e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home బతుకమ్మ మనసును తీపి చేసే కథలు

మనసును తీపి చేసే కథలు

రోజూ వెళ్లే దారి, రోజూ చూసే మనుషులు మారకపోవచ్చు. కానీ, మనసుతో చూడాలే కానీ, దారి వెంట మనసును తాకే ఎన్నో సంఘటనలు తారసపడతాయి. విభిన్న మనస్తత్వాలు పరిచయమవుతాయి. కళాత్మక కలంతో వాటిని ఆవిష్కరించగలిగితే మరపురాని కథలుగా మారుతాయి. ‘ఉడుకుబెల్లం’ కథలూ వివిధ సందర్భాల్లో పురుడు పోసుకున్నవే. వీటిని చదువుతున్నంతసేపూ ఆ సందర్భాలు తనకే ఎదురయ్యాయా అన్న అనుభూతికి పాఠకుడు లోనవుతాడు. అందులోని పాత్రలు కండ్లముందుకొస్తాయి. అవి పలికే మాటలు చెవుల్లో మార్మోగుతాయి. ‘జోగారావు దయచేతను..’ కథలో జోగారావు మాయలోపడి తిరుమల బాట పట్టిన ఊరుజనం అమాయకత్వంపై జాలి కలుగుతుంది. జోగారావులాంటి మనుషులకు దూరంగా ఉండాలన్న సత్యం బోధపడుతుంది. ‘సంగతి చెప్పిన సత్యవతక్క’ కథలో అసలు సత్యం తెలిశాక.. సత్యవతక్కపై కోపం రాదు. ‘ఉడుకు బెల్లం’, ‘మడి’, ‘పరాబ్రహ్మ పరమేశ్వర’ తదితర కథలు ఆద్యంతం అలరిస్తూనే, ఆలోచింపజేస్తాయి. వివిధ పత్రికల్లో ప్రచురితమైన తన కథలను ‘ఉడుకు బెల్లం’ పేరుతో సంకలనంగా తెచ్చారు రచయిత. పది కథలే అయినా, ప్రతిదీ ముచ్చటైందే. బెల్లం ఉడికేటప్పుడు వెలువడే పరిమళం నాసికలోంచి వెళ్లి మనసునూ తీపి చేస్తుంది. ఈ కథలు కూడా అంతే! మనసు పొరల్లోకి చేరిపోయి కలకాలం అక్కడే ఉండిపోతాయి.

ఉడుకు బెల్లం
రచయిత: చింతకింది శ్రీనివాసరావు
పేజీలు: 122, వెల: రూ.120
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
శ్రీనిజ పబ్లికేషన్స్‌, 88971 47067

- Advertisement -

కవితా సౌగంధికం
పరేశ్‌ వెలువరించిన ‘వానతనం’ కవితా సంపుటిలో సున్నిత భావచిత్రాలు, పదచిత్రాలు దర్శనమిస్తాయి. కొన్నిచోట్ల సామాజిక సంఘటనలపై కవి నిప్పులు చెరగడం కనిపిస్తుంది. అహంకారానికి గుర్తుగా మగవాడి లైంగికావయవంపై ప్రదర్శించిన ఏవగింపు సరికొత్తదనంతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. అమ్మ చేతుల్ని మల్లెతీగలతోనూ, ఆమె జ్ఞాపకాలను మల్లెల పరిమళంతోనూ పోల్చారు ‘కోల్పోయిన రహస్యం’ కవితలో. అంతే కాదు.. తిరిగి అమ్మకడుపులోకి వెళ్లి కోల్పోయిన రహస్యం ఏదో తెలుసుకోవాలంటారు. ‘వానతనం’ కవిత ఆర్ద్రత, ఉదాత్తతలను రంగరించి మనసుకు విందు చేసింది. ఇందులోని ప్రతి పద్యం ఒక ఇక్షుఖండమే. నిడివి విస్తరభీతితో సమీక్షకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాను. ఈ సంపుటిలో పరేశ్‌ దోశి తన కవితలకు చక్కని ఆంగ్లానువాదాలను అందించారు. ఇతర భాషలలోని గొప్ప కవితలనూ తేనెలొలికే తెలుగులోకి తెచ్చి చవులూరించారు. సాహితీ ప్రియుల మనసు పరవశించే కవితా సౌగంధికం ఈ పుస్తకం.

వానతనం (కవిత్వం)
రచయిత: పరేశ్‌ దోశి
పేజీలు: 134, వెల: రూ.140
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక విక్రయ కేంద్రాలు,
రచయిత ఫోన్‌: 98484 87768

ఆకాశమంత!
కథ అనగానే ఊహలకు రెక్కలు తొడిగేస్తారు. అతిశయాలతో ఊదరగొడతారు. కానీ, క్లుప్తత, అనుభూతి, సంఘర్షణ సమపాళ్లలో కుదిరినవే మంచికథలుగా గుర్తింపు తెస్తాయి. ‘కురిసి అలసిన ఆకాశం’లోని కథలు ఈ కోవకే చెందుతాయి. కథకు మరో కొలమానం సమకాలీనత. అప్పుడే పాఠకుడు త్వరగా కనెక్ట్‌ అవుతాడు. ఈ విషయంలో రచయిత్రి పద్మావతి రాంభక్త నేటి సమాజాన్నే తన కథా వస్తువుగా ఎంచుకున్నారు. ప్రస్తుత సమాజంలోని వాస్తవిక సందర్భాలను ‘కురిసి అలసిన ఆకాశం’ సంకలనంలో కథల ద్వారా హృద్యంగా వివరించే ప్రయత్నం చేశారు. ‘రంగు వెలసిన బతుకు’ కథలో ఓ తల్లీకూతుళ్ల మానసిక కల్లోలాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించారు. ‘ఎంపిక’ కథలోని శ్రీవల్లి, ‘ఉనికి’ కథలోని దీప ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న నేటి యువతులకు ప్రతీకలుగా కనిపిస్తారు. ‘కూలిన వెన్నెల’, ‘లక్ష్మి ఏడ్చింది’ కథలు మనసును తాకుతాయి. రకరకాల సందర్భాల నుంచి పుట్టిన ఈ కథలన్నీ చక్కగా చదివించేవే!

కురిసి అలసిన ఆకాశం
రచయిత్రి: పద్మావతి రాంభక్త
పేజీలు: 176, వెల: రూ.150
ప్రతులకు: 040 2767 8430

అచ్చేదిన్‌ అనుభవాలు
‘గతకాలం మేలు వచ్చు కాలం కంటెన్‌’ అని నానుడి. తరాలు మారినా మారని ముచ్చట ఇది. చిరుజల్లు పడుతున్న వేళ కిటికీలోంచి బయటకు చూస్తూ, వేడివేడి చాయ్‌ సిప్‌ చేస్తూ ఒక్కసారిగా గతంలోకి తొంగి చూస్తే.. ఎన్నెన్నో జ్ఞాపకాలు మనసును ఉప్పొంగేలా చేస్తాయి. ఆ జ్ఞాపకాల ఊటలోంచి ఉబికి వచ్చిన సంగతులను ‘అచ్చు కాయిదం’పేరుతో అచ్చ తెలంగాణ భాషలో మ్యూజింగ్స్‌గా ఆవిష్కరించారు రచయిత అల్లాడి శ్రీనివాస్‌. ‘సద్దుల బతుకమ్మ’ సందడి, ‘అవ్వసేతి అమృతాల’ రుచిని అందంగా వర్ణించారు. ‘శాట-సెరుగుడు’ వైనాన్ని, ‘సైకిల్‌-రేడియో-గడియారం’ సంగతిని, ‘సిరా బుడ్డి’ సిత్రాన్ని.. ఇలా గతకాలపు అచ్చేదిన్‌ అనుభవాలన్నిటినీ ఏర్చికూర్చి ఈ పుస్తకంలో పొందు పరిచారు.

అచ్చు కాయిదం
రచయిత: అల్లాడి శ్రీనివాస్‌
పేజీలు: 159, వెల: రూ.100
ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌: 98487 87284

-చంద్ర ప్రతాప్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana