e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home బతుకమ్మ బాల్యానికి కొవిడ్‌ ముళ్లు!

బాల్యానికి కొవిడ్‌ ముళ్లు!

దేశంలో ఏటా 15 లక్షల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇది యూనిసెఫ్‌ లెక్క. తాజాగా చైల్డ్‌లైఫ్‌ సంస్థ ఒక అధ్యయనం చేసింది. ప్రపంచంలో మూడోవంతు బాల్య వివాహాలు ఇండియాలోనే జరుగుతున్నాయట. అందులోనూ, బాల్య వివాహాల గురించి లాక్‌డౌన్‌లోనే 17శాతం ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఈ సామాజిక రుగ్మతను రూపుమాపేందుకు కృషి చేస్తున్నారు ఓ కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌.

బాల్యానికి కొవిడ్‌ ముళ్లు!

కర్ణాటక బాగల్‌కోట్‌ జిల్లా పరిషత్‌ సీయీవో భూబాలన్‌ బాల్య వివాహాలను అరికట్టడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తాను బాధ్యత తీసుకున్న వారం రోజులకే బాల్య వివాహాలపై దృష్టి సారించారు. లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన ‘హెల్ప్‌లైన్‌’ కాల్స్‌ తీవ్రతను చూసి ఆశ్చర్యపోయారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు తక్షణం రంగంలోకి దిగారు.

- Advertisement -

గతంలో కంటే, లాక్‌డౌన్‌లోనే బాల్య వివాహాలు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయన్న దానిపై యువ ఐఏఎస్‌ అధికారి.. భూబాలన్‌ క్షేత్రస్థాయి అధ్యయనం జరిపారు. ఉపాధి కోల్పోయి ఇంట్లోనే ఉండాల్సి రావడమే ప్రధాన సమస్య అని గుర్తించారు. ముఖ్యంగా ‘కరోనా మరణాలు అధికంగా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో చాలామంది కుటుంబ పెద్దలు చనిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయి, ఎంతోమంది పిల్లలు అనాథలుగా మారారు. తమ పరిస్థితి కూడా ఇలా అయితే, పిల్లల భవిష్యత్‌ ఏంటి? తాము ఉన్నప్పుడే కూతురి పెండ్లి చేస్తే ఓ పనైపోతుంది కదా’ అన్న ఆలోచనతో చాలామంది బాల్య వివాహాలకు పూనుకున్నట్టు భూబాలన్‌ బృందం గుర్తించింది. ఇందులో చాలావరకూ భయాలూ, అపోహలే. వాటిని వదలగొడితేనే మార్పు సాధ్యం. అందుకే ఆ వైపుగా ప్రయత్నం మొదలుపెట్టారాయన.

రంగంలోకి బృందం
తొలుత, బాల్య వివాహాలకు కారణాలను గుర్తించడంపై భూబాలన్‌ దృష్టి సారించారు. పోషకాహార లోపం, స్కూళ్లు లేకపోవడం, రక్తహీనత, తల్లిదండ్రులను కోల్పోవడం వంటి సమస్యలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాల్య వివాహాలు ముడిపడి ఉన్నట్లు విచారణలో తేలింది. బాల్య వివాహాలను కట్టడి చేసేందుకు గ్రామ సర్పంచ్‌లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, పోలీసులు, ఉపాధ్యాయులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోని సభ్యులు జిల్లాలోని ప్రతి గ్రామాన్నీ, ప్రతీ వాడనూ సందర్శించి స్థానిక ప్రజలతో మమేకం అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. బాల్య వివాహాలవల్ల అమ్మాయిల జీవితాలు ఎలా అంధకారంలోకి వెళ్తున్నాయో జనానికి సూటిగా చెప్పేందుకు అవగాహనా కార్యక్రమాలు ప్రారంభించారు. వీటిని బేఖాతరు చేసినవారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ‘బాగల్‌కోట్‌ను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చాలనేది నా లక్ష్యం’ అంటారాయన.

బాల్యానికి కొవిడ్‌ ముళ్లు!

176 పెండ్లిళ్లకు బ్రేక్‌
బాగల్‌కోట్‌కు చెందిన ఎనిమిదేండ్ల బాలికకు పెండ్లి జరుగుతోందని ఒకరోజు భూబాలన్‌ కార్యాలయానికి ఫోన్‌ వచ్చింది. కానీ ఫోన్‌ చేసిన వ్యక్తి తీవ్రంగా భయపడుతున్నాడు. ‘మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆందోళన చెందకండి. మీలాంటివారు ఎవరో ఒకరు సమాచారం ఇస్తేనే మార్పు సాధ్యం అవుతుంది’ అని ఆ వ్యక్తికి ధైర్యమిచ్చి వివరాలు సేకరించారు. హుటాహుటిన పెండ్లి జరుగుతున్న ప్రదేశానికి చేరుకొన్నారు. అమ్మాయిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా 1098 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించారు ఆ అధికారి. దీంతో, మార్పు మొదలైంది. ఆయన కరోనా మొదటి వేవ్‌లో 176 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. అంతకుముందే పెండ్లి జరిగిన 10 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇదో సానుకూలమైన మార్పు.

అప్పుడు 50 ఫిర్యాదులే!
లాక్‌డౌన్‌ కాలంలోనే బాల్య వివాహాల సంఖ్య ఎందుకు పెరిగింది? 2019 చివరి నాటికి జిల్లా వ్యాప్తంగా కేవలం 50 ఫిర్యాదులు మాత్రమే అందితే, లాక్‌డౌన్‌ కాలంలో 186 కాల్స్‌ రావడానికి మూల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు భూబాలన్‌. పేదరికమే పెద్ద శత్రువని అర్థమైంది. సమస్యలను అధిగమించడానికి ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ ద్వారా పని కల్పించి కుటుంబాల్లో ఆదాయ వనరును సృష్టించారు. వ్యాపారాలు చేసుకుంటామన్న వారికి రుణ సౌకర్యం కల్పించారు. చదువుపై అవగాహన కల్పించారు. పౌష్టికాహారం అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఎప్పటికప్పుడు గ్రామాల్లో తమ బృందాలను పంపిస్తూ బాల్య వివాహ రహిత జిల్లాగా బాగల్‌కోట్‌ను తీర్చిదిద్దేందుకు భూబాలన్‌ ప్రయత్నిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాల్యానికి కొవిడ్‌ ముళ్లు!
బాల్యానికి కొవిడ్‌ ముళ్లు!
బాల్యానికి కొవిడ్‌ ముళ్లు!

ట్రెండింగ్‌

Advertisement