e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home కథలు యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. కానీ అంతటితో కథ సుఖాంతం కాలేదు.

- Advertisement -

“పంచభూతాలను అనుమతి కోరానంటున్నావ్‌. కానీ, పంచభూతాలు అనగా భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి.. వీటిని నియంత్రించే నాథుడు కదా నా స్వామి. మరి వారికి నేను దాసుడినికదా! నన్నూ, నా స్వామినీ ఎలా మరిచిపోయావు?”పండు ముదుసలి అడిగిన ప్రశ్నకు యాదర్షి సమాధానం చెప్పలేక మౌనం వహించాడు. ఏదైతే అది అవుతుందని అడిగాడు. “అసలు నువ్వెవరు? నీ యజమాని ఎవరు? ఆయనకూ ఈ ప్రాంతంపైన అధికారం ఏమిటి? నేను ప్రశాంతంగా నా స్వామిగురించి తపస్సు చేసుకోవాలని వస్తే.. అర్థంకాని, అర్థంలేని ఈ మాటలేమిటి?”ఆ మాటలకు తెల్లగడ్డంతో ముగ్గు బుట్టలాంటి నెరిసిన జుట్టుతో వింత ఆకారంతో ఉన్న ముదుసలికి కోపం వచ్చింది.“నేనా? ఎవడనా? ఈ ప్రాంతానికి పాలకుడిని. నా గురించి తెలుసుకోకుండా, వినయ విధేయతలతో నన్ను అడుగకుండా.. ధిక్కార స్వరం వినిపిస్తున్నావ్‌? అసలు నువ్వెవరు? నీ కథ ఏంటి?”“నాపేరు యాదర్షి”“ఆగాగు.. నీకు నువ్వే రుషిత్వం ఆపాదించుకొని, యాదర్షి అని పేరుకూడా పెట్టుకొన్నావా?”“అయ్యా! నీ పేరు నువ్వే పెట్టుకొన్నావా? నీ తల్లిదండ్రులు పెట్టారా? నా పేరు మా నాయనగారు, మహాతపస్సంపన్నులు రుష్యశృంగ మహాముని నామకరణం నాడు పెట్టిందే” చెప్పాడు యాదర్షి. అందుకాయన పడీపడీ నవ్వాడు. “ఒహొహో.. ఆహ్లాదమూ, మోదమూ కలిగించే యాదరుషివన్నమాట. బాగుందయ్యా.. యాదర్షీ! నీ స్వామి ఎవరు? ఎవరికోసం నువ్వు తపస్సు చేస్తున్నావు? తపస్సు చేయాలనుకొంటున్నావ్‌.. సరే, మరి ఏ ఫలితాన్ని సాధిద్దామని? ఆ తపశ్శక్తితో ఏం చేద్దామని?”సమాధానం చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు యాదర్షి. “అయితే నేనుకూడా నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతాను, సమాధానం చెప్పు”“అడుగు” అన్నాడు ముదుసలి వ్యక్తి.

“ఏ ఫలితాన్ని కోరి హనుమంతులవారు శ్రీరాముడిని పూజిస్తున్నారు? ఏ సాధనకోసం నిరంతరం తన స్వామి శ్రీరామచంద్రమూర్తిని తలుస్తూ తపస్సు చేస్తాడు? అసలు రామస్వామికి.. ఆంజనేయస్వామికి ఉన్న బంధం, అనుబంధం ఏమిటి?”“ఏమిటేమిటీ? శ్రీరామాంజనేయుల అనుబంధాన్ని ప్రశ్నించేవాడివా నువ్వు?” కోపంగా అడిగాడు పెద్దాయన. “ప్రశ్నించడం లేదు, గుర్తు చేసుకోమంటున్నాను. వారిద్దరి అనుబంధం.. లోక కళ్యాణ కారకం! హనుమంతుడు ఎలా శ్రీరాముడికి మహాభక్తుడిగా లోకానికి ఆదర్శంగా నిలిచాడో, శ్రీరామ చంద్రస్వామివారు ఎలా అనుగ్రహించారో.. అలా నేనూ నా స్వామివారి అనుగ్రహం కోసం తపస్సు చేద్దామనుకొంటున్నాను..” వినయంగా పలికాడు యాదర్షి. “ఓహో! శ్రీరామబంటు హనుమంతుడిలాంటి వాడివన్న మాట. గొప్పగా పోల్చుకున్నావ్‌గా.. నీకు నువ్వు?” నవ్వుతూ అన్నాడు. ఆ మాట వింటూనే యాదర్షి భయంగా చెంపలేసుకొని, తలవంచి నమస్కరించి అన్నాడు.. “ఎంతమాట! పరమ భక్తాగ్రేసరుడైన ఆంజనేయుడెక్కడ? ఆరంభంలోనే ఆగిపోయిన నేనెక్కడ? పోలికలేదు. మీరు అన్నమాటలకు నేను.. మీకు అర్థం కావాలని అలా అన్నాను”. “నువ్వెలా అన్నా.. హనుమంతుడిని ఎవరు ఎలా అర్థం చేసుకొంటే వారికి అలా కనబడుతాడు. ‘శ్రీరామనామం శిరసానమామి’ అన్నప్పుడు దాసానుదాసుడు. అమ్మవారిని వెతకడానికి వెళ్లినప్పుడు, లంకాదహనం చేసినప్పుడు కొందరన్నారు.. ‘చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు’ అని! అమ్మకు అవమానం జరిగితే బొమ్మలా చూస్తూ కూర్చుంటాడా రామభక్తుడు? కాల్చి వచ్చాడు. అసలు లంకనే లేకుండా చేయగలడు రామనామ స్మరణతో! కానీ, అమ్మ ఉన్నది. నా సీతమ్మ తల్లి నా రాముడికోసం ఎదురు చూస్తుంది. రాముడే రావాలి. రాక్షసుణ్ని చంపేయాలి. రామ రాజ్యాన్ని స్థాపించాలి అని కదా.. అంజనీపుత్రుడు ఆగ్రహజ్వాలలు చెలరేగినా లంకను దహించకుండా వదిలిపెట్టాడు. అయినా రావణాసురుడికి ‘శిక్ష’ విధించాల్సిన శ్రీరాముడే కదా మనందరికీ శ్రీరామ రక్ష! సర్వజగద్రక్ష!” తన్మయత్వంతో పలికాడా వృద్ధుడు.
“హనుమంతుడి గురించి బాగా వివరించావు. నువ్వు రామభక్త హనుమాను భక్తుడివా?” అడిగాడు యాదర్షి.

“హనుమంతుడికీ, నాకూ ఎలాంటి భేదం లేదనుకో..” గర్వం తొణికిసలాడింది పండు ముదుసలి నిండు మోములో! ఆశ్చర్యపోయాడు యాదర్షి!ఎంత గర్వం, ఎంత దురహంకారం! రాలిపోయే పండులా ఉన్న ఈ శ్వేత కేశాల తాత.. అహంకారంలో ఉన్నాడు. కన్నూ మిన్నూ కానడం లేదు.హనుమంతుడికి, ఈ ముసలాయనకీ భేదమే లేదట!ఇది అహంకారమైతే తగ్గించాలి. అజ్ఞానమైతే తొలగించాలి. తమకు తాము దైవస్వరూపులమని కొందరు భావిస్తుంటారు. ఈ మనిషి.. తనేమిటో, తనెవరో తానే తెలుసుకొనేలా చేయాలి. “అయ్యా! పెద్దాయనా. నీకు తల నెరిసింది. గడ్డం నెరిసింది. శరీరమంతా చిక్కి శల్యమైపోయింది. వృద్ధాప్యం అనేది జ్ఞానాన్ని, అనుభవాన్ని, అణకువనూ ప్రసాదిస్తుంది. కానీ, నీ విషయంలో నీ వయోభారం అహంకారాన్నే అందిస్తున్నట్టుంది. అందర్నీ పాలించే చిరంజీవులైన హనుమంతుడు.. ఈ కొండమీద క్షణాలు లెక్కపెడుతున్నట్టు కనిపించే నువ్వు ఒకే స్థాయివారు ఎలా అవుతారు? ఆకాశంతో పోల్చుకున్నంత మాత్రాన అనామకుడు గొప్పోడై పోతాడా? ఎరుక కలిగి మాట్లాడు. ఎత్తు తెలుసుకొని వినయం తెచ్చుకో..” తీవ్రమైన స్వరంతో చెప్పాడు యాదర్షి.
“అబ్బా! ఊరుకొన్న కొద్దీ హద్దుమీరి మాట్లాడుతున్నావే.. ఏమన్నావు నన్ను? కొండమీద అవసాన దశలో ఉన్నానంటావా? అవసరమైతే కొండను కూడా లేపి, గాల్లోకి లంఘించి వాయువేగంతో నా స్వామి ఆదేశించిన ప్రదేశానికి చేర్చగలను. ఏమనుకొంటున్నావో? నా స్వామి నాకు ఆ శక్తిని ఇచ్చాడు. ఎరుక కలిగి మాట్లాడమంటున్నావు కదా! నాకు తెలుసు, నేనెవరో.. నా శక్తి ఏమిటో! నీతో చెప్పించుకోవలసిన అవసరమే లేదు. అహంకారం నాకుకాదు, నీకే ఉన్నట్టుంది అణువణువునా!”

ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు యాదర్షి. “తపస్సు చేసుకోవడానికి ఇంత చోటు చూపించండని పంచభూతాలను పరిపరి వేడుకొన్నానే.. నాకా అహంకారం అంటున్నావ్‌”“మాటలు సరేనయ్యా.. ఇంతకూ ఏ స్వామివారి కోసం తపస్సు చేద్దామనుకొంటున్నావ్‌?”“శ్రీ నరసింహ స్వామికోసం.. వారిని ప్రసన్నం చేసుకోవాలని తపస్సు సంకల్పించాను” వినయంగా చెప్పాడు యాదర్షి. “ఎలా ఏర్పడింది నారసింహుడిపై భక్తి?”
“తెలియదు.. నాకు ఊహ తెలిశాక, నాకు తెలిసిన దేవుడు నారసింహుడొక్కడే! కనులు మూసినా, తెరిచినా స్వామి రూపమే సాక్షాత్కరిస్తున్నది. స్వామి స్తోత్రమే మనసులో స్ఫురిస్తుంది. ఎన్నో పుణ్యక్షేత్రాలు, నదీనదాలు, స్వామి కొలువైన కొండలూ గుట్టలూ.. తిరిగాను. ప్రతి పిట్టనూ, ప్రతి పుట్టనూ అడిగాను. ‘నా స్వామి ఎక్కడ?’ అని! ఎక్కడ కనిపిస్తే అక్కడ కూర్చొని తపస్సు చేద్దామనుకొన్నాను. కానీ, ఎక్కడా స్వామి కరుణించలేదు. ఇక్కడికొచ్చాను. ఇక్కడే స్వామికోసం వేచి చూస్తాను” కన్నీటి పర్యంతమై చెప్పాడు యాదర్షి. అకస్మాత్తుగా అడిగాడు.. “అయ్యా.. మీరు పెద్దవారు. వయోవృద్ధులు. జ్ఞానులు! నాకు నా స్వామి దొరికే మార్గం చెప్పగలరా? మీరు చెప్పుకొన్నారు. కొండపైన ఉండటం కాదు, కొండనే లేపి ఇంకో చోట పెట్టగలను అని చెప్తున్నారు. మీకు మీరు ఎక్కువగా ఊహించుకొని ఇలాంటి అతిశయోక్తులు చెప్తున్నారనుకొంటున్నాను. అసలు మీరెవరు? దయచేసి నిజం చెప్పండి” భక్తిపూర్వకంగా ప్రాధేయపడ్డాడు. యాదర్షి మాటలకు ఆలోచనలో పడ్డాడు ఆ పెద్దాయన. “నేను నిజం మాత్రమే చెప్తాను. చేస్తాను. వింటాను. నిజమేమిటంటే.. స్వామి దర్శనమే! కానీ, నిన్ను చూస్తుంటే తపస్సుకు తట్టుకోగలవో, లేవో అని సందేహం వస్తున్నది..” ఆ వృద్ధుడి మాటలకు అడ్డొస్తూ అన్నాడు.. “తట్టుకోగలవా అని నన్నడుగుతున్నావ్‌. తట్టుకోవడానికి తపస్సేమైనా కాల నియమాలకు, నిబంధనలకు లోబడి ఉంటుందా? భగవదనుగ్రహం కోసం భక్తి పూర్వక సమర్పణ, నిరీక్షణ.. అది ఎంతకాలమైనా కానీ, నేను సిద్ధంగా ఉన్నాను”“నువ్వు సిద్ధంగా ఉన్నావు సరే, కోరిక సిద్ధిస్తుందనే నమ్మకం నీకుందా? ఎందుకంటే, ‘నమ్మకం’ అనేది ఒక్కటే కలను నిజం చేయగల ఏకైక సాధనం!” ముదుసలి అడిగాడు నవ్వుతూ. “నమ్మకం ఉంది. కానీ, మార్గమే కనిపించడం లేదు. ఎక్కడ్నుంచి ప్రారంభించాలో.. ఎప్పుడు ఫలిస్తుందో అర్థం కావడం లేదు. దారిచూపే మహాత్ముడుంటే దైవాన్నికూడా సులభంగా చేరగలం అనే నమ్మకమైతే ఉంది”“ఇంతకుముందు నువ్వు మాట్లాడుతూ ఆంజనేయస్వామి ప్రసక్తి తీసుకొచ్చావు. ఆయనా, నీలాగే సాధ్యాసాధ్యాలు చూడకుండా సీతాన్వేషణకోసం లంకకు పయనమై వెళ్లాడు. అటువంటి దృఢ సంకల్పం నీకుంటే, సాధించలేనిది ఏదీ ఉండదు. శ్రీరామ జయరామ జయజయరామ..” ఏదో అద్భుతమైన భావనతో, అపూర్వమైన తన్మయత్వంతో పలికాడు.

ఎవరు?ఎవరీ పండు ముదుసలి. ఎవరో స్ఫురిస్తున్నారు ఈయనను చూస్తుంటే!కనులు మూసుకున్నాడు యాదర్షి. అసంకల్పితంగా ఓ శ్లోకం గుర్తొచ్చింది. “ఏత దాఖ్యయం తత్సర్వం హనుమాన్‌ మారుతాత్మజః
భూయ స్సమూపచక్రామ వచనం వక్తు ముత్తరమ్‌సఫలో రాఘవోద్యోగ స్సుగ్రీవస్య చ సంభ్రమఃశీల మాసాద్య సీతాయం మమ చ ప్రవణం మనఃఆహా.. తెలిసింది. మహాకవి వాల్మీకి చెప్పిన మాటలు నాకు గుర్తొస్తున్నాయి. వాయుపుత్రుడైన హనుమంతుడు సవివరంగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని తెలిపాడు. శ్రీరాముడి కార్యం సఫలమైంది. సుగ్రీవుడి ఆకాంక్ష ఫలించింది. సీతమ్మవారి గొప్ప వ్యక్తిత్వం చూసి, నా మనస్సు భక్తితో పరవశమైంది. ఇవీ.. హనుమంతులవారి అద్భుత ప్రసంగం. తపస్సు ఎలా ముగుస్తుందో తెలియవలసిన పనిలేదు. సాధన అనుకొన్నప్పుడు ఆరంభించవలసిందే, సాధించవలసిందే”
ఉద్వేగంతో యాదర్షి చెప్పిన మాటలు వింటూనే పండు ముదుసలి కొండ ప్రదేశం కేసి చూస్తూ.. అటు ఒకడుగు వేశాడు.

ఆపదా మపహర్తారం
దాతారమ్‌ సర్వసంపదామ్‌
లోకాభిరామం శ్రీరామం
భూయోభూయో నమామ్యహమ్‌!
ఉగ్రవీరం.. మహావిష్ణుం..
జ్వలంతం సర్వతోముఖమ్‌
నృసింహం భీషణం భద్రం
మృత్యోమృత్యుం నమామ్యహమ్‌!!

ఆయన స్వరం కొండల గుండెల్లో మార్మోగింది. చూస్తుండగానే ఒక అద్భుతమైన వెలుగు భూమీ, ఆకాశాలను తాకుతూ ప్రభవించింది. అద్భుతం!ఆ వెలుగులో కనిపిస్తున్న వృద్ధుడు, క్రమంగా అదృశ్యమైపోతూ లీలామాత్రంగా ఒక హనుమంతుడి ముఖరూపుతో ఒక జ్వాలారేఖ ఆకాశమంతా కనిపించింది. “శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం”భావోద్వేగాలు ముప్పిరిగొనగా ఎలుగెత్తి పలికాడు యాదర్షి. ఆకాశంలో వెలుగుల రేఖలు హనుమంతుడి ముఖాకృతిని ఏర్పరచగా.. “ఓమ్‌ నమో నారసింహాయ” బిగ్గరగా గొంతెత్తి ప్రార్థించాడు యాదర్షి. అప్పుడు ప్రకృతి కదిలిపోయింది. కొండలూ, కోనలూ, నదీనదాలు గడగడలాడి పోయాయి.
యాదర్షి వినమృడై చేతులు జోడించాడు. “మహాభక్తుడా! నిన్ను నమ్మిన భక్తులను కరుణించేవాడా! అమేయ బలశాలీ.. శ్రీరామభక్త హనుమాన్‌! నాకు దారిచూపు.. దిశా నిర్దేశనం చెయ్యి. నా స్వామి.. నారసింహుడు ప్రసన్నుడు కావాలంటే, ప్రత్యక్షం కావాలంటే.. నేనేం చేయాలి? హిరణ్యకశిపుడి పేగులను గోళ్లతో వెలికితీసి.. సమయ నిబంధనల నియమాల మధ్య రాక్షస సంహారం చేసిన అవతారమూర్తి శ్రీ లక్ష్మీనరసింహుడు ప్రహ్లాదుడిని కాపాడినట్టు, దర్శనభాగ్యం ఇచ్చి అనుగ్రహం ప్రసాదించాలంటే.. నేను ఎక్కడ తపస్సు చేయాలి?”అప్పుడొక అదృశ్య స్వరం వినిపించింది. “నాయనా! యాదర్షీ! యాదగిరీశుడి క్షేత్రపాలకుడిగా నేను నీకు అనుమతి ఇస్తున్నాను. అదిగో.. అపూర్వ వృక్షాలు చుట్టూ పరిమళభరితములై ఉండగా, వాటి మధ్యలో కనిపిస్తున్న కొండగుహలో తపస్సు ప్రారంభించు. నారసింహుడు నిన్ను కరుణిస్తాడు. నమో నారసింహా”
అప్పుడు వెలుగూ, శబ్దాలు వెళ్లిపోయాయి. అంతులేని సంతోషంతో యాదర్షి.. స్వామివారు చెప్పిన కొండగుహ ప్రాంతానికి వెళ్లాడు. తపస్సు ప్రారంభించడానికి సంకల్పం చెప్పుకొన్నాడు.

allanisreedharthewriter@gmail.com

(మిగతా వచ్చేవారం)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana