e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎవర్‌గ్రీన్‌ యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే నర్మగర్భంగా మాట్లాడుతున్న ఓ బాలకుడు ప్రభువుల వారికి దిశానిర్దేశం చేస్తాడు. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు. సాక్షాత్తు నారసింహుడే తన భక్తుడిని రక్షించుకుంటాడు.

శ్రీలక్ష్మీ నారసింహుడే మహావైద్యుడై.. త్రిభువనమల్ల చక్రవర్తిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మార్చడాన్ని చూసిన కొండన్న, నరసింహదాసు పరవశులైపోయారు. ‘ఎంత త్వరగా ఈ వార్తను రాజధానికి చేరవేద్దామా..’ అని ఆత్రుతపడ్డారు. “అయ్యా.. నరసింహదాసయ్యా! అసలు ఈ మహిమ మన కండ్లముందే జరిగింది అంటే నేను నమ్మలేకపోతున్నా..” అంటూ కొండన్న నిలువెల్లా కంపించిపోతున్నాడు.“అవును.. కొండన్నా..! యాదగిరీశుడు.. శ్రీ లక్ష్మీసమేత అనుగ్రహ నరసింహస్వామి గురించి, ఎన్నో పురాణాలు చదివిన పెద్దలు చెప్పిన మాటలు చిన్నప్పట్నించీ శ్రద్ధగా ఆలకిస్తున్నాను. అణువణువునా.. అడుగడుగునా స్వామి మహిమ ఉంటుందని మహాత్ములు చెప్పగా విన్నాను. విశ్వసించాను. నమ్మిన వారిని కాపాడే దేవుడని తెలుసుగానీ, ఇంకా పూర్తిగా నమ్మకం కుదరని వారినికూడా కాపాడుతాడని తెలుసుకోలేక పోయాను. ఇప్పుడే భువనగిరి కోటలోని ఈ సమాచారం చేరవేద్దాం”

కొండ దిగుతూ.. అడవిలో అడుగులు వేస్తూ.. ‘ఎప్పుడెప్పుడు ఈ శుభవార్తను కోటలో వెల్లడిద్దామా..?’ అని వేగంగా.. ఉద్వేగంగా పులకించిపోతున్నారు ఇద్దరూ! సరిగ్గా అదే సమయంలో..
మహారాణి చంద్రలేఖాదేవి తన కుమారుడు చికిత్స పొందుతున్న మందిరంలోకి అడుగుపెట్టింది. అంతుపట్టని వ్యాధితో బాధ పడుతున్న తన పదేండ్ల కొడుకు సోమేశ్వరుడు.. చాలా శుష్కించి పోతున్నాడు. కళావిహీనమైన రాకుమారుడి కండ్లలో అమ్మను చూస్తూనే వెలుగొచ్చింది.
అమ్మ దగ్గరికి రాగానే.. పడుకున్న మంచంపై నుంచే రెండు చేతులూ చాచాడు. ఆ చాచిన చేతులను పూర్తిగా లేపే శక్తి లేక.. వదిలేశాడు.
అది చూసిన చంద్రలేఖ కండ్లలో నీరు!
“నాయన గారు.. ఎప్పుడు వస్తారమ్మా?” ఒక్కో పదాన్ని కూడదీసుకుంటూ.. బలహీనంగా అడిగాడు.
ఎవరు చెప్పాలి సమాధానం?
“వస్తారు కన్నా! నీ ఆరోగ్యం కోసమే.. ప్రభువులవారు నరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. త్వరలోనే తిరిగొస్తారు. నీ వ్యాధి నయమైపోతుంది. నువ్వు మళ్లీ హాయిగా.. అందర్లా ఆడుతూ పాడుతూ తిరుగుతావు”.. ఆ మాటలనైతే పలికింది కానీ, తనకే నమ్మకం లేని తన మాటల్ని పసికందు నమ్ముతాడా?
“నమ్మనమ్మా.. నువ్వు చెప్పింది నేను నమ్మను. ఏదో నా కోసం చెప్పాలని చెప్తున్నావు కదూ! నాయనగారు దేవుడ్ని చూడటానికి వెళ్లారేమో కానీ, నేను రేపో.. ఎప్పుడో దేవుడి దగ్గరికే వెళ్లిపోతా కదా?” ఆ పిల్లాడి మాటలు పూర్తి కాకుండా.. చేత్తో నోరు మూసింది చంద్రలేఖాదేవి.
“ఏం మాటలు సోమేశ్వరా.. ఇవి? ఇలా మాట్లాడి అమ్మను బాధపెట్టొచ్చా?” కోపంగా అన్నది మహారాణి.

“అమ్మా.. బాధ అనేది నీకు కొత్త కాదు. నాకూ కొత్త కాదు. నేను గవాక్షంలో నుంచి చూస్తుంటాను. సూర్యుడి వెలుగు అలా వెళ్లిపోతుంటుంది. వెలుగు తక్కువై తక్కువై ఆరిపోతున్న దీపంలా.. మొత్తానికి ఆ కాస్త వెలుతురూ వెళ్లిపోతుంది. మొత్తం చీకటై పోతుంది. చూస్తుండగానే! తెలుసా అమ్మా.. నాకుకూడా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడూ నా ఒంట్లో ఉన్న వెలుగుకూడా కాస్తకాస్త.. చివరికి మొత్తంగా వెళ్లిపోతుందేమో అని! అమ్మా నువ్వు అమ్మవు కదా! అన్ని విషయాలూ తెలిసిన దానివి కదా..! నాకెందుకు చెప్పలేదమ్మా చిన్నప్పుడే! నీకంటే గొప్పవారు నాయనగారు. మనందరికీ చక్రవర్తి కూడా! మరి ఆయనకూడా చెప్పలేదు. మీలాంటి పెద్దవాళ్లకే తెలియకపోతే.. నేను చిన్నవాణ్ణి కదా! నాకెలా తెలుస్తుందమ్మా.. నా పరిస్థితి ఇలా అవుతుందని? ఎవరిని అడగాలి? ఎవరు చెప్తారు?” ఆయాసపడుతూనే ఒక్కోమాటా పలికాడు.
నిజమే.. పెద్దవాళ్లే తెలుసుకోలేని పెద్దపెద్ద విషయాలు.. ఈ పసివాడికి ఏం తెలుస్తాయి?
“నీలో ఉన్న వెలుగు ఎప్పటికీ ఆరిపోదు నాయనా.. కనీసం నేనున్నంత కాలం.. నేను ఆ వెలుగును ఆరిపోనివ్వను” దృఢంగా పలికింది మహారాణి స్వరం.
“అమ్మా.. నా కోసం నువ్వు ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు కదూ!”
“నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను నాయనా” కొడుకు పక్కనే కూర్చొని, దగ్గరకు తీసుకున్నది. ఇంతలో నాగమల్లిక వచ్చింది.
“మహారాణీ! మిమ్మల్ని ఇలాంటి నిస్సహాయ స్థితిలో చూడలేక పోతున్నానమ్మా! మీకొక విషయం గుర్తుచేద్దామని వచ్చాను”
“ఏమిటా విషయం?” నిరాసక్తంగానే అడిగింది మహారాణి.

“అదే.. రామభట్టుగారు అర్చన చేసిన పవిత్రమైన కుంకుమ మీకు ఇచ్చారు. రాజకుమారుల వారి నుదుటన బొట్టుపెట్టి.. నరసింహస్వామిని ప్రార్థించమని చెప్పారు. మీరు మర్చిపోయారు” వినయంగా చెప్పింది.
“మర్చిపోలేదు నాగమల్లిక.. అవసరం అనిపించడంలేదు. అందుకే ఆ కుంకుమ పెట్టలేదు. ఎందుకంటే పూర్తిగా నమ్మిన రామభట్టు పండితుడు అయోమయస్థితిలో నిర్బంధంలో ఉన్నాడు. పూర్తిగా నమ్మినా నమ్మకపోయినా.. ప్రజల మేలుకోరి దర్శనంకోసం వెళ్లిన నా ప్రాణేశుడు.. ఇంకా అసంపూర్ణ ఫలసిద్ధిలో ఉన్నారు. వైద్యానికి లొంగనిది.. కుంకుమ పెడితే తగ్గిపోతుందా? చూద్దాం.. ఏం జరుగుతుందో? దానిని తట్టుకొనే శక్తిని మా కుటుంబానికి ప్రసాదించాలని మాత్రం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా..”
అమ్మ చేతి మహిమయేమో.. అప్పటివరకూ నొప్పితో విలవిలలాడిన సోమేశ్వరుడు.. నెమ్మదిగా నిద్రలోకి వెళ్లిపోయాడు.
చంద్రలేఖ లేచి, కుమారుడి తలకింద ఎత్తయిన మెత్తను అమర్చింది.
అంతవరకూ మౌనంగా తాళపత్ర గ్రంథం తిరగేస్తున్న రాజవైద్యుడు.. ప్రశాంతంగా నిద్రలోకి వెళ్లిన రాకుమారుడిని చూశాడు.
“అమ్మా.. ఏ మందులకూ.. మూలికలకూ.. ఆ మాటకొస్తే సంజీవనికికూడా లేని శక్తి అమ్మ చేతిస్పర్శకు ఉంటుందమ్మా! చూశారా.. అంతవరకూ అల్లకల్లోలమైన మానసిక స్థితిలో.. అశాంతితో అల్లాడిపోతున్న వాడు కాస్తా.. మీ చేయి తగలగానే ప్రశాంతతలోకి వెళ్లిపోయాడు” అని అన్నాడు.
‘అవును’ అన్నట్టుగా తలాడించింది మహారాణి.
“రాజ వైద్యులవారూ! ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది? వ్యాధి నిర్ధారణ జరిగిందా? నయం చేసే మందులు ఉన్నాయా?”

“అమ్మా.. నా అనుభవం కొద్దీ.. నా శక్తి కొద్దీ.. అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాను. ఆయుర్వేద శాస్ర్తాన్ని తీవ్రంగా పరిశీలించాను. పరిశీలిస్తున్నాను. మన్నించాలి. స్పష్టత రావడం లేదు” తనవల్ల అంతకుమించి సాధ్యం కావడంలేదన్న భావాన్ని వ్యక్తపరిచాడు రాజవైద్యుడు.
“ఇందులో మీరు మన్నింపు కోరవలసిందీ.. సంజాయిషీ చెప్పవలసిందీ ఏమీ లేదు. మీ శ్రద్ధా, చిత్తశుద్ధీ మాకు తెలుసు. మిమ్మల్ని నేను అడిగిన ప్రశ్నలు.. అమ్మగా అడిగాను తప్ప.. అధికారంతో కాదు. చూశారా పరిస్థితి ఎలా మారిపోయిందో? ఒకప్పుడు ‘నా బిడ్డ ఎప్పుడు లేచి ఆడుకుంటాడా?’ అని ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు.. ‘ఎప్పుడు నిద్రపోతాడా?’ అని ఎదురు చూస్తున్నాను. నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే వ్యాధి వాడిని బాధపెట్టడం లేదు. మెలకువ ఒక పీడనగా, పీడకలలా మారిపోయినప్పుడు నిద్ర ఒక్కటే నిశ్చింత కలిగిస్తుందేమో! ఏది ఏమైనా.. మన చేతుల్లో ఏమున్నది.. ఎంతవరకైనా మనం చేయకతప్పదు” అంటూ లేచింది.
“అమ్మా.. ఒక్కమాట”
ముందుకు వెళ్లబోయిన ఆమె.. వెనక్కి తిరిగి చూసింది.
“మరేం లేదు మహారాణీ! రామభట్టుగారు ఇచ్చిన పవిత్ర కుంకుమను మీ చేత్తో రాకుమారుడి నుదుట పెడితే ఫలితం ఉంటుందేమో!” వినయంగా చెప్పాడు రాజవైద్యుడు.
“ఫలితం మన చేతులు దాటి పోయిందనుకున్న తర్వాత.. అప్పుడు చూద్దాం..”
‘ఇక చెప్పడానికేమీ లేదన్నట్టు’గా తల పంకించాడు రాజవైద్యుడు. అక్కడి నుంచి సమాలోచనా మందిరానికి వెళ్లింది రాణీ చంద్రలేఖ.
సమాలోచనా మందిరంలో ఆమె కోసం.. ప్రధాన విధాన నిర్ణాయక మండలి కీలక సభ్యులు ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా విద్యాపతి.. ఆయన మొహంలో ఆందోళన కనబడుతున్నది.
“విద్యాపతి కవివరేణ్యా! ఈ అత్యవసర సమావేశానికి కారణం ఏమిటి?”
“మహారాణీ.. ఇంతకు మునుపే మీకు మనవి చేశాం. హొయసల రాజ్యాధీశుడు విష్ణువర్ధనుడు మన రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు. మీరు యుద్ధ సన్నద్ధతకోసం అధికారిక ప్రకటన చేస్తే.. మన సైన్యంలో ైస్థెర్యం ఏర్పడుతుంది”
మహారాణి ప్రశ్నకు సమాధానం చెప్పాడు విద్యాపతి.

తప్పదు.. యుద్ధం! వద్దనుకున్నా తప్పదు. ఇష్టం ఉన్నా? లేకపోయినా? ఒకరు క్రూరమైన ఈ ఆట మొదలుపెడితే మరొకరు దాని ప్రభావానికి లోనుకావాల్సిందే!
“ప్రత్యామ్నాయం లేనప్పుడు, ఇంకో అవకాశమే కానరానప్పుడు.. ఇంక నిర్ణయానికి ఆలోచన ఏమున్నది. సరే.. అలాగే యుద్ధ ప్రకటన చేద్దాం.. సైన్యాన్ని సన్నద్ధం చేయమని ప్రభువుల పక్షాన మేం నిర్ణయిస్తున్నాం.. ఆదేశిస్తున్నాం”
మహారాణివారి కంఠస్వరంలో ధ్వనించిన కఠిన ధోరణి.. విద్యాపతినే కాదు.. అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచింది.
“అయితే మరొక్క విషయం. త్వరలో ప్రభువులవారు తిరిగి రావచ్చు. వారు శ్రీ నారసింహుడి దర్శనం చేసుకొని తిరిగి నగరానికి చేరేలోపు యుద్ధంలో మనం విజయం సాధించాలి” అన్నది మహారాణి.
ఆమె మాటలకు అడ్డొస్తూ.. ఇలా అన్నాడు విద్యాపతి.
“మహారాణీ! మా దృష్టికి వచ్చిన మరొక ముఖ్యమైన సమాచారాన్ని మీకు విన్నవించాలని అనుకుంటున్నాం. మాళ్వా రాజ్యానికి రాజు జగద్దేవ రాజు.. జగద్దేవుడు మన ప్రభువులవారికి ఆత్మీయుడు. సహోదరుడి లాంటివాడు. మాళ్వా రాజ్యం గతంలో సంక్షోభంలో పడినప్పుడు జగద్దేవుడు మన ప్రభువులవారిని శరణు కోరాడు. చుట్టుముట్టిన శత్రుసైన్యాల నుంచి రక్షణకోసం సహాయాన్ని అర్థించాడు. ప్రభువులవారి పర్యవేక్షణలో మన బలగాలు యుద్ధంచేసి మాళ్వా రాజ్యాన్ని రక్షించాయి. ప్రభువులవారే స్వయంగా జగద్దేవ రాజుకు కిరీటధారణ చేశారు. అంతవరకూ బాగానే ఉంది.. కానీ” అని ఆపాడు.
“కానీ.. ఏం జరిగిందో చెప్పండి. వార్తలు విని వ్యాకులత చెందే బలహీన మనస్కురాలిని కాదు. నేను జగదేక మల్లుని కుమార్తెను.. త్రిభువనమల్లుని ధర్మపత్నిని. యుద్ధాలు, జయాలు, అపజయాలు రాజవంశాలకు కొత్తకాదు. అసలు మేము పుట్టి, పెరిగిందే అటువంటి వాతావరణంలో! తర్వాత ఏం జరిగింది” మహారాణి తీవ్రంగా ప్రశ్నించింది. విద్యాపతి.. దళపతికేసి చూశాడు.
దళపతి వినయంగా ముందుకు వచ్చాడు.
“మహారాణీ! ప్రభువులవారు కొండకు బయల్దేరినప్పుడు సకల రక్షక బలగాలతో, సాయుధ దళాలతో మేం వెన్నంటి వెళ్లాం. కానీ, భక్తుడిగా మాత్రమే అడవిలోకి వెళ్లాలనుకున్న ప్రభువులవారి ఆదేశం మేరకు మేం అక్కడి నుంచి సాయుధ బలగాల్ని ఉపసంహరించాం”
“అవును.. అదంతా మాకు తెలుసు” చెప్పింది రాణీ చంద్రలేఖ.
“ప్రభువులవారు మన సాయుధ బలగాలను, పరివారాన్ని వెంట రావద్దని ఆదేశించారు. కనుక మేము ఆ బలగాలను కొండకింద ప్రాంతంలో మోహరించాం. అదీ మీకు విన్నవించాం..”
“విద్యాపతి గారూ! ప్రభువులవారు ఒంటరిగా కొండపైకి వెళ్లడానికి.. మాళ్వా రాజ్యంలోని పరిణామాలకు ఏమిటి సంబంధం?”..
‘పరస్పర విరుద్ధమైన రెండు వేర్వేరు విషయాలకు సమన్వయమేమిటా’ అని ఆలోచిస్తూ ప్రశ్నించింది మహారాణి.

“మహారాణీ! మన్నించాలి. ఆ విషయానికే వస్తున్నాను. మన ప్రభువులవారు మాళ్వా రాజ్యాన్ని సంరక్షించి, సింహాసనం పైన జగద్దేవ రాజుని కూర్చోబెట్టడం.. జగద్దేవుడి తమ్ముడు నరవర్మకు నచ్చలేదు. అతడు కుట్ర పన్ని అన్నగారిని రాజ్యభ్రష్టున్ని చేయడంకోసం తిరుగుబాటు దళాలను కూడగట్టాడు. మన ప్రభువులవారిని లక్ష్యంగా చేసుకొని కొండ ప్రాంతంలో వెనుకనుంచి దాడి చేశారు. ప్రభువులవారు సురక్షితంగా.. క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాం” ఇంకా చెప్పలేక ఆగాడు దళపతి.
“జగద్దేవ రాజు తమ్ముడు నరవర్మ.. మన సైనిక దళాల దాడినుంచి తప్పించుకుపోయాడు. కానీ, అతని అనుచరులు పట్టుబడ్డారు. వాళ్లు చెప్పిన విషయాలు ఇవి.. అయితే నరవర్మ మన రాజ్య సరిహద్దులు దాటేలోపుగా బంధించి మీ ముందుకు తీసుకొస్తాం” ఆవేశంగా అన్నాడు విద్యాపతి.
“ఇంతకీ ప్రభువులవారి క్షేమ సమాచారం తెలుసుకున్నారా?” ఆవేదనగా అడిగింది మహారాణి
“వారు క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాం.. సాయంత్రంలోగా పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాం..”
‘విష్ణువర్ధనుడిపైన యుద్ధానికి ఎవరు సారథ్యం వహిస్తారు? మీరు ఎవరిని ఎంపిక చేస్తారు?” మహారాణి మనోగతమేమిటో తెలుసుకునే ప్రయత్నంగా అడిగాడు విద్యాపతి.
“మహారాణీ! మీరు ఎవరిని సూచించినా.. మీ ఆదేశాలు పాటించి యుద్ధానికి వెళ్లి, విజయంతో తిరిగొస్తాం”..
అందరూ అదే మాటమీద ఉన్నారనిపించింది మహారాణికి.

“ఎవరు యుద్ధానికి వెళ్లినా.. భువనగిరి రాజ్య విజయ పతాక సగర్వంగా తలెత్తుకొని వినువీధి విహారం చేస్తుంది.. అది నిశ్చయం! అయితే, నేనొక ఆలోచన చేస్తున్నాను. ప్రభువులవారి పక్షాన అధికారం అనుభవించడమే కాదు. వారి పట్టపు రాణిగా, వీరపత్నిగా.. నేనే యుద్ధానికి వెళ్దామనుకుంటున్నాను. సైన్యానికి సారథ్యం వహిస్తాను. విజయంవైపు ప్రయాణం చేయిస్తాను”
అందరి అభిప్రాయాలు తెలుసుకొనే విధంగా.. ఈ మాటలంటూ అందరికేసి సాలోచనగా చూసింది మహారాణి.
అందరూ నోటిమాట రాక.. అలాగే ఉండిపోయారు.
ఒక్కక్షణం భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది.
మహారాణి చెప్పిన మాటలు ఆమోదయోగ్యమా, కాదా? అన్న విషయం పక్కన పెడితే.. అసలు ఏం వింటున్నామో? ఎలా స్పందించాలో? ఎవరికీ అర్థం కాలేదు.
ముందుగా తేరుకున్నది విద్యాపతి..
“మహారాణీ! ఇంతమంది యోధానయోధులు, సమర్థులు.. అనేక యుద్ధాల్లో అపూర్వ విజయాలు సాధించిన సైన్యాధికారులు, మంత్రులు ఉండగా, యుద్ధానికి మీరు వెళ్లడం మాకెందుకో సమంజసంగా అనిపించడం లేదు. అదీకాక ప్రభువులవారు కోటలో లేరు. రాకుమారుడి ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో.. మీరూ..”
నిర్వేదంగా నవ్వింది మహారాణి.. తర్వాత స్పష్టంగా చెప్పింది.
“నాకు యుద్ధాలు కొత్తకాదు విద్యాపతి గారూ! జీవితంలో ప్రతిరోజూ నేను యుద్ధమే చేస్తున్నాను. రూపం మార్చుకుంది తప్ప.. యుద్ధం ఏ రోజూ నా జీవితంలోంచి తొలగిపోలేదు. ఇప్పుడెందుకు సంకోచించాలి? ఇది ప్రతిపాదన కాదు. నేను తీసుకున్న నిర్ణయం. నేను నిర్ణయించాను కనుక ఇదే శాసనం”

-అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement