e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 23, 2021
Home కథలు యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. పరమాత్మ తత్వాన్ని చాటడానికి సర్వసంగ పరిత్యాగానికి సిద్ధపడతాడు.

- Advertisement -

త్రిభువనమల్లుని ఆలోచన మహారాణికి మనస్తాపం కలిగిస్తే, యువరాజు సోమేశ్వరునికి కోపం తెప్పించింది.
“అవును నాయనగారూ.. మీ నిర్ణయం నాకు నచ్చలేదు” ఖండితంగా చెప్పాడు.
“ఓహో.. చక్రవర్తుల నిర్ణయంలో తప్పొప్పులు కనిపెట్టేంత పెద్దవాడివయ్యావన్నమాట.. ఈ ధిక్కారం క్షంతవ్యం కాదు..”
‘ఇంక ఆపైన ఏమాట వినవలసి వస్తుందో’ అనే ఆందోళనతో అడ్డుకున్నది రాణీ చంద్రలేఖ.
“ప్రభూ! పసివాడు. మళ్లీ మీరు కళ్లముందు కనిపించకుండా వెళ్లిపోతారేమోనని భయపడుతున్నాడు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా.. నేనూ, కుమారుడు మాత్రమే కాదు, భువనగిరి సామ్రాజ్యంలో ఉన్న వారందరూ శిరసావహిస్తారు”
ఆమెకేసి సాలోచనగా చూశాడు త్రిభువనుడు.
సోమేశ్వరుడు చేతులు జోడించాడు వినమ్రంగా.
“నాయన గారూ! నేను చిన్నవాడిని. అమ్మ చెప్పినట్టు నేను నా తండ్రికి దూరంగా బతకడానికి సిద్ధంగా లేను. శాసన వ్యవహారాల్లో మీ నిర్ణయాలను ఎవరూ తప్పు పట్టలేరు. కానీ, ఒక కుమారుడిగా నాకు నా తండ్రిని అడిగే హక్కు ఉందని అనుకుంటున్నాను”
సోమేశ్వరుని మాటలు త్రిభువనుడికి ఆశ్చర్యం కలిగించాయి.
ఆటబొమ్మలతో ఆడుకొనే పసివాడనుకున్నాడు. కానీ, తల్లి పెంపకంలో వయసుకు మించిన తెలివితేటలు వచ్చాయి.
“కుమారా! సర్వసంగపరిత్యాగిగా నేను మారాలంటే, అందుకు నాకు కావలసింది తల్లిగారి అనుమతి. అలాగే ‘నాతి చరామి’ అని ప్రమాణం చేసి, వివాహమాడిన నా ధర్మపత్ని ఆమోదం. ఇంకెవరి అనుమతీ, ఆలోచనా మాకు అవసరం లేదు”
రాణీ చంద్రలేఖ ఇంక ఆగలేక పోయింది..
“ప్రభూ! నా అనుమతి కోరుతున్నారా? అనుమతి ఇమ్మని ఆదేశిస్తున్నారా?”
“రెండిటికీ భేదమేమిటి?” అడిగాడు త్రిభువనుడు.
“అనుమతి అడిగితే.. ఒప్పుకోవాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఆదేశమైతే.. ఆ అవకాశం ఉండదు” చెప్పిందామె.
“అడుగుతున్నాననే అనుకో, అన్నీ వొదిలేసి స్వామివారి సేవకై వెళ్లమంటావా? లేదా స్వామినే వదిలేసి ఇక్కడే ఉండి పొమ్మంటావా? నీ నిర్ణయమేమిటో స్వచ్ఛందంగా వెల్లడించు..” కాస్త కటువుగానే చెప్పాడు.
ఆలోచించింది చంద్రలేఖ.
ఆయన మనసంతా నారసింహుడే ఉన్నాడు. ఇప్పుడు బలవంతంగా ఆపినా.. తనువు ఇక్కడే ఉంటుందేమో కానీ, మనసు మాత్రం నరసింహుడి కొండపైనే ఉంటుంది.
రాజ్యాన్ని పరిపాలించాల్సిన వాడు, ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుకుంటూ వారి కష్టసుఖాలను చూడాల్సినవాడు, యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్న ఇటువంటి కష్టకాలంలో.. అన్నీ వదిలేసి వెళ్లిపోతానంటున్నాడు. పోనీ.. వద్దందామా అంటే..
తన కొడుకుని బతికించిన స్వామి సేవ! లక్ష్మీ నృసింహా.. నీవే దారి చూపాలి..
“చెప్పలేకపోతున్నాను ప్రభూ! ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాను. నాకిప్పుడు కావలసింది నిర్ణయాధికారం కాదు. నిర్ణయం మాత్రమే! అదే నాకు ఆదేశం!”
స్పష్టంగా తన మనసులోని అభిప్రాయం చెప్పింది.
ఇంక మార్గం సుగమమయింది.
అడ్డంకులు తొలగిపోయాయి.
తను ఏం కోరుకున్నాడో..
అధి సాధించగలిగాడు.
కానీ, మరొక ముఖ్య విషయం.
రాజ్యపాలనాభారం ఎవరికి అప్పగించాలి?
సోమేశ్వరుడు చిన్నవాడు. అతడిని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత రాణీదే. తల్లిగా, పరిపాలకురాలిగా ఆమె రెండు బాధ్యతలూ మోయలేదు.
మరెవరికివ్వాలి పరిపాలనా పగ్గాలు..
అతని ఆలోచనలను భగ్నం చేస్తూ.. దళపతి లోపలికి ప్రవేశించాడు సవినయంగా!
“అత్యవసర వర్తమానం ప్రభూ! మన్నించాలి” భయపడుతూ అన్నాడతను.
“ఏమిటా అత్యవసరమైన వార్త?” అసహనంగా అడిగాడు త్రిభువనుడు.
“రామభట్టు గారనే పండితులు తమ దర్శనం కోరుతున్నారు. వారివెంట ఒక బాలుడు కూడా ఉన్నాడనీ, మీతో మాట్లాడటానికి అనుమతి కోరుతున్నానని వారు చెప్పమన్నారు”
తన నారసింహ దర్శనానికి ప్రేరేపించింది.. ఈ రామభట్ట్టే. తనే అతడిని చూడాలనుకుంటున్నాడు. స్వామి సంకల్పమేమో.. ఆయనే దేవుడు పంపినట్లుగా తన వద్దకు వచ్చాడు.
“వెంటనే రమ్మను”
చక్రవర్తి ఆదేశం తీసుకొని క్షణంలో వెళ్లిపోయాడు దళపతి.
“ప్రభూ! ఏమిటి ఈ రామభట్టుగారి అనుకోని సందర్శనకు కారణం?”
“తెలియదు దేవీ! చూద్దాం.. ఏ వార్త తెస్తాడో? స్వామివారి నుండి ఏ సందేశం మోసుకొస్తాడో..?”
ఈ సమయంలో రామభట్టుగారి ఆగమనం, అవసరమా? అనవసరమా? అర్థం కావడం లేదు. చూద్దాం. ప్రభువులవారు చెప్పినట్టు.. ఏ వార్తను తీసుకొస్తాడో?

రామభట్టు వినయంగా లోపలికి ప్రవేశించాడు.
“ఓమ్‌ నమో నారసింహాయ. శ్రీ లక్ష్మీ నృసింహానుగ్రహ ప్రాప్తిరస్తు” అంటూ ఆశీర్వదించాడు.
అసంకల్పితంగా తలవంచి నమస్కరించారు రాజదంపతులిద్దరూ.
రామభట్టు వెంట ఒక బాలుడు ఉన్నాడు.
“సర్వం శ్రీ నారసింహార్పణం” చిరునవ్వుతో అన్నాడా బాలుడు.
ఆ బాలుడిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు త్రిభువనుడు.
“నన్ను గుర్తించావా త్రిభువన చక్రవర్తీ?” నవ్వుతూ అడిగాడు బాలుడు.
గుర్తొచ్చింది త్రిభువనుడికి.
తాను యాదగిరీశుడి కొండమీద.. స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇద్దరు వృద్ధ దంపతులకు ధైర్యం చెప్తూ కనిపించాడు ఈ ముని బాలకుడు. యాదరుషి శిష్య పరంపరలోని వాడిననీ చెప్పుకొన్నాడు. వృద్ధ దంపతుల కొడుకు పిచ్చివాడై తిరుగుతూంటే.. ఆనాడు యాదర్షి కూర్చున్న రాతిని చూపించి, ఆ పిచ్చివాడి వ్యాధిని నయం చేశాడు. ఆ రైతు దంపతులు ఆరోగ్యవంతుడైన కొడుకుతో కొండదిగి వెళ్లిపోయారు.
“నిన్ను గుర్తించక పోవడమేమిటి? ముని బాలకుడివి. యాదర్షి మహర్షి శిష్యపరంపరలోని వాడనని నువ్వే చెప్పుకొన్నావ్‌. నీ రాక మాకు చాలా సంతోషం కలిగించింది. ఆ రోజున పిచ్చివాడికి అనుగ్రహ వైద్యం చేశావ్‌. అతడిని మామూలు మనిషిని చేశావ్‌. ఎలా మర్చిపోతాను?”
ఆనందంగా గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు
త్రిభువనుడు.
“కానీ..”
“ఇప్పుడెందుకు వచ్చాను.. అన్నది కదూ నీ సందేహం..”
అవునన్నట్టుగా తల ఊపాడు.
రామభట్టు అర్థం అయి కానట్టుగా ఇద్దర్నీ చూస్తున్నాడు.
“త్రిభువనమల్ల చక్రవర్తీ! ఆరోజు నీకు నేను నాపేరు చెప్పలేదు. నాపేరు సంచారి. పిల్లవాణ్ణి కాబట్టి నన్ను బాల సంచారి అంటారు. నా దేవదేవుడు నారసింహుడు. ఎక్కడెక్కడ తన ఉనికి ప్రత్యక్షంగా, నిదర్శనంగా చూపిస్తాడో.. అక్కడికి నేను వెళ్తుంటాను. స్వామిని సేవించుకుంటాను. నా సంగతి సరే, నీ పరిస్థితి ఎలా ఉంది? స్వామిని దర్శంచుకోగలిగావు. అదృష్టవంతుడివి. దర్శనం తరువాత నీలో వచ్చిన మార్పు ఏమిటి?”
ఈ ప్రశ్నకు తనవద్ద సమాధానం లేదు.
స్వామి దర్శనానికి ముందు, ఆ తరువాత తనలో చాలా మార్పు వచ్చింది. పెనుమార్పు!
“అధికారమూ, ఐశ్వర్యమూ, కీర్తికిరీటాలు.. విస్తరిస్తున్న సామ్రాజ్యపు సరిహద్దులూ, దినవారీ నిర్వహణ విధులు.. ఇవే నా ప్రపంచం. కానీ, స్వామివారి దర్శనం తర్వాత స్వామివారే నా ప్రపంచం అనిపిస్తున్నారు. ఆకాశమంత ఎత్తుకు తలెత్తి చూసినా నారసింహుడి పాదాలే కనిపిస్తున్నాయి. తలవంచుకొని నాలో నేను ఆలోచించుకున్నా.. స్వామి అనుగ్రహ వదనమే లీలామాత్రంగా కనిపిస్తోంది. ఏది నిజం, ఏది కల.. అర్థం కావడం లేదు. అందుకే..”
“అందుకే.. సర్వసంగ పరిత్యాగిలా మారదామనుకుంటున్నావ్‌.. అంతేగా?” అడిగాడు బాల సంచారి.
“అంతే! అంతకుమించి నాకు ఏమీ అవసరం లేదు. ఎవరూ అవసరం లేదు.”
“బంధాలు వదిలేసుకుంటాను.. అంటావ్‌?” నవ్వుతూ అడిగాడు బాలుడు.
అవునన్నట్టుగా తలూపాడు.
“త్రిభువన చక్రవర్తీ! ఆ రోజున నీవెవరో తెలియక, ఆ వ్యవసాయదారుడు నిన్ను ‘సర్వసంగ పరిత్యాగి’ అన్నాడు. ఆ మాటకు భయపడి.. నువ్వు కాదన్నావ్‌..”
“అవును.. అప్పుడు కాదు”
“మరి, ఇప్పుడేం మారింది? నువ్వింకా చక్రవర్తిగానే ఉన్నావ్‌. చక్రం తిప్పుతూనే ఉన్నావ్‌. నీ సైన్యాధిపతిని విష్ణువర్ధనుడిని ఓడించి తీసుకురమ్మని యుద్ధ రంగానికి పంపించావ్‌. ఏం వదిలేశావని.. ఏ బంధాన్ని దూరం చేసుకున్నావని సర్వసంగ పరిత్యాగాన్ని కోరుకుంటున్నావ్‌?”
సూటిగా ప్రశ్నించాడు బాల సంచారి.
“స్వామిని దర్శించాక.. ఆయనొక్కడే ‘నిజం’ అనిపించింది. మిగతాదంతా ‘మాయ’ అనిపిస్తున్నది. మాయలో నేను పడదల్చుకోలేదు. నిజం ఏమిటో తెలిశాక, అబద్ధాన్ని పట్టుకొని వేలాడటం దేనికి అనిపిస్తున్నది. వెళ్లిపోతాను.. ఆ స్వామి సన్నిధికే వెళ్లిపోతాను”
ఏదో లోకంలో ఉన్నట్టుగా పలికాడు.. త్రిభువనుడు.
రామభట్టు, రాణీ చంద్రలేఖ, యువరాజు సోమేశ్వరుడు నిశ్శబ్దంగా ఈ సంభాషణ వింటున్నారు.
“నువ్వు కోరుకున్నప్పుడు వెళ్లిపోవడానికి అదేమైనా నీ కోటలోని గుడి అనుకుంటున్నావా? వెళ్లాలనుకుంటే.. నువ్వు వెళ్లలేవు” చెప్పాడు బాల సంచారి.
“మరి?”
“ఆయన పిలిస్తే వెళ్లగలవు. రా.. రమ్మంటేనే స్వామివారి దర్శనం చేసుకోగలవు. నారసింహుడి కొండకు వెళ్లాలంటే, ఆయన కొండకు ఆయనే రప్పించుకోవాలి.. అనుగ్రహించాలి”
“స్వామి అనుగ్రహం నాపైన ఉన్నదనే అనుకుంటున్నాను”
“నేనూ అనుకుంటున్నాను. వారి అనుగ్రహం ఉన్నది కాబట్టే, నారసింహుడి దర్శనం నీకు దొరికింది” నవ్వుతూ అన్నాడు బాల సంచారి.
“అందుకే నేను అన్నీ వొదిలేసి వెళ్లిపోదామనుకుంటున్నా”
“ఎలా వదిలేస్తావు అన్నీ.. అసలు దేన్ని వదులుకోగలవు? సరే, బంధాలను వదిలేస్తావనుకుందాం.. మరి, బాధ్యతలను ఎలా వదిలేస్తావు?”
బాల సంచారి అడిగిన ప్రశ్న త్రిభువనుడిని అయోమయానికి గురిచేసింది.
“రెండూ ఒకటేగా? బంధం వేరూ, బాధ్యత వేరూ ఎలా అవుతుంది?”
“కాదు.. ఆ రెండూ ఒక్కటి కాదు. బంధం నువ్వు ఏర్పరచుకున్నది. బాధ్యత.. నువ్వే నెరవేర్చుకోవలసింది. బంధాన్ని వదులుకోవడం పరిత్యాగం కావచ్చు. కానీ, బాధ్యతల నుండి తప్పించుకోవడం.. ‘పలాయనం’ అవుతుంది. దాన్ని స్వామి ఎన్నటికీ ఒప్పుకోడు” స్థిరంగా పలికింది బాలుడి కంఠం.
“బాధ్యత బరువుగా అనిపిస్తే.. బరువును దించుకోవాలనుకోవడం తప్పు కాదు కదా?” అడిగాడు త్రిభువనుడు.
“తప్పే అవుతుంది. ప్రజలు, వారి సంక్షేమం, నీ కుటుంబం, ఈ రాజ్య భవిష్యత్తు.. ఇవి నీకు బరువుగా అనిపించినా.. బాధ్యతగా అనిపించినా.. వీటిని వొదులుకోలేవు. కూడదు..”
“అన్నీ ఉడిగిపోయిన తర్వాత కళ్లూ, నోరూ, చెవులు, శరీరం పనిచేయడం ఆగిపోయిన తర్వాత.. స్పృహ లేని ముసలితనంలో స్వామిని సేవించుకోమంటావా? స్తోత్రం చేయడానికి పెదవులు కదలవు. దివ్య రూపాన్ని చూడటానికి కనులు పనిచేయవు. సాష్టాంగ పడటానికి వీలుకాదు.. సర్వాంగాలు స్తంభించి పోయుంటాయి. అప్పుడేంలాభం? మృత్యుఘడియలు తరుముకొస్తుంటే.. శరణు కోరడానికి తప్ప ఈ శేష శరీరం.. సేవ చేయడానికి పనికొస్తుందా? అప్పటివరకూ సుఖభోగాలనుభవించి.. అన్నీ తీరిన తరువాత నిన్నే చేరుతా అంటే స్వామి మాత్రం కనికరిస్తాడా? కను మూసిన తర్వాత రానిస్తాడా?”
దానికీ సమాధానం.. చిరునవ్వే!
నవ్వుతూ అన్నాడు బాల సంచారి.
“నీకు తెలుసు. శ్రీ నారసింహావతార పరమార్థం. బాలుడు ప్రహ్లాదుడు. భక్తిగా మొక్కుకున్నాడు. స్తంభంలో నుండి బయటికి వచ్చి లోక కంటకుడైన హిరణ్యకశిపుని పేగులు బయటికి లాగి, రాక్షస సంహారం చేశాడు.
తప్తహాటక కేశాంత జలత్పావక లోచనః
వజ్రాధిక నఖస్పర్శ! దివ్యసింహా! నమోస్తుతే!
పాంతువో నరసింహస్య నఖలాంగల కోటయః
హిరణ్య కశిపోర్వక్షః క్షేత్రాసృ క్కర్దమారుణాః
అంటే.. హిరణ్యకశిపుని వక్షం అనే పొలంలోని నెత్తురు బురదతో ఎరుపెక్కిన నాగళ్లవంటి నరసింహుని గోళ్లు మనల్ని కాపాడుగాక.
అప్పుడు ఉగ్ర నరసింహుడు అడిగాడు
ప్రహ్లాదుడిని..
“ప్రహ్లాద! భద్ర! భద్రంతే ప్రీతోహం”
ఓ ప్రహ్లాదా! ఉత్తముడా, ప్రీతి చెందాను.
వరం వషీష్వాభిమతం కామ
పూరోస్మహం వృణా!
నీకిష్టమైన వరం కోరుకో అన్నాడు స్వామి”
బాల సంచారి మాటలకు అడుగలేక అడిగాడు త్రిభువనుడు.
“ఏం కోరుకున్నాడు ప్రహ్లాదుడు?”
“ఇంకేం కోరుతాడు. సర్వసంగ పరిత్యాగమే.. స్వామి సేవయే కోరుకున్నాడు”
“భక్త సులభుడైన శ్రీ లక్ష్మీ నారసింహుడు.. ప్రహ్లాదుని కోరికను తీర్చే ఉంటాడుగా..” ఆతృతగా అన్నాడు త్రిభువనుడు.
‘లేదు..’ అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు బాలుడు.
“అప్పుడు స్వామి ఏమన్నాడో తెలుసా? ప్రసన్న మూర్తియై ప్రహ్లాదుణ్ణి దగ్గరకు తీసుకొని అనుగ్రహ భాషణం చేశాడు.
‘నాయనా, నా ప్రియమైన భక్తుడా.. ప్రహ్లాదా! బాధ్యత నెరవేర్చుకున్న తరువాతే బంధనాలు వదులుకో.. రాజువై సింహాసనాన్ని అధిష్టించి.. ప్రజలకు మంచి పాలన అందించు..’
అని ఆదేశించాడు. ఇదే మాట నీక్కూడా వర్తిస్తుంది త్రిభువన చక్రవర్తీ!”
ఏం చెప్పాలో తెలియక..
కనులు మూసుకొని తన ఇష్టదైవం శ్రీ లక్ష్మీ నరసింహుణ్ణి మనసారా ప్రార్థించాడు.
అదే సమయంలో విష్ణువర్ధనుడు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒక అనూహ్య పరిణామం సంభవించింది.

-అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement