e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home బతుకమ్మ నిజమైన శ్రీమంతుడు

నిజమైన శ్రీమంతుడు

శభాష్‌ రెడ్డి

‘ఊరు నాకేమిచ్చింది?’ అనుకోలేదాయన!‘పుట్టి పెరిగిన ఊరికి నేనేం ఇవ్వగలను’ అనుకున్నారు.కన్నభూమి రుణం తీర్చుకోవడం అంటే ఏమిటో కండ్లకు కడుతున్నారు.విల్లాలను మరిపించే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, కార్పొరేట్‌ స్కూల్‌ను తలదన్నే పాఠశాల భవనం కట్టించి ‘శభాష్‌’ అనిపించుకున్నారు. సొంత లాభం సాంతం మానుకొని స్వగ్రామం కోసం పాటుపడుతున్నారు.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన సుభాష్‌రెడ్డి.

- Advertisement -

తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి పేరున్న కాంట్రాక్టర్‌. జనగామ గ్రామంలో పుట్టిపెరిగారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. కొన్నాళ్లకు రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చారు. అదృష్టం కలిసొచ్చింది. సిరిసంపదలు ఆయన ఇంట కొలువుదీరాయి. తన అనుభవంతో ఆస్తిని పదింతలు చేసుకోవచ్చు. ఏం చేయకున్నా భార్య రజని, కుమారుడు నిహాంత్‌ రెడ్డితో హాయిగా కాలం గడుపవచ్చు. కానీ, సుభాష్‌రెడ్డి తన సంపదతో ఊరి తీరు మార్చాలనుకున్నారు.

దాదాపు దశాబ్దకాలంగా గ్రామానికి ఏదో ఒక సాయం చేస్తూనే ఉన్నారు సుభాష్‌రెడ్డి. ఈ క్రమంలో తను చదువుకున్న పాఠశాలను పునర్నిర్మించాలనుకున్నారు. కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా కట్టించాలనుకున్నారు. చూస్తుండగానే రెండు అంతస్తుల భారీ భవన నిర్మాణం పూర్తయింది. మొత్తం 36 విశాలమైన గదులతో చూడముచ్చటగా తయారైంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ పాఠశాల భవనంలో ఆధునిక సౌకర్యాలెన్నో ఉన్నాయి. సుమారు ఆరుకోట్ల రూపాయలు వెచ్చించి ఈ సువిశాల భవనాన్ని నిర్మించారు. అంతేకాదు, గ్రామంలో రెండంతస్తుల పంచాయతీ భవనాన్ని కట్టించారు సుభాష్‌. రూ.15 లక్షలతో గ్రంథాలయాన్నీ నిర్మించారు. బీబీపేట మండలంలోని అనేక గ్రామాల్లో రూ.20 లక్షలతో ఎల్‌యీడీ లైట్లు ఏర్పాటు చేయించారు. రూ.30 లక్షలతో పలుగ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి తోడ్పడ్డారు. కష్టాలలో ఉన్నవారికి తనవంతుగా సాయం చేస్తారు.

డబుల్‌ బెడ్‌ విల్లాలు
పేదల ఆత్మగౌరవం పెంచేలా రాష్ట్రవ్యాప్తంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను కట్టిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న సుభాష్‌ రెడ్డి తాను సైతం ఈ మహాక్రతువులో భాగం అయ్యారు. పురిటి గడ్డ రుణం తీర్చుకోవడం కోసం.. డబుల్‌ ఇండ్లను సర్వాంగ సుందరంగా నిర్మించి ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మంజూరు చేసిన 102 ఇండ్లను నిర్మించే కాంట్రాక్టును తానే తీసుకొన్నారు సుభాష్‌రెడ్డి. ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఇచ్చే డబ్బుకు అదనంగా రూ.3 లక్షల వరకు చేర్చి వీటిని కట్టించారు. జనగామలో 52 ఇండ్లు, భిక్కనూరు మండలం జంగంపల్లిలో 50 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను కట్టించారు. మొత్తంగా 102 ఇండ్లను విల్లాలను తలపించేలా గ్రౌండ్‌, ప్లస్‌ వన్‌ ఫ్లోర్‌తో అందంగా నిర్మించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

కేసీఆర్‌ స్ఫూర్తి
నేను చదువుకున్న స్కూల్‌ను పునర్నిర్మించడం సంతోషంగా ఉంది. నూతన పాఠశాల భవనంతో మా ఊరి పిల్లలతోపాటు ఇతర గ్రామాల విద్యార్థులకూ మేలు జరుగుతుంది. 52 డబుల్‌ ఇండ్లను మా స్వగ్రామం జనగామలో నిర్మించాను. వీటిని చూసి ఎమ్మెల్యేగారు మరో గ్రామంలోనూ ఇలాగే నిర్మించాలని కోరారు. దాంతో జంగం
పల్లిలో 50 ఇండ్లు కట్టాను. పేదవారికిచ్చే నివాసాలు గౌరవప్రదంగా ఉండాలన్న ముఖ్యమంతి కేసీఆర్‌గారి స్ఫూర్తితో, సొంత ఖర్చుతో వీటిని తీర్చిదిద్దాను. వీటన్నిటి వల్ల నాకు కలిగిన సంతృప్తికి వెల కట్టలేను. నా జీవితం ధన్యం అయ్యింది.

సౌకర్యాలు భళా!
దూరం నుంచీ చూస్తే ఆ నిర్మాణశైలి ఖరీదైన భవంతులను తలపిస్తుంది. ఆ డబుల్‌ ఇండ్ల సముదాయంలో లేని వసతులంటూ ఉండవు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతోపాటు అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ వైరింగ్‌ చేపట్టారు. ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్‌, యూపీవీసీ కిటికీలు, అందమైన టైల్స్‌, ఎల్‌యీడీ వీధి దీపాలు, అంతర్గత సీసీరోడ్డు నిర్మించి ప్రైవేట్‌ వెంచర్‌లోని అత్యాధునిక భవనాలను తలపించేలా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించారు. త్వరలోనే అర్హులైన పేదలకు కేటాయించనున్నారు. వీటిని చూసిన వారంతా సుభాష్‌రెడ్డి చొరవను అభినందిస్తున్నారు.

జూపల్లి రమేశ్‌, నిజామాబాద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana