం లేదు. అందుకే చరక ముని, ‘తదేవ యుక్తం భైషజ్యం యదారోగ్యాయ కల్పతే!’ అన్నాడు.”
ఆశ్చర్యపోయాడు రాజవైద్యుడు.
“అవును ప్రభూ! చాలా మంచిమాట అది.
‘తదేన యుక్తం..’ అంటే చికిత్సాద్రవ్య జ్ఞానాన్ని పామరులు అని మనం అనుకునే సామాన్యుల నుండి, కొండజాతి వారినుండి పశువుల కాపరులనుండి కూడా గ్రహించి, సరైన విధానంలో ఉపయోగించాలని ‘చరక సంహిత’ చెప్తున్నది. తమకు అందుబాటులో ఉన్న ప్రకృతి ఇచ్చిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి, వ్యాధిగ్రస్తులపైన ప్రయోగించి, మంచి ఫలితాలు రాబట్టిన మందులను వాటి తయారీ విధానాన్ని పదిమందికీ ఉపయోగపడేలా చేయవలసిందని చరక మహర్షి ఉపదేశించాడు. వ్యాధి నివారణ కలిగించేలా పని చెయ్యడమే ఆ మందుకు ప్రామాణికతగా మనం పరిగణించాలి” చరక సంహితను తలుస్తూ, సంతోషంతో చెప్పాడు రాజవైద్యుడు. మహారాణి ఈ మాటలు విని మౌనం వహించింది.
‘కొత్త మందును నమ్మడం అంత సులభమైన విషయం కాదు. కానీ, కొత్త వ్యాధులు చుట్టు ముట్టినప్పుడు పాత మందుల పనితనం ప్రశ్నార్థకమవుతుంది. అందుబాటులో ఉన్న చికిత్సా విధానం వల్ల ఉపయోగం సందేహాలకు దారితీస్తే కొత్త మందుల ప్రయోగం తప్పదు. ప్రయోగాలవల్లనే ఫలితం నిర్ధారితమవుతుంది.’
మహారాణి ఏమి ఆలోచిస్తున్నదో త్రిభువనుడికి అర్థం కాలేదు. తను ఆదేశపూర్వంగా ఈ ఔషధాన్ని యువరాజుకు అందించగలడు.
కానీ, ఆమె కన్నతల్లి. ఔషధ సేవనంలో నమ్మకం చాలా పని చేస్తుంది. ఇచ్చేవారికి, తీసుకొనే వారికి పరిపూర్ణ నమ్మకం ఉంటేనే మనోధైర్యంతో.. ఆ మందు విజయం సాధిస్తుంది.
“అమ్మా! ‘చరక సంహిత’ వంటి మరో అద్భుత వైద్యగ్రంథం ‘సుశృత సంహిత’. కాంభోజరాజు కాలంలో ఆస్థానవైద్యుడిగా ఉన్న ‘సుశృతుడు’ శస్త్రచికిత్సను కూడా కలుపుకొని ‘సుశృత సంహిత’ను మానవాళికి అందించాడు..”
“శస్త్రచికిత్స అంటే?”
“శస్త్రచికిత్స అంటే శల్యతంత్రం. మానవ శరీరంలోని చెడిపోయిన భాగాలను శస్త్రంతో తీసివేసి, ఆ వ్యాధి వ్యాప్తిని అరి కట్టడం. బాధ తొలగించడం. సుశృతుడు గొప్ప శల్య తంత్రవేత్త” అని మళ్లీ కొనసాగించాడు రాజవైద్యుడు.
“సుశృత సంహిత రాసి ఇన్ని వేల ఏండ్లయినా ‘ఇటీవలే రాయబడిందా?’ అని ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘అసలు వైద్యుడనేవాడు గురువువద్ద విద్య అభ్యసించాలి’ అని చెప్పిన మహానుభావుడు సుశృతుడు. ఆరు భాగాలుగా ఈ గ్రంథం ఆయుర్వేదానికి ఆధారమైంది. అవి: సూత్రస్థానం, నిధానస్థానం, శారీరస్థానం, చికిత్సాస్థానం, కల్పస్థానం, ఉత్తరస్థానమూ. ఔషధ ద్రవ్యగుణాలు.. మందులు పనిచేయగల శక్తి, ఫలితాలు, పంచభూతోత్పత్తి, శల్య తంత్రముల వివరాలు, కంటివ్యాధులు.. చికిత్సలు, ఆరోగ్య సూత్రాలు ఎంతో వివరంగా చెప్పారు సుశృతుడు. మనిషికి బ్రహ్మ జన్మనిస్తే ఆ జన్మించిన మనిషి శరీరంలో ఏయే వ్యాధులు పుట్టుకొస్తాయో, వాటిని ఎలా నివారించాలో, నిర్మూలించాలో ‘సుశృత సంహిత’ విశదంగా చెప్పింది. అందుకే, ఆయుర్వేదం మనకు జీవన వేదం! దాన్ని అభ్యసించగలిగిన అదృష్టవంతుణ్ణి నేను”.. చరకుడిని, సుశృతుడినీ తలుచుకున్నప్పుడల్లా తన మనసు ఆనందంతో పులకించిపోతున్నది. భావోద్వేగం ఆవరిస్తుంది.
“అందుకే, ‘వైద్యో నారాయణో హరి’ అన్నారు. మీవంటి ప్రాణాలు నిలిపే వైద్యుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే!” కృతజ్ఞతా పూర్వకంగా అన్నది మహారాణి చంద్రలేఖ. ఆ మాటలకు చేతులు జోడించాడు రాజవైద్యుడు.
“కాదమ్మా, ఇక్కడ ఈ వైద్యుడు నారాయణుడు కాదు. సాక్షాత్తూ నారాయణుడే వైద్యుడై, ఈ అపూర్వ ఔషధాన్ని ప్రభువులవారికి ప్రసాదించాడు” వినయంగా అన్నాడు. ఆ మాటలకు త్రిభువనుడిలో సజీవంగా ఉన్న జ్ఞాపకం కనుల ముందు దృశ్యమై నిలిచింది.


“అవును.. నా నారాయణుడు.. నేను నమ్మిన దేవదేవుడు నారసింహుడు.. ఈ ఔషధాన్ని అందించాడు మహారాణీ”
.. నారసింహమూర్తిని కనులారా గాంచిన ఆ నిమిషంలో తాను అచేతనుడయ్యాడు.
ఇది కలయా? నారసింహుని మాయా? ఆనాడు యాదర్షికి దర్శనమిచ్చిన లోకైకమూర్తి తనకు కలలో కాకుండా ఇలలో కనిపించాడా?
“తీసుకో.. ఈ మూలికలు తీసుకో..” ఎవరిదో సుశ్రావ్య గంభీరస్వరం తనను ఆదేశిస్తున్నది.
ఎవరు, ఎవరితో చెప్తున్నారు. తనతో అంత వరకూ మాట్లాడిన నామాల వృద్ధుడేమయ్యాడు?
ఆ క్షణం.. హోరుగాడ్పుల బీభత్స శబ్దం.
ఆ క్షణం.. కోటి సూర్యకాంతుల జ్వాలభ్రమణం..
ఆ క్షణం.. ఆకాశం దాక విస్తరించి ఉన్న సింహరూపుని చిద్విలాసం..
ఆ క్షణం.. సప్త సాగరాల అశేష తరంగాలలో చిందులై.. అంతరిక్షం దాకా వ్యాపించిన సింహాకృతిని కనులు మూసుకొనో, కనులు తెరిచో జ్ఞప్తికి రావడం లేదు. కానీ, ఆ నారసింహుడి విశ్వరూపంలో లక్షో వంతును చూస్తున్న దృశ్యం..
ఆ అపూర్వ దృశ్యం.. క్షణకాలమా? చిరకాలమా?
కాలగణన తెలియకుండా నిలిచి అదృశ్యమైంది. తాను రాజమందిరానికి అడుగుపెట్టిన క్షణమే.. కలలోనుండి బయటికి వచ్చాడు తను!
బహుశా అప్పుడే, తాను ఆ మూలికలు తీసుకొని ఉత్తరీయం కట్టుకొని ఉంటాడు. ఏదీ గుర్తు లేదు. అంతా కలలాగా ఉంది. కానీ, అది స్వప్నమైతే ఔషధం మాత్రం సత్యం!


“మహారాణీ! నీ సందేహం తీరిందా? ఈ మూలికలను నూరి రసాన్ని సోమేశ్వరుని కంట్లో వేయమంటావా?” సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు త్రిభువనుడు. రాణీ చంద్రలేఖకూడా అయోమయ స్థితికి వెళ్లిపోయింది. అసంకల్పితంగా, ‘సరే’ అన్నట్లు తలూపింది. అదే ఆదేశంగా తీసుకొని రాజవైద్యుడు తన అనుభవంతో క్షణాల్లో ఔషధాన్ని సిద్ధం చేశాడు. త్రిభువనుడు కనులు మూసుకొని..
“ఓమ్‌ నమో నారసింహాయ” అని భక్తితో ప్రార్థించాడు.
రాజవైద్యుడు సోమేశ్వరుని కనులు తెరిచి, ఒక చుక్క ఔషధాన్ని కంట్లో వేశాడు.
“అమ్మా..” మందిరం పైకప్పు కదిలిపోయేలాగా గట్టిగా అరిచాడు సోమేశ్వరుడు.
-అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement