మైన్మార్‌లో తెలుగు బడి


Sun,August 30, 2015 05:53 AM

భాషా సంస్కృతులను కాపాడుకోవాలనుకునే వారిలో చక్కటి విశ్వాసాన్ని ప్రోది చేస్తున్న బర్మా తెలుగు ప్రజలు అ అంటే అమ్మా...ఆ అంటే ఆవు అంటూ తెలుగు నేర్పుతూ, గొప్ప ఆదర్శంగా తమంతట తాము బడిని నిలబెట్టడం విశేషం.
- నాగవర్ధన్ రాయల

govt-school

ఆహార సేకరణ, ఉత్పత్తి మనిషికి జ్ఞానం నేర్పింది. ఆ జ్ఞానమే భాషకు జీవం పోసింది. ఆహారం కోసం, ఆవాసం కోసం పోరాడుతూ ఒక సమూహం ఎంత దూరం ప్రయాణించిందో, అంతదూరమూ ఆ భాష, సంస్కృతి విస్తరించాయి. ఇది ప్రాచీన కాలం నాటి సంగతి. ఈ కాల పరిస్థితులు వేరు. కూటికోసం, గుడ్డకోసం ఈ దేశంలోనే పరదేశీ భాష నేర్చుకుని, పర సంస్కృతిని పాటించాల్సిన దుస్థితి. ఆకలి దప్పులు తీర్చుకోడానికి ఆత్మీయతను కోల్పోతున్నట్లుగా కూడా భావించనంతగా ఆంగ్ల సంస్కృతికి అలవాటయిపోయాం. వేష భాషలు మార్చి బతకనేర్పే వ్యక్తిత్వ వికాసం పాఠాలకు భిన్నంగా తమ సంస్కృతి పరిరక్షణ కోసం తెలుగు బడులకు శ్రీకారం చుట్టారు మైన్మార్ (బర్మా) దేశంలోని తెలుగు ప్రజలు.

తెలుగు బడి- అదే వాళ్ల గుడి!


బ్రిటీష్ వాళ్లు భారతదేశంలో అడుగుపెట్టాక తమ ఆధీనంలో ఉన్న దేశాల్లో చేపడుతున్న పనుల కోసం మనవాళ్లను కూలీలుగా ఆయా దేశాలకు తీసుకుపోయారు. పేదరికంతో బాధపడేవాళ్లు ఏ దేశమైతేనేమి కూడుదొరికితే చాలనుకుని తెల్లవాడిని అనుసరించారు. రెండు వందల ఏళ్ల క్రితం మాతృదేశాన్ని వీడి, అప్పటి బర్మా దేశం చేరుకున్న వాళ్ల వారసులు వీళ్లు. ఇప్పుడు మైన్మార్‌గా పిలువబడుతున్న బర్మా దేశంలోని తెలుగువాళ్లు ఒకప్పుడు మాతృదేశంలోనే ఉంటున్నట్లుగా ఫీలయ్యేవారట. అక్కడి పట్టణాల్లో ఒకటి, రెండు కుటుంబాలు కాదు, వందల తెలుగు కుటుంబాలున్నాయి.

తెలుగు ప్రజల వీధుల్లో తెలుగు సంస్కృతి వర్థిల్లేది. భాష, సంస్కృతే కాదు బడుల్లోనూ తెలుగు వర్ధిల్లింది. ఆ దేశ పాలకులు తెలుగును సెకండ్ లాంగ్వేజ్ (ద్వితీయ భాష)గా ఆమోదించారు. దీన్నిబట్టి మన జనాభా అక్కడ ఎలా ఉందో అర్థమవుతోంది. అవన్నీ నిన్నటి రోజులు. ఇప్పుడా దేశంలో తెలుగు వాళ్లు సుమారు 80 వేలమంది ఉంటారు. చిన్న దేశంలో ఈ సంఖ్య చాలా పెద్దదే. (ఒకప్పుడైతే మన తెలుగువాళ్ల సంఖ్య ఇంతకంటే అనేక రెట్లు ఎక్కువగా ఉండేది.) సైనిక పాలన తర్వాత పౌరసత్వం ప్రాతిపదికగా విధించిన ఆంక్షల వల్ల చాలా మంది వెనక్కి రావడంతో మనవాళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ స్థితిలో పాఠశాలల్లో తెలుగుకు ద్వితీయ భాష హోదా పోయింది. తెలుగు కుటుంబాల్లో పుట్టిన వారికి తెలుగు మాట్లాడటమే కానీ, రాయడం రాదు. అప్పుడు ఆ దేశంలోని పట్టణాల్లో తెలుగు నేర్పే ప్రైవేటు బడులు మొదలయ్యాయి. ఆసక్తి ఉన్న వాళ్లు ఫీజు కట్టి నేర్చుకునేవాళ్లు. కొన్నాళ్ల తర్వాత అవి కూడా మూతబడ్డాయి.

దశాబ్దాలు గడిచాయి. తెలుగు భాషను చదివిన తరంవాళ్లంతా ముసలివాళ్లయ్యారు. ప్రైవేటు బడుల్లో తెలుగు నేర్చుకున్నవాళ్లు పెద్దవాళ్లయ్యారు. ఇప్పటి పిల్లలు మాత్రం తెలుగు రాని వాళ్లయ్యారు. ఒకప్పుడు పెళ్లిలో మంగళ హారతులు పాడే యువత ఉండేది. ఇప్పుడు నాయనమ్మలు తప్ప నడివయసు మహిళలు పాడడం లేదు. ప్రభుత్వ విద్యావిధానం, సామాజిక మార్పులతో తమ సంస్కృతికి కష్టం వచ్చిందని బర్మా తెలుగు వాళ్లకర్థమైంది. తెలుగంటే సినిమా పాటలు కావు. తేటతెలుగు మాటలని, ఆ..తియతీయని తేనియ మాటలు తమ పిల్లలకూ నేర్పాలనుకున్నారు. మాతృభాషను కాపాడుకుంటేనే మాతృ సంస్కృతి నిలుస్తుందనే ఉద్దేశ్యంతో తెలుగు బడులకు శ్రీకారం చుట్టింది బర్మా తెలుగు సంఘం. ఈ ప్రయత్నం మాకెంతో గర్వంగా ఉందని బర్మా తెలుగు సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం అన్నారు.

ఆ దేశమేగిన తెలుగు...


తెలుగు కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు తెలుగు నేర్పేందుకు ప్రైవేటు బడులు పెట్టి తెలుగు నేర్పించడానికి ఉద్ధండ పండితులు కాదు కదా... వ్యాకరణం తెలిసిన వాళ్లు కూడా బర్మా తెలుగు సంఘానికి దొరకలేదు. అయినా వాళ్లు వెనకడుగు వేయలేదు. 2003లో మౌల్మీన్ పట్టణంలో తొలి బడి ప్రారంభించారు. ఆ బడిలో తెలుగు వచ్చిన వాళ్లు పంతుళ్లు, రాని వాళ్లు విద్యార్థులు.

సాయంత్రం గంట సేపు చెప్పే తెలుగు పాఠాలు వినడాకిని స్పందన బాగానే వచ్చింది. ఆరేళ్ల పిల్లల నుంచి మూడు పదుల పెద్దల వరకు పలకా, బలపం పట్టుకున్నారు. అ, ఆ, ఇ, ఈలతో మొదలైన తెలుగు బడి గుణింతాలు, పదాలు దాటి ఎక్కాలు, వ్యాకరణం దాకా ముందుకు సాగింది. బర్మా తెలుగు సంఘం చేస్తున్న కృషికి తల్లిదండ్రుల తోడ్పాటూ తోడయింది. తెలుగు నేర్చుకోమని పిల్లలకు ప్రోత్సాహం అందించడం, వారిలోనూ నేర్చుకోవాలనే ఉత్సాహం పెంచేందుకు తెలుగు సంఘం అనుబంధంగా ఉన్న సంక్షేమ నిధితో కార్యవర్గం పిల్లల్ని ఆకట్టుకునేలా బడిని నిర్వహించడంతో విద్యార్థుల సంఖ్య కూడా బాగానే పెరిగింది.

సాధారణ పాఠశాలలకు సెలవు రోజుల్లో (శని, ఆదివారాల్లో) సాయంత్రం ఒక గంటసేపు తెలుగు బడికి వస్తే ఉచితంగా రుచికరమైన తినుబండారాలను అందించేవాళ్లు. చిరుతిళ్లు, స్నేహితులతో గడిపే అవకాశం ఉండడంతో పిల్లలు హుషారుగా వచ్చి అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అంటూ తెలుగు అక్షరాలను, తెలుగు సంస్కృతిని నేర్చుకోవడం మొదలుపెట్టారు. తెలుగు బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఆ తర్వాత బడి గంటలు పెంచారు. 6-7 గంటల మధ్య ఒక బృందానికి, 7-8 గంటల మధ్య మరో బృందానికి తెలుగు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. తెలుగు వారు అధికంగా ఉండే మౌల్మీన్ నగరంలో విజయవంతమైన ఈ ప్రయోగం వార్త ఇతర నగరాలకు వ్యాపించింది. అక్కడా తెలుగు బళ్లు పెట్టాలనే ఆకాంక్ష మొదలైంది. అదే పనిలో ఉన్న బర్మా తెలుగు సంఘం మౌల్మీన్ నగరంలో మరో 3 పాఠశాలలు, రంగూన్‌లో 2 పాఠశాలలు, బేక్‌లో మూడు పాఠశాలలతోపాటు పెగు, తటోన్, కోతాం పట్టణాలలో ఒక్కో పాఠశాలను నెలకొల్పింది.

తెలుగు సేవలు


రోజూ సాయంత్రం ఒక గంట సేపు తెలుగు బడికి వచ్చిన విద్యార్థులను సానబట్టేందుకు వేసవిలో ఇంకొంచెం ఎక్కువ సేపు తరగతి గదిలో ఉంచేందుకు బర్మా తెలుగు సంఘం కృషి చేసింది. వేసవి సెలవుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు బడులు నిర్వహించి చదవడం, రాయడమే కాదు తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి తెలిసేలా పాఠాలు చెప్పాలని నిర్ణయించారు. వేసవి బడికి పిల్లలు వస్తారు. వారికి ఆకలైతే? మళ్లీ ఇంటికిపోయి వస్తారా? లేక ఆటల్లోపడి బడిని మర్చిపోతారా? అనుకున్నారు. బడికి వచ్చిన పిల్లల ఆకలి తీర్చడం తెలుగు సంఘం తమ బాధ్యత అనుకుంది. బడికి వచ్చిన విద్యార్థులందరికీ మధ్యాహ్నం ఉచితంగా భోజనం పెట్టేందుకు దాతలు ముందుకు రావాలని కోరింది. సంఘంలో ప్రతి సభ్యుడు ఒక రోజు విద్యార్థులకు ఉచిత భోజన బాధ్యతను తీసుకున్నాడు. సంఘం వాళ్లు భోజనానికి పిలుపునిస్తే దాతలు భోజనమేనా? వేసవిలో కూల్ డ్రింక్స్ ఉండాలి కదా! అని అవి కూడా సమకూర్చారు.

ఓన్లీ కూల్ డ్రింక్సేనా అంకుల్ అనడిగే పిల్లల కోసం స్నాక్స్ (చిరుతిళ్లు) కూడా సిద్ధం చేశారు ఆ తెలుగు పెద్దలు. ఇంత దొడ్డ మనసుతో బడి నిర్వహిస్తుంటే చిన్న మనసులు తెలుగు నేర్చుకోకుండా ఉంటాయా? మాతృభాష అభ్యసించేదుకు వచ్చే ఈ పిల్లల బుర్రకు పదునుపెట్టి, బొజ్జలు నింపడమే కాదు. పాఠాలు పూర్తయిన తర్వాత వారిని కారులో ఇంటి దగ్గర దింపి వస్తారు. ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబాల వారు తమ కార్లలో బడి ముగిసే సమయానికి అక్కడికి చేరుకుంటారు. పిల్లల్ని ప్రతి రోజూ బాధ్యతగా సుదూరంగా ఉన్న ఇంటి దగ్గర నిర్వాహకులే దింపి వస్తారు. రాత్రివేళ అనుకోని ప్రమాదం జరిగితే బడికి దూరమవుతారేమోనని తెలుగు సంఘం వారి ముందు జాగ్రత్త.

బాలశిక్షే -తెలుగు రక్ష


బడుల్లో, బర్మా తెలుగు సంఘంలో తెలుగు బోధనపై అవగాహన ఉన్నవారు లేరు. కానీ, చేయాలనే తపన మాత్రం ఉంది. ఆ ఆరాటమే లోపాలున్నా పనికి ఆటంకం కాలేదు. పిల్లలకు చెప్పే చదువు ఎలా ఉండాలి? సిలబస్ రూపకల్పన వంటి సమస్యలు వారికి ఎదురయ్యాయి. ఈ విద్యా బోధనా ప్రణాళిక కోసం ఆగిపోకుండా ఎవరు సాయం చేస్తే వారి సేవల్ని వినియోగించుకున్నారు. వివిధ జంతువులు, వస్తువులను తెలుగులో ఏమంటారో చెబుతూ పాఠాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలుగు భాషా గని, తెలుగు సంస్కృతి విజ్ఞాన ఖని పెదబాల శిక్ష వారికి కరదీపికైంది. అందులోని పద్యాలు, సామెతలు, జాతీయాలతోపాటు కథలు, సామాజిక, శాస్త్రీయ విశేషాలను పిల్లలకు వివరించేవారు.

ఇలా నడుస్తున్న పాఠశాలలకు తెలుగు విశ్వవిద్యాలయంలోని అంత్జాతీయ తెలుగు కేంద్రం సేవలూ చేరువయ్యాయి. బర్మాలో పుట్టి పెరిగిన ఎర్రన్నాయుడు బర్మీస్ తెలిసిన పిల్లల కోసం ఓ తెలుగు వాచకాన్ని 2011లో రూపొందించాడు. ఈ వాచకంలో ఏ ప్రమాణాలు ఉండాలో యూనివర్సిటీవారు నిర్దేశిస్తే, ఆ ప్రమాణాలకు అనుగుణంగా సుందర్‌రావుతో కలిసి వాచక రూపకల్పన చేశారు ఎర్రన్నాయుడు. ఈ వాచకం, పెద్దబాల శిక్ష బర్మాలోని తెలుగు బడిలో పాఠ్యగ్రంథాలు.

బహుళ జాతుల ప్రపంచంలో జాతి భావనకు సంస్కృతే మొదటి ప్రాతిపదిక. సంస్కృతికి భాష తల్లివేరులాంటిది. ఈ తల్లివేరుకు ప్రపంచీకరణ వేరుపురుగులా పరిణమించింది. ఈ కష్టకాలంలో పెద్ద పెద్ద సమూహాలే పెట్టుబడి గొడ్డలికి మౌనంగా తలవంచి ఆత్మహత్యకు సిద్ధపడుతున్న అభివృద్ధి కాలమిది. ఒక పెద్ద సమాజంలోంచి వేరయిపోయి, చిన్న దేశంలో, ఒక చిన్న సమూహంగా బతుకుతున్న వాళ్లు తల్లిలాంటి సంస్కృతిని బతికించుకోవాలన్న తాపత్రయం, మా తాతల భాషను మేమూ నేర్చుకోవాలన్న పిల్లల పట్టుదల చూస్తుంటే గ్లోబలైజేషన్‌పై గెలుస్తామన్న విశ్వాసం మళ్లీ కలుగుతోంది.

3699
Tags

More News

VIRAL NEWS