e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home Top Slides పసి పెద్దలకు మాత్రమే!

పసి పెద్దలకు మాత్రమే!

పసి పెద్దలకు మాత్రమే!

స్పైడర్‌ మ్యాన్‌- ఈ ప్రపంచాన్నే రక్షించే యోధుడు. ఆపదలు కాచే సూపర్‌హీరో. కానీ వ్యక్తిగతంగా తనకెన్నో ఇబ్బందులు. ఓ మామూలు మనిషికి ఉండే న్యూనతాభావం, సందిగ్ధత లాంటి సవాలక్ష సమస్యలు తనని వేధిస్తూ ఉంటాయి. స్పైడర్‌ మ్యాన్‌ కాల్పనిక పాత్రే కావచ్చు. కానీ, తరచి చూసుకుంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ వైరుధ్యం ఉంటుంది. పైకి కనిపించే కథానాయకుడు వేరు, లోలోపల కుమిలిపోతున్న పాత్ర వేరు.భూమి మీద పచ్చదనమే కనిపిస్తుంది… కానీ లోపల బడబాగ్నులు రగులుతూ ఉంటాయి. అలాగే… బింకంగా జీవితాలను నెట్టుకొచ్చే మనిషి లోలోపల భయం, బిడియం, అవమానం, అనుమానం… లాంటి సవాలక్ష లోటుపాట్లతో తమతమైపోతుంటాడు. వాటి మూలాలు చాలావరకు చిన్నతనంలోనే మొదలవుతాయి. వాటికి పరిష్కారం ఎలా? ఎప్పటికప్పుడు మన లోపాలను సవరించుకుంటూ, పరిపూర్ణమైనమనిషిగా ఎదిగేదెలా? దీనికోసం రకరకాల సిద్ధాంతాలు, చిట్కాలు, విశ్లేషణలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఓ విధానం క్రమంగా ప్రచారంలోకి వస్తున్నది.అదే.. సెల్ఫ్‌ పేరెంటింగ్‌!

‘ఈప్రపంచంలో ఏ పిల్లవాడూ ఆత్మన్యూనతతో పుట్టడు. తల్లిదండ్రులు, గురువులు, మత పెద్దలు… అందరూ అతడిలో న్యూనతను కలిగిస్తారు. దీంతో వాళ్ల ఆశలకు అనుగుణంగా మెలిగితేనే ఆ అభద్రత నుంచి బయటపడగలననే అభిప్రాయానికి వచ్చేస్తాడు. దీంతో తన పరిస్థితి మరింత దుర్భరమైపోతుంది. తన వ్యక్తిత్వం వేరొకరి నిబంధనలకు అనువుగా మారిపోతుంది. ప్రకృతి తనకంటూ అందించిన ప్రత్యేకతను వదులుకొని ఇంకెవరిగానో మిగిలిపోతాడు. ఇక జీవితంలో సంతోషం ఉండదు. తన విలువనూ, సామర్థ్యాన్నీ నిరూపించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా… మిగిలేది నిరాశే!’

  • ఓషో
    ఈ మాటలు ప్రస్తావించడానికి ఓ కారణం ఉంది. పిల్లల్ని పెంచే కళ అంత సులువుగా అలవడేది కాదు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా.. అంతిమంగా అది స్వానుభవాల నుంచి నేర్చుకుంటూ సాగించే ప్రయాణమే! ఒత్తిడులు, చిన్న కుటుంబాలు, కోపతాపాలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల పిల్లల పెంపకంలో తెలియని పొరపాట్లు జరుగుతాయి. సంద్రమంత లోతైన పసివాడి మనసును గ్రహించి, అందుకు అనుగుణంగా పెంపకంలో మార్పులు చేసుకోవడమూ అసాధ్యమే! వెరసి… ‘పెంపకంలో లోటు లేదు’ అని ఏ కన్నవారూ చెప్పలేరు. ఆ లోటును తీర్చేదే సెల్ఫ్‌ పేరెంటింగ్‌.

ఏమిటీ సెల్ఫ్‌ పేరెంటింగ్‌!
ఈ ప్రపంచంలో అందరితోనూ బాగానే ఉంటాం. శత్రువును సైతం చిరునవ్వుతో పలుకరిస్తాం, దారిన పోయేవాడిని కూడా నమ్మేస్తాం. కానీ మనతో మనం మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం. మన మనసు బాల్యంలో ఎన్నో కష్టాలు పడి ఉంటుంది. ఎంతో వివక్షను ఎదుర్కొని ఉంటుంది. అయినా కూడా ఆ మనసు మీద కించిత్‌ అయినా జాలి లేకపోతే ఎలా! పైగా అలా మనల్ని మనం ఓదార్చుకోవడాన్ని కూడా బలహీనతగా భావిస్తాం. ‘అదే పెద్ద పొరపాటు..’ అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. బాల్యంలో పేరుకుపోయిన ఎన్నో లోపాలను సరిదిద్దుకునేందుకు, మనకు మనమే తల్లిదండ్రులుగా మారాలని చెబుతున్నారు. దీనికే ‘సెల్ఫ్‌ పేరెంటింగ్‌’ అని పేరు.

ఎందుకని?
ఎన్నో అవమానాలు, కట్టడుల మధ్య మన బాల్యం సాగుతుంది. ఆ క్రమంలో అనేక గాయాలు మానకుండా మిగిలిపోతాయి. అవన్నీ మన సంతోషాలకు అడ్డుపడుతూ ఉంటాయి. మన నిర్ణయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. పరీక్షలంటే భయం, కొత్త మనుషులంటే చిరాకు, ప్రయాణాలంటే కంగారు, పెంపుడు జంతువులంటే అసహ్యం… పైకి కనిపించే ఇలాంటి ఎన్నో లక్షణాలతో పాటు సవాలక్ష దురభిప్రాయాలు మనల్ని నడిపిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, మనలోని ఆ గాయపడిన పిల్లవాడు కొరడా ఝళిపిస్తూ… మన జీవితాన్నీ, దృక్పథాన్ని శాసిస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లో సమస్య తీవ్రతను గుర్తించడానికి బదులు, మన పట్ల మనం మరింత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఇంట్లో ఎవరైనా పొరపాటు చేస్తే ‘అయిందేదో అయిపోయింది. ఇక మీదట జాగ్రత్త’ అని హెచ్చరించి వదిలేస్తాం. కానీ, అదే పొరపాటు మనం చేస్తే మాత్రం న్యూనతతో కుంగిపోతాం. మనల్ని మనం క్షమించుకోవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడంతో సెల్ఫ్‌ పేరెంటింగ్‌ మొదలవుతుంది! మనలో ఉండే పిల్లవాడిని (ఇన్నర్‌ చైల్డ్‌) గుర్తించడంసెల్ఫ్‌ పేరెంటింగ్‌ ప్రక్రియలో తొలి అడుగు. కిమ్‌ ఎగెల్‌ అనే థెరపిస్ట్‌ ప్రకారం ‘ఒక్కసారి నమ్మాలే కానీ, మనలో ప్రతి ఒక్కరూ తమలోని పిల్లవాడిని గుర్తించగలరు. మనసు బాగోగులు గమనించుకునే శ్రేయోభిలాషి బాధ్యతను స్వచ్ఛందంగా తలకెత్తుకోగలరు’.

పసి పెద్దలకు మాత్రమే!

ఇలా చేయండి…
సెల్ఫ్‌ పేరెంటింగ్‌కు సంబంధించి ఎన్నో విశ్లేషణలు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ పరిమితం కాదు, పరిపూర్ణం కాదు. కాకపోతే అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరిస్తే కొన్ని అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవే ఇవి..

ప్రాధాన్యం ఇవ్వడం..
తల్లిదండ్రుల తొలి ప్రాధాన్యం బిడ్డ మంచిచెడ్డలే. అలా ఓ పేరెంట్‌ దృక్పథంలోంచి మనల్ని మనం చూసుకుంటూ… ఓ ఆరోగ్యకరమైన వాతావరణంలో మెలిగే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్ర లేవాలి… మొత్తంగా, క్రమశిక్షణకు విలువ ఇచ్చే తండ్రి పెంపకంలో ఎలా మెలుగుతామో, అలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి.

ఆసరా
కష్టం ఎదురవుతుంది, సమస్య అడ్డుపడుతుంది. అవమానమో, నిరాదరణో మనసును కమ్మేస్తుంది. ఇలాంటప్పుడు పిల్లలు ధైర్యం కోసం తల్లిదండ్రుల వైపు చూస్తారు. కన్నవారి వైపు నుంచి వచ్చే ఆ నాలుగు మాటల్నీ, ఆసరానూ మనకు మనమే అందించుకోవాలి. ఇదే, సెల్ఫ్‌ పేరెంటింగ్‌లో కీలకం.

ప్రోత్సాహం
విమర్శ మంచిదే, అది మనలోని లోపాలను గుర్తించేలా చేస్తుంది, విమర్శతోనే ఎవరైనా ఎదుగుతారు.. ఇలాంటి మాటలన్నీ వినడానికి చాలా బాగుంటాయి. నిరంతరం అవే మాటలు వింటూ పెరగడం వల్ల, ఆ ప్రభావంతో మనల్ని మనం కూడా నిశితంగా విమర్శించుకుంటూ ఉంటాం. ఒకసారి తల్లిదండ్రులను గుర్తుచేసుకోండి. ఇంట్లో పిల్లవాడు ఏదైనా ప్రయత్నంలో విఫలమైతే ‘ఫర్వాలేదు. ప్రయత్నం చేశావు కదా! ఈసారి సాధిస్తావులే’ అని ఓదారుస్తారు. ఆ నాలుగు మాటలే కొండంత బలాన్నిస్తాయి. కాసేపు, విమర్శను పక్కన పెట్టి మనల్ని మనం ప్రోత్సహించుకుంటే, మనకు మనమే ధైర్యం చెప్పుకుంటే… ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక్కమాట మాత్రం గుర్తుంచుకుని తీరాలి! విమర్శ నూటికి 90 శాతం సందర్భాలలో ఉత్సాహాన్ని నింపదు. గాయపడిన వాళ్లను మరింత బాధించి తీరుతుంది. ముందు నాలుగు సాంత్వన వచనాలు విన్న తర్వాతే ఓటమి మీద విశ్లేషణ జరగాలి.

రక్షణ
కన్నవారు తమ బిడ్డకు ఏ ఆపదా రాకుండా కాపాడుకుంటారు. అదే విధంగా, ఎలాంటి అవమానమూ మనల్ని కుంగదీయకుండా, ఏ వైఫల్యమూ అడ్డుకోకుండా… మనకు మనమే
అండగా నిలబడాలి. ఇదో స్వీయ రక్షణ విధానం.

సాయపడే అంశాలు!
సెల్ఫ్‌ పేరెంటింగ్‌ ప్రక్రియ అనుకున్నంత సులువేమీ కాదు. అలాగని ఇదేదో అంతరిక్ష శాస్త్రమూ కాదు. కొన్ని పద్ధతులను ఆచరిస్తే, ఇందులో మంచి ఫలితాలే వస్తాయి. అవేమిటంటే…

గమనించాలి
ఇంట్లో పిల్లవాడు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు దాన్ని శ్రద్ధగా విన్నప్పుడే, బిడ్డ సమస్య పరిష్కారమవుతుంది. మన లోపలి పసివాడికి కూడా ఇదే వర్తిస్తుంది. ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు, దానికి కారణం ఏమిటో చెప్పేందుకు లోపలి నుంచి ఒక గొంతుక ప్రయత్నిస్తూ ఉంటుంది. ‘ఈ పని వాయిదా వేయడానికి వెనక కారణం… భయం’, ‘ఈ పని ఇష్టం చేయకపోవడానికి కారణం… అయిష్టం’ అంటూ చిన్నపాటి స్వరమేదో గొణుగుతూ ఉంటుంది. దాన్ని వినే ప్రయత్నం చేసినప్పుడే, పరిష్కారం లభిస్తుంది. ఇలాంటి చాలా సందర్భాలలో సమస్యని గుర్తించగానే, అది కారుమబ్బులా కరిగిపోతుంది.

సేదతీరాలి
ఇప్పటి తరం దృష్టిలో కాలక్షేపం అంటే మొబైల్‌ సహవాసం, టీవీ వీక్షణం. నిజానికి సైక్లింగ్‌, ఆటలు, డ్యాన్స్‌, నలుగురితో కలిసి నవ్వుకోవడం, చిన్నచిన్న సరదాలను ఆస్వాదించడం… ఇది కదా కాలక్షేపమంటే! ఇలాంటి సందర్భాలలోనే మనసు సేదతీరుతుంది. మనలోని పిల్లవాడు కూడా సంతోషంగా ఉంటాడు. తనకు తగిలిన గాయాలను మరచి పోతాడు.

సమయం ఇవ్వాలి
కాలాన్ని వెల కట్టలేం. కానీ విచ్చలవిడిగా వాడేస్తుంటాం! కబుర్ల దగ్గర నుంచీ సెల్‌ఫోన్‌ వరకూ.. ప్రతి మనిషి కోసం, ప్రతి వస్తువు కోసం మన దగ్గర సమయం ఉంది. కానీ మనకోసం మనం కేటాయించుకొనే సమయం ఎంత? రోజులో కొంతసేపైనా ఏకాంతంగా గడిపే ప్రయత్నం చేస్తే… ఆ నిశ్శబ్దంలో ఎన్నో కబుర్లు వినిపిస్తాయి. లోలోపలి ఆలోచనలు సంభాషణలుగా మారి పలకరిస్తాయి. మన భయం, ఆందోళన, కోపం, నిస్సహాయత, అపరాధభావం… క్రమంగా బయటకి వస్తాయి.

థెరపిస్ట్‌ను కలవండి
తప్పేం లేదు. చిన్నప్పటి గాయాలు నిరంతరం సలుపుతూ ఉంటే, వాటి నుంచి బయటపడలేనంటూ మనసు చేతులెత్తేస్తుంటే, చేయి తిరిగిన సైకాలజిస్టును కలవడం తప్పేమీ కాదు. బాల్యంలో ఏర్పడిన అఘాతం (ట్రామా) నుంచి బయట పడేయటానికి వాళ్ల దగ్గర చాలా ఉపాయాలే ఉంటాయి. ముఖ్యంగా, బాల్యంలో లైంగిక వేధింపుల లాంటివి ఎదుర్కొన్నప్పుడు, ఆ గాయం చాలా లోతుగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో తప్పకుండా థెరపిస్ట్‌ సాయం తీసుకోవాల్సిందే.

పసి పెద్దలకు మాత్రమే!

జ్ఞాపకాలను నెమరేసుకోండి
ఎన్నో భయాందోళనలకు మూలం బాల్యమే. ఆ కారణంగానే చాలామంది గతాన్ని గుర్తుచేసుకోవడానికి ఇష్టపడరు. నిజమే, ఎవరూ పీడకలల్ని కోరుకోరు కదా! నిజానికి చిన్ననాటి ఫోటోలు చూడటం, అప్పటి వస్తువులతో గడపటం, కుటుంబ సభ్యులతో బాల్యంలోని సంగతులు నెమరువేసుకోవడం… వీటివల్ల బాల్యాన్ని మరోసారి గడిపినట్లవుతుంది. అప్పటి గాయాలను ఈసారి మరింత పరిణతితో ఎదుర్కోగలం. చాలా సందర్భాలలోఒకప్పటి భయాల వెనుక, సహేతుకమైన కారణాలేవీ లేవని తెలిసిపోతుంది,
తేలిపోతుంది.

పిల్లలతో గడపండి
ఇంట్లోని చిన్న పిల్లలతో గడపడం వల్ల వాళ్ల బాల్యమైనా తృప్తిగా గడిచే అవకాశం ఉంటుంది. అంతేకాదు! పిల్లల మనస్తత్వం, వాళ్ల స్పందనల వెనుక కారణాలని తెలుసుకోగలుగుతాం. క్రమంగా… మనం కోల్పోయిన బాల్యాన్ని కూడా తిరిగి పొందగలుగుతాం!

డైరీ రాయండి
అణచిపెట్టుకున్న భావాలకు విముక్తి ప్రసాదించడానికి డైరీ ఓ మంచి మాధ్యమం. మనం ఎలా ఉండాలని అనుకుంటున్నాం… దానికి అడ్డుపడుతున్న అంశాలు ఏమిటి? ఆ మూలాలు ఎక్కడున్నాయి? వాటిని అధిగమించడం ఎలా?… లాంటి సవాలక్ష సందేహాలకు డైరీ ఓ అక్షరరూపాన్ని అందిస్తుంది. వాటన్నిటినీ రాసుకున్న తర్వాత, సహజంగానే పరిష్కారాలు కూడా
తడతాయి.

ధ్యానం చేయండి
ధ్యానంతో మనసు తేలికపడుతుంది. భావోద్వేగాల మీద పట్టు వస్తుంది. ఆ సాంత్వనలో మనలోని పిల్లవాడు, తన గాయాల బాధల నుంచి సేదతీరుతాడు. మరింత నిబ్బరాన్నిఅలవర్చుకుంటాడు.

మీకో ఉత్తరం!
కాస్త విచిత్రంగా అనిపించినా, డయానా రాబ్‌ అనే సైకాలజిస్ట్‌ ఈ పద్ధతి బ్రహ్మాండంగా పనిచేస్తుందని ధ్రువీకరించారు. మీ చిన్నప్పటి గాయాలను గుర్తుచేస్తూ, వాటి వెనుక ఉన్న కారణాలను సహేతుకంగా వివరిస్తూ… మీకు మీరే ఓ ఉత్తరం రాసుకుని చూడమంటున్నారు. ఉదాహరణకు చిన్నప్పుడు మీ పక్కింటివాళ్లు మీతో చాలా హింసాత్మకంగా వ్యవహరించేవారే అనుకుందాం. దాంతో, ఇరుగుపొరుగు అంటే తెలియని భయం ఏర్పడి ఉంటుంది. కానీ ఇన్నాళ్ల తర్వాత ఆ జ్ఞాపకాన్ని ఓ ఉత్తరంలో రాస్తూ, విశ్లేషించే ప్రయత్నం చేస్తే… అప్పటి పరిస్థితులు భిన్నమైనవనే నిర్ధారణకు వచ్చేస్తారు కదా! ఆ విశ్లేషణతో పాటు ‘కంగారుపడాల్సింది ఏమీ లేదు’, ‘నీకు నేనున్నాను’… లాంటి భరోసా పూర్వకమైన వాక్యాలు కూడా జోడిస్తే, భయం స్థానంలో అభయం చోటు చేసుకుంటుంది.

పసి పెద్దలకు మాత్రమే!

..ఇదీ సెల్ఫ్‌ పేరెంటింగ్‌ మీద ప్రాథమిక అవగాహన ఏర్పరుచుకునే యత్నం. నిజానికి, ఈ అంశం మీద అంతర్జాలంలో దొరికే సమాచారం అస్పష్టంగా, అరకొరగా ఉంది. పైగా రీపేరెంటింగ్‌ అనే మరో క్లిష్టమైన ప్రక్రియతో ఈ సెల్ఫ్‌ పేరెంటింగ్‌ను పోల్చుకునే ప్రమాదమూ లేకపోలేదు. మనలో ఉన్న పిల్లవాడిని ఊహించుకుంటూ, తనతో సంభాషించుకోవడం తరహా ప్రక్రియలకూ కొదవ లేదు. ప్రతి మనిషి లోపలా అసంతృప్తితో అల్లాడిపోతున్న ఓ పిల్లవాడి ఉనికిని మాత్రమే మనం గమనంలోకి తీసుకోవాలి. ఆ గాయాల తాలూకు ప్రతికూల ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాలి. ఆ ప్రయత్నంలో ఈ సూత్రాలు తప్పక ఉపయోగపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే… మనలో ప్రతి ఒక్కరిలోనూ ఓ ప్రహ్లాదుడు ఉంటాడు. ఆ బాలకుడితో హిరణ్యకశిపుడిలా నిర్దయగా వ్యవహరించడమా, విష్ణుమూర్తిలాగా రక్షణనివ్వడమా అన్నది నిర్ణయించుకోవాలి.

ఆపరేషన్‌ ‘బ్యూటిఫుల్‌’!
కేట్లిన్‌ బోయెల్‌… అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన యువతి. టీనేజ్‌లో తను విపరీతమైన డిప్రెషన్‌కు లోనైంది. తరచూ ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పార్ట్‌టైమ్‌ ఉద్యోగంలో చేరింది కేట్లిన్‌. మరోపక్క కాలేజీలో అడుగుపెట్టింది. సరదాగా సాగిపోతుందనుకున్న ఉద్యోగం నరకంలా మారింది. దాని ప్రభావం చదువు మీదా పడింది. పరీక్షల తర్వాత ఫలితాలు ప్రకటించారు. నూటికి నలభై శాతంతో అట్టడుగున ఉంది కేట్లిన్‌. ఈ ప్రపంచం మీదా, తన మీదా తెలియని అసహనం, కోపం, ద్వేషం పుట్టుకొచ్చాయి. ఇంటికొచ్చి వాష్‌రూమ్‌ తలుపు వేసుకుంది. అద్దంలో తనను తాను చూసుకోగానే అసహ్యం వేసింది. ఆ రూపాన్ని చెరిపేయాలన్నంత కసి వచ్చేసింది. ఆ క్షణంలో తను ఏం చేసేదో! కానీ ఎందుకనో ఓ చిన్న ఆలోచన వచ్చింది కేట్లిన్‌కి. వెంటనే తన హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి స్టిక్‌ నోట్స్‌ బయటికి తీసింది. ‘యు ఆర్‌ బ్యూటిఫుల్‌!’ అని రాసి, ఆ కాగితాన్ని అద్దం మీద అతికించింది. ఆశ్చర్యం! ఒకటికి రెండు సార్లు ఆ వాక్యాన్ని చదువుకున్న తర్వాత, ఆమెలో నిరాశానిస్పృహలు కరిగిపోసాగాయి.

ఈ ఉపాయమేదో బాగానే ఉందనిపించింది కేట్లిన్‌కి. వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి సానుకూలమైన వాక్యలు రాసిన స్టిక్‌ నోట్స్‌ అతికించడం మొదలుపెట్టింది. దానికి ‘ఆపరేషన్‌ బ్యూటిఫుల్‌’ అని పేరు పెట్టింది. ‘మీరు అనుకున్నది సాధించగలరు’, ‘మీరు బాగుంటారు’, ‘మీరు మంచివాళ్లు’… లాంటి వాక్యాల్ని రాసేది. ఈ నోట్స్‌ చూసి చాలామంది స్ఫూర్తి పొందారు. తాము కూడా అలాంటి స్టిక్‌ నోట్స్‌ రాయడం మొదలుపెట్టారు. ఓ దశాబ్దం క్రితం, ‘ఆపరేషన్‌ బ్యూటిఫుల్‌’ అమెరికాలో సంచలనం సృష్టించింది. దీని మీద పుస్తకాలూ, బ్లాగులూ వచ్చాయి. మానసికంగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు… ఆ ఊబిలో పడిపోకుండా నిస్పృహలోకి జారిపోకుండా ఒక చిన్నపాటి ఉపాయంతో గట్టెక్కగలిగింది కేట్లిన్‌. ద్వేషం స్థానంలో మన మీద మనకు ప్రేమనూ, జాలినీ స్థాపించగలిగితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఆపరేషన్‌ బ్యూటిఫుల్‌ నిరూపిస్తున్నది. సెల్ఫ్‌ పేరెంటింగ్‌ మౌలిక సూత్రం కూడా ఇదే!

చాలా అవసరం
రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చాలాసార్లు విపరీతంగా స్పందిస్తూ ఉంటాం. అలా కోపం, చిరాకు, విసుగు… లాంటి అర్థంలేని ఉద్వేగాలతోనే జీవితం నిండిపోతుంది. దీంతో, సంతోషానికి దూరం అవుతాం. అందరూ, అన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండలేరు. అలా ఉండటమూ ఇష్టమే! ఒక్కోసారి ‘నాలో ఎందుకింత బాధ, చిరాకు, విసుగు?’ అనిపిస్తూ ఉంటుంది. ‘అలా ఎందుకు స్పందించాను, చిన్నపిల్లవాడిలాగా ఎందుకు ప్రవర్తించాను’ అనే పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ, ఎంత ఆలోచించినా ‘ఎందుకు’ అన్నది అర్థం కాదు. ఇలా కేవలం మన ప్రవర్తనే కాదు, మన చుట్టూ ఉన్న చాలామంది తీరూ ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి కూడా ఒక్కోసారి అనూహ్యంగా స్పందించడం చూసి అయోమయానికి గురవుతాం. నిజానికి వాళ్లు, తమ చిన్నతనంలో ఎక్కడ గాయపడి ఆగిపోయారో, అక్కడి నుంచే స్పందిస్తున్నారు. వాళ్లే కాదు… మనం కూడా అంతే!మన ప్రతి స్పందనకూ మూలాలు బాల్యంలోనే ఉంటాయి. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు, మనసుకు అయిన గాయాలు… మనలో ఉన్న చిన్నపిల్లవాడిని అక్కడే కట్టి పడేస్తాయి.

అలా చాలాసార్లు మనలో ఒక భాగం చిన్నతనంలోనే ఉండిపోతుంది. ఇప్పడు మనం చెప్పుకొంటున్న అనూహ్యమైన స్పందనలన్నీ చిన్నతనంలో ఎదగడం ఆగిపోయిన బాధలే. మనకు ఆ గాయాలను ఎవరు కలిగించారు? అన్నది పక్కన పెడితే, ఆ గాయం అయినప్పుడు తగినంత స్వాంతన, ప్రేమ దక్కకపోవడం వల్లే… ఇంకా మానకుండా ఉండిపోయిందన్నది మాత్రం నిజం. దాంతో ఆ పసివాడు అక్కడే ఆగిపోయి, మనతో కలిసి ప్రయాణం చేయడం ఆపేశాడు. మరి, ఆ చిన్నపిల్లవాడిప్పుడు ఆ కోల్పోయిన ప్రేమను ఎవరిస్తారు? పెద్దవాళ్లం అయ్యాం కాబట్టి, మనకి మనమే తల్లిదండ్రుల్లా వ్యవహరించాలి. మనకు మనమే చిన్నతనంలో కోల్పోయిన ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, గుర్తింపు, ప్రోత్సాహం, అండ… అందిస్తూ వెళ్లడమే సెల్ఫ్‌ పేరెంటింగ్‌. ఇలా చేస్తూ వెళ్తే కొన్నాళ్లకి జీవితంలో సంతోషం పాలు పెరుగుతుంది. ఆనందమే జీవన విధానం అవుతుంది. మిమ్మల్ని మీరు గుర్తించడానికి, మీ సామర్థ్యాన్ని మీరు వెలికితీయడానికి… సెల్ఫ్‌ పేరెంటింగ్‌ ఓ అద్భుతమైన సాధనం.

పసి పెద్దలకు మాత్రమే!

రామకృష్ణ మాగులూరి
ట్రాన్స్‌ఫార్మేషన్‌ కెటలిస్ట్‌
ఇన్నర్‌ పీస్‌ ఇనీషియేటివ్‌ ఫౌండేషన్

‌ఇవీ కూడా చదవండి…

కాకి ని చూసి మ‌న‌షులు సిగ్గు ప‌డాలి.. వీడియో వైర‌ల్

ఫ్రిజ్‌లో వీటిని అస‌లు పెట్ట‌కూడ‌దు.. ఎందుకో తెలుసా?

క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్‌.. అప్లై ఎలా చేయాలంటే..

నీళ్ల‌ను కూడా డీప్ ఫ్రై చేసుకోవ‌చ్చని మీకు తెలుసా..?

వేములవాడకు హెలికాప్టర్‌

Advertisement
పసి పెద్దలకు మాత్రమే!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement