e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఎవర్‌గ్రీన్‌ యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు. సాక్షాత్తు నారసింహుడే తన భక్తుడిని రక్షించుకుంటాడు. కానీ, రాజ్యంలో మాత్రం అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ భయం! సాక్షాత్తు రాణీగారే యుద్ధరంగానికి వెళ్తానని ప్రకటిస్తారు. అంతలోనే..

కొండపైన కొలువైన శ్రీ లక్ష్మీనారసింహునికి అత్యంత భక్తిశ్రద్ధలతో సాష్టాంగ ప్రణామం చేస్తున్న గజేంద్రునివలె కనిపిస్తున్నది భువనగిరి దుర్గం. వాతావరణం ఎన్నడూ లేనంత ఉద్విగ్నభరింతగా ఉన్నది ఆనాడు! కారణం..
నారసింహుని దర్శనానికి వెళ్లిన విక్రమాంకదేవ చక్రవర్తి, భువనగిరీశుడు త్రిభువనమల్లుడు తిరిగి వచ్చిన శుభ సమయం.
శుత్రదుర్భేద్యంగా నిర్మితమైన భువనగిరి దుర్గం ఒక కోట మాత్రమే కాదు, కొండపైన వెలసిన నగరం. భగీరథుడు ఆకాశగంగను నేలమీదికి తీసుకొస్తే, ఈ అపర భగీరథుడు, త్రిభువనుడు కొండపైనే జలాశయాలను ఏర్పరచాడు.
ఏడు గుండాలు అన్ని కాలాల్లో నిండుగా పొంగి పొర్లే మంచినీటి సరస్సులు. ‘ఎక్కడ నీటికి లోటుండదో అక్కడ కన్నీటికి చోటుండదు’ అని నమ్మిన త్రిభువనుడు కోటలోనే కాదు, ప్రతి గ్రామంలోనూ చెరువులు తవ్వించాడు. ‘యథారాజా తథాప్రజా’ అన్నట్టు పరిపాలకుని ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, రాజ్యమంతటా జలాశయాలను పరిరక్షించుకున్నారు స్థానిక గ్రామపెద్దలు.
కోటలో ఏడు గుండాలమీదుగా వీస్తున్న చలచల్లటి గాలి అందరినీ పరవశులను చేస్తున్నది.
మహాలక్ష్మీ ద్వారం!
భువనగిరి దుర్గానికి అపూర్వమైన అలంకారం. అందరి దృష్టిలో అది కేవలం ద్వారం కాదు, అష్టలక్ష్ములూ అనుగ్రహించే అష్టయిశ్వర్యాలకది ముఖద్వారం!
‘లక్ష్మీద్వారం’ వద్ద మహారాణి చంద్రలేఖ సపరివారంగా చేతులు జోడించి నిలబడి ఉంది. ఆస్థాన పురోహితులు, వేదపండితులు, అతిముఖ్యులైన అధికార ప్రముఖులు మాత్రమే అక్కడ భక్తిభావంతో రాజాజ్ఞకోసం ఎదురు చూస్తున్నారు.
అందరి దృష్టీ కనులు మూసుకొని ధ్యానిస్తున్న త్రిభువనమల్ల చక్రవర్తిపైనే ఉంది.
సర్వకాలాల్లో సర్వాలంకరణ భూషితులై దర్శనమిచ్చే ప్రభువులవారు నేడు నిరాడంబరంగా ఉన్నారు. కేవలం ఉత్తరీయం, ధోవతి మాత్రమే ధరించి ఉండటం రాజ సంప్రదాయం కాదు. అందుకే, ద్వారబంధం దగ్గర రాకపోకలను నిషేధించారు. విద్యాపతి, అనంతపాలుడు, దుర్గాధికారి అంటే పర్యవేక్షకుడైన దండనాయకుడు లక్ష్మీదేవుడు, రాజ పురోహితులు, రాజ వైద్యుడు, రాణీగారి ప్రధాన పరిచారిక.. వీరు మాత్రమే అక్కడున్నారు. అంగరక్షక దళం కాస్తదూరంలో సాయుధులై కాపలా కాస్తున్నారు.
రాణీ చంద్రలేఖ ద్వారంపైనున్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని చూస్తూ ప్రార్థించింది, తనలో తానే.
‘సర్వసంపత్‌ స్వరూపత్వమ్‌
సర్వేషాం సర్వరూపిణీ
రాశేశ్వర్యధి దేవీత్వం
త్వత్కాళాః సర్వయోషితః
సర్వమంగళదం స్తోత్రమ్‌
శోక సంతాప నాశనమ్‌
హర్షానందకరం శాశ్వద్ధర్మ
మోక్ష సుహృత్‌ప్రదమ్‌’
‘అమ్మా! లక్ష్మీదేవి, నీవు సంపత్‌ స్వరూపిణివి, అందరిలో ఉన్న అన్ని రూపాలూ నీవే. రాసేశ్వర్యాదేవీ! నీ కళలనుండే అందరూ ఉద్భవించారు. సర్వమంగళకరం నీ స్తోత్రం. శోకాన్ని, సంతాపాన్ని నీ భక్తుల దగ్గరకు రాకుండా చేస్తావు. సంతోషం, సౌభాగ్యం, ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ప్రసాదిస్తావు’.
***
త్రిభువనమల్లుడు కనులు మూసుకొని ధ్యానముద్రలో నిలబడి ఉన్నాడు. ఈ లోకంలో లేడు. లక్ష్మీద్వారాన్ని నిర్మించినవాడు త్రిభువనమల్లుడే. అష్టలక్ష్ముల అనుగ్రహం కోరి, అతిసుందర శిల్పాలతో శాస్ర్తోక్తంగా రూపొందింది లక్ష్మీ ద్వారం.
అష్టలక్ష్ములూ కొలువైన కోటలో సద్భావన సందేశం ఈ లక్ష్మీద్వారం.
అందరికీ అభయమిచ్చే ఆదిలక్ష్మి. వరికంకి, చెరుకు గడ, అరటిని హస్తాలలో ధరించి, వ్యవసాయాభివృద్ధిని, సమృద్ధిని ప్రసాదించే ధాన్యలక్ష్మి. శౌర్యాన్ని, ధైర్యాన్ని కలిగించే ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి.. ఈ అమ్మవార్లందరూ లక్ష్మీ స్వరూపాలే! సకల సౌభాగ్యాలనూ అనుగ్రహించే మాతృమూర్తులే.
ద్వారంపైన శిలారూపంలో కొలువై ఉన్నది లక్ష్మి. రాజ్య ప్రదాత. రెండు చేతుల్లో రెండు పద్మాలు. రెండు హస్తాలూ వరదాభయ ముద్రలో ఉంటాయి.
ఇరువైపులా రెండు ఏనుగులు. శుభకారక గజాలు. అభిషేకం చేస్తుంటాయి.
లక్ష్మీ ద్వారం ముందు నిలబడి ఉన్న త్రిభువనమల్ల చక్రవర్తి ‘ఎప్పుడు కనులు తెరిచి చూస్తారా, ఎప్పుడు వారికి స్వాగతం పలికి జయజయ ధ్వానాలతో కోట లోపలికి తీసుకు వెళ్దామా’ అనే ఉత్కంఠతో వేచి చూస్తున్నారు వందిమాగధులు.
రాణీ చంద్రలేఖ ప్రభువుల దగ్గరికి వెళ్లింది.
“ప్రభూ! మీరు అనుమతిస్తే మీకు స్వాగతం పలికి సాదరంగా మన మందిరానికి తీసుకువెళతాను..”
ఆమె మాటలు విని కనులు తెరిచాడు త్రిభువనుడు.
చుట్టూ పరికించాడు.
ఎక్కడున్నాడు తను?
“నేను ఎక్కడున్నాను?”
రాణీ చంద్రలేఖను సూటిగా చూస్తూ
అడిగాడు.
ఆ ప్రశ్న వింటూనే అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.
“ప్రభూ! మీరు మన భువనగిరి దుర్గంలో ఉన్నారు. తృతీయ ద్వారం.. లక్ష్మీ ద్వారం వద్ద ఉన్నారు. మా కోరిక మన్నించి లోపలికి రండి..” వినయంగా పలికింది చంద్రలేఖ.
“నేను ఎవరిని?” ముఖంలో ఏ భావమూ లేకుండా అడిగాడు త్రిభువనుడు.
తాము ఏం వింటున్నామో అర్థం కాక, అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
‘ఏం జరిగింది?’
‘ప్రభువుల వారు ఎందుకీవిధంగా మాట్లాడుతున్నారు?’
అనంతపాలుడు ప్రభువుకేసి తేరిపార చూసి, ఒకడుగు వెనుకకు వేశాడు.
“మీరు భువనగిరి రాజ్యాధినేతలు. పశ్చిమ చాళుక్యవంశ కేసరి త్రిభువనమల్ల చక్రవర్తులు.. మా ప్రభువులు” కంఠం వణుకుతుండగా విద్యాపతి నెమ్మదిగా చెప్పాడు.
అతని కంట నీరు ఆగడం లేదు.
ఏమయింది త్రిభువనమల్ల చక్రవర్తికి?
“నేను ఎక్కడున్నాను? నేను ఎవరిని?” అని అడిగే మానసిక స్థాయికి వెళ్లిన వ్యక్తి, రాజ్యభారాన్ని ఎలా మోయగలడు? యుద్ధం ముంచుకొస్తున్న ఈ సంక్షోభ సమయంలో ఈ పరిస్థితి ఏమిటి?
రాణీ చంద్రలేఖకు నోటమాట రాలేదు. ‘తన ప్రాణనాథుడు తిరిగి వస్తాడు. సమస్యలు తీరుస్తాడు. తమ ప్రియతముడు.. కన్నబిడ్డ సోమేశ్వరున్ని బతికించుకుంటాడు. శత్రురాజు దాడినుండి సామ్రాజ్యాన్నీ, ప్రజలనూ రక్షిస్తాడు..’ అనే ఆశతో ఉంది తను.
“ప్రభూ..” ఆందోళనగా పలికింది
ఆమె స్వరం.
“కాదు, నేను ప్రభువును కాదు..”
తల అడ్డంగా ఊపాడు.
రాజ వైద్యుడికి అనుమానం వచ్చింది.. ప్రభువుల వారిపైన ఏదైనా విష ప్రయోగం జరిగిందా?’
“కాదు, మహారాణీ! నేను ప్రభువును కాదు. అందరికీ ప్రభువు ఆ లక్ష్మీ నారసింహుడు. సకల లోకాలను పాలించే శాశ్వత పాలకుడు ఆయనే. నేను కాదు..”
ఆ మాటలతో అక్కడ భయంకరమైన నిశ్శబ్దం ఆవహించింది.
మహారాణి మౌనంగా ముందుకొచ్చింది. త్రిభువనుడి పాదాలను స్పృశించి, నమస్కరించింది. తన ప్రధాన పరిచారిక నాగమల్లికకు కనులతోనే ఏం చేయాలో ఆదేశించింది.
ఆ సంకేతాన్ని అందుకున్న నాగ మల్లిక, విద్యాపతికి విన్నవించింది జరగ వలసినదేమిటో!
విద్యాపతి పురోహితులకు, వేద పండితులకు స్వాగత కార్యక్రమాలు కొనసాగించాల్సిందిగా సూచించాడు.
సంప్రదాయబద్ధంగా లక్ష్మీ ద్వారానికి పూజలు నిర్వహించారు.
పెద్ద గుమ్మడికాయను హారతి కర్పూరంతో దిష్టి తీసి అవతల పారవేశారు.
స్వస్తి వచనాన్ని పఠించారు..
“స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేన మహీంమహీశా
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినోభవంతు”
‘ప్రజలందరికీ శుభం కలుగుగాక. భూమిని పాలించే న్యాయవర్తనుడైన ప్రభువుకు, గోసంతతి, పాడిపంటలనిచ్చే వ్యవసాయదారులకు, పురానికి హితం కోరి, అందరి ఇండ్లల్లో శుభకార్యాలద్వారా శుభాన్ని ఆశించే బ్రహ్మమూర్తులకు, లోకంలోని సమస్త జనులకు శుభం కలుగుగాక!’
ఆశీర్వచనం తరువాత త్రిభువనుడు ముందుకు కదిలాడు.
విద్యాపతి, అనంతపాలుడు ‘ఏం చేద్దాం’ అన్నట్లు ముఖాముఖాలు చూసుకున్నారు.
వారి మనసుల్లో భావాలను గ్రహించినట్టుగా అన్నది రాణీ చంద్రలేఖ..
“ప్రభువుల వారు కొద్ది సమయం విశ్రాంతి తీసుకొని, ఆంతరంగిక మందిరానికి వచ్చేస్తారు. మనకు దిశా నిర్దేశనం చేస్తారు..”
ఆ మాటలతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టయి, వినయంగా తల పంకించాడు విద్యాపతి.
జయజయ ధ్వానాలతో స్వాగత వచనాలతో, రాజ లాంఛనాలతో అడుగు ముందుకు వేశాడు త్రిభువనుడు.
***
రాజమందిరంలో ఉన్నతాసనంలో ఆసీనుడై ఉన్నాడు త్రిభువనమల్లుడు.
రెండు ఘడియలు గడిచినా, మౌనంగా ఏవో ఆలోచనల్లో లీనమై ఉండటం చూస్తుంటే చాలా అసహనంగా ఉన్నది చంద్రలేఖ మనస్సు. రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకుడు ఏదీ చెప్పకుండా, ఏదీ వినకుండా మౌనంగా ఉంటే, ఆ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి!
అసలు నారసింహుని దర్శనానికి వెళ్లిన చక్రవర్తి ఇలా ఎందుకు మారిపోయారు?
దైవ దర్శనం లభించిందా? లేదా?
“ప్రభూ!..”
ఆలోచనల సంకెళ్లు తెగిపోయి, ఆమెకేసి తేరిపార చూశాడు.
“దేవీ! మేము అడిగిన రెండు ప్రశ్నలు ఇంకా నిన్ను కలవర పెడుతున్నాయి కదూ..”
“అవును ప్రభూ! ‘నేనెక్కడున్నాను?’ అన్న ప్రశ్న తాత్కాలిక మనో విభ్రమం అనుకున్నాను. కానీ, ‘నేనెవరిని?’ అన్నమాట మీ నోట వినగానే నా మనసు స్తంభించిపోయింది. ‘నేనెవరిని?’ అని మీకు మీరే ప్రశ్నించుకుంటే, మీ కనుసన్నల్లో, మీ ఛత్రఛాయలో జీవించే మేమంతా ఏమై పోవాలి? అసలు ఆ కొండమీద, ఆ అడవిలో ఏం జరిగింది?”
“రాణీ చంద్రలేఖా! నేను దర్శించాను. అద్భుతమైన శ్రీ నారసింహుని దివ్యవిగ్రహాన్ని. నాడు మహర్షి యాదర్షి కనులారా కాంచిన పాంచనారసింహుల పవిత్రమూర్తులను నేను చూడగలిగాను. ఈ జన్మకు ఇక ఇది చాలు అనిపిస్తున్నది. ఇంకా నేను ఏమనుకుంటున్నానో తెలుసా? స్వామివారి సన్నిధానంలో శేష జీవితాన్ని
గడిపేద్దామని..”
ఆ మాట ఇంకా పూర్తి కాకుండానే చంద్రలేఖ గభాల్న తన ఆసనం నుండి లేచి, ఆయన పాదాల వద్ద కూర్చున్నది.
“దేవీ! ఏమిటిది? అర్ధ సింహాసనాన్ని అధిష్టించే మా అర్ధాంగి పాదాల చెంత కూర్చోవడమా? మేము నిన్నెప్పుడూ అవమానించలేదే! మహారాణి అని గౌరవించామే తప్ప పాదదాసిగా భావించలేదే! ఈ పనిద్వారా నీవు చెప్పదల్చుకున్నదేమిటి?..” అర్థంకాని స్థితిలో అడిగాడు.
“ప్రభూ! మీరు నారసింహుల పాదాల దగ్గర మీ శేష జీవితాన్ని గడిపేస్తానంటున్నారు. మీ పాదసేవ చేస్తూ తరించడం తప్ప నా జీవితానికి మరో పరమార్థమేమున్నది?”
ఆ మాటకు బదులు చెప్పలేదు త్రిభువనుడు.
“మనిద్దరమూ భక్తిభావంతో సర్వసంగ పరిత్యాగులమైతే, మన కుమారుడు సోమేశ్వరుని పరిస్థితి ఏమిటి?” ఒకింత ఆగ్రహం వినిపించింది ఆమె మాట్లలో.
త్రిభువనుడు ఆలోచించాడు.
“ప్రభూ! ప్రజలను పరిపాలించే చక్రవర్తికి వారి సంక్షేమమే సంపూర్ణ జీవితం అవుతుంది. శేష జీవితం అంటూ ఉండదు..”
మళ్లీ తనే చెప్పింది. “కొండమీద మీరేమి దర్శించారో, ఏయే అనుభవాలు కలిగాయో నాకు తెలియదు. కానీ, ఈ కోటలో మాత్రం మీరు వెళ్లిన తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. పరిస్థితులు మరీ దుర్భరం అయినాయి”
“సోమేశ్వరుడి గురించా నువ్వు చెప్పేది?” ఆమె మాటలకు అడ్డొస్తూ అన్నాడు.
“మన బిడ్డ భవిష్యత్తు మన చేతుల్లో లేదు. కానీ, భువనగిరి సామ్రాజ్యంలోని ప్రజల భవిష్యత్తు మాత్రం మీ చేతుల్లోనే ఉంది..”
“అంటే..?” అర్థం కాక అడిగాడు.
“విష్ణువర్ధనుడు మన సరిహద్దు రక్షణ దుర్గాన్ని ఆక్రమించుకున్నాడు. సైన్యాలతో తరలి వస్తున్నాడు. మీరు రావడం ఆలస్యమవుతుందేమోనని యుద్ధానికి నేనే సారథ్యం వహించాలనుకున్నాను. ఇప్పుడు మీరొచ్చారు. మా అందరికీ ధైర్యం వచ్చిందనుకుంటే.. వీరులైన మీరు యుద్ధంలో గెలిచే కత్తిని వదిలేసి, చేతికి భక్తి కంకణం కట్టుకుందామని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?..” నిష్ఠూరంగా అడిగింది.
“రాణీ చంద్రలేఖా! నీ సందేహాలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. కానీ, దానికంటే ముందు నేనొక ప్రశ్న అడుగుతాను”
“అడగండి”
“నేను నమ్మే నారసింహుడిపైన నమ్మకం ఉందా?”
‘లేదు’ అన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది.
“నమ్మకం లేదా?” రెట్టించి అడిగాడు.
“లేదు ప్రభూ! నాకు మీపైన నమ్మకం ఉంది. కానీ, మీరు నమ్ముతున్న ఆ సింహదేవుడి మీద నాకు నమ్మకం లేదు. మిమ్మల్ని బాధ పెడితే మన్నించండి..”
నవ్వాడు త్రిభువనుడు.
“ఏం జరిగితే, నీకు నా దేవుడిపైన నమ్మకం ఏర్పడుతుంది?” ప్రశ్నించాడు.
“జరగకూడనిదే జరుగుతున్నది ప్రభూ! నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకు పదేండ్లు కూడా నిండకుండానే నూరేండ్లు నిండిపోతున్నాయి. రాజ్యం సంక్షోభంలోకి వెళ్తున్నది. మీరొస్తారు, అన్ని సమస్యలూ పరిష్కరిస్తారనే నమ్మకంతో ఎంతో ఆశ పెట్టుకుంటే, ఆ నమ్మకమే కుప్పకూలిపోయింది. మీరు నమ్మే దేవుడిపైన మీరుంచిన నమ్మకం.. మీదే కానీ, ఆ దేవుడికేం సంబంధం లేదు. ‘రాయి’లో ఉన్నవాడు రాయిగానే ఉన్నాడు. ఇదంతా మహిమ కాదు. మన నమ్మకం. మన తపన, మన తండ్లాట! అంతే..”
ఇంక చెప్పలేక ఆగింది, గొంతు గాద్గదికమయింది.
“దేవుడికోసం మనం ఆరాటపడితేనే కదా, ఆయన మనకోసం వచ్చేది. భక్తి అనేది నిర్బంధం కాదు. మహిమ చూపిస్తేనే నిన్ను నమ్ముతా అనే ఒప్పందమూ కాదు. ఎందుకో నాకు వెంటనే మన బిడ్డను చూడాలని
పిస్తున్నది..”
అంటూ లేచి, యువరాజు శయన మందిరంలోకి వెళ్లాడు.
వెనుకనే అనుసరించింది రాణీ చంద్రలేఖ.
“వాడి ఆరోగ్యం బాగా క్షీణించింది. స్పృహలో లేడు. మీరు చూసి తట్టుకోలేరు..” చెప్పలేక, చెప్పలేక చెప్పింది.
“అయితే ఒక పని చెయ్యి. ఈ మూడు మూలికలను ముద్ద చేసి, ఆ రసాన్ని సోమేశ్వరుడి కంటిలో రెండు చుక్కలు వెయ్యి.
ఆ క్షణంలో ఒక్కసారి ‘నమో నారసింహా!’ అని దండం పెట్టుకో. ఇదంతా నీకు నమ్మకం కలిగించడానికి కాదు. నాకు నమ్మకం ఉంది కనుక, మానవ ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేకపోయినై కనుక..”
ఎందుకో ఆమె వద్దనలేక పోయింది.
సోమేశ్వరుడు కనులు మూసుకొని అచేతనంగా వాలిపోయి ఉన్నాడు. ఏం చేయాలి?

-అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement