e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home ఎవర్‌గ్రీన్‌ యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

10.కొత్త ధారావాహిక

జరిగిన కథ

నరమృగా వతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో  తెలియజేస్తాడు.   స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి.  నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో  ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా  కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే నర్మగర్భంగా మాట్లాడుతున్న ఓ బాలకుడు ప్రభువుల వారికి  దిశానిర్దేశం చేస్తాడు. మరోపక్క రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు. మహారాజు విష్ణువర్ధనుడు హొయసల రాజ్యాన్ని సుస్థిరం చేసిన యుద్ధవీరుడు. పొరుగు రాజ్యమైన మన భువనగిరిని ఆక్రమించాలని, తన సామ్రాజ్యంలో కలుపుకోవాలని ఎప్పటినుంచో కాచుకొని ఉన్నాడు.  ప్రస్తుతం త్రిభువనమల్లు చక్రవర్తి రాజ్య విస్తరణ కాంక్షలో లేరని, భగవంతునిపైన మనసు నిలిపారని విష్ణువర్ధనుడు తెలుసుకున్నాడు. అందుకే యుద్ధ్దానికి సిద్ధమైనాడు.  ఈ పరిస్థితుల్లో..’ ఇంక చెప్పలేక ఆగాడు విద్యాపతి. 

    మహారాణి చంద్రలేఖ సమాలోచనా మందిరంలో ఉన్నతాసనంపైన ఆసీనురాలై ఉన్నది. ఆమె మొహంలో విచార ఛాయలు కనిపిస్తున్నాయి. శ్రీ నారసింహుని దర్శనం లభిస్తేనే కానీ తిరిగి సింహాసనంపైన కూర్చోనని తన భర్త  దృఢమైన నిర్ణయం ప్రకటించాడు. త్రిభువనమల్లుని మాటే ఒక శిలాశాసనం.

    ఒకవైపు రోజురోజుకీ క్షీణిస్తున్న కుమారుడి ఆరోగ్యం.. మరొక వైపు శత్రురాజు దురాక్రమణ ప్రయత్నాలు.. ఇంతకాలం తను భర్తచాటు భార్య.  ఆయన ఉన్నాడనే ధైర్యంతో కనులు మూసుకొని నిశ్చింతగా  నిదురించే తను, ఈ రోజున గొప్ప గొప్ప నిర్ణయాలు.. భర్తకు చెప్పకుండానే ఆయన ఆనుమతి లేకుండా తీసుకోవలసి వస్తున్నది. 

దేవుడు ఎవరికి ఎప్పుడు ఏ పరిస్థితి కల్పిస్తాడో, ఎవరికి ఏ పరిష్కారం చూపిస్తాడో ఎవరికి తెలుసు? 

    కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం నెలకొని ఉన్న ఆ సమాలోచనా మందిరంలో ఆసీనులై ఉన్న ప్రధానామాత్యులు, దండనాయకుడు, రాణీగారికి వింజామరలు వీస్తున్న పరిచారికలు ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. 

అప్పుడన్నాడు విద్యాపతి..

   ‘నిర్ణయాధికారం మీది. 

 అమ్మా.. చంద్రలేఖాదేవి ఈ పరిస్థితుల్లో  మనం ఏం చేస్తే బాగుంటుందని మీ ఆలోచన?’

   ‘కవిగారూ, నిర్ణయాధికారం అనేది ఒక అధికారం అనిపించటం లేదు.. నాకు. మన నిర్ణయానికి మనల్ని బందీ చేసే ఒక బాధ్యత. వ్యక్తిగతమైతే ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చేమో. కానీ, ప్రజలందరినీ ప్రభావితం చేసే ప్రధానమైన నిర్ణయాన్ని ప్రభువుల సమ్మతి లేకుండా ఎలా తీసుకోవాలి?’ గంభీరంగా అన్నది చంద్రలేఖ. 

  పరిస్థితి అందరికీ అర్థమైంది. 

భార్యగా, తల్లిగా కాదు. ప్రజల భవితను నిర్ణయించే ఒక రాణి వలెనే ఆలోచిస్తున్నది 

మహారాణి. 

   ‘అమ్మా! నిర్ణయాన్ని పొడిగించే కాలవ్యవధి కూడా ఇప్పుడు లేదు. యుద్ధవాతావరణం ఏర్పడితే సందిగ్ధతకు అవకాశం ఉండదమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్దం కావాలా, వద్దా అని నిర్ణయించే అధికారం కూడా మనకు లేదు. ఎందుకంటే అవతల యుద్ధ భేరి  మోగనే మోగుతుంది. సన్నద్ధత ఒక్కటే మన ముందున్న అవకాశం’ విస్పష్టంగా చెప్పాడు విద్యాపతి. 

  ‘అలాంటప్పుడు.. నేను ప్రకటించాల్సిన నిర్ణయమేముంది?’ ఒకింత  ఆశ్చర్యంగా 

అడిగింది. 

 ‘పరిస్థితి ఏదైనా, ఎలా ఉన్నా మీరు ప్రకటిస్తే.. అది అధికారిక ప్రకటన అవుతుంది. అధికారులు, ప్రజలందరికీ మీ నిర్ణయాన్ని పాటించాల్సిన బాధ్యత ఏర్పడుతుంది’ వినయంగా చెప్పాడు విద్యాపతి. 

  ‘అప్పుడు బాధను తట్టుకోవడం కూడా ఒక బాధ్యత అవుతుంది. అంతేగా విద్యాపతి కవి వరేణ్యా!

 ‘అవునమ్మా! ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తిస్తేనే సంక్షోభ సమయాల్లో బాధను తట్టుకోగలుగుతారు అధిగమించగలుగుతారు. ప్రభువుల వారు నిర్ణయాధికారాన్ని మీకు అప్పగించారంటేనే దాని అర్థం మీ కార్యాచరణ రాజ్యాన్ని సురక్షితంగా ఉంచగలదని! ఆలోచించి చెప్పండి!’ 

.. అన్నాడు విద్యాపతి.  

 ‘ఆమె ఏ నిర్ణయం ప్రకటిస్తారా’ అని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 

‘ఒక్కరోజు సమయం ఇవ్వండి. తగిన నిర్ణయాన్ని ఆలోచించి ప్రకటిస్తాను’  ఇక సమావేశం ముగిసింది అన్నట్టుగా చెప్పింది 

చంద్రలేఖ. 

 అందరూ సెలవు తీసుకొని, వినయంగా 

నిష్క్రమించారు.

 మౌనంగా అలా ఉండిపోయింది చంద్రలేఖ. 

ఆమె మనస్థితి గమనించి, పరిచారికలు కూడా అక్కడినుంచి వెళ్లి కాస్త దూరంగా స్తంభం మాటున నిలబడ్డారు. చంద్రలేఖ ఆసనం మీద నుంచి లేచి ముందుకు నడిచింది. 

ఎదురుగా గవాక్షానికి అమర్చి ఉన్న తెరలు గాలికి అటూ ఇటూ కదులుతున్నాయి. అంతఃపురంలో భాగమైన క్రీడా ప్రాంగణం కనిపిస్తున్నది. 

అదిగో.. తన కుమారుడు.. సోమేశ్వరుడు!

 తన చిన్ని చేతులతో లోహపు  గుండును పైకెత్తాడు. 

  ‘సోమేశ్వరా వద్దు వద్దు! కాళ్లమీద పడుతుంది’ ఆందోళనగా అన్నది చంద్రలేఖ. 

  ‘ఏంటమ్మా.. ఇంకా నన్ను ఉయ్యాలలో ఉన్న పసివాడిననుకుంటున్నావా? పదేళ్లొచ్చాయి నాకు. ఈ గుండు తిప్పితిప్పి విసిరానంటే అదిగో వెళ్లి ఆకాశంలో పడుతుంది. నన్ను ఆపకమ్మా..’

  నవ్వుతూ గిరగిరా తిప్పుతున్నాడు లోహగోళాన్ని.  పైకి విసిరేశాడు. అది వెళ్లి పక్కనున్న నీటి కొలనులో పడింది. ఒక్కసారిగా నీళ్లు అతని మొహం మీద పడ్డాయి. సోమేశ్వరుని తల తడిసిపోయింది. నీళ్లను జుట్టుతో విదిలిస్తున్నాడు. తల అటూ ఇటూ ఊపుతున్నాడు. ఆ సంతోషంలో నవ్వు తెరలు తెరలుగా వస్తున్నది. కానీ తల్లి హృదయం తట్టుకోలేక

పోయింది. 

యాదాద్రి వైభవం

  ‘అయ్యో.. పిల్లవాడు నీళ్లలో తడిసిపోయాడు’ అనుకుంటూ పరుగెత్తింది చంద్రలేఖ. 

క్రీడా ప్రాంగణంలో ఉన్న ఆ పసివాడు, ‘అమ్మ’ తన దగ్గరకు రావడం చూసి,  ఆమెకు దొరక్కూడదని ఇంకోవైపునకు పరుగులు తీశాడు నవ్వుతూ.

  ‘అమ్మా! నాకేం కాదమ్మా.. నేను త్రిభువనమల్ల సార్వభౌముని ముద్దుల కొడుకుని తెల్సా?’ అమ్మకు దొరకకూడదని, చిలిపిగా నవ్వుతూ అటూ ఇటూ పరుగెత్తుతున్నాడు.

అటూ ఇటూ పరుగెత్తి చంద్రలేఖ కూడా అలసి పోయింది. 

  ‘ఇదిగో నువ్వు నాకు దొరకలేదనుకో.. ఇదిగో 

ఈ బొమ్మనే మా అబ్బాయి అనుకొని గోరుముద్దలు తినిపిస్తా..  ఇంక నిన్ను దగ్గరికి రానివ్వను’ చిరు కోపంగా హెచ్చరించింది. 

ఆ మాటతో దిగి వచ్చాడు ఆ పిల్లవాడు.

 ‘అమ్మో.. అమ్మా! నువ్వు నా దగ్గరికి రాకపోతే, నాకు పండ్లెవరు తినిపిస్తారు, కథలు ఎవరు చెప్తారు. అసలు నువ్వు నా దగ్గర లేకపోతే.. నేనుండలేను కదమ్మా! నీకు తెలుసు కదా.. మరి, ఎందుకమ్మా ఆ మాటలంటావు?’  కన్నీళ్లతో పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అమ్మను కావలించుకున్నాడు. 

 ఆ మాటలతో చంద్రలేఖ కనులు తడిసిపోయాయి కన్నీటితో. సంతోషమైనా, దుఃఖమైనా లోకాన్ని మనకు చూపించే ఈ కనులు కన్నీటితో  అస్పష్టమై, కనిపించే దృశ్యాన్ని అదృశ్యం చేస్తాయి కదా!

 కన్నీరు తుడుచుకుంటూ, కొడుకుని దగ్గరికి తీసుకుంది. తన పిల్లవాడిని ఎవరైనా తన నుండి వేరు చేస్తారేమో’ అన్న భావన బలంగా ఏర్పడిందేమో.. గట్టిగా బిడ్డను గుండెలకదుముకుంది. 

‘నాయనా! నీ తలంతా తడిసిపోయిందిరా! ఇలా అయితే నా సుకుమార రాకుమారుడికి ఆరోగ్యం పాడవదూ’ అంటూనే తన చీరకొంగు తీసి ఆ పిల్లవాడి తలను తుడుస్తోంది ఆ తల్లి. 

‘అమ్మా! చంద్రలేఖమ్మ గారు.. ఇటు చూడండమ్మా’ ఎవరో తనను గట్టిగా కుదుపుతున్నారు. 

ఒక్కసారి ఉలికిపడి చూసింది. 

ఎదురుగా తన ప్రధాన పరిచారిక నాగమల్లిక. 

నాగమల్లిక కనులు కన్నీటి చెరువులయ్యాయి. 

‘ఏమిటే.. నాగమల్లికా! ఎందుకేడుస్తున్నావు. కాస్త నీళ్లు పడి యువరాజు తల తడిసింది అంతే. నేను తుడుస్తున్నానుగా.. ఇంకా ఎందుకీ వేదన?’ అంటూ తల తుడుస్తూనే ఉంది. 

‘అమ్మా.. చూడండమ్మా.. ఈ లోకంలోకి వచ్చి చూడండమ్మా..’

 అప్పుడు స్పృహలోకి వచ్చింది చంద్రలేఖ. 

తను తల తుడుస్తున్నది బాలకృష్ణుని విగ్రహానికి. క్రీడా ప్రాంగణంలో తను ఎంతో ఇష్టపడి చెక్కించిన విగ్రహం అది. అందమైన బాలకృష్ణుడు ఐదుతలల పాము పడగలపైన నాట్యం చేస్తున్న చక్కటి శిల్పం. 

బాలకృష్ణుని విగ్రహం తల భాగాన్ని తన చీర చెంగుతో తుడుస్తున్నది తాను అంతవరకూ. 

‘నాగ మల్లికా! నేను, నేను ఏం చేస్తున్నాను? నా బిడ్డ, సోమేశ్వరుడు ఏడీ.. ఇప్పటిదాకా ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఆడుకున్నాడుగా..’ అర్థం కాని ఒక అయోమయ స్థితిలో నాగమల్లిక భుజాలు పట్టి కుదుపుతూ అడిగింది. 

యాదాద్రి వైభవం

‘అమ్మా.. అమ్మా.. మీరింకా ఏదో ఆలోచనల్లో ఉన్నారు. యువరాజా వారు ఇప్పుడు క్రీడా ప్రాంగణంలో ఆడుకునే పరిస్థితిలో లేరు’ ముంచుకొస్తున్న దుఃఖం ఆమె మాటను సగంలో ఆపేసింది. 

‘మరి ఎక్కడున్నాడు తన కొడుకు? తన పేగు చీల్చుకొని పుట్టిన తన బిడ్డ ఎక్కడున్నాడు?’ వెంటనే స్మృతిలోకి వచ్చింది. 

బాలకృష్ణుని విగ్రహాన్ని చూసింది. కాళీయ మర్దనుడు బాలకృష్ణుడు ఎంత అందంగా, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు! ఆమె దృష్టి బాలకృష్ణుని పాదాల కింద ఉన్న పాము పడగలపైన పడింది. 

‘నాగమల్లికా! చూడవే ఈ విష సర్పాన్ని చిన్ని కృష్ణుడు ఎలా తొక్కేస్తున్నాడో.. ఎంత సంతోషంగా ఉంటుందో కదా అమ్మ  యశోదమ్మ.’ మరి, నా బిడ్డ పరిస్థితి ఇలా అయిందేమిటి? కృష్ణయ్య కాళ్లకింద అణగిమణిగి ఉన్న విషసర్పం అంతుపట్టని వ్యాధి రూపంలో నా కొడుకునెందుకే చుట్టుముట్టింది? ఎందుకే ఇలా.. నేనేం అపచారం చేశానే?’ గాద్గదికంగా ప్రశ్నించింది. 

ఎట్టి పరిస్థితుల్లోనైనా ధీరగంభీర మహారాణి చంద్రలేఖాదేవి ఇంత బేలగా మాట్లాడటం,  అదీ తన వంటి పరిచారికల ముందు.. ఎప్పుడూ జరగలేదు. ధైర్యం కూడదీసుకుంది నాగమల్లిక.

 ‘అమ్మా.. ! పరిస్థితులు చక్కపడతాయి. మీరు అధైర్యపడకండి. రండమ్మా… యువరాజావారు మిమ్మల్నే కలవరిస్తున్నాడు’

చేయి పట్టుకొని ఆమెను రాణీమందిరంలోకి తీసుకెళ్లింది నాగమల్లిక.

సరిగ్గా ఆ సమయంలోనే..

విద్యాపతి ఇంటిముందు ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి నిలిపారు రాజ సైనికులు. 

నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు?’

 ఆ వృద్ధ బ్రాహ్మణుడు వారిని అసహనంగా ప్రశ్నిస్తుండగానే విద్యాపతి బయటికి వచ్చాడు. 

‘రామభట్టుగారికి నమస్కారాలు. మన్నించండి. మీకు శ్రమ కలిగించినందుకు! రండి, లోపలికి..’ వినయంగా ఆహ్వానించాడు విద్యాపతి. 

‘శుభం భుయాత్‌. నన్ను ఎందుకు పిలిపించారు?’ తనకు చూపిన ఆసనంలో కూర్చుంటూ ఆడిగాడు.

‘చెప్తాను. ముందుగా ఈ పండ్లను ఆరగించండి. చాలా దూరం ప్రయాణించి వచ్చారు’ ఆత్మీయంగా పండ్లు ఉన్న పాత్రను ఆయన ముందు పెట్టాడు. 

‘వద్దు’ అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు 

రామభట్టు. 

‘మన్నించండి. కవివరేణ్యా.. నేను ఎట్టి ఆహారాన్నీ ఇప్పుడు స్వీకరించలేను’ నవ్వుతూ అన్నాడు రామభట్టు. 

‘ఆ మాటకు కోపం వచ్చింది విద్యాపతికి. 

‘ఓహో.. తమరు నిత్యాగ్నిహోత్రులైన మహా

బ్రాహ్మలు!  మేము కాదనా? మా ఆతిథ్యం మీకు పనికిరాదా? ఎక్కడో మారుమూల గ్రామంలో మీరు అధికులు కావచ్చు. మీ మాటను విద్యాగంధం సోకని పామరులు వినయంగా పాటించవచ్చు. కానీ ఈ విద్యాపతి ప్రభువుల వారి అభిమానాన్ని చూరగొన్న కవి పండితుడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభువుల వారి అనుగ్రహాన్ని పొందాలని కలలు కనే ప్రతివారూ నా దర్శన భాగ్యానికై ఆరాటపడతారు. నన్ను మెప్పించాలని తహతహలాడుతారు. నీవొక ఛాందసుడిలా ఉన్నావు. కులభావన బలంగా ఉన్నట్టుంది నీలో..’ ఆగ్రహంతో అన్నాడు విద్యాపతి. 

‘కాకపోతే ఎంత ధైర్యం ఈ గ్రామీణ వృద్దుడికి? తను సమర్పించిన ఫలాలను స్వీకరించ

లేనంటాడా?’

..విద్యాపతి మాటలకు చిన్నగా నవ్వాడు 

రామభట్టు. 

 ఇంకా కోపం పెరిగింది విద్యాపతికి. 

‘ఏమంటున్నావ్‌, మహాకవీ! నాకు కులభావన ఉన్నదా? విద్య, విద్వత్తు మనిషిని ఉన్నతంగా చేస్తుంది అనుకున్నాను. కానీ అది అహంకారాన్ని, ఇతరులను అవమాన పరిచే కుసంస్కారాన్ని పెంచుతుందని అనుకోలేదు’ నిదానంగా పలికాడు రామభట్టు.

‘అంటే?’

‘లేదు నాయనా, నాకు కులభావన లేదు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువా.. ఎప్పుడూ కాదు. ఈ దేవుని సృష్టిలో అందరూ ఒకటే. నా పేరులో రామ శబ్దమున్నది. భగవంతుడైన శ్రీరాముడు మాకు కులదైవం. కానీ, ఆ దైవానిది మా కులం కాదు. మేము కొలిచే శ్రీ కృష్ణపరమాత్మునిదీ మా కులం కాదు. ఆదిపరాశక్తీ, హరహర మహాదేవుడు, సకల దేవతలూ ఈ మానవలోకంలో పుట్టలేదు. మనుషులు పుట్టించుకున్న కుల, వర్గ భేద భావనలు వారికి లేవు. వారిని మనసా, వాచా,  కర్మణా నమ్మే మాకు లేవు..’ చెక్కు చెదరని చిరునవ్వుతో చెప్పాడు ఆ వృద్ధుడు. ఆ మాటలతో కొంత తగ్గాడు విద్యాపతి. 

‘మరి, మేము ఇచ్చిన ఆహారాన్ని మీరెందుకు వద్దంటున్నారు?’

‘నాకు కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి.’

‘కారణం’ అడిగాడు విద్యాపతి.

‘నేను దీక్షలో ఉన్నాను.’

‘దీక్షా? ఏ దీక్ష?’

‘ నరసింహ స్వామి దీక్ష..’ భక్తిగా చేతులు జోడించి చెప్పాడు రామభట్టు.

నవ్వుతూ గిరగిరా తిప్పుతున్నాడు లోహగోళాన్ని.  పైకి విసిరేశాడు. అది వెళ్లి పక్కనున్న నీటి కొలనులో పడింది. ఒక్కసారిగా నీళ్లు అతని మొహం మీద పడ్డాయి. సోమేశ్వరుని తల తడిసి పోయింది. నీళ్లను జుట్టుతో విదిలిస్తున్నాడు. తల అటూ ఇటూ ఊపుతున్నాడు. ఆ సంతోషంలో నవ్వు తెరలు తెరలుగా వస్తున్నది. కానీ తల్లి హృదయం తట్టుకోలేక

పోయింది. 

‘అమ్మో.. అమ్మా! నువ్వు నా దగ్గరికి రాకపోతే, నాకు పండ్లెవరు తినిపిస్తారు, కథలు ఎవరు చెప్తారు. అసలు నువ్వు నా దగ్గర లేకపోతే.. నేనుండలేను కదమ్మా! నీకు తెలుసు కదా.. మరి, ఎందుకమ్మా ఆ మాటలంటావు?’  కన్నీళ్లతో పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అమ్మను కావలించుకున్నాడు. ఆ మాటలతో చంద్రలేఖ కనులు తడిసిపోయాయి కన్నీటితో. సంతోషమైనా, దుఃఖమైనా లోకాన్ని మనకు చూపించే ఈ కనులు కన్నీటితో  అస్పష్టమై, కనిపించే దృశ్యాన్ని అదృశ్యం చేస్తాయి కదా!

(మిగతా వచ్చేవారం)

Advertisement
యాదాద్రి వైభవం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement