e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home బతుకమ్మ యజ్ఞానికి పరిచయం

యజ్ఞానికి పరిచయం

‘హోమం లేదా యజ్ఞం చేసేవాళ్లకు ఈశ్వరుడు మిత్రుడవుతాడు. వాళ్ల సంకల్పాలు నెరవేరతాయ’ని సామవేదం పేర్కొంటుంది. ఈ వేద వాక్యాన్ని నిజం చేయడానికి యజ్ఞాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చి, ప్రజలకు చేరువ చేసిన వ్యక్తి ఆర్య సమాజ’ స్థాపకుడు మహర్షి స్వామి దయానంద సరస్వతి. అలా భారతీయ సమాజంలో ఎలాంటి భేదాలు లేకుండా ఎవ్వరైనా సరే యజ్ఞం చేయవచ్చన్న స్పృహ కల్పించింది ఆర్య సమాజమే అని స్పష్టంగా చెప్పవచ్చు. అలాంటి యజ్ఞం ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఆర్య సామాజికుడు బైస హరిదాస్‌ ఆర్య రాసిన పుస్తకం ‘యజ్ఞం చేద్దాం- మనల్ని మనం రక్షించుకుందాం’. 20 సంవత్సరాలుగా నిత్య యజ్ఞం నిర్వహిస్తూ, ఇతరులతో చేయిస్తూ గడించిన అనుభవసారాన్ని ఈ చిన్న పుస్తకంలో వివరించారు రచయిత. యజ్ఞంలో వాడే వివిధ మూలికలు, వాటి ప్రయోజనాలు, యజ్ఞ కుండాల గురించి, రుతువులకు తగినట్లుగా మూలికలు, సమిధలను ఎలా ఎంచుకోవాలి, యజ్ఞం వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలకు సంబంధించి ‘హోమా థెరపీ’ లాంటి వివరాలను ఏర్చికూర్చి రాసిన ఈ పుస్తకం భారతీయ సనాతన సంస్కృతిలో అవిభాజ్య భాగమైన యజ్ఞం గురించి తెలుసుకోవాలనుకునే వారికి కరదీపిక.

యజ్ఞం చేద్దాం- మనల్ని మనం రక్షించుకుందాం
రచయిత: బైస హరిదాస్‌ ఆర్య, పేజీలు: 80, వెల: రూ. 50
ప్రతులకు: రచయిత, ఫోన్‌ నెం. 98492 59011,
బ్రహ్మరుషి ఆశ్రమం, డిచ్‌పల్లి, నిజామాబాద్‌;
బైస బ్రహ్మానంద్‌, ఫోన్‌ నెం. 74169 67008,
భోగ సత్యనారాయణ, ఫోన్‌ నెం. 99490 77957

- Advertisement -

సస్పెన్స్‌ థ్రిల్లర్‌
సాధారణంగా టూరిస్ట్‌- యాత్రికుడు, ట్రావెలర్‌- పర్యాటకుడు ఒకటే అనుకుంటారు. టూరిస్ట్‌ అంటే కేవలం ప్రదేశాలను చూడటానికి మాత్రమే తిరిగేవాడు. ఇక ట్రావెలర్‌- పర్యాటకుడు అంటే ప్రపంచాన్ని చదవడానికి యాత్రలు చేసేవాడు. యువరచయిత సుధీర్‌ కస్పా రాసిన ‘మృత్యవిహారి’ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నవలలో ప్రధాన పాత్ర ఆర్యన్‌ సుబ్రమణ్యన్‌, ఉరఫ్‌ సుబ్బు పాత్ర కూడా ప్రపంచాన్ని చదవడానికి పర్యటనలకు బయల్దేరిందే. తన పర్యటనల్లో లహరితో ప్రేమాయణం, డాక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, శివాని, నయన ఇలా వివిధ పాత్రల కారణంగా సుబ్బు ఎదుర్కొన్న పరిస్థితులను ఇందులో కళ్లకు కట్టాడు సుధీర్‌. రంగురాళ్ల నిధుల కోసం చరిత్ర ప్రొఫెసర్‌ ముఖర్జీ పడే తపన, స్వతహాగా మంచివాడే అయినా జనం విపరీత ప్రవర్తన కారణంగా వారిపై ద్వేషం పెంచుకున్న డాక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఇలా వివిధ పాత్రల కారణంగా సుబ్బు ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఎంతో ఉత్కంఠ భరితంగా చిత్రించాడు సుధీర్‌. చివరికి డాక్టర్‌ ప్రశాంత్‌ వర్మే నవలలో ఉత్తమ ‘విలన్‌’ అని తేలుతుంది. ‘మృత్యువిహారి’ని ఉత్కంఠభరితంగా నడిపించడంలో రచయిత సఫలీకృతుడయ్యాడు.

మృత్యువిహారి
రచయిత: సుధీర్‌ కస్పా,
పేజీలు: 160, వెల: రూ.200,
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
ప్రతులకు: acchamgatelugu@gmail.com ఫోన్‌: 85588 99478

మనిషిని మనిషిగా నిలిపే కవితలు
మానవ జీవితంలో జరిగే సంఘటనలకు కార్యకారణ సంబంధం ఉంటుంది. కోరికలే దుఃఖానికి కారణాలు. దుఃఖాన్ని తొలగించుకోవాలంటే అష్టాంగమార్గాన్ని అనుసరించాలన్న బుద్ధ భగవానుడి సాహచర్యం కోరుకుంటూ రాసిన కవిత ప్రాణ గంధం. ఇలాంటి 80 కవితలతో కవి బూర్ల
వేంకటేశ్వర్లు తీసుకువచ్చిన కవితా సంకలనం ‘ప్రాణ గంధం’. జాను తెనుగుకు పట్టం కట్టిన కవుల్లో పాల్కురికి సోమనాథుడిది ప్రత్యేక స్థానం. ద్విపద, శతకం, ఉదాహరణ లాంటి తెలుగు సాహితీ ప్రక్రియలకు ఆదిగురువు ఆయనే. అంతేకాదు సంస్కృత పౌరాణిక పాత్రలకు భిన్నంగా సబ్బండ వర్ణాల పామరులకు తన ‘బసవ పురాణం’లో కావ్య గౌరవం కల్పించిన తొలి తెలుగు కవి. అలాంటి మహనీయుని స్తుతిస్తూ, ఆయన స్ఫూర్తిని చాటుతూ సాగే కవిత ‘సవారి కచ్చురం’. లోక వ్యవహారమే ప్రామాణికం అని ప్రకటించే ‘మా మాటలు’, ప్రపంచానికి అన్నం పెట్టే రైతును కూడా దేవుడిగా చూడాలని గుర్తుచేసే ‘రైతు దేవోభవ’, నేత పనివాళ్ల వెతలను గానం చేసే ‘దారప్పోగు’, వర్తమాన సమాజంలో పెల్లుబుకుతున్న అసహనం సమసిపోయి మానవత్వం వెల్లివెరియాలని కోరే ‘కడుపు కోత’, అశక్తతను అధిగమించి ప్రతి ఒక్కరూ కార్యక్షేత్రంలో దూసుకుపోవాలని స్ఫూర్తినిచ్చే ‘పనిమంతునివై’, కరోనా కష్టాలను కళ్లకు కట్టే ‘యుద్ధపు కొల్పు’, ‘కరోనా… వానా…’, జ్యోతిరావు పూలే గులాంగిరి స్ఫూర్తితో రాసిన ‘పురాణ సారమెల్ల’… ఇలా ప్రాణ గంధంలోని ప్రతి కవితా సరళంగా, ముక్కుసూటిగా సాగుతుంది. ప్రస్తుత కాలంలోని చిన్నాపెద్దా పరిస్థితుల్ని కళ్లకు కడుతుంది. వ్యవస్థను ప్రశ్నిస్తూ, మనిషి మనిషిగా బతకాలని, మనిషిని మనిషిగా చూడాలన్న సందేశాన్ని అందిస్తుంది.

ప్రాణ గంధం (కవిత్వం)
రచయిత: బూర్ల వేంకటేశ్వర్లు
పేజీలు: 167 వెల: రూ. 150
ప్రచురణ: సాహితీ సోపతి, కరీంనగర్‌
ప్రతులకు: బి. సంతోష, 2-10-1524/ 10, ఫ్లాట్‌ నం. 403, వేంకటేశ్వర టవర్స్‌, జ్యోతి నగర్‌, కరీంనగర్‌,
తెలంగాణ- 505001

-చింతలపల్లి హర్షవర్ధన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement