e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home బతుకమ్మ భళా.. కాకతీయ చిత్రకళ!

భళా.. కాకతీయ చిత్రకళ!

కాకతీయుల పాలన కాలం.. తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయం.నాటి నిర్మాణాలు.. పాలకుల కళా హృదయానికి నిదర్శనం. శిల్పకళతోపాటు రూప పుష్టి, భావలాలిత్యం తొణికిసలాడే శైలి.. అలనాటి చిత్రకారుల సొంతం.కాకతీయుల పాలన సంస్కృతికి పెద్దపీట వేసింది. నాటి పాలకులు సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రం తదితర కళల్ల్లో తమదైన ముద్ర వేశారు. శిల్పంతో సమానంగా చిత్రకళనూ ప్రోత్సహించారు. ‘వినుకొండ వల్లభరాయడు’ రాసిన‘క్రీడాభిరామం’లో మాచల్దేవి చిత్రశాలలో ఉన్న అనేక శృంగార చిత్రాల వర్ణనతోపాటు కాకతీయ చిత్రకళ గురించిన ప్రస్తావనలూ ఉన్నాయి. ఓరుగల్లులో 1,500కు పైగా చిత్రకారుల నివాసాలు ఉండేవని ఏకామ్రనాథుడి ‘ప్రతాప చరిత్రము’ చెబుతున్నది. ఆలయాలు, రాజ ప్రాసాదాలు, కుబేరుల నివాసాలలో అత్యద్భుతమైన చిత్రరాజాలు ఉండేవి. పాలకులూ ఉన్నత వర్గాలవారు మాత్రమే కాకుండా, సామాన్యులు కూడా చిత్రకళను ఆదరించినట్లు సాహిత్య ఆధారాల ద్వారా తెలుస్తున్నది. రామప్ప, ఘనపురం కోటగుళ్లలోని ఆలయ పైకప్పులపై ఎరుపు రంగుతో వేసిన చిత్రాలను ఇప్పటికీ చూడొచ్చు. వీటితోపాటు త్రిపురాంతకం కొండమీది దేవాలయ మండప పైభాగంలోని చిత్రాలు.. నాటి ప్రజల జీవన విధానాన్ని కండ్ల ముందు ఉంచుతున్నాయి. అయితే, చిత్రాల జీవితకాలం చాలా తక్కువ. ఇట్టే నశించే స్వభావం వాటిది. కాబట్టే, అప్పటి చిత్రాలు ఎక్కువగా మనుగడలో లేవు.

పిల్లలమర్రి చిత్రాలు
సూర్యాపేటకు 7 కి.మీ.ల దూరంలో ఉంటుంది పిల్లలమర్రి గ్రామం. పూర్వం ఇది కాకతీయుల సామంతులైన రేచర్ల నాయకుల ముఖ్య పట్టణం. కాకతీయ రుద్రదేవుని సేనానిగా నియమితుడైన రేచర్ల నామిరెడ్డి పిల్లలమర్రిలో కోటను, కొన్ని దేవాలయాలను నిర్మించాడు. అందులో ప్రధానమైంది నామేశ్వరాలయం. ఇందులో, అంతరాళం ఎదుట ఆలయ పైకప్పునకు ఉన్న రెండు రాతి దూలాల మీద మూడు వర్ణ చిత్రాలున్నాయి. వీటిని సహజమైన రంగులతో వేసినట్లు తెలుస్తున్నది. మొదటి వర్ణచిత్రం సురాసుర క్షీరసాగర మథనానికి సంబంధించినది. రెండో వర్ణచిత్రంలో రెండు యుద్ధ దృశ్యాలున్నాయి. ఇందులో ఒకటి మధ్యయుగపు యుద్ధ సన్నివేశం. దీనిలో రథంపై విల్లంబులు ధరించిన ఒక రాజు, గుర్రంపై ఒక యోధుడు, కొందరు సైనికులు ఉన్నారు. వీరిలో ఒక మహమ్మదీయ సిపాయి ఉండటం విశేషం (కాబట్టే, ఈ చిత్రాలు కాకతీయుల తర్వాతి కాలానివనే వాదన ఉన్నది). మరొకటి రామరావణ యుద్ధ సన్నివేశం. మూడో వర్ణచిత్రం పూర్తిగా ధ్వంసమై అస్పష్టంగా కనిపిస్తున్నది.

- Advertisement -

పాండవుల గుట్ట బొమ్మలు
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రావులపల్లె పరిసరాల్లో పాండవుల గుట్టలున్నాయి. అరణ్యవాస కాలంలో పాండవులు ఈ గుట్టల్లో కొంతకాలం నివాసం ఉన్నారనేది స్థలోక్తి. ఇక్కడ పాండవుల వివాహ ఘట్టానికి సంబంధించిన చిత్రం ఉండటం విశేషం. పంచపాండవుల గుహలో వివిధ రంగులతో చిత్రించిన పాండవులు, కుంతీదేవి, ద్రౌపది, ద్రుపదుడు, పాండవుల పెండ్లి, శేషతల్పం మీద నిద్రిస్తున్న విష్ణుమూర్తి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతి చిత్రాలున్నాయి. కొన్నిచోట్ల పాత బొమ్మల మీదనే కొత్త బొమ్మలు వేసినట్లు కనిపిస్తున్నది. నాటి చిత్రకారులు రంగులను స్వయంగా తయారు చేసుకునేవారట. వీటి తయారీ గురించి ‘అభిలషితార్థ చింతామణి’లో విపులమైన వివరాలున్నాయి. కుంచెల ప్రస్తావన కూడా అందులో కనిపిస్తుంది.

-అరవింద్‌ ఆర్య , 7997 270 270

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement