e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home బతుకమ్మ నీటిలో కరిగిపోతాయ్‌! మట్టిలో కలిసిపోతాయ్‌!!

నీటిలో కరిగిపోతాయ్‌! మట్టిలో కలిసిపోతాయ్‌!!

పాల ప్యాకెట్‌కు ఓ కవర్‌, పెరుగుకు ఇంకో కవర్‌, కూరగాయలకు మరో కవర్‌. ఇవన్నీ వేయడానికి వేరే కవర్‌. ఇంటింటికీ ఇన్ని కవర్లు ! ఆ చెత్తంతా పెద్ద కవర్‌లో వేసి బయట పారేస్తున్నాం. ఈ కవర్లు భూమిలో కలిసిపోవడానికి వెయ్యేండ్లు పడుతుందని మీకు తెలుసా? కవర్ల వాడకాన్ని కట్టడి చేయలేనప్పుడు, పర్యావరణహిత కవర్లు తయారు చేయడమే ఉత్తమ మార్గమని అనుకున్నారు డీఆర్‌డీవో శాస్త్రవేత్త డాక్టర్‌ వీరబ్రహ్మం. ఎన్నో పరిశోధనల తర్వాత.. నీళ్లలో కరిగిపోయే, భూమిలో కలిసిపోయే కవర్లను ఆవిష్కరించారు. ఆ కథాకమామీషు ఆయన మాటల్లోనే..

నేను డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా చేస్తున్న నా స్నేహితుడు డాక్టర్‌ లింగరాజు కలిసి ‘ప్లాస్టిక్‌ టీ గ్లాస్‌లకు ప్రత్యామ్నాయం లేదా?’ అన్న కోణంలో ఆలోచించాం. ఎంతో అధ్యయనం తర్వాత, పాలివినైల్‌ ఆల్కహాల్‌ బేస్‌తో ఒక ఫార్ములాను రూపొందించాం. కానీ, దానితో తయారు చేసిన వస్తువుల్లోనూ విష వ్యర్థాలు ఉన్నాయని గమనించాం. అలా ఆ ప్రయత్నం ఆగిపోయింది. అయినా, నా బుర్రలో మాత్రం పాలిథిన్‌ కవర్లకు ప్రత్యామ్నాయం కనిపెట్టాలనే ఆలోచనలు తిరుగుతూ ఉండేవి. ఈ సమస్యపై తరచూ జర్నల్స్‌లో వ్యాసాలు రాసేవాళ్లం.

- Advertisement -

ఆరు నెలల్లో మాయం
పర్యావరణానికి శాపంగా పరిణమించిన పాలిథిన్‌ కవర్లకు దీటైన ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించే ప్రయత్నమూ ప్రారంభించాం. ఎన్నో కాంబినేషన్లు పరిశీలించాం. క్యాల్షియం కార్బొనేట్‌ మినరల్స్‌, పాలిలాక్టిక్‌ యాసిడ్స్‌ విశ్రమాల్ని వివిధ నిష్పత్తులలో కలుపుతూ వెళ్లాం. చివరికి మా ప్రయత్నం సఫలమైంది. ఈ పదార్థంతో చేసిన బ్యాగులు పెద్ద బరువులను ఆపగలవు. అంతేకాదు, భూమిలో కలిసిపోతున్నట్టుగా గుర్తించాం. మా ప్రయోగాల్లో మట్టిలో 94 శాతం వరకూ కలిసిపోయాయి. అదే, పాలిథిన్‌ కవర్లు అయితే, భూమిలో కలిసిపోవడానికి వెయ్యేండ్లు పడుతుంది. మా బ్యాగులు 90 నుంచి 180 రోజుల్లోనే మట్టిలో కలిసిపోవడం మేం సాధించిన అతిపెద్ద విజయం.

ధర తక్కువే
మా ఫార్ములాను మెచ్చుకోనివారు లేరు. అన్ని రకాల అనుమతులూ సాధించాం. ఉత్పత్తి కోసం ఎన్నో పరిశ్రమలు తిరిగాం. చివరికి, మా ఫార్ములాను అర్థం చేసుకొని, పర్యావరణహితంగా ఉందని నమ్మి.. హైదరాబాద్‌ చర్లపల్లిలోని ఎకోలాస్టిక్‌ కంపెనీ ముందుకు వచ్చింది. అలా వీటి తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ బయో డిగ్రేడబుల్‌ కవర్లు ప్రపంచమంతా వినియోగంలోకి రావాలన్నది మా ఆకాంక్ష. మామూలు కవర్లు రూపాయికి ఒకటి దొరితే, మేం ఉత్పత్తి చేసే బ్యాగ్‌ ధర రూ.1.25 నుంచి రూ.2 వరకు ఉంటుందంతే! కవర్లతోపాటు టీకప్పులు, స్ట్రాలు, చిన్నచిన్న ప్లేట్లు.. ఇలా క్రమంగా వస్తువుల సంఖ్యను పెంచుతూ పోతున్నాం. నా ప్రయత్నంలో స్నేహితుడు సీహెచ్‌ లింగరాజు, నా కొలీగ్‌ పద్మనాభరాజు, మా డీఆర్‌డీఓ ఏఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.రామ మనోహర్‌ బాబు ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైంది. ‘ఈ ప్రపంచాన్ని రేపటి తరాలకు అనువుగా సిద్ధం చేయాల్సిన బాధ్యత మనదే. వారసులకు ఇవ్వా ల్సింది.. ఆస్తులో ఐశ్వర్యాలో కాదు, స్వచ్ఛమైన వాతావరణం’ అంటారు వీరబ్రహ్మం.

వ్యర్థాల నుంచి..
మా కవర్లలో బయో డిగ్రేడబుల్‌ స్టార్చ్‌ ఉంటుంది. మక్కజొన్న, కూరగాయల వ్యర్థాల నుంచి ఉత్పత్తయ్యే నూనెతో ఈ స్టార్చ్‌ను తయారు చేస్తాం. మక్కజొన్న, ఇతర పదార్థాల ఉత్పత్తులు మొదట జిగటగా వస్తాయి. దాన్ని దశల వారీగా పౌడర్‌గా తయారు చేస్తాం. తర్వాత ప్రాసెస్‌ చేసి పెల్లెట్స్‌గా మారుస్తాం. కొన్ని రకాల పదార్థాలు కలిపి ఫైనల్‌ ప్రొడక్ట్‌ సిద్ధంచేస్తాం. దీనినుంచి మనకు కావాల్సిన కవర్లు ఉత్పత్తి అవుతాయి. వీటిలో నీటిలో కరిగేవి, నీటిని తట్టుకుని నిలబడేవి.. రెండు రకాల కవర్లు ఉత్పత్తి చేస్తున్నాం. రెండూ భూమిలో 90 నుంచి 180 రోజుల్లో పూర్తిగా కలిసిపోతాయి. అంతేకాదు జలచరాలు, ఇతర జంతువులు ఈ కవర్లను తిన్నా ఎలాంటి హానీ కలుగదు. నూటికి నూరుశాతం సురక్షితమైన ఉత్పత్తులు ఇవి.

నాగోజు సత్యనారాయణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana