e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home బతుకమ్మ పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. అరవైయేండ్ల నిరీక్షణ.‘మా తెలంగాణ మాగ్గావాలె’ అని.. ఊరూవాడ ఒక్కటై ఉద్యమిస్తుంటే ఉన్నది ఉన్నట్లు రాసే పత్రిక లేదు. ఝంఝామారుతమై జననినాదం మార్మోగుతుంటే..నిఖార్సయిన నిజాల్ని చూపించే టీవీ చానెల్‌ లేదు. మన ఆత్మగౌరవాన్ని మంటగలపడానికి, మన అస్తిత్వాన్ని అవహేళన చేయడానికి పన్నని కుట్రా లేదు. ఆడని డ్రామా లేదు.‘మీ రాతలు తప్పు. మీ కూతలు తప్పు. మీ చేతలు తప్పు’ అంటూ సీమాంధ్రుల కుతంత్రాలను తిప్పికొట్టడానికి.. ఉద్యమ తీవ్రతను.. స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పడానికి దండోరా వేసి.. దండును కూడగట్టి.. ‘జై తెలంగాణ’ అంటూ పురుడు పోసుకున్నది ‘నమస్తే తెలంగాణ’. ఆత్మగౌరవ ప్రతీకగా, అస్తిత్వ చిహ్నంగా ఆవిర్భవించి, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నది కేసీఆర్‌ మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’. ఈ ఉద్యమాక్షరం నేటితో పదేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ..

ఒకాయన అన్నాడు..‘హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో నిలిపాను. తెలంగాణ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాను. ఇక ప్రత్యేక రాష్ట్రమెందుకు?’ఇంకొకాయన అన్నాడు..‘తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఒకవేళ తెలంగాణ కనుక ఏర్పాటైతే రాష్ట్రమంతా అంధకారమవుతుంది’ అడుగడుగునా అణచివేతలే. ఆ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టింది ‘నమస్తే తెలంగాణ’. ఆంధ్రపాలకుల అభివృద్ధి ఏపాటిదన్న నిష్టుర సత్యాన్ని తెలంగాణ సమాజం ముందు పెట్టింది. ‘ఇక్కడి నిధులు దోచుకొని, ఇక్కడి వనరులు పిండుకొని, ఇక్కడి నీళ్లు మళ్లించుకొని ఒక్క రూపాయి కూడా ఎందుకివ్వవు బిడ్డా?’ అని బరిగీసి నిలదీసింది. ఉద్యమానికి ఊతమిచ్చి, తెలంగాణ పునర్నిర్మాణానికి పురుడు పోసి, కంటిపాప లెక్క తెలంగాణను కాపాడుకుంటున్నది ‘నమస్తే తెలంగాణ’.

సామాన్యుడే అతిథి
తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా రోమాంచిత ఘట్టాలే. ప్రతి మజిలీ ఓ పోరు సంతకమే. ఉద్యమం కాటగలపాలన్న కుట్రతో ‘మీ కోసం’ యాత్ర మొదలు పెట్టిన చంద్రబాబు నాయుడు, వందిమాగధులతో కలిసి రాయపర్తి వెళ్లాడు. ఫణికర మల్లయ్య అనే సామాన్య రైతుకూలీ, ఆ సమయంలో పొలంలో పనిచేసుకుంటున్నాడు. మల్లయ్య దగ్గరకెళ్లి చంద్రబాబు ‘మీకేం కావాల్నో అన్నీ నేనిస్తా. మీ కోసం నేనున్నా. మీ బాధ్యత నాదే’ అని ఏదో చెప్పబోతుండగా.. మల్లయ్య మధ్యలోనే కల్పించుకొన్నాడు. ‘మీకోసం అని బాగనే వచ్చిండ్రుగానీ.. ముందు తెలంగాణ సంగతి తేల్చుండ్రి. మీరు చేయవట్కెనే వత్తలేదంట. మా ఊళ్లె పోరగాండ్లు, పెద్దోళ్లు అందరూ అడుగుతున్నట్టుగా తెలంగాణ ముచ్చట చెప్పరాదుండ్రి. ఇవన్నీ ఎందుకు?’ అని నిలదీశాడు. అప్పుడన్నీ సీమాంధ్ర పత్రికలూ.. చానెళ్లే. ఎవరూ చూపించలేదు. ఆ మల్లయ్య చేతులమీదుగానే ‘నమస్తే తెలంగాణ’ పత్రికను ఆవిష్కరింపజేశారు. ప్రారంభోత్సవానికి ఒక సామాన్య రైతు కూలీని ఆహ్వానించడంతోనే తానెవరి పక్షమో ప్రస్ఫుటంగా తెలియజేసింది. నాటినుంచి నేటివరకూ అదే నిబద్ధత, అంతే నిజాయతీ.

పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

ఆంధ్రాలోనూ.. జై తెలంగాణ
2013లో ఉద్యమం ఊపు మీదున్నది. ‘నమస్తే తెలంగాణ’ ఒక దిక్కు. మిగతా సీమాంధ్ర పత్రికలు, చానెల్స్‌ ఒకదిక్కు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర పెట్టుబడిదారులు, వారిచేతుల్లోని మీడియా తప్ప, అక్కడి జనం వ్యతిరేకం కాదంటూ అనేక కథనాలు రాసింది ‘నమస్తే తెలంగాణ’. వాస్తవ పరిస్థితిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ‘నమస్తే తెలంగాణ’ బృందం ఆంధ్రాలో పర్యటించింది. ‘నమస్తే..’ ప్రతులను అక్కడి ప్రజలకు పంచింది. సీమాంధ్ర రాజకీయ నాయకులకు ఈ సమాచారం చేరింది. ప్రజలు అడ్డు పడుతున్నా.. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని మొత్తుకుంటున్నా వినకుండా రాజకీయ గూండాలు ‘నమస్తే తెలంగాణ’ వాహనంపై దాడి చేశారు. వాహనం అద్దాలు పగులగొట్టారు. ప్రతినిధులను గాయపరిచారు. పత్రిక ప్రతులను లాక్కొని తగులబెట్టారు. ‘ఆంధ్రా ప్రాంతంలో తెలంగాణ పేపర్‌ను వద్దన్నట్టే.. తెలంగాణలో కూడా ఆంధ్రా మీడియాను తరిమికొట్టాలా?’ అన్న సగటు ఆంధ్రుడి స్వరాన్ని ప్రచురించి, తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడుతున్నది ఎవరో తేటతెల్లం చేసింది. ‘ప్రత్యేక రాష్ర్టానికి మేం కాదు, మా నాయకులే వ్యతిరేకం’ అన్న చైతన్యం ఆంధ్రా ప్రజల్లో తీసుకురావడంలో ‘నమస్తే తెలంగాణ’ సఫలమైంది.

పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

నిజాల నిప్పు కణికలు
తెలంగాణలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి అప్పటి ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖలను ‘నమస్తే తెలంగాణ’ తిప్పి కొట్టింది. ఎన్ని లేఖలు? ఎంత అక్కసు? తెలంగాణ అంటే వాళ్లకు. రాష్ట్రం ఏర్పడక ముందు ఒక రకం కుట్రలు, ఏర్పాటైన తర్వాత ఇంకో రకం కుట్రలు చేస్తూ అడుగడుగునా అభివృద్ధికి అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు. కేంద్రానికి, కేంద్ర జలసంఘానికి లేఖలు రాస్తూ వచ్చారు. అపెక్స్‌ కమిటీకి జాబు రాసి, తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు తెప్పించి తమకు ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసి, తమ ఓర్వలేనితనాన్ని చాటుకున్న అప్పటి ఆంధ్రా ప్రభుత్వ తీరును ఎండగడుతూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు అందించి తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపింది. విభజన నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదంటూ ఆంధ్రా సర్కారు చేసిన తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టింది. నిజంగా, ‘నమస్తే..’నే లేకపోతే, వాళ్లు రాసిన లేఖలే వాస్తవమనీ, వారు చేసిన ప్రచారాలే నిజాలని నమ్మే పరిస్థితి ఉండేది. ఆ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, ప్రజలను అప్రమత్తులను చేసింది.. ‘నమస్తే తెలంగాణ’.

పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

పరిశ్రమలే పట్టుగొమ్మలు
తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్‌ ఎడారిగా మారుతుందంటూ జరిగిన అబద్ధపు ప్రచారాలను బద్దలు చేస్తూ ‘నమస్తే తెలంగాణ’ సవివర కథనాలు రాసింది. ప్రజలను అప్రమత్తం చేసింది. పరిశ్రమలు ఎక్కడికీ తరలిపోవు, హైదరాబాద్‌లోనే ఉంటాయి, రెట్టింపు స్థాయిలో పెట్టుబడులు రాష్ర్టానికి వస్తాయని అవగాహన కల్పించింది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్‌తో వందల పరిశ్రమలు ఏర్పాటవుతాయని చెప్పింది. ‘నమస్తే తెలంగాణ’ అన్నట్టుగానే వందలాది పరిశ్రమలు తరలివచ్చాయి. గత ఏడేండ్లలో అదనంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఆంధ్రా నాయకులు కలలుగన్నట్లు పారిశ్రామిక వేత్తలు ఎక్కడికీ పోలేదు. వీళ్లు ఆశించినట్టు ఏ ఒక్క పరిశ్రమా నగరం దాటి వెళ్లలేదు. తెలంగాణ అభివృద్ధి గిట్టనివారికి ఇది జీర్ణించుకోలేని విషయం. అందుకే తమకు దక్కనిదేదీ తెలంగాణకు దక్కొద్దని.. పరిశ్రమలు కర్ణాటకకు తరలిపోతున్నాయంటూ కట్టుకథలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రచారం ఎవరి మేలుకోరి చేశారన్నది ‘నమస్తే తెలంగాణ’ వాస్తవ పరిస్థితులను వివరిస్తూ చెప్పింది. పరిశ్రమలే తెలంగాణకు పట్టుగొమ్మలవుతాయని రాష్ట్ర ఏర్పాటుకు ముందే చెప్పి పారిశ్రామిక తెలంగాణకు మద్దతు తెలుపుతూ వచ్చింది. అన్నట్టుగానే, ఎన్నో బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌ను చిరునామాగా మార్చు కుంటున్నాయి.

పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

విషపు రాతలకు విరుగుడు
పైత్యం ప్రకోపించి, సీమాంధ్ర పత్రికలు తెలంగాణపై విషపు రాతలెన్నో రాశాయి. రాష్ట్రం వస్తే తమ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని, ఇన్నేండ్లు కాపాడుకున్న కిరీటం నేలపాలు అవుతుందని ఆంధ్రా మీడియా భావించింది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఇవే రాతలు. ఏర్పాటైన తర్వాతా ఇవే రోతలు. వారికి సమగ్ర సర్వే తప్పే. కాళేశ్వరం కట్టినా తప్పే. భగీరథతో మంచినీళ్లు ఇస్తున్నా తప్పే. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక్క పనిని కూడా ప్రశంసించలేదంటే, అక్కసు ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. దేశదేశాలు, ప్రతిపక్ష పార్టీలు పొగిడినా విషపు మీడియా మనసు మాత్రం ఒప్పకోలేదు. ప్రభుత్వం కొలువుదీరిన మర్నాడే హైదరాబాద్‌ చుట్టుపక్కల పరిశ్రమల్లో 60% సీమాంధ్రులవేనని, వాటిని కాపాడుకోవడం తెలంగాణ సీఎంకు పెద్ద సవాలు అని ఒక కథనం వండి వార్చింది. మిషన్‌ భగీరథ లాంటి అద్భుత పథకం గురించి కూడా నీచపు రాతలే. అసలు ఎట్లుండె తెలంగాణ? మంచినీళ్ల గోసలు అన్నీ ఇన్నీ కావు. నల్లగొండ లాంటి జిల్లాల్లో ఫ్లోరైడ్‌ సమస్యతో ఒక తరానికి తరం ఎలా నాశనమైందో మనం చూశాం. వీటికి పరిష్కారంగా, సురక్షిత జలాలను ఇంటింటికీ అందించాలన్న సంకల్పంతో ‘మిషన్‌ భగీరథ’ చేపట్టి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిస్తే కూడా వారికి కనిపించదు. సీమాంధ్ర పత్రికల ప్రతీ విమర్శకూ ‘నమస్తే తెలంగాణ’ కౌంటర్‌ ఇచ్చి నోరు మూయించింది. మిషన్‌ భగీరథపై క్షేత్రస్థాయి అధ్యయనం చేసి.. నాటి నేటి పరిస్థితుల గురించి కండ్లకు కట్టినట్లు చూపించింది. భగీరథ ఏవిధంగా 11 రాష్ర్టాలకు ఆదర్శం అయ్యిందో వివరంగా తెలియజేసింది.

పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

కృష్ణ కమిటీ కుట్రలు భగ్నం
2009 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు కొనసాగింపుగా శ్రీకృష్ణ కమిటీని వేశారు. కానీ మొదట్నుంచీ ఆ కమిటీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూనే వచ్చింది. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి, గత్యంతరం లేని పరిస్థితుల్లో వాయిదా వేయడానికి, తప్పకపోతే తెలంగాణ ఇచ్చినా వ్యవహారం చెడగొట్టడానికి మార్గాలు సూచించే.. శల్యసారథ్య బృందంగానే హైదరాబాద్‌లో అడుగుపెట్టింది తప్ప, రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను వేగిరం చేయడానికి రాలేదు. 2010 ఫిబ్రవరి 3న పని ప్రారంభించిన ఈ కమిటీ పది నెలల తర్వాత ఎనిమిది చాప్టర్ల నివేదికను సమర్పించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తెలంగాణ సమాజం ఎన్నో అనుమానాలు వ్యక్తంచేసింది. ఎనిమిదో చాప్టర్‌లో జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణపై విషం చిమ్మిందనే వాస్తవాన్ని ప్రకటించి, పెనుకుట్రను బయటపెట్టంది ‘నమస్తే తెలంగాణ’. సీమాంధ్రుల మేలు కోసం శ్రీకృష్ణ కమిటీ చేసిన వ్యవస్థీకృత మోసాన్ని నిలదీసింది. జస్టిస్‌ శ్రీకృష్ణ తెలంగాణ పాలిట కృష్ణుడు కాదనీ.. కంసుడంటూ రాసిన కథనం చర్చనీయమైంది. ‘తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌, మీడియా మేనేజ్‌మెంట్‌ చేయాలి. రాజకీయ నాయకులను పదవులతో కొనాలి. అవసరం అయితే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడానికి కూడా వెనుకాడ వద్దు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉద్యమంలోకి రాకుండా కట్టడి చేసి ఉద్యమాన్ని అణచివేయాలి’ అనే శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయపు కుట్రపూరిత సూచనలను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టి ప్రజలను అప్రమత్తం చేసింది. నాటి పాలకులను నిగ్గదీసి అడిగింది. దుర్నీతిపై అక్షరాల నిప్పులు కురిపించింది.

జలాలపై గళం
తెలంగాణ ఏర్పాటు తర్వాత శ్రీశైలం కుడి, ఎడమ గట్లమీద అప్పటి ఆంధ్రా ప్రభుత్వం, మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. ‘నమస్తే తెలంగాణ’ ఈ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కూడా ఆంధ్రా భూభాగమే అంటూ కట్టుకథలల్లిన సీమాంధ్ర మీడియాను ‘నమస్తే తెలంగాణ’ ఎండగట్టింది. శ్రీశైలం ఎడమగట్టు పక్కాగా తెలంగాణ భూభాగమేనని రెవిన్యూ రికార్డులతోసహా చూపింది. పాలమూరు, డిండీలపై అప్పటి ఆంధ్రా ప్రభుత్వం కుట్రలకు పాల్పడినప్పుడు కూడా, ‘నమస్తే తెలంగాణ’ కనువిప్పు కలిగేలా కథనాలు ప్రచురించింది. వాళ్లు చెప్పుకొచ్చిన పట్టిసీమ ప్రాజెక్టు రాష్ట్ర విభజన వరకు ఎవరికీ తెలియదనీ, కేంద్ర జలసంఘం కూడా ఈ పేరుతో ప్రాజెక్టు ఉన్నట్టు ఎప్పుడూ వినలేదనీ ‘నమస్తే తెలంగాణ’ కుండబద్దలు కొట్టి చెప్పింది.

భద్రాచలంపై బాజాప్తా
రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలంపై వివాదం తలెత్తింది. భద్రాచలాన్ని మింగేయాలన్నది ఆంధ్రా పాలకుల దురాశ. అలా ఎలా అవుతుంది? అది ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమే అని ‘నమస్తే తెలంగాణ’ కొట్లాడింది. తెలంగాణ నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. భద్రాద్రి ఆలయాన్ని నిజాంల కాలంలో కంచర్ల గోపన్న నిర్మించాడనీ, సీతారామ కల్యాణానికి నిజాం ముత్యాలను సమర్పించడం మొదలు అక్కడి పూజారులకు వేతనాల చెల్లింపు వరకూ అనేక ఆధారాలను చూపుతూ పాత చిట్టాలను పరిచింది. భద్రాచలం ఆంధ్రాదే అనేవాళ్ల నోర్లు మూయించింది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందనీ, పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలనీ, అసలు పోలవరం ప్రాజెక్టే ఒక తెల్ల ఏనుగనీ రోజుకో కథనం రాసింది. భద్రాద్రిని పరిరక్షించడంలో కేంద్రం విఫలమైందని నిరూపిస్తూ ‘మా రాముడు రాముడు కాదా’ అంటూ నిక్కచ్చి కథనాలు అందించింది. పచ్చని పాపికొండలపై, పర్ణశాలపై, పర్యావరణంపై, పర్యాటకంపై రకరకాల వార్తలు, కథనాలు బాజాప్తా ప్రచురించి తెలంగాణ ఆత్మను చాటింది ‘నమస్తే తెలంగాణ’.

పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

సంస్కృతికి చాటింపు
తెలంగాణ అడుగడుగునా చరిత్ర దాగి ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన, దాదాపుగా ధ్వంసమైన మన సంస్కృతిని, చరిత్రను పరిరక్షించే బాధ్యతను ‘నమస్తే తెలంగాణ’ భుజాలమీద వేసుకున్నది. ఎవ్వరూ రాయని ఒక మహాలఖా బాయ్‌ చాంద్‌ గురించి, ఎన్నడూ రాయని ఒక రాచకొండ రాజసం గురించి, మనం మరిచిన మన పదాల గురించి, ఎవరూ చెప్పని మన చరిత్ర గురించి అనేక కథనాలు ‘జిందగీ’, ‘బతుకమ్మ’లలో అందిస్తూ వస్తున్నది. కాకతీయ వారసులు ఎక్కడున్నారు? బస్తర్‌ సామ్రాజ్యపు స్థితిగతులేంటి? వంటి అధ్యయనాత్మక కథనాలు అందించిన ఘనత ఉన్నది. మన చరిత్ర మనం రాసుకునే అవకాశం, మన రవీంద్రభారతి వేదికగా మన సంస్కృతిని చాటుకునే అవకాశం ‘నమస్తే తెలంగాణ’ కల్పించింది. కరీంనగర్‌లోని బొమ్మలమ్మ గుట్టవద్ద లభించిన కురిక్యాల శాసనం గురించి ప్రత్యేక కథనాలు అందించి తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడంలో కీలక పాత్ర పోషించింది. సీమాంధ్ర పత్రికల్లో ఎన్నడూ ఒక సింగిల్‌కాలమ్‌ జాగాకు కూడా నోచుకోని మన జానపద కళల గురించి, జీవితమంతా ఒగ్గుకళకే ధారపోసి అరుదైన ఒక తెలంగాణ ఒగ్గు మహిళ మల్లారి గురించి.. పతాక శీర్షికకు ఎక్కించి కథనం రాయడం తెలుగు పత్రికా చరిత్రలోనే ప్రథమం. ఒక కాకి పడగల కథ, బీరప్ప పట్నాలు, చెంచు లక్ష్మి నాటకం, బైండ్ల నాటకాలు, మందెచ్చుల కథల గురించి వినడమేగానీ ఎక్కడా చదివిన దాఖలాలు లేవు. అలాంటిది, వాళ్ల గురించి ప్రధాన శీర్షికల్లో ఫీచర్‌ కథనాలు రాసిన ఘనత ‘నమస్తే తెలంగాణ’కు దక్కుతుంది. తెలంగాణ వైతాళికులపై కూడా వరుస కథనాలను తీసుకొచ్చింది.

పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

తెలంగాణ సినీ వైభవం
రాష్ట్రం ఏర్పడకముందు మన భాష సినిమాల్లో కమెడియన్ల భాష. విలన్ల భాష. 24 ఫ్రేమ్స్‌లోనూ మన కళాకారులు ఉన్నా, ఎవరికీ ఫ్రంట్‌లైన్‌ అవకాశాలు రాలేదు. కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి వంటివారు తొలినాళ్లలోనే అశేష ప్రేక్షకాదరణ చూరగొన్నా వారినెవ్వరు గుర్తించారని? తెలంగాణ వచ్చిన తర్వాత మనం గుర్తుచేసుకొన్నాం. వారి కుటుంబాలకు మన ప్రభుత్వం అండగా నిలిచిన ఘట్టాలను ‘నమస్తే తెలంగాణ’లో కథనాలుగా మలుచుకున్నాం. ప్రతిభావంతులకు అవకాశం కల్పించేలా రవీంద్రభారతి వేదికపై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘సినీవారం’ ఏర్పాటుచేస్తే ఎవరన్నా అభినందించారా? రాశారా? ‘నమస్తే తెలంగాణ’ రాయడం మొదలుపెడితేనే, తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని పత్రికలూ లైన్లు కట్టాయి. ఎందరో టాలెంట్‌ ఉన్న నటులు, దర్శకులు, సంగీత దర్శకులు వెలుగులోకి వచ్చారు. తెలంగాణలో సినిమా భవిష్యత్‌ ఎలా ఉండబోతుందనే విశ్లేషణలకూ ‘నమస్తే’ వేదికైంది. ఆ తర్వాతే తెలంగాణ భాషకు, కట్టుబాటుకు సినిమాల్లో అవకాశం ఇవ్వడం మొదలైంది. ఎవరో రాసింది కాకుండా, మనం రాసిన సాహిత్యం పుస్తకాలకెక్కింది. వాటిని నలుగురికీ తెలియజేయడానికి ‘నమస్తే తెలంగాణ’ సాహిత్య అనుబంధం ఒక అవకాశం కల్పించింది.

పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

నమస్తే తెలంగాణ..
తెలంగాణ ఆత్మ, ప్రజల గొంతుక.
పదేండ్ల ప్రయాణంలో నాడు ఉద్యమ బాధ్యతను, నేడు పునర్నిర్మాణ బాధ్యతను సవినయంగా భుజానికి ఎత్తుకున్నది. ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక పోతన, ఒక కాళోజీ, ఒక దాశరథి, ఒక చిందు ఎల్లమ్మ, ఒక చాకలి ఐలమ్మ, ఒక జయశంకర్‌ సార్‌, ఒక కేసీఆర్‌, ఒక నమస్తే తెలంగాణ! అంతే! తెలంగాణ సమాజానికి నమస్తే.. తెలంగాణ పాఠక దేవుళ్లకు నమస్తే!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పత్రికొక్కటున్న… పదివేల ఉద్యమాలు!

ట్రెండింగ్‌

Advertisement