e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home కథలు యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. ఆ తర్వాత, ఎన్నో మలుపులు. అంతలోనే, యాదరుషి వృత్తాంతమూ ప్రస్తావనకు వస్తుంది..

- Advertisement -

తన కుమారుడిని ‘యాదరుషి’ అని సంబోధించడం విని, సంతోషపడింది శాంత. ఎందుకంటే, ‘రుష్యశృంగ మహర్షి’ వాక్శుద్ధి ఉన్న మహాత్ముడు. ఏ కారణంగా తన కుమారుడికి ‘రుషిత్వం’ ప్రసాదించాడో తెలియదు కానీ, తన కుమారుడు ఏదో గొప్పకార్యం సాధించగలడని ఆమెకు అర్థమైంది. కానీ, అంతలోనే ఆమె తల్లి మనసు ఆగలేకపోయింది. ఎంత సాధించనీ గాక, బిడ్డను వదిలి తల్లి ఉండగలదా?“ఉండాలి కదమ్మా.. అమ్మ ఆశీర్వాదం ఉంటేనే కదమ్మా.. ఏ కొడుకైనా ఏదైనా సాధించగలిగేది?”శాంత తన మనసులో మాట పైకి అనకపోయినా.. తల్లి మనసు గ్రహించిన యాదరుషి అనునయంగా పలికాడు. రుష్యశృంగ మహర్షి తల్లీకొడుకుల మనఃస్థితిని అర్థం చేసుకొన్నాడు. “నాయనా యాదరుషీ! శాంత నన్ను వివాహం చేసుకొన్న నాటినుండి ఏరోజూ సంప్రదాయానికి విరుద్ధంగా ఆలోచించలేదు. తపస్సు కోసం ఇంటినుండి వెళ్లడం.. సాధన ద్వారా జ్ఞానాన్ని, శక్తినీ సాధించుకోవడం మునికుమారుల కర్తవ్యం.

కానీ, ఎందుకోమరి ఈరోజున ఆమె పుత్రప్రేమ ఆమెతో ఈవిధంగా మాట్లాడిస్తున్నదని అనుకొంటాను” అని భార్యకేసి తిరిగి మళ్లీ అన్నాడు.. “శాంతా! నారసింహుణ్ని వెతుక్కుంటూ వెళ్తానంటున్నాడు యాదరుషి. అందనిదాన్ని అందుకోవడంలో ఆనందం ఉంటుంది..” “అది సాధ్యమేనంటారా?” “తప్పకుండా, భక్తుడు భగవంతుడి కోసం ఎలా అయితే ఎదురుచూస్తాడో.. ఆయనను దర్శించుకోవాలని తహతహలాడుతాడో.. దేవుడు కూడా అంతే! ఎప్పుడెప్పుడు తన బిడ్డను అంటే.. భక్తుణ్ని చూద్దామా? అని ఎదురుచూస్తుంటాడు” ఆ ఒక్కమాటతో కదిలిపోయాడు యాదరుషి. తండ్రిగారి కాళ్లపై పడి, కన్నీటితో అభిషేకం చేశాడు. “నాయనా! లే.. ఏమిటిది?” అంటూ కొడుకును భుజం పట్టుకొని పైకి లేపి.. “ఎందుకీ కన్నీరు?” అని అడిగాడు. “నేను నా దేవుడు నారసింహుడి కోసం ఎదురు చూస్తున్నాననుకొంటే.. నా దేవుడే నాకోసం వేచి చూస్తున్నాడేమో అనిపించింది.. మీరు చెప్పిన మంచి మాట విని” అంటూ తల్లికి ప్రణమిల్లుతూ..

“అమ్మా.. వెళ్లొస్తానమ్మా”అన్నాడు యాదరుషి. గుండె గట్టి చేసుకొంది శాంత. కనులు మూసుకుంది ఓ క్షణం.. ఒడిలో బిడ్డ ఇంతై ఇంతింతై.. ఎన్ని మధుర జ్ఞాపకాలు.. చిన్ని కృష్ణుడు కదా నా బిడ్డడు. బలరాముడు కదా ఈ బాలుడు. ‘అమ్మా.. అదేమిటిది? అమ్మా ఇదేమిటి?’ అని అడిగే నా కుమారుడేనా.. నువ్వు? కొంగల గుంపును చూసి భయపడి, తల్లి కొంగుపట్టుకొని దాక్కున్న నా పసి బిడ్డవేనా నువ్వు? ‘ఆకలి వేస్తుందమ్మా!’ అని నా చేతి గోరుముద్దల కోసం ఆరాటపడిన కన్నయ్యవేనా నువ్వు? ఎలా ఉంటావురా? ఎక్కడ ఉంటావురా?
ఏమి తింటావు? ధ్యానంలో పరధ్యానంలో ఉండిపోతే అన్నం పెట్టమని ఎవర్నిరా అడుగుతావు? కన్నబిడ్డ దూరంగా వెళ్లిపోతానంటే నాయనగారు తట్టుకొంటారేమో.. వారికంటూ వారికొక మనోప్రపంచం ఉందిరా! మరి.. ఈ అమ్మ ప్రపంచమంతా నువ్వే నాయనా!అమ్మ బాధ చూసి గుండె బరువెక్కింది కుమారుడికి.‘ఎలా చెప్పాలి అమ్మకు!’ ఆలోచించాడు.

“ఏమిటమ్మా.. అన్నీ తెలిసినదానివి. అందరికీ చెప్పాల్సినదానివి. నేను నీ ద్వారా ఈ లోకంలోకి వచ్చాను. నా జీవితానికి ఆదిమూలం నువ్వే! కానీ, కాలం అనేది మనిషిని మూలాల దగ్గరే ఆగనిస్తుందా? గుడ్డును పగలగొట్టుకొని వచ్చి, తల్లిరెక్కల కింద ఉన్న పక్షి.. గూడు వదిలి వెళ్లిపోదా? అడుగు ముందుకే పడుతుంది కానీ, కాళ్లు వెనక్కి నడుస్తాయా? దూరాభారమైనా, కాలం దూరాన్ని పెంచినా, కనిపెంచిన అమ్మను నేను ఏనాటికీ మరువను. నేను ఎక్కడున్నా నీతో ఉన్నట్టే ఉంటాను. ఏ స్థితిలో ఉన్నా నిన్నుతలుచుకొంటూనే ఉంటాను. దెబ్బ తగిలితే ‘అమ్మా’ అంటాను. ఆనందం కలిగినా ‘అమ్మా’ అనే అంటాను. నాకిప్పుడు కావాల్సింది నీ ఆశీస్సులు.. సంతోషంగా నన్ను సాగనంపడం..”
ప్రశాంతంగా చెప్పిన యాదరుషి మాటలు శాంతలో ఆలోచన కలిగించాయి.
నిజమే!
“అమ్మను కనుక అలా ఆలోచించానురా! నువ్వు క్షేమంగా వెళ్లి లాభంగా రావాలి.
‘లాభం’ అంటే.. నువ్వు కోరుకున్నది నీకు దొరకడం.
నువ్వనుకున్నది సాధించడం!”
మనసారా ఆశీర్వదించింది.
“అమ్మా.. లక్ష్మమ్మా!
నీ హృదయసమేతుడైన శ్రీ నరసింహస్వామివారి దర్శనం కోసం నా బిడ్డ వస్తున్నాడు.
వాడి యోగక్షేమాలన్నీ నీకు అప్పచెప్తున్నాను. ఇంక, నీదే భారం!” అని శ్రీలక్ష్మిని ప్రార్థించింది.
ఆమె ప్రార్థన అమ్మవారు విన్నదా.. అన్నట్టుగా చెట్లపైనుండి పూలు జలజలా రాలిపడ్డాయి.
‘శుభ సూచకం’ అన్నాడు తండ్రి.
చూస్తుండగానే.. కుమారుడు యాదరుషి వడివడిగా నడుస్తూ అడవిలో అదృశ్యమయ్యాడు.

నెలలూ, సంవత్సరాలూ గడుస్తున్నాయి. యాదరుషి అన్వేషణ కొనసాగుతున్నది. తిరుగుతున్నాడు. కొండా కొండా గాలిస్తున్నాడు. నారసింహుడి జాడ దొరుకుతుందేమోనని పుట్టా పుట్టా వెతుకుతున్నాడు. అమ్మను, నాయన గారినీ వదిలిపెట్టి.. ఇలా స్వామికోసం అన్వేషిస్తూ వస్తుంటే.. ఏమిటీ స్వామి? దర్శనం కాదుకదా.. కనీసం నిదర్శనం కూడా చూపడే?కాలం వేగంగా పరుగులు తీస్తున్నది. కానీ, గమ్యం మాత్రం కనిపించడం లేదు. కళ్లముందే మొక్కలు చెట్లవుతున్నాయి. చిగురుటాకులు హరితపత్రాలై ఆకుపచ్చ ఆకాశాన్ని ఆవిష్కరిస్తున్నాయి. కళ్లముందే పండుటాకులై రాలి మట్టిలో కలిసిపోతున్నాయి. కాలాలూ, ఆరు రుతువులూ గిర్రున తిరిగి మారుతున్న కాలానికి సంకేతంగా నిలుస్తున్నాయి. సహనం.. తనకు పరీక్ష పెడుతున్నది. హృదయం..ఆరాటంతో అలిసిపోతున్నది. మనసు.. తొందరపడకు అంటున్నది. బుద్ధి.. ఎంతకాలం ఈ ఆధారం లేని అన్వేషణ అంటున్నది. స్వామిని నమ్ముకోవడమే తను చేసిన తప్పా?స్వామి దర్శనాన్ని కోరుకోవడమే తన దోషమా? ఎవరు తీరుస్తారు తన సందేహాన్ని?“చెప్పండి.. నా స్వామి ఎక్కడున్నాడో ఎవరైనా చెప్పండి”తనలో తానుకాదు.. గట్టిగానే ప్రశ్నించాడు.“ఎవరు చెప్పాలి నీకు సమాధానం?”ఎవరిదో కంఠస్వరం విని.. అటు చూశాడు యాదరుషి.

వెలుగు.. చూపు కనిపించినంత!ఎవరో మరి.. సరిగ్గా కనిపించడంలేదు. “ఎవరు మీరు?”ఆ ప్రశ్న విని, ముందుకొచ్చాడు ఆ వ్యక్తి. అతడిని చూసి ఆశ్చర్యపోయాడు యాదరుషి.
చూపులకు మనిషిలానే ఉన్నా.. గుహల్లో నివసించే ఆదిమ మానవుడిలా ఉన్నాడు.
తీక్షణమైన చూపులు.. నెరిసీ నెరియని గడ్డం.. నుదుటిపైన నిలువు నామంలాంటి ఓ చారిక. ఆరడుగుల ఎత్తున్నాడు. ఒంటిమీద పంచె, పైన ఉత్తరీయం. మెడలో ఏదో పూసల గొలుసు.. నరసంచారం లేని ఈ అడవిలో.. ఈ కొండ ప్రాంతంలో ఎవరీ వింత మానవుడు?“ఎవరు మీరు?” మళ్లీ అడిగాడు యాదరుషి. “నేనా.. ఈ ప్రాంతంలోనే ఉంటాలే! నన్ను గిరిధరుడంటారు. నువ్వు ఎవరు? ఏం కావాలి?”“నాపేరు యాదరుషి. నేను స్వామిని వెతుక్కుంటూ వచ్చాను” చెప్పాడు యాదరుషి. “ఎవరు నీ స్వామి?”“నరసింహ స్వామి.. ఆయన దర్శనం కోసం వచ్చాను”“ఆయన ఎక్కడుంటాడో తెలుసా?” అడిగాడు గిరిధరుడు.“తెలిస్తే.. నేరుగా అక్కడికే వెళ్లుండేవాణ్ని కదా!” అన్నాడు యాదరుషి. “ఆయన ఎక్కడుంటాడో తెలియదు. ఎలా ఉంటాడో తెలియదు. అసలు ఇక్కడ ఉంటాడో.. ఉండడో తెలియదు. అసలు నువ్వు ఉన్నావనుకునేవాడు ఉన్నాడో లేదో కూడా తెలియదే!” నవ్వుతూ అన్నాడు గిరిధరుడు. ఆ మాటలకు నవ్వుకున్నాడు యాదరుషి. “ఎందుకు నవ్వుతున్నావు?” అడిగాడు గిరిధరుడు. “ఎందుకంటే.. ‘నువ్వు ఉన్నాడంటున్నవాడు ఉన్నాడా లేడా?’ అని అడిగినందుకే కదా, ఉన్నానని ఆ స్తంభంలోంచి ఉరికొచ్చి పేగులు తీశాడు. నమ్మనివాడినే కరుణించిన నా స్వామి.. మనసారా నమ్మిన వారిని కనికరించడా? అందుకే నవ్వాను”. యాదరుషి మాటలకు కాస్త కోపం వచ్చింది గిరిధరుడికి.

“అనుకుందాం.. ఉన్నాడనే అనుకుందాం! మరి ఉన్నవాడు ఉండకుండా.. ‘దర్శనం కోరాలి’ అనే కోరికను నీలో ఎందుకు రగిలించినట్టు? పోనీ.. అటువంటి ఆలోచనను నీకు కలిగించినవాడు.. బయటికెందుకు రాడు? ‘ఇదిగో ఇక్కడున్నానయ్యా.. నేను!’ అని ఎందుకు దర్శనమివ్వడు? నీ భక్తిలో పరిపక్వత లేదా? నీ స్వామికి నీ మీద ప్రేమ లేదా? నువ్వే.. వెతుక్కుంటూ వెళ్తున్నావు కానీ, ఆయన అనుగ్రహం చూపడేమయ్యా నీ మీద!” కాస్త అసహనంగా అన్నాడు గిరిధరుడు. మౌనమే సమాధానమయ్యింది. “మాట్లాడవేమయ్యా!” రెట్టించి అడిగాడు గిరిధరుడు. “మాట్లాడ్డానికేముంది మహానుభావా! నువ్వన్నదీ నిజమేనేమో.. నా భక్తికింకా పరిపక్వత రాలేదేమో! నా స్వామిని చేరుకోవడానికి, ఆయన దర్శన భాగ్యం పొందడానికి నా మనోబలం సరిపోదేమో..” ఒకింత నిరాశగానే అన్నాడు యాదరుషి. “లేదా.. నీ స్వామికే భక్తులను అనుగ్రహించే సమయం లేదేమో..”ఆ మాటలకు అడ్డొస్తూ అన్నాడు యాదరుషి..“లేదు లేదు.. నా నారసింహుడు కరుణాసాగరుడు. తప్పకుండా అనుగ్రహిస్తాడు”.నవ్వాడు గిరిధరుడు. “ఏమో.. నాకు సందేహమే!”.. సమాధానం ఏం చెప్తాడా అన్నట్టుగా అన్నాడు గిరిధరుడు. “సందేహం అక్కర్లేదు. స్వామి ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉండడు అనే సంశయం అవసరంలేదు. ఎక్కడ వెదకిచూసినా అక్కడే ఉంటాడు. స్తంభంలోనూ ఉంటాడు. సముద్రంలోనూ ఉంటాడు. గుహలో ఉంటాడు. గుడిలోనూ ఉంటాడు” ఉద్వేగంగా చెప్పాడు యాదరుషి. “సరేనయ్యా! ఎక్కడెక్కడ ఉంటాడో తెలిసినట్టే చెప్తున్నావ్‌. మరి ఇన్ని తెలిసినవాడివి ఎందుకని ఆయనెక్కడుంటాడో ఎందుకు తెలుసుకోలేక పోతున్నావ్‌?”
“సమయం రావాలి కదా!”
“ఎప్పుడొస్తుంది.. సమయం?”
“ఆ సందర్భం వచ్చినప్పుడు..” చెప్పాడు యాదరుషి.
“సమయం, సందర్భం వాటంతటవే రావయ్యా.. రప్పించుకోవాలి”
గిరిధరుడి మాటలు అర్థం కాలేదు యాదరుషికి.
“అంటే?” అని అడిగాడు. “కాలాన్ని కూడా ప్రార్థించాలి. ‘నన్ను అనుగ్రహించు’ అని! సందర్భం వెతుక్కుంటే రాదు.. తపస్సు చేయాలి. జ్ఞానాన్ని, దివ్య దృష్టినీ, సహజ శక్తినీ పొందేలా.. కృషి చేయాలి. ఆ విధంగా కృషి చేస్తేనే.. నువ్వు నిజమైన రుషివి అవుతావు. తపస్సు అంటే.. ఒకేఒక పనిపైన సర్వశక్తులూ లగ్నం చేయడం. అనుకున్న కార్యాన్ని సాధించడం..” గిరిధరుడి మాటలు అమృతవాక్కుల్లా అనిపించాయి. అయితే.. యాదరుషికి ఒక సందేహం కలిగింది.

కాలం వేగంగా పరుగులు తీస్తున్నది. కానీ, గమ్యం మాత్రం కనిపించడం లేదు. కళ్లముందే మొక్కలు చెట్లవుతున్నాయి. చిగురుటాకులు హరితపత్రాలై ఆకుపచ్చ ఆకాశాన్ని
ఆవిష్కరిస్తున్నాయి. కళ్లముందే పండుటాకులై రాలి మట్టిలో కలిసిపోతున్నాయి. కాలాలూ, ఆరు రుతువులూ గిర్రున తిరిగి మారుతున్న కాలానికి సంకేతంగా నిలుస్తున్నాయి.

“అనుకుందాం.. ఉన్నాడనే అనుకుందాం! మరి ఉన్నవాడు ఉండకుండా.. ‘దర్శనం కోరాలి’ అనే కోరికను నీలో ఎందుకు రగిలించినట్టు? పోనీ.. అటువంటి ఆలోచనను నీకు కలిగించినవాడు.. బయటికెందుకు రాడు? ‘ఇదిగో ఇక్కడున్నానయ్యా.. నేను!’ అని ఎందుకు దర్శనమివ్వడు? నీ భక్తిలో పరిపక్వత లేదా? నీ స్వామికి నీ మీద ప్రేమ లేదా? నువ్వే.. వెతుక్కుంటూ వెళ్తున్నావు కానీ, ఆయన అనుగ్రహం చూపడేమయ్యా నీ మీద!” కాస్త అసహనంగా అన్నాడు గిరిధరుడు.

allanisreedharthewriter@gmail.com

(మిగతా వచ్చేవారం)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement