e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home బతుకమ్మ జబర్దస్త్‌ నటుడు అనిపించుకోవాలి

జబర్దస్త్‌ నటుడు అనిపించుకోవాలి

జబర్దస్త్‌ నటుడు అనిపించుకోవాలి

‘కడుపులో కాస్త ఆకలి మిగిలి ఉంటేనే లక్ష్యం వైపు ప్రయాణం సాగుతుంది. ప్రయత్నాలకు హద్దులు గీసుకుంటే ఉన్నచోటే నిలిచిపోతాం. కంఫర్ట్‌జోన్‌ నుంచి బయటకు వచ్చినప్పుడే అసలు సత్తా బయటపడుతుంద’ని అంటారు రచ్చ రవి. విలక్షణ హాస్యం, మేనరిజమ్స్‌తో ‘జబర్దస్త్‌’ వేదికపై తిరుగులేని ప్రాచుర్యం సంపాదించుకున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యారు. వెండితెరపై ప్రత్యేక ముద్రను వేయాలన్నదే తన సంకల్పమని చెబుతున్న రచ్చ రవి ‘బతుకమ్మ’తో 

జరిపిన సంభాషణ..

ఏదో సాధించాలనే తపన, బలమైన ఆకాంక్షే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. నేను భోజనం కూడా తక్కువగా తీసుకుంటాను. కడుపులో కాస్త ఆకలి మిగిలి ఉంటే మరింత కసిగా పనిచేస్తామన్నది నా ఫిలాసఫీ. కాలం, అదృష్టం, స్నేహితులు వీరందరి కంటే మన కడుపులో మండే ఆకలే జీవితాన్ని ఉన్నత లక్ష్యం వైపు నడిపిస్తుందని బలంగా నమ్ముతాను.

చిరంజీవి స్ఫూర్తితో..

జబర్దస్త్‌ నటుడు అనిపించుకోవాలి
- Advertisement -

నా స్వస్థలం వరంగల్‌. చిన్నప్పటి నుంచే నేను చిరంజీవికి వీరాభిమానిని. ఆరో తరగతిలో ఉన్నప్పుడే సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. చిన్నతనంలో దూరదర్శన్‌లో వచ్చే చార్లీచాప్లిన్‌ ఎపిసోడ్స్‌ నా మీద చాలా ప్రభావాన్ని చూపాయి. వినాయక చవితి మంటపాల్లో ప్రదర్శించే హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాలు నాలో ఉత్సాహాన్ని నింపేవి. ఏదో ఒకటి నేర్చుకొని కళారంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల చప్పట్లు, విజిల్స్‌ను ఎంజాయ్‌ చేయాలని బలంగా కోరుకున్నా. ఈ క్రమంలో మిమిక్రీ నేర్చుకొని స్టేజీల మీద ప్రదర్శనలిచ్చాను.

చెల్లి ఇచ్చిన డబ్బుతో..

మిమిక్రీ స్టేజీషోలతో సంతోషంగా ఉన్నా ఏదో వెలితి. నాలోని ప్రతిభను మరో వేదికపై ప్రదర్శించానే అభిలాష ఎక్కువైంది. ఓ రోజు చెల్లెలు ఇచ్చిన కొంత డబ్బు పట్టుకొని హైదరాబాద్‌కు వచ్చా. జెమిని టీవీ నిర్వహించిన ‘వన్స్‌మోర్‌ ప్లీజ్‌’తో బుల్లితెరపై నా అరంగేట్రం జరిగింది. సినిమాల్లో ప్రయత్నించే తొలిరోజుల్లో ఏం అర్థమయ్యేది కాదు. కొన్నాళ్లయ్యాక నేను కలిసిన వ్యక్తులు, చూసిన ప్రపంచం నా దృక్పథాన్ని మార్చేశాయి. అప్పటి వరకు నేర్చుకున్నదంతా శూన్యమని అర్థమైంది. జనాలు మెచ్చేంత గొప్పగా ఏదైనా నేర్చుకోవాలనే తపన మొదలైంది. ఈలోగా మా నాన్న నన్ను వరంగల్‌ తిరిగి రమ్మని బలవంతపెట్టాడు. అక్కడే ఏదో పనిచూసుకొని సెటిలవ్వమని కోరడంతో కాదనలేక వరంగల్‌కు తిరుగు ప్రయాణమయ్యా.

మున్సిపల్‌ ఉద్యోగిగా..

వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగంలో చేరా. అక్కడే ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ మేడమ్‌ దగ్గర కొన్నాళ్లు పనిచేశా. ‘మనం చేసే పని, ఆలోచనలు ఎప్పుడూ నెక్ట్స్‌ లెవల్‌లో ఉండాల’నే మేడమ్‌ మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత ప్రోదిచేశాయి. అలా మున్సిపల్‌ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దుబాయ్‌కి వెళ్లి రేడియో జాకీగా కొత్త జీవితాన్ని ప్రారంభించా. ‘నవ్వుల నల్లబాలు’ పేరుతో తెలంగాణ యాసలో నేను చేసిన ప్రోగ్రామ్‌కు విశేష ఆదరణ లభించింది. డబ్బులు బాగానే సంపాదిస్తున్నా నా కలలకు దూరంగా జరిగిపోతున్నాననే అసంతృప్తి వెంటాడేది. దాంతో ఓ రాత్రి దుబాయ్‌కి వీడ్కోలు పలికి హైదరాబాద్‌కి వచ్చేశాను.

ఒకసారి సక్సెస్‌ అయితే..

సినిమా కలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తర్వాత దర్శకుడు క్రిష్‌ నాన్న సాయిబాబాగారు నిర్మించిన ‘పుత్తడి బొమ్మ’, ‘శిఖరం’ ధారావాహికలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఈలోగా దుబాయ్‌ నుంచి తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోవడంతో వాస్తవం బోధపడింది. ఎంతో సన్నిహితులు అనుకున్నవారు కూడా ‘ఇంకా ఎన్ని రోజులు ఈ సినిమా పిచ్చి? ఎప్పుడు అవకాశాలొస్తాయి?’ అంటూ హేళనగా మాట్లాడేవారు. నేను ఆ మాటల్ని ఏ మాత్రం లెక్కచేయకపోయేవాడిని. ఒక్కసారి సక్సెస్‌ అయితే వాళ్లే నా దగ్గరకు వస్తారులే అనుకునేవాణ్ని.

‘జబర్దస్త్‌’లో అరంగేట్రం

అవకాశాల్ని ఎవరూ పిలిచి ఇవ్వరు. మనమే సృష్టించుకోవాలి. మన ప్రతిభ గురించి నలుగురికి మనమే ప్రచారం చేసుకోవాలి. సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నేనెప్పుడూ నిరుత్సాహపడలేదు. సినిమా మీద నాకున్న ప్రేమ, విజన్‌ ఏమిటో  ఫుల్‌ క్లారిటీ ఉండేది. అందుకే, ఎవరెంత అపహాస్యం చేసినా మౌనంగా ఉండేవాడిని. అవకాశాల్ని అన్వేషిస్తూ ఓ రోజు చమ్మక్‌ చంద్ర ఇంటికి ఆడిషన్స్‌కు వెళ్లా. అక్కడికొచ్చిన పదిమందిలో నేను ఒకరిగా సెలెక్ట్‌ అయ్యాను. ప్రత్యేకంగా ఉండే నా వాయిస్‌, హావభావాలు చంద్రను బాగా ఆకట్టుకున్నాయి. అలా మేమిద్దరం జబర్దస్త్‌లోకి ప్రవేశించాం.

‘జబర్దస్త్‌’లో నా ప్రయాణం గురించి అందరికి తెలుసు. ఆ వేదిక అతి తక్కువ సమయంలోనే ఎంతో మందికి స్టార్‌డమ్‌నిచ్చింది. అందులో నేనూ ఒకడిని. జబర్దస్త్‌లో పాల్గొంటూనే సినిమాల్లో కూడా నటించాను. తేజగారి దర్శకత్వంలో వచ్చిన ‘వెయ్యి అబద్ధాలు’ (2013) చిత్రం ద్వారా నేను వెండితెరకు పరిచయమయ్యాను. ఇప్పటివరకు 70కిపైగా సినిమాలు చేశాను. ప్రస్తుతం నేను నటిస్తున్న పది సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ‘వెయ్యి అబద్ధాలు’, ‘కల్యాణ వైభోగమే’, ‘శతమానం భవతి’, ‘రాజా ది గ్రేట్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’ ‘ఒక్కక్షణం’, ‘ఏంసీఏ’, ‘గద్దలకొండ గణేష్‌’, ‘రెడ్‌’, ‘క్రాక్‌’ సినిమాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

మంచి పాత్రలొస్తున్నాయి

తెరపై కాసేపు కనిపించే దశ నుంచి ఇప్పుడు కథాగమనంలో ప్రాధాన్యం ఉండే పాత్రల్ని పోషించే స్థితికి చేరుకున్నా. నా మనసుకు నచ్చిన పాత్రల్ని చేస్తున్నా. వాటి నాణ్యతను ప్రేక్షకులే నిర్ణయించాలి. ‘గద్దలకొండ గణేష్‌’, ‘శతమానంభవతి’ చిత్రాల్లో తెలంగాణ, ఆంధ్రా యాసలో మాట్లాడి అలరించాను. క్రిష్‌-వైష్ణవ్‌తేజ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రంలో నేను రాయలసీమ యాసను మాట్లాడబోతున్నా. ఇలా వేషభాషల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నా. తెలుగు పరిశ్రమలో పెద్ద దర్శకులు గుర్తించే నటుడినయ్యాననే సంతృప్తి ఉంది.

కామెడీకే  పరిమితం కాను

నేను ఇప్పటివరకు చేసిన పాత్రల్ని చూస్తే వినోదంతోపాటు భిన్నరకాల భావోద్వేగాల్ని పలికించే అవకాశం దొరికింది. నవరసాల్ని అభినయించే మంచిరోల్స్‌ నా దగ్గరకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్‌గా సాగే క్యారెక్టర్స్‌ కోసం దర్శకులు నన్ను ఎంపిక చేసుకోవడం ఆనందంగా ఉంది. ఓ రకంగా చిత్రసీమలో నా గోల్డెన్‌ టైమ్‌ స్టార్ట్‌ అయిందని భావిస్తున్నా. సోలో కామెడీ హీరోగా కూడా కొన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరించాను. ఎందుకంటే  వెండితెరపై వివిధ ఉద్వేగాల్ని పండిస్తూ మంచి నటుడిగా నిరూపించుకోవాలని ఉంది. తెలుగు ఇండస్ట్రీలో అందరివాడు అనిపించుకోవాలనే ఆశయంతో ముందుకుసాగుతున్నా. బాగా డబ్బు సంపాదిద్దామనే ఆశతో కాకుండా సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనే సంకల్పంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను.

అన్ని భాషల్లో నటించాలి

నేను సహాయ దర్శకుడిగా పనిచేశాను. రచనలు చేయగలను. నటుడిగా అనుభవాన్ని సంపాదించాను. కాబట్టి, ఏ విభాగంలోనైనా రాణిస్తానని నమ్ముతున్నా. అన్ని భారతీయ భాషల్లో నటించాలని ఉంది. ఈ మధ్యే ఓ కన్నడ సినిమా చేశాను. తమిళం నుంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే భాషపై పట్టులేకపోవడం వల్ల ఒప్పుకోలేదు. నేను నటించిన ‘గాలి సంపత్‌’, ‘నారప్ప’, ‘పాగల్‌’ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రిష్‌, వైష్ణవ్‌తేజ్‌ చిత్రంలో హీరో పక్కన ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేశాను. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ‘జబర్దస్త్‌’ చేయలేకపోతున్నా. వెబ్‌సిరీస్‌లలో కూడా చాలా ఆఫర్లు వస్తున్నాయి.

నమ్మకమే నడిపించింది

ఒక వేదికను వదిలిపెట్టి మరో వేదికపై అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో ఎన్నడూ నిరాశ  నమ్మకమే ముందుకు నడిపించింది. కష్టపడితే ఏదో ఒకరోజు ఫలితం వస్తుందని నమ్మాను. ‘జబర్దస్త్‌’ నుంచి బయటకు వచ్చేటప్పుడు శ్యాంప్రసాద్‌రెడ్డిగారికి థ్యాంక్స్‌ లెటర్‌ ఇచ్చాను. అప్పుడాయన ‘సినిమాల్లోకి వెళ్తున్నావ్‌! ఇక్కడ చెక్‌లు, సంపాదన గురించి ఆలోచించావా?’ అని వారించే ప్రయత్నం చేశారు. ‘సంతృప్తి పడితే ఇక్కడే ఉండిపోతాను సర్‌. నా ప్రతిభను మరింత విస్తరించుకోవాలనుంది. నా మీద నాకు నమ్మకం ఉంది’అని శ్యాంప్రసాద్‌రెడ్డి, నాగబాబు సార్లను కన్విన్స్‌ చేశాను. వారి ఆశీస్సులతో బయటకొచ్చాను.

-కళాధర్‌ రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జబర్దస్త్‌ నటుడు అనిపించుకోవాలి
జబర్దస్త్‌ నటుడు అనిపించుకోవాలి
జబర్దస్త్‌ నటుడు అనిపించుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement